H1B Grace Period: అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది భారతీయ టెక్ ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపే న్యూస్ ఇది. హెచ్1బీ సహా వివిధ వర్క్ వీసాలపై ఉన్నవారికి ఉద్యోగం పోతే.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా ఎత్తేసేందుకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ నిబంధనను ఫెడరల్ రిజిస్టర్‌లో పొందుపరిచాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఉద్యోగం పోయినా భారతీయ టెకీలు 60 రోజుల పాటు అమెరికాలో ఉండి, కొత్త జాబ్ వెతుక్కునే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే… వీసా గడువు మిగిలి ఉన్నా, ఉద్యోగం పోయిన వెంటనే విదేశీ ఉద్యోగులు అమెరికాను వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదన హెచ్1బీ ఒక్కదానికే పరిమితం కాదు. ఈ-1, ఈ-2, ఈ-3, హెచ్1బీ1, ఎల్-1, ఓ-1, టీఎన్ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులపైనా పడనుంది.
భారత్ టెక్ రంగంపై దెబ్బ..
వీసా హోదాకు, ఉద్యోగానికి మధ్య నేరుగా సంబంధాన్ని తిరిగి నెలకొల్పడమే ఈ మార్పు లక్ష్యమని, పాలనాపరమైన భారాన్ని తగ్గిస్తుందని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. కానీ దీని దెబ్బ భారత టెక్ రంగంపైనే ఎక్కువ. ఇండియన్ ఐటీ దిగ్గజాలతో పాటు మిగతా ఎంఎన్‌సీ సంస్థలే.. హెచ్1బీ వీసాలకు అతిపెద్ద స్పాన్సర్‌లు. ఈ మార్పు అమెరికాలో సెటిలైన ఉద్యోగులకు, వారి కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇంకా చట్టం కాలేదు. తుది నిర్ణయానికి ముందు.. రెండు నెలల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. లక్షలాది భారతీయ టెకీల భవిష్యత్తు.. ఇప్పుడు ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
Also Read: ములుగు జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి, మరొకరి పరిస్థితి విషమం!