Budget 2025 Updates: ఇప్పటి వరకూ ఒక లెక్క. ఇకపై లెక్క మారబోతుందా…? అందరిలోనూ ఇదే ఆతృత. ముఖ్యంగా మిడిల్ క్లాస్‌లో ట్యాక్స్ టెన్షన్ మరింత పెరుగుతోంది. త్వరలో 2025 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో… రాబోయే బడ్జెట్ ఎలా ఉంటుందా అని అంతా చర్చించుకుంటున్నారు. ఎప్పటిలాగే, ఈ బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితి పెంచుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతీ సారి అలాగే చెబుతున్నారు కానీ… ఇప్పటి వరకూ చేయనేలేదు. మరి, ఆర్థిక మంత్రి ఈ సారైనా కరుణిస్తారా…? అసలు, ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది..? దేశంలో టాప్ ట్యాక్స్ పేయర్స్‌గా ఉన్న మధ్యతరగతి ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి..?
పన్ను భారంపై సంక్షిప్తంగా…
• పన్ను తగ్గించకపోతే జనం విసిగిపోయే ప్రమాదం
• అందరి చూపు ఫిబ్రవరి 1 బడ్జెట్ వైపు
• మోడీ 3.0 ప్రభుత్వంలో ఇది తొలి పూర్తి బడ్జెట్
• నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి ప్రవేశపెడుతున్న బడ్జెట్
• ట్యాక్స్ పేయర్లకు కొంత ఉపశమనం అందుతుందేమోనని ఆశ
• మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించడం..
• వినియోగదారుల వ్యయం, పెట్టుబడులను పెంచడం
• పన్ను శ్లాబుల్లో సవరణలు తీసుకోస్తారనే అంచనాలు
• ప్రాథమిక మినహాయింపు పరిమితిలో పెంపు కోసం డిమాండ్
• పరిమితి రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని ఆశ
• రూ.20 లక్షల వరకు ఆదాయం వారికి పన్నులో ఉపశమనం అవసరం
• పరిమితి రూ.7లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచాలనే డిమాండ్
• స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని విజ్ఞప్తి
• రూ.7 లక్షల నుండి రూ.15 లక్షల ఆదాయం వారికి పన్నులో ఉపశమనం
• సెక్షన్ 80సీ కింద పరిమితి రూ.1.5లక్షల నుండి…
• రూ.2 లక్షలకు పెంచాలని డిమాండ్
• 2003లో గరిష్టంగా రూ.1లక్ష వరకు మినహాయింపు
• 2014లో పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచి కొంత ఉపశమనం
• దీన్ని రూ.3.5 లక్షలకు పెంచాలని కూడా డిమాండ్లు
• హౌసింగ్ లోన్‌ల వడ్డీపై సెక్షన్ 24(బి) కింద…
• మినహాయింపు పరిమితిని రూ.2లక్షల నుండి రూ.3లక్షలకు పెంచాలి
• గత కొన్నేళ్లుగా వేగంగా పెరుగుతున్న ఆహార ధరలు
• ఆదాయంలో దాదాపు 40% ఆహారం కోసమే ఖర్చు
• 2024లో అధికంగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం
161% పెరిగిన టమాటా ధర… 65% పెరిగిన బంగాళదుంపల ధర
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మరి కొన్ని రోజుల్లో కేంద్రబడ్జెట్ 2025ను ప్రవేశపెట్టనున్నారు. సమయం సమీపిస్తున్న కొద్దీ అందరి దృష్టీ ఈ బడ్జెట్ అంచనాల వైపే ఉంది. ముఖ్యంగా, మధ్య తరగతి వాళ్లు పన్నులు తగ్గుతాయేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. వస్తువుల ధరల్లో ఏవి తగ్గుతాయి… ఏవి పెరుగతాయో అనే టెన్షన్ పట్టుకుంది. ఇక, ఆదాయ పన్ను రేట్లు, శ్లాబుల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయోనని వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. భారీగా పెరిగిన ఖర్చులతో.. పన్ను తగ్గించకపోతే జనం విసిగిపోయే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు, వ్యాపార వర్గాలు కూడా తాయిలాలు ఉంటాయేమోనని ఆబగా వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా అందరి చూపూ.. ఫిబ్రవరి 1 కోసం కాచుకొని ఉన్నాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో ఇది తొలి పూర్తి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల్లోనూ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఈ బడ్జెట్ లో ఏయే అంశాలపై ఫోకస్ పెడుతున్నారు? సామాన్యులకు ఊరటనిచ్చే విషయాలేంటి అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి.
రికార్డు సరే.. మాకేంటీ?
ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1, 2025న జరిగే అవకాశం ఉంది. నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ… భారతదేశ చరిత్రలో ఇన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక మంత్రిగా రికార్డ్ సృష్టించారు. ఇక, ఈ రికార్డ్ సంగతి పక్కనపెడితే… ఈ బడ్జెట్‌లో అయినా పన్ను సంస్కరణల రూపంలో ట్యాక్స్ పేయర్లకు కొంత ఉపశమనం అందుతుందేమోనని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించడం, వినియోగదారుల వ్యయం, పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా… పన్ను శ్లాబుల్లో సవరణలు తీసుకోస్తారనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ బడ్జెట్ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనేది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే, మోడీ ప్రభుత్వంలో కీలక స్లోగన్ అయిన ‘వికసిత్ భారత్’ 2047 లక్ష్యాన్ని చేరడానికి బడ్జెట్ కీలకం కానుంది.
ట్యాక్స్ పేయర్స్‌కు మినహాయింపులు ఉంటాయా?
ఈ బడ్జెట్‌లో వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు పన్ను మినహాయింపులు ఉంటాయా లేదా అనే టెన్షన్ పట్టుకుంది. ప్రాథమిక మినహాయింపు పరిమితిలో పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త విధానం కింద ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెరుగుతుందని… ఇది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించి… వినియోగ, పునర్వినియోగ ఆదాయాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. అందుకే, రాబోయే బడ్జెట్‌పై వేతన జీవులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయాలు భారమవుతున్న నేపథ్యంలో పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఇటీవల పరిశ్రమల సమాఖ్య సీఐఐ సైతం ఆ దిశగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రూ.20 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఈసారి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక, పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచాలనే డిమాండ్ కూడా ఉంది. అలాగే, స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక, రూ.7 లక్షల నుండి రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇవన్నీ జరుగుతాయా?
అలాగే, ప్రభుత్వం సెక్షన్ 80సీ కింద పరిమితిని రూ.1.5 లక్షల నుండి 2 లక్షలకు పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. నిజానికి, ఇది మోడీ మొదటిసారి పగ్గాలు పట్టిన 2014 నుండి మారనేలేదు. 2003లో సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.లక్ష వరకు మినహాయింపు లభించింది. 2014లో ఈ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచి కొంత ఉపశమనం కలిగించినా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ పెంపు సరిపోలేదు. పెరుగుతున్న జీవన వ్యయం, పన్ను చెల్లింపుదారులపై పెరుగుతున్న ఆర్థిక భారంతో సెక్షన్ 80సీ పరిమితిని మరింత పెంచాలని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూ.3.5 లక్షలకు పెంచాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక, రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి కోసం… గృహ యజమానుల్ని ప్రోత్సహించడం కోసం… హౌసింగ్ లోన్‌ల వడ్డీపై సెక్షన్ 24(బి) కింద మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు. అలాగే, గృహ రుణ వడ్డీ మినహాయింపులను సెక్షన్ 80సీ కింద కలపొద్దనీ.. ప్రత్యేక, అధిక మినహాయింపు పరిమితిని ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
పెరిగిన ఆహార ద్రవ్యోల్భణం
మరోవైపు, ఆహారం, దుస్తులు, గృహాల ధరల పెరుగుదల సమస్యను పరిష్కరించే సవాళ్లు ఉన్నాయి. ఈ ప్రతి కుటుంబానికీ అత్యంత ముఖ్యమైనవి. ఈ నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించవచ్చా లేదా అనేది ఈసారి బడ్జెట్‌లో తేలనుంది. అటువంటి పరిస్థితిలో బడ్జెట్‌లో ఆహారం, దుస్తులు, గృహాలు చౌకగా ఉంటాయా లేదా అనేది అతిపెద్ద ప్రశ్న. గత కొన్ని సంవత్సరాలుగా ఆహార ధరలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ప్రకారం… భారతీయ కుటుంబాల ఆదాయంలో దాదాపు 40% ఆహారం కోసమే ఖర్చు చేస్తున్నారు. 2024లో ఆహార ద్రవ్యోల్బణం చాలా పెరిగింది. టమాటా ధర 161% పెరిగింది. అదే సమయంలో బంగాళదుంపల ధర 65% పెరిగింది. కాబట్టి, రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ దిశగా కొన్ని మార్పులు చేస్తుందని ఆశిస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహకారంతో వడ్డీ రేట్లను బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే, రూపాయి మారకం విలువను స్థిరీకరించవచ్చు. అదే సమయంలో ఎడిబుల్ ఆయిల్ వంటి వాటిపై దిగుమతులు కూడా ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయి. ఇది కాకుండా, ఆహార సబ్సిడీ పథకాన్ని పెంచే అవకాశం ఉంది.
మధ్యతరగతే టార్గెట్..
నిజానికి భారతదేశంలోని వరుస ప్రభుత్వాలు, మధ్యతరగతిని చాలా కాలంగా బంగారు బాతుగా పరిగణిస్తున్నాయి. పన్ను మినహాయింపులు, వాహనాలు, గృహ కొనుగోళ్లకు ప్రోత్సాహకాలు, తగ్గింపుల పరంగా కార్పొరేషన్లతో సమానంగా ఉండాలనే న్యాయమైన డిమాండ్ పెరుగుతోంది. గృహ పొదుపులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, కార్పొరేషన్ల వేతనాల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని కవర్ చేయడానికి సరిపోవట్లేదు. ఇలాంటి సమయంలో, మధ్యతరగతికి కొంత ఉపశమనం అవసరమన్నది ప్రధానంగా ఉన్న డిమాండ్. ఎందుకంటే, మధ్యతరగతి, ముఖ్యంగా జీతాలు పొందే తరగతి, దేశ పన్ను భారాన్ని ఎలా మోస్తున్నారనే దానిపై కొన్ని సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఇక, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య తక్కువే అయినప్పటికీ, వీళ్లే ఎక్కువ భారం మోస్తున్నారు. అందుకే, పన్నుల్లో ఉపశమనం కోరుతున్నారు. ఈసారి గానీ కేంద్రం పన్నులు, ఇతరాత్ర అంశాల్లో ఉపశమనం కలిగించకపోతే.. తప్పకుండా తమ పవర్ చూపిస్తారని తెలుస్తోంది. మరి మోడీ సర్కారు అంత వరకు తెచ్చుకోదని ఆశిద్దాం.
గత పాలన నుండి మోడీ ప్రభుత్వం పన్ను స్లాబ్‌లలో ఎటువంటి మార్పులు చేయలేదు. కొత్త పన్ను విధానాన్ని అవలంబించేలా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడం… దానికి ప్రజల్లో ఆమోదాన్ని పెంచడంతోనే ఇంత కాలం సరిపోయింది. మరోవైపు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు భారీగా పన్నులు చెల్లిస్తూ… బలానికి మించిన భారాన్ని మోస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా పన్నుల్లో ఉపశమనం ఉంటుందేమోనని ఎదురు చూస్తున్నారు.
• కార్పోరేషన్ల పన్ను భారం తగ్గి, వ్యక్తిగత పన్నుదారులకు భారం
PIT రిటర్న్‌లు 2013-14లో 3.35 కోట్లు, 2023-24లో 7.54 కోట్లు
• జీరో-ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య..
2013-14లో 1.69 కోట్ల నుండి 2023-24లో 4.73 కోట్లు
• ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తుల సంఖ్య..
2013-14లో 1.66 కోట్ల నుండి 2023-24లో 2.81 కోట్లు
• కంపెనీలకు బేస్ కార్పొరేట్ పన్ను రేటు 30% నుండి 22%కి తగ్గింపు
• 2019 తర్వాత కొత్త తయారీ సంస్థలకు 25% నుండి 15%కి తగ్గింపు
• 2000-2010 నుండి 2019-20 వరకు 0.7x ఉన్న PIT-CIT నిష్పత్తి..
• 2020-21 నుండి 2024-25 బడ్జెట్‌లో 1.1xకి పెరిగింది
• CIT వసూళ్లు 2019-20లో రూ.5.56 లక్షల కోట్ల నుండి..
• 2024-25లో రూ. 10.2 లక్షల కోట్లతో 83% పెరుగుదల
• PIT వసూళ్లు రూ. 4.92 లక్షల కోట్ల నుండి..
• రూ. 11.87 లక్షల కోట్లతో 141% పెరుగుదల
• వార్షిక GST వసూళ్లు రూ.18లక్షల కోట్ల నుండి రూ.20లక్షల కోట్లు
• GST వసూళ్లలో ఎక్కువ భాగం వ్యక్తుల నుండే లెక్కింపు
• మహారాష్ట్రకు 21.2%తో అత్యధిక GST వాటా
• కర్ణాటక 9.3%, గుజరాత్ 8.4%, తమిళనాడు 8.2%
• 2023లో 6.8% వాటాతో ఉత్తరప్రదేశ్ ఐదవ స్థానం
• యూపీ మినహా ఈ రాష్ట్రాలు జాతీయ సగటు 31.1%
• రూ.10లక్షలు సంపాదించి 30% జాతీయ పొదుపు రేటు ఆదా చేస్తే…
• సగటున 15% GST రేటు ప్రకారం, పన్ను చెల్లింపు దాదాపు రూ.1.6 లక్షలు
• ఆదాయంలో 15% ఆదా చేస్తే, ఖర్చు 18%.. అసలు పొదుపు లేకపోతే 20%
• ఆదాయంలో రూ. 20 లక్షలు సంపాదించి 30% ఆదా చేస్తే..
• ఖర్చుపై సగటున 10% GST రేటు ప్రకారం…
• కొత్త పన్ను విధానంలో రూ. 3.1 లక్షల ఆదాయపు పన్ను…
• వినియోగ వ్యయంపై రూ. 2 లక్షల GST
• అదే వ్యక్తి 15% ఆదా చేస్తే, మొత్తం పన్ను భారం దాదాపు 28%
• రూ.1 కోటి రూపాయలు సంపాదించి 30% ఆదా చేస్తే
• సగటున వినియోగ వ్యయంపై 23% GST రేటుతో..
• పన్ను భారం దాదాపు రూ. 40 లక్షలు.. ఆదాయంలో 40%
• అదే వ్యక్తి 15% ఆదా చేస్తే, పన్ను భారం 43% పెంపు
• పొదుపులు లేకపోతే, భారం 47%కి పెరుగుదల
గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలోని మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు అధికంగా అంచనాలు పెంచుకుంటూనే ఉన్నారు. కానీ, బడ్జెట్ ప్రకటనల తర్వాత నిరాశ చెందడం సర్వసాధారణంగా మారింది. అయితే, ఈసారి దీనికి భిన్నంగా బడ్జెట్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నప్పటికీ… మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించే దిశగా నిర్ణయలు ఉంటాయా అనే అంశంలో ఆసక్తి నెలకొంది. అలాగే, బేసిక్ ఎగ్జమ్షన్ పెంచడంతో పాటు ట్యాక్స్ శ్లాబ్స్ సవరించే అవకాశాలు ఉన్నాయో లేదో అర్థం కావట్లేదు. నిజానికి, మధ్యతరగతి, ముఖ్యంగా జీతాలు పొందే తరగతి, దేశ పన్ను భారాన్ని భారీగా మోస్తున్నారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య తక్కువే అయినప్పటికీ, ఎక్కువ పన్ను భారం వీళ్ల మీదే ఉంటోంది. కార్పోరేషన్ల పన్ను భారం తగ్గి, వ్యక్తిగత పన్నుదారులకు తడిసి మోపెడవుతోంది.
పెరిగిన జీరో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్
దేశవ్యాప్తంగా గత లెక్కలు చూస్తే… వ్యక్తిగత పన్ను చెల్లింపుల భారం ఎంత పెరిగిందో తెలుస్తుంది. వ్యక్తిగత పన్నుదారులు దాఖలు చేసిన పన్ను రిటర్న్‌ల సంఖ్య 2013-14లో 3.35 కోట్లు ఉంటే… అది, 2023-24లో 7.54 కోట్లకు పెరిగింది. అయితే, చాలా మంది వ్యక్తులు కేవలం సమ్మతి ప్రయోజనాల కోసం జీరో-టాక్స్ రిటర్న్‌లను దాఖలు చేస్తున్నారు. ఇక, జీరో-ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య కూడా గతంలో కంటే రెట్టింపు అయ్యింది. ఇది 2013-14లో 1.69 కోట్ల నుండి 2023-24లో 4.73 కోట్లకు పెరిగింది. మరోవైపు, వాస్తవానికి ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తుల సంఖ్య 2013-14లో 1.66 కోట్ల నుండి 2023-24లో 2.81 కోట్లకు పెరిగింది.
సెప్టెంబర్ 2019లో, ప్రభుత్వం ప్రస్తుత కంపెనీలకు బేస్ కార్పొరేట్ పన్ను రేటును 30% నుండి 22%కి… అక్టోబర్ 1, 2019 తర్వాత విలీనం చేసిన కొత్త తయారీ సంస్థలకు 25% నుండి 15%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత, కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లతో పోలిస్తే భారీగా తగ్గాయి. 2000-2010 నుండి 2019-20 వరకు 0.7x ఉన్న… పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్- కార్పొరేట్ ఇన్‌కమ్ ట్యాక్స్ నిష్పత్తి.. 2020-21 నుండి 2024-25 బడ్జెట్‌లో 1.1xకి పెరిగింది. అలాగే, కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు 2019-20లో రూ. 5.56 లక్షల కోట్ల నుండి 2024-25లో రూ. 10.2 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే, ఇది 83% పెరుగుదల. అదే కాలంలో, పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ వసూళ్లు రూ. 4.92 లక్షల కోట్ల నుండి రూ. 11.87 లక్షల కోట్లు పెరిగింది. అంటే, 141% పెరుగుదల చూసింది.
అత్యధిక జీఎస్టీ చెల్లిస్తోన్న మహారాష్ట్ర
ఇక, పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ ద్వారా GSTకి భారీగా విరాళం అందుతుంది. భారతదేశంలో వార్షిక GST వసూళ్లు రూ. 18 లక్షల కోట్ల నుండి రూ. 20 లక్షల కోట్ల వరకు ఉంది. ఈ మొత్తంలో వ్యక్తులు, కార్పొరేషన్ల వాటాల భాగస్వామ్యం ఎంతో విభజన లెక్కలను ప్రభుత్వం చూపించదు. వ్యాపార ప్రయోజనాల కోసం కొనుగోలు చేసిన వస్తువులు, లేదంటే… సేవల కోసం కార్పొరేషన్లు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌లను క్లెయిమ్ చేస్తాయి. కాబట్టి, GST వసూళ్లలో ఎక్కువ భాగం వ్యక్తుల నుండే లెక్కిస్తారు. మొత్తం GST వసూళ్లలో చూసుకుంటే దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు సగానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. మహారాష్ట్రకు 21.2%తో అత్యధిక వాటా ఉంది. తర్వాత, కర్ణాటక 9.3%, గుజరాత్ 8.4%, తమిళనాడు 8.2%తో ఉన్నాయి. 2023లో 6.8% వాటాతో ఉత్తరప్రదేశ్ ఐదవ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ మినహా ఈ అన్ని రాష్ట్రాలు జాతీయ సగటు 31.1% కంటే పట్టణీకరణ స్థాయిలను కలిగి ఉన్నాయి. దీని అర్థం భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పట్టణ ప్రాంతాలలోనే GST వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి.
‘పొదుపు’ చేస్తేనే లాభం..
మధ్యతరగతి భుజాలపై ఉన్న భారం తెలియాలంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయ్. రూ. 10 లక్షలు సంపాదించి 30% జాతీయ పొదుపు రేటు ఆదా చేసే వ్యక్తికి… వినియోగంపై సగటున 15% GST రేటు ప్రకారం… పన్ను చెల్లింపు దాదాపు రూ.1.6 లక్షలకు చేరుకుంటుంది. అంటే, ఒక వ్యక్తి మొత్తం ఆదాయంలో 16% GST చెల్లిస్తున్నారు. అదే వ్యక్తి తన ఆదాయంలో 15% ఆదా చేస్తే, ఖర్చు 18%.. అసలు పొదుపు లేకపోతే 20% అవుతుంది. ఇక, ఒక వ్యక్తి ఆదాయంలో రూ. 20 లక్షలు సంపాదించి 30% ఆదా చేస్తే, వారి ఖర్చుపై సగటున 10% GST రేటు ప్రకారం… అతడు కొత్త పన్ను విధానంలో రూ. 3.1 లక్షల ఆదాయపు పన్నును… వినియోగ వ్యయంపై రూ. 2 లక్షల GSTని చెల్లిస్తాడు. ఈ చెల్లించిన మొత్తం పన్ను రూ. 5.1 లక్షలు లేదా ఆదాయంలో 25% ఉంటుంది. అదే వ్యక్తి 15% ఆదా చేస్తే, మొత్తం పన్ను భారం దాదాపు 28% ఉంటుంది. పొదుపులు లేకపోతే, అది 31% కి దగ్గరగా ఉంటుంది.
Also Read: సౌత్‌కు నార్త్ దెబ్బ.. పడిపోతున్న దక్షిణాది రాష్ట్రాల జనాభా, ఇలాగైతే భవిష్యత్తు..
అలాగే, ఒక వ్యక్తి రూ.1 కోటి రూపాయలు సంపాదించి 30% ఆదా చేస్తాడని అనుకుంటే, సగటున వినియోగ వ్యయంపై 23% GST రేటుతో, పన్ను భారం ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ. 40 లక్షలు లేదా ఆదాయంలో 40% ఉంటుంది. అదే వ్యక్తి 15% ఆదా చేస్తే, పన్ను భారం 43%కి పెరుగుతుంది. పొదుపులు లేకపోతే, భారం 47%కి పెరుగుతుంది. దీన్ని బట్టి, వ్యక్తుల తమ ఆదాయంలో భారీగా పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. కానీ, వీళ్లకు పన్ను మినహాయింపులు దగ్గట్లేదు. నిజానికి, పన్ను స్లాబ్‌లను తగ్గించడం, మినహాయింపు పరిమితులను పెంచడం వల్ల కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని బాగా తగ్గించవచ్చు. పొదుపు చేస్తూనే వారు ఎక్కువ ఖర్చు చేయడంలో ఇది సహాయపడుతుంది. వినియోగంలో ఈ పెరుగుదల ఆర్థిక వృద్ధిని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్తు దృష్టిగల రంగాలలో లక్ష్యంగా ఉన్న పన్ను ప్రయోజనాలు ఈ రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. ఇటువంటి చర్యలు భారతదేశ స్థిరమైన వృద్ధి ఆశయాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను కూడా ప్రోత్సహం అందిస్తాయి.