IRCTC Ticket Booking Surge: పండుగ సీజన్ మొదలవడంతో రైలు టికెట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ రద్దీని తట్టుకుంటూ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 7, 2026న IRCTC వెబ్‌సైట్ ద్వారా ఒక్క రోజులోనే 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. మరుసటి రోజు కూడా బుకింగ్‌లు భారీగా కొనసాగాయి. సెప్టెంబర్ 8న మరో 19,50,699 టికెట్లు బుక్ అయినట్లు IRCTC వెల్లడించింది.
ఈ భారీ బుకింగ్స్ కు ప్రధాన కారణం పండుగ సీజన్ అని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది నవంబర్ 8న దీపావళి ఉండటంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇటీవల భారతీయ రైల్వే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ను 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. దీంతో పండుగ ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్ లు ఈ వారంలో ప్రారంభమయ్యాయి. బుకింగ్ విండో తెరుచుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు టికెట్ల కోసం ప్రయత్నించారు.
ప్రస్తుతం రిజర్వ్‌డ్ రైలు టికెట్లలో సుమారు 89 శాతం ఆన్ లైన్ లోనే బుక్ అవుతున్నాయి. ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభమైన వెంటనే డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతున్నప్పటికీ, మొత్తం రోజులోని బుకింగ్స్ లో 8.43 శాతం నుంచి 14.14 శాతం వరకు మాత్రమే మొదటి గంటలో పూర్తవుతున్నాయి. అయితే, ఉదయం 8 నుంచి 8.15 గంటల మధ్య మాత్రం అత్యధిక రద్దీ కనిపిస్తోంది. గత ఏడాది పండుగ సీజన్‌లో ఒక రోజులో గరిష్ఠంగా 18,40,203 టికెట్లు బుక్ కాగా, ఈసారి ఆ రికార్డు దాటిపోయి 20 లక్షల మార్క్ ను కూడా అధిగమించింది.
పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని IRCTC తన టికెటింగ్ వ్యవస్థను ఆధునీకరించింది. NGeT (Next Generation e-Ticketing) వ్యవస్థలో సర్వర్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సాఫ్ట్ వేర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ లోనూ మార్పులు చేసింది. కొత్త సర్వర్లను అందుబాటులోకి తీసుకురావడంతో గతంతో పోలిస్తే సిస్టమ్ సామర్థ్యం దాదాపు రెట్టింపైంది. సాఫ్ట్ వేర్ ఆప్టిమైజేషన్ తో మరింత ఎక్కువ లావాదేవీలను వేగంగా నిర్వహించే అవకాశం ఏర్పడింది.
IRCTC జూలై 15 నుంచి తన వెబ్ సైట్ కొత్త UI బీటా వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులకు టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా ఉండేలా దీన్ని రూపొందించారు. ముఖ్యంగా స్లీపర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్ వంటి తరగతుల సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌పై చూసే అవకాశం కల్పించారు. దీంతో ప్రయాణికులు వేర్వేరు పేజీలకు వెళ్లకుండా తమకు సరైన ఆప్షన్‌ను త్వరగా ఎంచుకోవచ్చు.
టికెట్ బుకింగ్‌లో బాట్ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు IRCTC యాంటీ బాట్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసింది. దీనివల్ల హానికరమైన బాట్ ట్రాఫిక్ 55 నుంచి 65 శాతం వరకు తగ్గినట్లు సంస్థ తెలిపింది. స్టాటిక్ కంటెంట్ కోసం CDN వినియోగించడం ద్వారా ప్రధాన బుకింగ్ సిస్టమ్ పై భారం కూడా తగ్గింది. అంతేకాకుండా టికెటింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. 3.04 కోట్ల యూజర్ ఐడీలను నిష్క్రియం చేయగా, మరో 6.33 కోట్ల ఐడీలను పునఃధృవీకరణకు పంపారు. అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్‌లు, పీఎన్‌ఆర్‌లపై కూడా చర్యలు చేపట్టారు.
Read Also: మీ రైలు ఎక్కడుంది? కోచ్ ఏ చోట ఆగుతుంది? ఈ యాప్ తో ఈజీగా తెలుసుకోవచ్చు!