BigTV English

Delhi: లిక్కర్ స్కాంలో కొండను తవ్వి ఎలుకలను పట్టిన సీబీఐ?

Delhi: లిక్కర్ స్కాంలో కొండను తవ్వి ఎలుకలను పట్టిన సీబీఐ?

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ లిక్కర్ స్కాం లింకులు బయటపడ్డాయి. మొదట్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే టార్గెట్ గా ఈ కేసు తెరమీదకు వచ్చింది. ఆయన ఇల్లు, ఆఫీసుల్లోనూ సోదాలు జరిగాయి. అంతా ఆయనే చేశారంటూ బీజేపీ తెగ ప్రచారం చేసింది. సిసోడియా జైలుకు వెళ్లడం ఖాయమని.. ఇక ఆప్ పని ఖతమని ఊదరగొట్టింది. ఇన్నాళ్లూ ఇంత హంగామా చేస్తే.. చివరాఖరికి ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయానికి.. అసలు మనీష్ సిసోడియా పేరే లేకపోవడం ఆసక్తికరం.


ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ ఏకంగా 10వేల పేజీల తొలి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో ఏ1గా అప్పటి అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్దీప్‌సింగ్‌, ఏ2గా అబ్కారీశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేందర్‌సింగ్‌, ఏ3గా విజయ్‌ నాయర్‌, ఏ4గా అభిషేక్‌ బోయిన్‌పల్లి పేర్లను పొందుపరిచింది. వీరితో పాటు సమీర్‌ మహేంద్రు, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌ పేర్లను చేర్చింది సీబీఐ. అంటే, ఆప్ మంత్రుల ప్రమేయం లేకుండానే.. అధికారులు, వ్యాపారులు మాత్రమే లిక్కర్ స్కాంకు పాల్పడ్డారనేది సీబీఐ అభిప్రాయం కాబోలు. ఇక, శరత్ చంద్రారెడ్డి పేరు కూడా మొదటి ఛార్జిషీటులో లేకపోవడం ఆశ్చర్యకరం.

అయితే, కేసు దర్యాప్తు ఆధారంగా మరికొన్ని ఛార్జ్‌షీట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈడీ కూడా ఛార్జ్‌షీట్లు వేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ ఆమోదంపై ఈనెల 30న రౌస్‌ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.


అదేంటి? మనీష్ సిసోడియా పేరు లేకపోవడం ఏంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. బీజేపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఇలానే ఉంటాయంటోంది ఆప్. కావాలనే.. తమ పార్టీని బద్నామ్ చేయాలనే.. సిసోడియా పేరు ప్రముఖంగా వినిపించేలా చేసిందని ఆరోపిస్తోంది. సిసోడియాకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా.. కేంద్రం ఒత్తిడితోనే మనీష్ సిసోడియా ఇల్లు, కార్యాలయంలో సీబీఐ రైడ్స్ జరిగాయని.. ఆయనకు సమన్లు కూడా ఇచ్చారని మండిపడుతున్నారు. ఆప్ కు అవినీతి మరక అంటించాలని చూశారని.. అయితే అది సాధ్యం కాలేదని తప్పుబడుతోంది.

ఇక, తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. అభిషేక్ బోయిన్ పల్లి పేరును ఏ4గా చేర్చింది సీబీఐ. విచారణ అభిషేక్ వరకే ఆగిపోతుందా? లేక, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు కేసీఆర్ కూతురు కవిత వరకూ వస్తుందా? అనేది రాజకీయంగా కీలకాంశంగా మారనుంది. అటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న అయిన శరత్ చంద్రారెడ్డి పేరు ఛార్జిషీట్ లో లేకపోవడమూ పొలిటికల్ అంశమే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×