Chevireddy: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తిరిగి ఒంగోలులో ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం ఉరకలేస్తోందంట. నడిపించే నాయకుడు లేక నిస్సారంగా, నిసత్తువుగా ఉన్న వైసిపి నేతల్లో ఆయన రాక నూతనోత్సాహం తెచ్చిందంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన చెవిరెడ్డికి ఒంగోలులో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి… అయితే చెవిరెడ్డి ఒంగోలు వైసీపీ శ్రేణులకు నేనున్నానని భరోసా కల్పిస్తూ జిల్లాకే పూర్తి సమయంం కేటాయిస్తారా? లేకపోతే సొంత జిల్లాలోని చంద్రగిరి రాజకీయాలకు పరిమితమవుతారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో గత ఎన్నికల వరకు వైసీపీ హవా నడిచింది … నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ తర్వాత వైసీపీ అక్కడ సత్తా చాటుతూ వచ్చాయి… ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడగా మొదటి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 1957లో మొదలైన కాంగ్రెస్ విజయపరపర 1962 , 1977 మినహా 1984 వరకు కొనసాగింది. 1984లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా 89 లో జరిగిన ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ విజయం సాధించింది.
1991 నుండి 1999 వరకు మాగుంట కుటుంబం కాంగ్రెస్ తరపున విజయం సాధిస్తూ వచ్చింది. 1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి ఎంపీగా గెలుపొందగా… 2004, 2009 ఎన్నికలలో తిరిగి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 2014 ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి 2019 ఎన్నికల్లో తిరిగి పార్టీ మారి వైసిపి నుండి పోటీ చేసిన మాగుంట విజయం సాధించారు.అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ సీన్ రివర్స్ అయింది.
సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంటకు జగన్ గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. తిరుపతి జిల్లాకు చెందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోటీలో నిలపగా అతను టిడిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఓటమి చెందినప్పటికీ పార్లమెంటు నియోజకవర్గం వైసీపీలో మొత్తం తానై కార్యకర్తలను ఏకతాటిపై నిలిపేందుకు కృషి చేశారు. కార్యకర్తల్లో నూతన ఉత్సాహం తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ముందు కదిలారు. అయితే కల్తీ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పాలు కావడంతో జిల్లా వైసీపీ అయోమయంలో పడిపోయింది.
ప్రధానంగా జిల్లాలో వైసీపీ బాణి , వాణి గట్టిగా వినిపించే నేతే కరువయ్యాడు. జిల్లా మొత్తాన్ని తానై నడిపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకోవడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పాలు కావడంతో…. జిల్లా వైసీపీ నిస్తేజంగా మారింది. కొత్త నాయకులు వచ్చినప్పటికీ వారు వారి వ్యాపారాలపై దృష్టి పెట్టి మొక్కుబడి కార్యక్రమాలు చేశారే తప్ప కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపలేకపోయారు. జిల్లా వైసీపీలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ఇన్‌యాక్టివ్ అయ్యారు . ఎన్నికల్లో సొంత నియోజకవర్గాల నుండి మార్చి తమ పట్టు కోల్పోయే విధంగా చేశారనే అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం మానేశారంట.
దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలలో చురుకుదనం లోపించింది… దర్శి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మినహా నేతలు ఎవరు కూడా బయటకు రాకపోవడంతో వైసీపీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోయాయి. నడిపించే నేత లేక, అటు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించలేక, పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనలేక వైసీపీ శ్రేణులు నిస్సహాయంగా మిగిలిపోయాయి. నడిపించే నాయకుడు లేని సైన్యం ఎలా తయారవుతుందో దానికి ఉదాహరణగా నిలిచారు ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు…
అయితే బెయిల్ పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదలై ఒంగోలు రావడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులలో నూతనోత్సాహం కనిస్తోందంట. చెవిరడ్డి రాక సందర్భంగా జిల్లా వైసీపీ క్యాడర్ భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు… తమ నేత బయటికి వచ్చారు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారని వారంతా సంబరపడిపోయారు.. ఒక్కసారిగా చెవిరెడ్డి వారిలో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, క్యాడర్‌కు అన్నీ తానై ఉంటానంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఎక్కడ తగ్గమంటూ, భయపడేది లేదంటూ కార్యకర్తలలో జోష్ నింపారు… ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్నిసార్టు అరెస్ట్ అయినా సరే భయపడమంటూ భరోసా కల్పించే విధంగా మాట్లాడారు.
అయితే చెవిరెడ్డి తిరిగి తిరుపతి జిల్లా రాజకీయాలకే పరిమితం అవుతారా? లేక నిరంతరం ఒంగోలు జిల్లా వైసీపీ కార్యక్రమాలలో పాల్గొంటారా? అన్న అనుమానాలు జిల్లా పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. నాన్ లోకల్ వ్యక్తి నిత్యం వచ్చి, ఎంతవరకు జిల్లాలో కార్యక్రమాలు చేయగలుగుతారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కేసులు…. మరోవైపు తన సొంత పనులు వదులుకుని ఒంగోలు జిల్లాకు ఎంత మేర సమయం కేటాయిస్తారన్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఉంది…
మరోవైపు 2024 ఎన్నికలలో జగన్ ఆదేశాల మేరకు బలవంతంగా నియోజకవర్గాలు మారిన అభ్యర్థులు అక్కడ ఉండేందుకు ఇష్టం చూపకపోవడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది.. దాన్ని చెవిరెడ్డి ఎంతవరకు పరిష్కరించగలుగుతారన్నది పార్టీ శ్రేణుల చర్చల్లో నలుగుతోంది. మరి రానున్న రోజులలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లాలో యాక్టివ్ గా ఉంటారా?…. సమస్యలకు తగిన పరిష్కారాలు చూపుతారా?… లేక తన సొంత జిల్లా కు పరిమితం అవుతారా? అన్నది చూడాలి.
Also Read: లోక్‌సభలో బుక్ దుమారం.. ఆ బుక్‌లో ఏముంది..?
Story by: Apparao, Big Tv