వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిపై చాలా ఆరోపణలున్నాయి. అయితే మహిళా మంత్రుల్లో మాత్రం రోజా, రజినిపై మాత్రమే అవినీతి ఆరోపణలు వినపడుతున్నాయి. ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు దారిమళ్లించారని ఆల్రడీ రోజాపై ఆరోపణలున్నాయి. తాజాగా విడదల రజినిపై ఏకంగా ఏసీబీ కేసు నమోదైంది. అయితే ఈ ఇద్దరిలో ముందుగా కోర్టు బోనెక్కేదెవరనేది మాత్రం తేలాల్సి ఉంది.
వైసీపీ హయాంలో చంద్రబాబుని, లోకేష్ ని, పవన్ కల్యాణ్ ని తిట్టినవారిని వెంటనే జైలుకి పంపించాలి అంటే ఆ లిస్ట్ లో మొదట వినిపించే పేరు మాజీ మంత్రి రోజా. అయితే రెడ్ బుక్ లో పేరు ఎంట్రీ అయినా కూడా వారిపై కేసులు పెట్టే విషయంలో మాత్రం కూటమి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఎక్కడ, ఎవరిపై, ఎలా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలా అనే విషయంలో పకడ్బందిగా ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయ్యారు, బెయిలుపై విడుదలయ్యారు. మరికొందరు జైలులోనే ఉన్నారు. అయితే మంత్రులెవరూ ఇంకా కోర్టు బోనెక్కలేదు. మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, కొడాలి నాని వంటి వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా మహిళా మంత్రుల పేర్లు బలంగా వినపడుతున్నాయి. ఇందులో విడదల రజిని పేరు తాజాగా లిస్ట్ లో ఎంట్రీ అయింది.
మాజీ మంత్రి విడదల రజినిపై పల్నాడు జిల్లా యడ్లపాడులోని స్టోన్ క్రషర్ సంస్థ యాజమాన్యం ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పట్లో మంత్రిగా ఉన్న విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ స్టోన్ క్రషర్ కంపెనీని బెదిరించాడట. సంస్థ కార్యకలాపాలు కొనసాగాలంటే మంత్రితో మాట్లాడాలని చెప్పారట. ఆయన సూచన మేరకు మంత్రితో మాట్లాడితే ఆమె తిరిగి పీఏని కలవాలని చెప్పారని, ఆ తర్వాత ఆమె పీఏ 5కోట్ల రూపాయలు డిమాండ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. మాట వినకపోయే సరికి అప్పటి విజిలెన్స్ అధికారులు కూడా సదరు సంస్థను బెదిరించారట. ఆ బెదిరింపులకు జాషువా అనే ఐపీఎస్ అధికారి కారణం అని తెలుస్తోంది.
బెదిరింపులతోనే సరిపెట్టలేదు. చివరకు సదరు సంస్థ వద్ద బాగానే డబ్బులు గుంజారని కూడా తెలుస్తోంది. 2కోట్ల 20 లక్షల రూపాయలు రజిని సహా ఆమె అనుచరులు తీసుకున్నారని స్టోన్ క్రషర్ సంస్థ యాజమాన్యం ఫిర్యాదులో తెల్పింది. ఇందులో రూ. 2.10 కోట్లు విడదల రజిని మరిది గోపికి ఇచ్చారని, రూ.10 లక్షలు ఐపీఎస్ అధికారికి చెల్లించారట. దీంతో ఏసీబీ పక్కా ఆధారాలతో రంగంలోకి దిగింది. స్టోన్ క్రషర్ సంస్థను బెదిరించి డబ్బు తీసుకున్నవారందరిపై కేసులు నమోదు చేసింది. ఇందులో ఏ-1 గా మాజీ మంత్రి విడదల రజిని పేరు ఉంది. ఏ-2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా పేరు చేర్చారు.
ఏసీబీ అధికారులు సహజంగా ప్రభుత్వ సిబ్బంది అవినీతిపై ఫిర్యాదులు తీసుకుంటారు. దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వారిపై కూడా నిఘా పెట్టేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులపై ఏసీబీ కేసు నమోదు చేయడం విశేషం. సహజంగానే దీన్ని రాజకీయ కక్షసాధింపుగా వైసీపీ అభివర్ణిస్తోంది. అయితే గత ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు చేసిన అధికారులు, రాజకీయ నేతల పాపం పండిందని, వారంతా శిక్ష అనుభవించక తప్పదని కూటమి నేతలు బదులిస్తున్నారు.
విడదల రజిని కేసు వ్యవహారం పక్కనపెడితే.. అంతకు ముందే మరో మాజీ మంత్రి రోజా వ్యవహారంపై కూడా కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. సాక్షాత్తూ అసెంబ్లీలో కూడా మంత్రి రోజా అవినీతి గురించి ప్రస్తావించారు నేతలు. క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రోజా అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం దీనిపై పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసేందుకు నేతలు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇద్దరు మహిళా మంత్రుల్లో ముందు ఎవరు కోర్టు బోనెక్కుతారు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.