CID Investigations: కేసు సీఐడీకి పోయిందా?…అయితే మనం తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చులే .. ఇదీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల్లో వినిపిస్తున్న టాక్. వివిధ కేసుల్లో సీఐడీ దర్యాప్తులు నత్తనడకన నడుస్తుండటమే వారి ధీమాకు కారణంగా కనిపిస్తోంది. తిరుపతి కేంద్రంగా పరకామణిలో చోరీ కేసుతో పాటు నకిలీ ఓటర్ల కార్డుల తయారీ కేసు, తిరుపతి మాస్టర్ ప్లాన్ రహాదారుల బాండ్స్ , చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితా కేసు, మదనపల్లి పైల్స్ దగ్గం కేసులు అన్నీ ఇప్పుడు సీఐడీ విచారణ పేరుతో అటకెక్కాయన్న వాదన ఉంది. దీంతో సీఐడీ కేసులు.. జీవిత కాలం లేటు అన్నట్లు తయారైంది వ్యవహారం.. పరకామణి కేసులో హైకోర్టు టైం బాండ్ పెట్టినా దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నటు తయారవ్వడం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివాదాస్పద రాజకీయ నేతల భవితవ్వం పోలీసుల చేతుల్లో ఉండి పోయింది.. ముఖ్యంగా వైసీపీలో కీలక నేతలంతా , తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు, దౌర్జనాలకు సంబంధించి ఎదో ఒక వివాదంలో ఇరుక్కున్నారు.. వారిపై ఉన్న అరోపణలకు సంబంధించిన కేసులు సీఐడీ దర్యాప్తులో ఉండటంతో వారు తమకేమి కాదులే అన్న ధీమాతో కనిపిస్తున్నారు.. ఆ ధీమాతోనే వారు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు..
ముఖ్యంగా టిటిడిలో స్వామి వారి హుండీ లెక్కింపు సందర్భంగా 2023లో నమోదు అయిన పరకామణీ చోరీ కేసు విచారణను సీఐడీ, ఎసీపీలకు హైకోర్టు అప్పగించింది. అయితే సీఐడీ విచారణలో పురోగతి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో జియ్యంగార్ మఠం ఉద్యోగి అయిన రవికూమార్ దొంగతనానికి పాల్పడి దొరికిపోవడం, తర్వాత లోక్ అదాలత్ లో కేసు రాజీ కావడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ కేసు రాజీలో పాత్ర ఉన్న అప్పటి ఏవీఎస్ఓ ,అర్ఐ సతీష్ తాడిపత్రి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ఆ కేసులో నెల రోజుల పాటు హాడావుడి చేసిన సీఐడీ తర్వాత ఎలాంటి పురోగతి సాధించిందో ఎవరికీ అర్థం కావడం లేదంట. దానికితోడు ఈ కేసులో అరోపణలు ఎదుర్కుంటున్నవారు సైతం సీఐడీలో కీలక పదవులలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సీఐడీ డీజీ అయ్యన్నార్ అయితే కేసు విషయంలో నెల రోజుల పాటు తిరుపతిలో ఉండి ప్రత్యేక టీమ్‌ల ద్వారా వివరాలు సేకరించి, హైకోర్టు కు సమర్పించారు..హైకోర్టు టీటీడీతో పాటు ప్రభుత్వానికి కేసుల నమోదుకు అదేశాల జారీ చేసింది. సీఐడీ, ఎసీబీలు కేసు విచారణ సాగించాలని అదేశాలు జారీ చేసింది..అయితే ఇప్పటి వరకు ఓక్క అప్‌డేట్ రావడం లేదని అంటున్నారు..
2021లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో ఏకంగా అప్పటి తిరుపతి ఎన్నికల అధికారి అధికారిక ఐడీని ఉపయోగించి, 32వేల నకిలీ ఓటర్ల ఐడి కార్డులను డౌన్ లోడ్ చేసి ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసుకు సంబంధించి 2024లో ఎన్నికల కమిషన్ ఐఎఎస్ అధికారి అయిన గీరిషాను విధుల నుంచి కొంతకాలం పాటు తప్పించింది.. ఈ కేసులో కొందరు అధికారులపై ఈసీ వేటు కేసింది. వారిలో కొంతమంది ఇప్పటికీ వీఅర్‌లో, సస్పెషన్ లో ఉన్నారు.
అయితే దాని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రదారులపై మాత్రం ఇప్పటి వరకు కనీస విచారణ చేయలేదు..ఈకేసు తిరుపతి ఈస్ట్ పోలీసుస్టేషన్‌లో నమోదు అయ్యింది. తర్వాత మాత్రం ఎందుకో విచారణ నత్తనడకన నడుస్తోంది. దీనిపై అటు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, సిఐడి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలపాలు అవుతోంది. వైసీపీ నేతలే ఆ అక్రమాలకు ఊతమిచ్చారని, అధారాలు ఉన్నా విచారణలో ఎందుకు ముందుకు అడుగు పడటం లేదని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.
మరో కీలక కేసు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కోలకు సంబంధించింది ..మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసు కు సంబంధించి సిఐడి విచారణ కొనసాగుతోంది. ఆ కేసుల్లో నిందితులను సీఐడీ విచారణకు పిలవగానే వారికి హైకోర్టు నుంచి బెయిల్ వస్తుందనే విమర్శలున్నాయి. ఈ కేసు లో దర్యాప్తు వేగవంతం అయితే చాలమంది సామాన్యులకు సంబంధించిన భూములు తిరిగి వెనుకకు వస్తాయని అశపడుతున్నారు. అయితే ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.
ఘటన జరిగినప్పుడు పోలీసు ఉన్నతాధికారుల వచ్చి హాడావుడి చేసారు. ప్రత్యేక కార్యదర్శి వచ్చి వినతులు స్వీకరించారు. తర్వాత ఏమి జరగలేదని బాధితులు అంటున్నారు..ఇప్పటికైనా తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. సీఐడీ అధికారులు మాత్రంఅరు నెలల కొకసారి విచారణ పేరుతో ఒకరిని పిలిపించడం, వారు బెయిల్‌పై బయటకు రావడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం మాజీ అర్డీఓ మురళితో పాటు సీనియర్ అసిస్టెంట్ తేజా మాత్రం జ్యుడిషియల్ కస్టడిలో ఉన్నారు. మిగతా వారిలో కొందరు బెయిల్‌పై బయట తిరుగుతుంటే… మరికొందరు అజ్ణాతంలో ఉన్నారు.
తిరుపతి టీడీఅర్ బాండ్స్ కేసు విచారణలో సైతం సంబంధిత శాఖ చూస్తున్న కూటమి మంత్రి సైతం సీరియస్‌గా లేరంట…స్థానిక అధికారులు చెప్పినట్లు వింటున్నారంట.. బాధితులు తాము ఇప్పటికి అల్లాడిపోతున్నామని, కాని న్యాయం చేయడం లేదని, విచారణ పేరుతో కాలయాపన తప్ప కనీస చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.
మరో అత్యంత వివాదస్పద కేసు చంద్రగిరి ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు. ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రయాలు జరిగాయని అప్పట్లో అక్కడ విధులలో ఉన్న తిరుపతి అర్డీఓ , చంద్రగిరి మాజీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పెషల్ అఫీసర్ గా వ్యవహారించిన వారిపై ఆరోపణలు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కరరెడ్డి కార్యాలయం నుంచి ఓటర్ల మార్పులు చేర్పులు చేయడంపై ప్రస్తుత శాసనసభ్యుడు అయిన పులివర్తి నాని డిమాండ్ మేరకు ప్రభుత్వం విచారణ బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. అయితే ఆ కేసుకు సంబంధించి ప్రస్తుత అధికారులు సీఐడీకి సహాకారించడంలేదని అంటున్నారు. దీంతో ఆ కేసు దర్యాప్తు కూడా మూలన పడింది.
దీంతో పాటు తుడాలో 500 కోట్ల రూపాయల మేర అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంటు విచారణ జరిగింది. అక్రమాలు జరిగాయని నిర్ధారించారు. తర్వాత మాత్రం చర్యలు లేవు. టీటీడీలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అక్రమాలపై సైతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి, ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేసింది.. అక్రమాల్లో 45మంది ఉద్యోగుల పాత్ర పై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అయితే కనీసం ఓ ఉద్యోగిని కూడా బదిలీ చేయలేని స్థితి ఉంది టీటీడీ పాలకవర్గం.
నగరి మాజీ ఎమ్మెల్యే రోజా మంత్రిగా ఉన్నప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’కు సంబంధించి వందల కోట్ల అక్రమాలు జరిగాయని ఏకంగా విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంటు నివేదిక ఇచ్చినా కనీసం దానిపై రివ్యూ కూడా నిర్వహించలేదని తెలుస్తోంది. దీంతో తమను ప్రస్తుత పాలకులు ఏమి చేయలేరనే ధీమాతో, అరోపణలు ఎదుర్కొంటున్న నేతలు భూమన కరుణాకరెడ్డి, రోజా వంటి వారు ఇష్టానుసారం ప్రెస్ మీట్లు పెడుతూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని టిడిపి క్యాడర్ వాపోతోంది.
మొత్తం మీద ఆధారాలు ఉన్న కేసుల్లో సైతం సీఐడీ విచారణ, విజిలెన్స్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.. సీఐడీ అధికారులు సాగదీత ధోరణిలో విచారణల తతంగం నడిపిస్తూ.. వైసీపీ నేతలకు పరోక్షంగా సహకరిస్తున్నారని తమ్ముళ్లు మండిపడుతున్నారు. మరి చట్టం తన పని తాను చేసుకు పోతుందంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ వివాదాస్పద కేసులను ఎప్పటికి కొలిక్కి తెస్తారో చూడాలి?
Also Read:మొదలైన మూడో ప్రపంచ యుద్ధం? ఇరాన్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం..
Story by: Apparao, Big Tv