E-Paper
Advertisement

CM progress Report: రాజధాని రైతులకు అండగా చంద్రబాబు

CM progress Report: రాజధాని రైతులకు అండగా చంద్రబాబు

CM progress Report: భారతదేశం గర్వపడేలా రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు సీఎం చంద్రబాబు. 2047 నాటికి.. ప్రపంచ వేదికపై భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని.. అందులో ఏపీదే కీలకపాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో.. రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు సీఎం. ఎన్ని ఇబ్బందులున్నా.. అభివృద్ధి సాధించగలమనే విశ్వాసం ఉందన్నారు ముఖ్యమంత్రి. ఇక.. తిరుమల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేసేలా.. చర్యలు చేపట్టాలని సూచించారు సీఎం.

నవంబర్ 24, సోమవారం ( మరింత మెరుగ్గా పౌరసేవలు )
ఏపీలో.. వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచనలు జారీ చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై అధికారులతో ఈ వారం రివ్యూ నిర్వహించారు. వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం అవేర్ యాప్‌ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని ఆదేశించారు. అదేవిధంగా.. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై.. సీఎం రివ్యూ చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా.. వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా.. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ఉంటుంది. ఇక.. అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహా వివిధ శాఖల అధికారులతో జరిపిన సమీక్షలో కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో.. కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలన్నారు. గాలి, నీరు, ఇండస్ట్రియల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ లాంటి వాటిలో.. వివిధ రకాలుగా అధ్యయనం చేయాలన్నారు సీఎం. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించాలన్నారు. ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే.. సదరు సంస్థలు వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నవంబర్ 25, మంగళవారం ( కొత్త జిల్లాలకు ఆమోదం )
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలకు సీఎం చంద్రబాబు ఈ వారం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి పెరిగింది. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి.. కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో తనిఖీలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు ప్రతి హాస్టల్‌లో ఉండాలని నిర్దేశించారు.

నవంబర్ 25, మంగళవారం ( సీమలో ఉద్యాన పంటలు )
రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌ అంశాలపై సీఎం ఈ వారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా.. రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాయలసీమలోని పండ్లతోటల రైతుల ఆదాయం పెంచేందుకు.. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. దాదాపు 6 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

నవంబర్ 26, బుధవారం ( రైతులందరికీ న్యాయం )
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సూచించారు. ఈ వారం సీఆర్డీఏపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భూములు త్యాగం చేసి ప్రభుత్వానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం తరపున అదే స్థాయి సహకారం అందాలన్నారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇక.. పంటలకు ధరలు తగ్గకుండా, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపైనా రివ్యూ చేశారు. రబీ సీజన్లో 50 లక్షల 75 వేల టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాలనే అంచనాలు పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అవసరమైన 13 వేల 451 కోట్ల రూపాయల కోసం ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గోనె సంచులను అందించాలని ఆదేశించారు.

నవంబర్ 26, బుధవారం ( మన వాటా మనకే )
కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశంలో బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు వీలులేదని, చట్టపరంగా దక్కిన వాటాను యధాతథంగా కొనసాగించాల్సిందేనని చెప్పారు. జలవనరుల శాఖ అధికారులతో సీఎం ఈ వారం రివ్యూ నిర్వహించారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల వాటా కలిగి ఉండగా.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున జలాలు కేటాయించారు. ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నందున.. వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. డయాఫ్రమ్‌ వాల్‌ పనులు 73 శాతం మేర పూర్తికాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ తక్షణం చేపట్టాలని, ఆర్‌అండ్ఆర్‌ ప్యాకేజీని నిర్వాసితులకు వేగంగా అందించాలని సీఎం సూచించారు.

నవంబర్ 26, బుధవారం ( సంవిధాన్ దివస్‌లో సీఎం )
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. అసెంబ్లీ కార్యకలాపాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం.. ఏపీ ప్రభుత్వం మాక్‌ అసెంబ్లీ నిర్వహించింది. విద్యార్థులు ప్రజాప్రతినిధుల్లా వ్యవహరిస్తూ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. మాక్ అసెంబ్లీ అద్భుతమని.. విద్యార్థులు అదరగొట్టారని సీఎం అన్నారు. అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సూచించారు. తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదన్నారు చంద్రబాబు. కానీ.. ఏ పనిచేసినా పద్ధతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. కాస్త తడబాటుకు గురయ్యానన్నారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా సభ బాగా నిర్వహించారన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం ఇండియానే అని చెప్పుకొచ్చారు.

నవంబర్ 26, బుధవారం ( రోడ్ సేఫ్టీపై రివ్యూ )
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన.. ఈ వారం రాష్ట్ర స్థాయి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
కార్పోరేషన్‌‍‌ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం ఆదేశించారు. గుంతలు లేని రోడ్లు తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని స్పష్టం చేశారు.

నవంబర్ 27, గురువారం ( రాజధాని రైతులతో కీలక మీటింగ్ )
అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 29 గ్రామాలకు చెందిన రాజధాని రైతులతో ఈ వారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ తరహాలో అమరావతిని వేగంగా, విస్తృతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఆ స్థాయిలో అభివృద్ధి సాధించాలంటే.. ఇప్పుడున్న 29 గ్రామాల పరిధి సరిపోదన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతుల కల్పనపై చర్చ జరిగింది. అమరావతి పూర్తిస్థాయి అభివృద్ధి చెందాలంటే.. తాను తీసుకునే నిర్ణయాలకు రాజధాని పరిధిలోని గ్రామాల రైతులందరి నుంచి మద్దతు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ ప్రతినెలా రైతులతో సమావేశం అవుతుందని.. 3 నెలలకోసారి తానే స్వయంగా రైతులని కలుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువు పొడిగింపు కోసం కూడా.. కేంద్రంతో మాట్లాడతానన్నారు. రాజధాని రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను అమ్ముకోవద్దని సీఎం సూచించారు. భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని.. అమరావతి అభివృద్ధి ఫలాలను మొదట అందుకోవాల్సింది రైతులేనన్నారు. బిట్స్ పిలానీ, క్వాంటం వ్యాలీ లాంటి సంస్థలు వస్తున్నాయని.. అమరావతిని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని చెప్పారు. సీఎం హామీలపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి డెవలప్‌మెంట్ అసోసియేషన్‌గా ఏర్పడి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. రెండో విడత భూ సమీకరణకు పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

నవంబర్ 27, గురువారం ( టీటీడీపై స్పెషల్ ఫోకస్ )
తిరుమల క్షేత్ర ఆధ్యాత్మిక వైభవాన్ని.. ప్రపంచవ్యాప్తం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. టీటీడీ.. ఆధ్యాత్మికత, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ వారం.. దేవాదాయశాఖ, టీటీడీపై.. ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్.. అన్ని ప్రధాన దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. ప్రసాదం, అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన సరుకుల కోసం తీసుకువచ్చిన మార్పులను పరిశీలించారు. ప్రసాదాల తయారీ, క్యూలైన్ల నిర్వహణ లాంటి అంశాల్లో తిరుమల ప్రమాణాలను అనుసరించాలని సూచించారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యం కావాలని, టీటీడీ భక్తుల పోర్టల్‌ను ఆర్టీజీఎస్‌తో అనుసంధానించాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రులను లింక్ చేసి.. వాటినొక మోడల్‌గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి, వారి సేవలను.. ఆసుపత్రుల ద్వారా భక్తులకు, ప్రజలకు అందించేలా అవకాశం కల్పించాలన్నారు. ఇక.. వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం. వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. టీటీడీ బోర్డు సభ్యుల కమిటీల పర్యవేక్షణలో కొత్త దేవాలయాల నిర్మాణం ఉండాలని.. పురాతన దేవాలయాల పునరుద్ధరణకు టీటీడీ కార్యాచరణ చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

నవంబర్ 28, శుక్రవారం ( క్యాబినెట్ కీలక నిర్ణయాలు )
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి రంగాల్లో మార్పు తెచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి నిర్మాణం, కొత్త జిల్లాల ఏర్పాటు, 5 వేల కోట్ల రుణం, భూకేటాయింపులు, ఎన్నికల ప్రణాళికలు సహా.. మొత్తం 25కి పైగా అజెండా అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. అమరావతి నిర్మాణం రెండో దశలో 7 గ్రామాల్లో 16 వేల 675 ఎకరాలని.. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. ధాన్యం కొనుగోలు కోసం 5 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రానికి 3 వేల 762 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి పొందేందుకు అంగీకారం తెలిపారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రులకు అధికారాలు కల్పించడంపైనా చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ చివరి వరకు కొత్త జిల్లాలను అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా చర్చలు జరిగాయి.

కూటమి ప్రభుత్వం ప్రధానంగా.. రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టింది. మొదటి దశలో 33 వేల ఎకరాలు సేకరించిన నేపథ్యంలో.. రెండో దశలో 16 వేల 675 ఎకరాలు చేర్చి.. మొత్తం భూవిస్తీర్ణం 50 వేల ఎకరాలకు పరిమితం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాజెక్టు పనులు వేగవంతానికి ఇది తోడ్పడుతుందన్నారు. ధాన్యం కొనుగోలు కోసం NCDC నుంచి 5 వేల కోట్లు పొందడం వల్ల.. రైతులకు తక్షణ చెల్లింపులు జరగనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 31 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్న ఏపీలో మొత్తం 13 కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై చర్చించారు. ఈ మార్పులు పరిపాలన సౌలభ్యం పెంచుతాయని అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి 2026లో నిర్వహించాలని చర్చల్లో ప్రస్తావించారు. మొత్తం.. 3 వేల 762 కోట్ల రుణం.. కేంద్ర అనుమతితో తీసుకోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక భారం తగ్గనుంది.

Also Read: మేడారం జాతరపై సీఎం సమీక్ష.. నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం

నవంబర్ 28, శుక్రవారం ( అమరావతిలో బ్యాంకులు )
అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి.. మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరాబ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసీ, నాబార్డ్ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థ, విభజన వల్ల జరిగిన నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నో ఇబ్బందులున్నా.. అభివృద్ధి సాధించగలమనే విశ్వాసం ఉందన్నారు సీఎం. 2028 కల్లా నిర్మాణాలు పూర్తవుతాయని.. దేశం మొత్తం గర్వించేలా అమరావతిని నిర్మిస్తామన్నారు చంద్రబాబు. 2047 నాటికి.. భారత్ అగ్రస్థానంలో ఉంటుందని.. అందులో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఉన్న భరోసాతో.. ఏపీకి మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి అన్ స్టాపబుల్ అన్నారు సీఎం చంద్రబాబు. ఇక.. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న కాస్మోస్ ప్లానెటోరియంకు సంబంధించి.. ఏపీ సీఆర్డీఏ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మధ్య.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదిరింది.

Story By Anup, Bigtv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×