Bhupalpally: యుద్ధాల్లో శత్రువుతో ముఖాముఖి తలపడతారు, కానీ రాజకీయాల్లో ప్రత్యర్థులను వెనక నుండి దెబ్బ కొడతారు. ఇది గమనించుకోకపోతే ఏం చేసినా…ఎన్ని చేసినా ఎన్నికల నాటికి ప్రజల ముందు దోషులుగా మిగిలిపోవడమో? లేకపోతే రాజకీయంగా అనామకులుగా మారిపోవడమో? తప్పదు ఇప్పుడు ఇదే ఎపిసోడ్ భూపాలపల్లి నియోజకవర్గంలో నడుస్తోందట. అక్కడ కాంగ్రెస్ నుంచి అనూహ్య విజయం సాధించిన గండ్ర సత్యనారాయణ తన పనితీరుతో మంచి మార్కులు వేయించుకుంటున్నారు. దాంతో ప్రత్యర్ధులు ఆయన గ్రాఫ్ తగ్గించడానికి స్కెచ్‌లు గీస్తున్నారంట. ఇంతకీ గండ్ర తన వెనుక జరుగుతున్న కుట్రని గమనించలేకపోతున్నారా?
భూపాలపల్లిలో భారీ మెజార్టీతో గెలిచిన గండ్ర సత్యనారాయణ
వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 2023 సాధారణ ఎన్నికలలో 54శాతం ఓట్లతో..52 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్ధులు సైలెంట్‌గా ఉండరు కదా…. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఎన్నికల నాటికి ఆ నాయకుని గ్రాఫ్ తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెనుక సైతం ఆ మాస్టర్ స్కెచ్ నడుస్తోందన్న చర్చ జరుగుతోంది.
భూపాలపల్లిలో ప్రతిపక్షం లేకుండా పోయిందని సంబరం
భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని పార్టీల నుండి కీలక నేతలు సత్తన్న వెనకే నడుస్తామంటూ హస్తం కండువా కప్పుకున్నారు. పాత, కొత్త నాయకులతో భూపాలపల్లి కాంగ్రెస్ భవన్ నిండిపోయింది. రికార్డ్ స్థాయిలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సత్తెన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులంతా కలవరానికి గురవుతున్నారంట. కొత్తగా వచ్చిన వారికి భవిష్యత్తులో పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారంట. మొదట్లో చేరికలు పెరిగినప్పుడు భూపాలపల్లిలో ప్రతిపక్షం అనే మాటే లేకుండా పోయిందని కాస్త సంబర పడ్డారట.
సొంత పార్టీ నేతల్లో ఎమ్మెల్యేపై పెరుగుతున్న అసంతృప్తి
అయితే ఆ సంబరం ఎక్కువ రోజులు లేకుండా పోయిందని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నాయంట. ఫ్యూచర్లో తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందో అని భయపడుతున్నారంట. ఆ క్రమంలో ప్రతిపక్షమే లేదనుకున్నచోట, ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారట. ఎమ్మెల్యే తీరుతో కొంత మంది సీనియర్లు పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. మరోవైపు వివిధ సంఘాల నేతలు ఎమ్మెల్యే పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారట. ఇక జర్నలిస్టు సంఘాల సైతం రోడ్డెక్కి ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా నిరసన ధర్నాలు నిర్వహించారు.
పథకం ప్రకారమే జరుగుతోందంటున్న కాంగెస్ శ్రేణులు
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాటుపడుతుంటే, వివిధ వర్గాల్లో ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా ఒక పథకం ప్రకారమే కొంతమంది నాయకులు నడిపిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇష్టారీతిన గులాబీ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంతో.. ఇప్పుడు వాళ్లే ఎమ్మెల్యేకు ప్రజలలో వ్యతిరేకత కలిగేలా చేస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే వెంటే ఉంటూ, కొంతమంది నాయకులు చెడ్డ పేరు వచ్చేలా పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యే తన నోటి దూకుడు కారణంగా ద్వితీయ శ్రేణి నాయకుల వద్ద బదనామవుతున్నారని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు.
ఎమ్మెల్యేని పక్కదారి పట్టిస్తున్న బీఆర్ఎస్ వలస నేతలు
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో బీఆర్ఎస్ నుండి హస్తం పార్టీలో చేరిన కొంతమంది నాయకులు కావాలనే ఎమ్మెల్యేను పక్కదారి పట్టిస్తున్నారంట.. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కిందిస్థాయి నాయకుల వద్ద ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేను డ్యామేజ్ చేస్తున్నారట. ఇదంతా బీఆర్ఎస్ పార్టీలోని మాజీ ప్రజాప్రతినిధుల వ్యూహంలో భాగమేనని చర్చ జరుగుతుంది. ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల్లో, ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలిగించడంలో సక్సెస్ అయ్యారట. ఇదే ఊపులో, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలకు బూస్టింగ్ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభపడచ్చని బిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారట. మరికొద్ది రోజుల్లోనే భూపాలపల్లి నియోజకవర్గం లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన చేపట్టేందుకు సన్న హాలు చేస్తున్నారట. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న నాయకులను, శ్రేణులను గులాబీ పార్టీలోకి చేర్పించేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ పర్యటనతో తిరిగి గులాబీ పార్టీ జోష్ నింపేలా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా?
ప్రస్తుత పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని చర్చ
అయితే కొద్ది నెలలుగా ఎమ్మెల్యే తన వెనుక జరుగుతున్న తతంగాన్ని గుర్తించలేకపోతున్నారని చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే మాటతీరు , ఒంటెద్దు పోకడలతో.. ఆయన సన్నిహితులు సైతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను చెప్పేందుకు వెనుకాడుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయని చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. రాజకీయాలలో ముందు చూపే కాదు వెనుక చూపు కూడా ముఖ్యమని ఎమ్మెల్యే సత్తన్న ఎప్పుడు తెలుసుకుంటారోనని గుసగుసలాడుకుంటున్నాయి సీనియర్ కాంగ్రెస్ శ్రేణులు.
story By Rami Reddy, Bigtv