AP Politics: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో గెలుపుపై విపరీతమైన ధీమాతో కనిపించారు. ఎన్నికల ప్రచార సమయంలో తన మెజార్టీ 20 వేలకు తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం కూడా చేశారు. తీరా చూస్తే సొంత బంధువు కూన రవికుమార్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత ఆయన పొలిటికల్‌గా తమ్మినేని సైలెంట్ అవ్వడంతో ఇక ఆయన పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ఆముదాలవలస వైసీపీ నాయకుడు తిరిగి లైమ్ లైట్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తమ్మినేని అంత సడన్‌గా యాక్టివ్ అవ్వాలని చూడటానికి కారణమేంటి?
2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన తమ్మినేని
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని రాజకీయ నేత. ఆయన మాట్లాడినా.. మౌనంగా ఉన్నా సెన్సేషనే. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కాస్త సైలంట్ అయ్యారు. దీంతో తమ్మినేని రాజకీయాలకు గుడ్ బై చెబుతారని చర్చ జరిగింది. కానీ.. ఇప్పుడు మౌనం వీడి యాక్టీవ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆముదాలవలస వైసీపీలో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కు ఇబ్బందికరంగా మారుతోందంట
టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని
తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు 1983లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన తమ్మినేని సీతారం తర్వాత సైకిల్ ఎక్కి.. టీడీపీ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత 2009లో సామాజికవర్గం లెక్కలతో ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయనకు బావమరిది అయిన కూన రవికుమార్ టీడీపీ నుంచి రాజకీయ ప్రత్యర్ధిగా మారారు. 2014లో కూన రవి ఆముదాలవలసలో తమ్మినేనికి షాక్ ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన తమ్మినేని స్పీకర్‌గా పనిచేశారు. 2024లో గెలుపుపై ధీమా ప్రదర్శించి సవాళ్లు సైతం విసిరిన ఆయనకు కూన రవి మరోసారి షాక్ ఇచ్చారు.
చింతాడ నియామకంతో పూర్తిగా సైలెంట్ అయిన తమ్మినేని
మొన్నటి ఎన్నికల్లోనే తమ్మినేని తన తనయుడు చిరంజీవి నాగ్‌ను అసెంబ్లీకి పంపాలని అనుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ దగ్గర కూడా అదే విషయం చెప్పారు. అయితే.. ఈ సారి మీరే పోటీ చేయాలి తప్పదని జగన్ స్పష్టం చేయడంతో కాదనలేకపోయారంట సీతారాం. ఎన్నికల తర్వాత ఆమదాలవలసలో సీన్ మారిపోయింది. తమ్మినేని సీతారం యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరమైనట్టు కనిపించడంతో చింతాడ రవికుమార్ ని జగన్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించారు. దీంతో మాజీ స్పీకర్ పూర్తిగా సైలంట్ అయ్యారు.
ఆముదాలవలసలో తమ్మినేని వర్సెస్ చింతాడ పాలిటిక్స్
తమ్మినేని వ్యవహారాన్ని గమనించిన జగన్ ఆయనకి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దీంతో అమదాలవలస వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. బయటకు కనిపించకపోయినా నియోజకవర్గంలో తమ్మినేని వర్సెస్ చింతాడ రవిగా ఇన్ సైడ్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయంట. నిన్న మొన్నటి వరకు జిల్లాలోని ఏ నియోజకర్గంలో కార్యక్రమాలు జరిగినా జిల్లా పెద్దగా తమ్మినేని అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించినా.. సొంత నియోజకవర్గం ఆమదాలవలసలోని కార్యక్రమాలతో మాత్రం తనకు సంబంధం లేదన్నట్టు ఉండేవారు.
నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ్మినేని
అయితే.. సడెన్ గా ఏమైందో ఏమో కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారాయన. నియోజవర్గంలో వరుస కార్యక్రమాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన వారికి ఆమదాలవలసలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చింతాడ రవికి ఆహ్వానం పంపినా ఆయన దూరంగా ఉన్నారు. ఇక భారీ బైక్ ర్యాలీతో వైఎస్ ఆర్ జయంతిని కూడా ఓ రేంజ్‌లో జరిపించారు తమ్మినేని. చింతాడ రవి ఈవెంట్స్ లో ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తుంటే.. తమ్మినేని కార్యక్రమాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోతున్నాయి.
Also Read: భూపాలపల్లి ఎమ్మెల్యేపై కుట్రలా?
కొడుకు భవిష్యత్ కోసమే తమ్మినేని యాక్టీవ్ రోల్
మొత్తానికి కొడుకు భవిష్యత్ కోసమే తమ్మినేని యాక్టీవ్ రోల్ ప్లే చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. తన అనుభావాన్నంతా రంగరించి దూకుడు చూపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ్మినేని స్వయంగా యాక్టివ్ అవుతుండటంతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. జగన్‌ను మాత్రం కొత్త సమస్య వెంటాడుతుందని తెలుస్తోంది. నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా చింతాడ రవికుమార్‌ని ప్రకటించినప్పటికీ పేరాడ తిలక్‌ను ఆమదాలవలస భవిష్యత్ లీడర్ గా జగన్ భావిస్తున్నారని వైసీపీలో కీలక నేతల వెర్షన్. ఇప్పుడు తమ్మినేని యాక్టివ్ అవ్వడంతో వర్గపోరు ఎక్కడ పెరుగుతుందోనని వైసీపీ అధిష్టానం తెగ టెన్షన్ పడిపోతుందంట. మరి చూడాలి ఆముదాలవలస వైసీపీ పాలిటిక్స్ చివరికి ఏ టర్న్ తీసుకుంటాయో.
Story By Rami Reddy, Bigtv