China Expanding in Ladakh: జిత్తుల మారి చైనా నానాటికీ దిగజారుతోంది. అంతర్జాతీయంగా పరపతిని పెంచుకుంటున్న భారత్‌ను ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురిచేయడానికి చీప్ ట్రిక్స్ చేస్తోంది. భారత్-చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి అని అనుకున్న ప్రతీసారి.. మళ్లీ ఏదో ఒక రెచ్చగొట్టే చర్యలతో.. రెండు దేశాల మధ్య అగ్గిని రాజేస్తోంది. చైనా-భారత్ బోర్డర్‌లో మళ్లీ మళ్లీ వంకర బుద్ది చూపిస్తూనే ఉంది. ఒకవైపు భారత్‌తో దౌత్య చర్చలు జరుపుతూనే.. మరోవైపు, భారత్ భూభాగాన్ని ఆక్రమించే వ్యూహాలు పన్నుతోంది. ఇంతకీ, చైనా ఏం చేస్తోంది..? అసలు, చైనా ప్లాన్ ఏంటీ..? దీనిపై భారత్ ఎలా స్పందిస్తోంది..?
న్యూఢిల్లీతో బీజింగ్ సంబంధం గతేడాది నుండీ సానుకూలం
భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులను మరింత జఠిలం చేస్తున్నాయి చైనా చర్యలు. నిన్నగాక మొన్ననే బోర్డర్‌లో సైన్యాలను వెనక్కి రప్పించే ఒప్పందానికి ఓకే చెప్పి.. ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరచుకుంటామని మాట ఇచ్చింది. ఈ క్రమంలోనే.. మార్చి 8న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. న్యూఢిల్లీతో బీజింగ్ సంబంధాలు గతేడాది నుండీ సానుకూల పురోగతి సాధించాయని చిలకపలుకులు పలికారు. గతేడాది రష్యా ఆతిధ్యం ఇచ్చిన కజాన్ కార్యాక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశం జరిగింది.
లడఖ్ భూభాగాన్ని ఆక్రమించి కొత్త స్థావరాల ఏర్పాటు
ఈ సందర్భంగా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయనీ.. అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం వచ్చిందని కూడా చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అందుకే, కలిసి పనిచేయడం రెండు దేశాలకు మంచిదని కూడా వెల్లడించారు. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి కలుపుగోలు మాటలు మాట్లాడుతూనే.. వెనక నుండి వెన్నుపోటు పొడుస్తోంది చైనా. భారత కేంద్రపాతిల ప్రాంతం లడఖ్ భూభాగాన్ని ఆక్రమించి రెండు కొత్త స్థావరాలను ఏర్పాటు చేసింది.
2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో…
2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యం మధ్య తలెత్తిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు భారీగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇదే విషయంపై అనేక దఫాలుగా సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. ఇటీవల ఆ చర్చలు పూర్తి కాగా.. సరిహద్దుల్లో మోహరించిన సైన్యాలు, ఆయుధాలను వెనక్కి మళ్లించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలోనే రెండు వైపులా బలగాలు వెనక్కి వెళ్లినట్లు రెండు దేశాలు ప్రకటించాయి. దీంతో నాలుగున్నర ఏళ్ల నాటి సమస్య తీరిపోయి.. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గిందని భావించే లోపు భారత్‌కు మరోసారి చైనా తలనొప్పిగా మారింది.
నిరసనను తెలియజేసినట్లు మార్చి 21న భారత్ ప్రకటన
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సమీపంలో చైనా రెండు కొత్త కౌంటీలను ఏర్పాటు చేస్తుందనీ.. వాటిలో కొన్ని భాగాలు లడఖ్‌లో ఉన్నాయనీ.. దీనిపై భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా “తీవ్రమైన” నిరసనను తెలియజేసినట్లు మార్చి 21న భారత ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. “ఈ ప్రాంతంలో భారత భూభాగంపై చైనా అక్రమంగా చేస్తున్న ఆక్రమణను భారతదేశం ఎప్పుడూ అంగీకరించలేదని” అన్నారు.
ఈ ప్రాంతంపై భారత్‌కు దీర్ఘకాలంగా స్థిరమైన వైఖరి
భారత భూభాగంలో చైనా ఆక్రమణను భారత ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదు. లడఖ్‌లో చైనా కొత్త కౌంటీలను వ్యాప్తి చేయడం వల్ల ఈ ప్రాంతంపై భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి ఎలాంటి మార్పు ఉండదని కూడా పలుమార్లు వెల్లడించింది. ఈ ప్రాంతంపై భారతదేశానికి దీర్ఘకాలంగా ఉన్న స్థిరమైన వైఖరిపై ఈ చర్య ప్రభావం చూపదని తాజాగా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి చర్యల ద్వారా చైనా చేస్తున్న చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణకు చట్టబద్ధతను కూడా ఇవ్వదని కేంద్ర సహాయం మంత్రి మరోసారి వెల్లడించారు. ఇక, ఈ పరిణామాలపై ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా నిరసనను తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.
హోటాన్ ప్రిఫెక్చర్‌లో చైనా రెండు కొత్త కౌంటీలు
అయితే, హోటాన్ ప్రిఫెక్చర్‌లో చైనా రెండు కొత్త కౌంటీలను స్థాపించడం… లడఖ్‌లో భారత భూభాగాన్ని కలుపుకోవడం గురించి ప్రభుత్వానికి తెలుసా అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ఒక వేళ తెలిస్తే.. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక, దౌత్యపరమైన చర్యలు ఏమిటనే ప్రశ్న కూడా వచ్చింది. కాగా.. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, మంత్రి స్పందించారు. చైనాలోని హోటాన్ ప్రిఫెక్చర్‌లో నిర్మించిన రెండు కొత్త కౌంటీలకు సంబంధించి చైనా చేసిన ప్రకటన గురించి భారత ప్రభుత్వానికి తెలుసనీ… ఈ కౌంటీల అధికార పరిధిలోని కొన్ని ప్రాంతాలు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో వస్తాయని ఒప్పుకున్నారు.
సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు
అయితే, ఈ కౌంటీల ఏర్పాటుకు వ్యతిరేకంగా భారతదేశ తెలియజేసిన నిరసనలకు.. చైనా ప్రభుత్వం నుండి ఏవైనా ప్రతిస్పందనలు ఉంటే వాటి వివరాలను కూడా మంత్రిని కోరాగా… దీనిపై స్పష్టమైన సమాధానం దొరకలేదు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల మెరుగుదలపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందనీ… ఈ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచడానికి, అలాగే భారతదేశ వ్యూహాత్మక, భద్రతా అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్న కేంద్ర మంత్రి
ఇక, భారతదేశ భద్రతపై ప్రభావం చూపించే.. అన్ని పరిణామాలను ప్రభుత్వం నిరంతరం గమనిస్తూనే ఉందనీ.. భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే, భారత ప్రభుత్వం నుండి ఇలాంటి సమాధానాలు గతంలో కూడా వచ్చాయి. అయినప్పటికీ.. చైనా కుట్ర చర్యల్లో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం ఇప్పుడు ఆందోళనను పెంచుతోంది.
భారత కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం
లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతంలో చైనా రెండు స్థావరాలను ఏర్పాటు చేసినట్లు గతేడాదిలోనే భారత్ గుర్తించింది. దీనిపై, ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో చైనా ఆక్రమణలను ఎప్పటికీ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి చట్ట విరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలు చేయడం వల్ల.. ఆ ఆక్రమణలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇక ఇదే లడఖ్‌లో ఆక్రమణల అంశంపై దౌత్యమార్గాల ద్వారా చైనాకు తమ నిరసన ఇప్పటికే వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.
చైనా మీడియా జిన్‌హువా గతేడాది డిసెంబర్ 27 ప్రకటన
అయితే, చైనా ప్రభుత్వ మీడియా జిన్‌హువా గతేడాది డిసెంబర్ 27న వాయువ్య చైనాలోని జిన్‌జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్ ప్రకటన విడుదల చేసింది. చైనా ప్రభుత్వం ఈ ప్రాంతంలో.. హియాన్ కౌంటీ, హెకాంగ్ కౌంటీ అనే రెండు కొత్త కౌంటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంట్రల్ కమిటీ, అలాగే, స్టేట్ కౌన్సిల్… ఈ రెండు కొత్త కౌంటీలను ఆమోదించాయి. ఇవి హోటాన్ ప్రిఫెక్చర్ ద్వారా నిర్వహించబడతాయని కూడా, జిన్‌హువా నివేదించింది. హీయాన్ కౌంటీ సీటు హాంగ్లియు టౌన్‌షిప్ కాగా, హెకాంగ్ కౌంటీ సీటు జియిదులా టౌన్‌షిప్ అని చైనా రాష్ట్ర మీడియా నివేదించింది. దీని తర్వాత భారత ప్రభుత్వం నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.
బ్రహ్మపుత్ర నదిపై చైనా జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం
చైనాలోని హోటాన్ ప్రాంతం.. లడఖ్‌కు సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీల నిర్మాణం చేపట్టింది చైనా. ఈ రెండు కౌంటీల్లోని కొంత భాగం లడఖ్ పరిధిలోకి వస్తుంది. దీంతో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నది స్పష్టంగా ఉంది. అయితే, దీనికి ముందు నుండే.. టిబెట్ అటానమస్ రీజియన్‌లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై చైనా జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది. కాగా, బ్రహ్మపుత్ర నదిపై చైనా జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించడంపై భారత్ ఆందోళనలను తెలియజేసింది.
మెగా ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు భారత్ వెల్లడి
నది జలాలపై వినియోగదారు హక్కులను కలిగిన, దిగువనున్న దేశంగా ఈ మెగా ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చైనాకు వెల్లడించింది. నిపుణుల స్థాయిలో, దౌత్య మార్గాల ద్వారా… చర్చలకు జరగాలని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ బ్రహ్మపుత్ర దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు హాని కలగించకుండా చూసుకోవాలని చైనాను కోరింది. అది రక్షణ పరంగా భారత్‌కు మరింత కీలకమైన ప్రాంతం కాబట్టి, అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు కూడా భారత్ వెల్లడించింది.
పాంగాంగ్ సరస్సుకు ఉత్తర దిక్కున పర్వతాల మధ్య…
నిజానికి, భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి చైనా చర్యలు. గతంలో తూర్పు లద్దాక్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద చైనా భారీ బంకర్లు నిర్మించింది. ఇందులో భాగంగా చైనా సైన్యం భారత భూభాగంలో చాలా లోతుగా తవ్వుతున్న దృశ్యాలు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ బంకర్లలో ఆయుధాలు, ఇంధనం నిల్వచేయడంతో పాటు… బంకర్లను సాయుధ వాహనాలకు పటిష్ఠమైన షెల్టర్లుగా ఉపయోగించుకోవాలని అనుకుంటుంది.
వాస్తవాధీన రేఖకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో..
అయితే, పాంగాంగ్ సరస్సుకు ఉత్తర దిక్కున పర్వతాల మధ్య సిర్జాప్ ప్రాంతంలో చైనా సైన్యం, ది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ప్రధాన స్థావరం కూడా ఉంది. పాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన డ్రాగన్ సైన్యానికి అదే ప్రధాన కార్యాలయం. దీనిని వాస్తవాధీన రేఖకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. అయితే, అది భారత్ భూభాగమని మొదటి నుండీ భారత్ వాదిస్తోంది. అయినప్పటికీ, అక్కడ మౌళిక సదుపాయాలను పెంచుతూ భారత్‌ను ఎప్పటికప్పుడు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది చైనా.
2024లో లడఖ్ సమీపంలో ఆరు కొత్త హెలిస్ట్రిప్‌ల నిర్మాణం
లడఖ్ సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌లో చైనా చేస్తున్న కుట్ర పూరిత చర్యలు కొత్తేమీ కాదు. 2024 మధ్యలో… చైనా సైన్యం లడఖ్ సమీపంలో ఆరు కొత్త హెలిస్ట్రిప్‌లను నిర్మించింది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం తెలిసింది. అయితే, హెలిస్ట్రిప్ నిర్మించిన ప్రదేశం పశ్చిమ టిబెట్‌లో ఉంది. లడఖ్‌లోని డెమ్‌చోక్ నుండి ఈ హెలిస్ట్రిప్‌ల దూరం 100 మైళ్లు మాత్రమే. డెమ్‌చోక్ అనేది భారత్ -చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త ప్రాంతంగా ఉంది. దీని కారణంగా ప్రమాదం మరింత పెరుగుతుందని భారత రక్షణ వర్గాలు భావించాయి.
ఉత్తరాఖండ్‌లోని బరాహోటీకి 120 మైళ్ల దూరం
ఆరు హెలి స్ట్రిప్‌లను గెయాయి అనే ప్రదేశంలో నిర్మించారు. ఇక్కడ అరడజను నుండి డజను వరకు హెలికాప్టర్లను ఏకకాలంలో మోహరించే అవకాశం ఉంటుంది. ఇది లడఖ్‌లోని డెమ్‌చోక్‌కు 100 మైళ్ల దూరం, ఉత్తరాఖండ్‌లోని బరాహోటీకి 120 మైళ్ల దూరంలో ఉంది. ఇలా, చైనా సైన్యం తరచుగా LAC సమీపంలో హెలిప్యాడ్‌లు లేదా నిర్మాణాలను నిర్మిస్తూనే ఉంది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో అనేక రహదారులను కూడా నిర్మించింది. అందుకే, లడఖ్‌కు ఆనుకుని ఉన్న చైనా ప్రాంతంపై భారత్ కూడా నిఘా పెంచింది.
వ్యూహాత్మక ప్రదేశానికి సమీపంలో చైనా గ్రామాలు
భారత్‌తో ఉన్న సరిహద్దుల వెంబడి చైనా ప్రాభల్యం పెంచుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భూటాన్‌లోని డోక్లామ్ సమీపంలో భారత్-చైనా ప్రతిష్టంభన ఏర్పడిన దాదాపు 8 సంవత్సరాల తర్వాత, వ్యూహాత్మక ప్రదేశానికి సమీపంలో చైనా గ్రామాలను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పటికే, సుమారు 22 గ్రామాలను నిర్మించినట్లు ఉపగ్రహ డేటాలో ఇటీవల గుర్తించారు. ఈ 22 గ్రామాల్లో 8 గ్రామాలు భూటాన్‌లోని డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్నాయి. ఈ గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో.. చైనా క్లెయిమ్ చేస్తున్న వ్యూహాత్మక లోయల్లో, కొండల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
2020 నుండి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా గ్రామాలు
“చికెన్ నెక్” అనే పేరుతో పిలిచే సిలిగురి కారిడార్‌కు ఇది దగ్గరగా ఉంది. ఈ ప్రాంతం… భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి ఈశాన్య భారతదేశానికి వెళ్లే ఎంట్రీ ద్వారంగా పిలుస్తారు. అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాల ప్రకారం, 2020 నుండి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా గ్రామాలు కనిపిస్తున్నాయి. అలాగే, ఈ గ్రామాలకు సమీపంలో చైనా సైనిక స్థావరాలు, అవుట్‌పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు చైనా పేర్లు
అయితే, చైనా ఇలాంటి చేష్టలు చేయడం మొదటిసారి కాదు. తన మ్యాప్‌లో భారత భూభాగాలను పేర్కొన్న గత సందర్భాలు కూడా ఉన్నాయి. 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు సంబంధించి ‘ప్రామాణిక’ పేర్లతో కూడిన తొలి జాబితాను చైనా విడుదల చేసింది. 2021లో, 15 స్థానాలతో కూడిన రెండవ జాబితాను విడుదల చేసింది. అలాగే, 2023లో విడుదలైన 11 అదనపు స్థలాల పేర్లతో మరొక జాబితాను తీసుకొచ్చింది. అయితే, ఎప్పుడు చైనా రెచ్చగొట్టినా.. భారత భూభాగాలను క్లెయిమ్ చేయాలనే చైనా ప్రయత్నాన్ని భారత్ బలంగానే తిరస్కరించింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవం చెరిగిపోదని హెచ్చరించింది.
2023లో విడుదలైన 11 అదనపు స్థలాల పేర్లతో మరొక జాబితా
అయినా కూడా చైనా తన కుట్రలను ఆపలేదు. హోటాన్ ప్రిఫెక్చర్‌లో కొత్తగా చైనా స్థావరాలు ఏర్పాటు చేస్తూ.. వందల కొద్దీ ప్రజలను అక్కడికి తరలిస్తున్నారు. దీని ద్వారా, త్వరలో లడఖ్‌లో ప్రాంతాలకు కూడా చైనా పేర్లు పెట్టి, తన మ్యాప్‌లోకి జొప్పించే ప్రయత్నం చేస్తుందనిపిస్తోంది. అయితే, దీనికి కౌంటర్‌గా భారత్, అటు అరుణాచల్ ప్రదేశ్‌లోనూ… ఇటు లడఖ్‌లోనూ మౌళిక సదుపాలయాలను బలోపేతం చేస్తోంది. రాబోయే రోజుల్లో LAC వెంబడి భారత్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకునే దిశగా మరిన్ని చర్యలు చేపట్టడానికి రెడీ అవుతోంది.