కేసీఆర్‌కున్న ప్రధాన అలవాట్లలో ఇలా సర్వేలు చేయించుకునే అలవాటు కూడా ఒకటి. జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం, తన గురించి తరచూ తరిచి చూసుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు. సీఎంగా ఉన్న సమయంలోనూ సందర్భమేమీ లేకున్నా.. ఏదో రకమైన సర్వే చేయించుకుని వాటి ఫలితాలను చూసుకుని ముందుకు సాగేవారు.
ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాడాయన. ఇటీవల అసెంబ్లీ పరిణామాల నేపథ్యంలో .. ఓ ఐదు ప్రశ్నలతో సర్వే నిర్వహించారు. దీనికి నమస్తే తెలంగాణ టీమ్‌ను కూడా రంగంలోకి దింపారు. అయితే ఈ ఫలితాల రహస్యంగా ఉంటాయి. కానీ ఈసారి ఎలాగో లీక్ అయ్యింది. ఆ లీకైన సర్వే రిపోర్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ప్రధానంగా ఐదు ప్రశ్నలల్లో కేసీఆర్ చావు, ఫామ్‌హౌజ్ ముట్టడి అనే రెండు లేటెస్ట్ ఇష్యూలకు సంబంధించిన ప్రశ్నలను పొందుపరిచారు. ఇక మిగిలిన మూడు ప్రశ్నలు మామూలువే.
ఈ సర్కార్ గురించి జనం ఏమనుకుంటున్నారు? కేసీఆర్ పాలన బెటరా? రేవంత్ పాలన బెటరా? హామీలపై ఏమనుకుంటున్నారు..? సీఎం రేవంత్ వ్యవహార శైలి కరెక్టేనా? అంటూ ఇలా తమకు కావాల్సిన ఇన్‌పుట్స్‌ను ప్రజల నుంచి తెప్పించుకుని దాన్ని తమ ప్రచారాల్లో విరివిగా వాడుకోవాలనేది కేసీఆర్ ఉద్దేశ్యం. కానీ ఆ సర్వే రిపోర్టులో పరిపాలన, రేవంత్ వ్యవహార శైలిపై కేసీఆర్, బీఆరెస్ ఊహించిన రిపోర్టు రాకపోవడమే ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుత రేవంత్ సర్కార్ పాలనకు బీఆర్‌ఎస్ సర్వే పాస్ మార్కులేసింది.
జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఓ వైపు బీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తోంది. కానీ ఆ పార్టీ తాజాగా నిర్వహించిన సర్వే రిపోర్టు దీనికి భిన్నంగా రావడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు కీలక నాయకులు. ఫామ్‌హౌజ్ ముట్టడి పట్ల బీఆర్‌ఎస్‌కు అనుకూలమైన రిపోర్టు వచ్చింది. వందకు 55.8 శాతం ఇది కరెక్టు కాదని కొట్టి పారేశారు. ఇక కేసీఆర్ చావును కోరిన కాంగ్రెస్ నేతల వైఖరి పట్ల అడిగిన ప్రశ్నకు వందకు 73 శాతం సరైంది కాదన్నారు. 19.7 శాతం సరైందేనని అభిప్రాయం చెప్పారు.
ఇక ఏ సర్కార్ పాలన ఎలా ఉందని.. కేసీఆర్, రేవంత్ పాలనను ప్రజల ముందుంచితే.. కేసీఆర్ కన్నా రేవంత్ సర్కార్‌కే 4 శాతం మంది ఎక్కువగా బాగుందన్నారు. అంటే కేసీఆర్ పాలన కన్నా పర్వాలేదు అనే విధంగా కొంచెం మార్జిన్‌లో పాస్ మార్కులు పడ్డాయి రేవంత్‌కు. సీఎం రేవంత్ వ్యవహార శైలిపై కూడా బీఆర్‌ఎస్ పార్టీ కి విస్తుగొలిపేలా ఫలితాలు వచ్చాయి. రేవంత్ రూటే సెపరేట్ కు .. అనుకూలంగా 63.5 శాతం ఓటేయగా.. 17.8 శాతం మంది మాత్రం బాగాలేదని ఆన్సరిచ్చారు.
సీఎం మాటతీరు, విధానంపై బీఆర్‌ఎస్ విస్తృతంగా నెగెటివ్ ప్రచారం చేస్తూ వస్తోంది. కానీ ప్రజల్లో అంత పెద్దగా ఈ వైఖరిపై వ్యతిరేకత లేదని వారి సర్వే రిపోర్టే నిగ్గు తేల్చడంతో అవాక్కయ్యారు గులాబీ నేతలు. హామీలపై కూడా రేవంత్‌కు పాస్ మార్కులే వేశారు. 39.5 శాతం మంది పర్వాలేదు అనగా.. 35.3 శాతం ప్రజలు బాగాలేదని పెదవి విరిచారు. అంటే ఇంకా హామీలు అమలు కాలేదనే భావన ఉన్నప్పటికీ.. ఇప్పటికైతే అందుతున్న వాటి పట్ల కొంత సంతృప్తి ఉందనే భావనే వ్యక్తమయ్యిందన్నమాట.