BRS Leaders: బీఆర్ఎస్ అగ్రనేతలు..చేతులేత్తారా..? గెలవలేమనుకుంటున్నారా..? అయినా గెలిస్తే చేసేదేముంది..పార్టీకి ఒరిగేదేముంది అని భావిస్తున్నారా..? ఆగండి..ఆగిండి…ఇవి నా మాటలు కావు..మా ఛానల్ అభిప్రాయమూ అంతకంటే కాదు. ఇది తెలంగాణ పల్లెల్లోని జనం మాట. గులాబీ కార్యకర్తల మనసుల్లోని మాట…! జనం అనుకుంటున్నట్లు..కార్యకర్తలు మాట్లాడుకుంటున్నట్లు.. పంచాయితీ ఎన్నికలను బీఆర్ఎస్ నేతలు నిజంగానే లైట్ తీసుకున్నారా..? క్యాడర్ ఉత్సాహంగా పల్లెల్లో ప్రచారం నిర్వహిస్తుంటే…లీడర్లు ఎందుకు నిరుత్సాహంలో మునిగిపోయారు..?
తెలంగాణ పల్లెల్లో పంచాయితీ పోరు భీకరంగా నడుస్తోంది. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇక కొన్ని ఊర్లలో అయితే..వేలం పాటలు పోటా పోటీగా నడుస్తున్నాయి. దీంతో ఏ పల్లె చూసినా…ఏ గ్రామానికి వెళ్లినా…ఎలక్షన్ ఫీవర్‌తో సందడి నెలకొంది. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పండగలా తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు సైతం.. సందడిగా నామినేషన్లు వేస్తున్నారు. కానీ..బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లలో మాత్రం ఆ జోష్ మిస్ అయింది. దీనికి కారణం గులాబీ అగ్రనేతలు..స్థానిక ఎన్నికలను పట్టించుకోకపోవడమే అని టాక్.
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు.. కంటోన్మెంట్, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో సహా.. అన్నింటిలోనూ విజయం సాధించి సరిలేరు.. మాకెవ్వరూ అనే తీరులో ఉంది. ఈ క్రమంలో గ్రామ పంచాయితీ ఎన్నికలను కూడా హస్తం పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లలో, ప్రచార పర్వంలో నియోజకవర్గ నేతలు పాల్గొంటూ..వారికి అండగా నిలుస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి. పరిస్థితి పూర్తిభిన్నంగా కనిపిస్తుందనే చర్చ నడుస్తోందట. గ్రామాల్లో బీఆర్ఎస్ తరఫున కార్యకర్తలే.. ప్యానల్ వేసి పోటీలోకి దిగుతున్నా.. వారికి హైకమాండ్ నుంచి సరైన మద్దతు దొరకడం లేదన్న ప్రచారం జరుగుతుందట.
పంచాయితీ ఎన్నికలు ప్రస్తుతం కాస్లీ ఎన్నికలుగా మారిపోయాయి. లక్షలు కుమ్మరిస్తే కానీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు డబ్బు ప్రవాహం పారాల్సిందే. దీంతో గత పదేళ్లు పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ..పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన కార్యకర్తలు..అధిష్టానం నుంచి ఆర్థిక మద్దతు లభిస్తుందన్న నమ్మకంతో..స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సమయంలో వారికి మద్దతుగా నిలవాల్సిన బీఆర్ఎస్ కీలక నేతలు గ్రామాల వైపే కన్నెత్తి చూడటం లేదట. గ్రామాల్లోకి వెళ్తే..సర్పంచ్ అభ్యర్థులు ఎక్కడ డబ్బులు అడుగుతారోనని అగ్రనేతలు భయపడుతున్నారని టాక్.. గులాబీ దళంలో వినిపిస్తుందట. ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి చేసేదేముంది..? పార్టీకి ఒరిగేదేముంది..అనే భావనలో గులాబీ పెద్ద లీడర్లు ఉన్నారట. అందుకే పంచాయితీ ఎన్నికలను లైట్ తీసుకుంటున్నారనే ప్రచారం నడుస్తోంది.
రాష్ట్రస్థాయిలో బీఆర్ఎస్ దూకుడు బాగానే ఉన్నా..రూరల్ పాలిటిక్స్‌ను మాత్రం పట్టించుకోవడం లేదన్న చర్చ తెలంగాణ అంతటా జరుగుతుందట. ఎంతసేపు రాష్ట్రస్థాయిలో కాకుండా.. గ్రామాల్లో పార్టీ క్యాడర్, కిందిస్థాయి లీడర్లకు భరోసా కల్పించేలా ఏ ఒక్క కార్యక్రమాన్ని గట్టిగా చేపట్టలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాగతంగా కమిటీలున్నాయి. కానీ బీఆర్ఎస్‌కు సంస్థాగత కమిటీలు లేవు. జిల్లా కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో నియమించాలని, లేకపోతే పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని ఎప్పటి నుంచో… అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను జిల్లా నాయకులు కోరినా.. వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జిల్లా స్థాయినుంచి గ్రామ స్థాయి వరకు పదవులు పొందలేక ఇంతకాలం పార్టీలో ఉన్న నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడంతో.. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన పడుతున్నారట.
గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటి అధికారంలోకి వస్తామని భావించినా….గులాబీ నాయకత్వం ఆ దిశగా కార్యచరణ చేయలేకపోతుందని కేడర్ చర్చించుకుంటున్నారట. ఏ పార్టీ అయినా క్షేత్రస్థాయిలో బలంగా ఉంటేనే..రాష్ట్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆ దిశగా కాంగ్రెస్, బీజేపీ ..తమ పార్టీల బలోపేతం కృషి చేస్తుంటే..బీఆర్ఎస్ మాత్రం..లైట్ తీసుకుంటుందని గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారట. వరుస ఓటములతో డీలా పడిపోయిన బీఆర్ఎస్‌కు పంచాయితీ ఎన్నికల రూపంలో సత్తా చాటేందుకు అవకాశం వచ్చినా…కీలక లీడర్లు పట్టించుకోవడం లేదని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎన్నికల ఖర్చును భరించే పరిస్థితి కార్యకర్తల్లో లేకపోయినప్పటికీ..గులాబీ పెద్దలు..కనీసం తమకు భరోసా కల్పించేందుకు కూడా ముందుకు రావడం లేదని..ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే..పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారట.
Story By Kishan, Big Tv