Israel-Iran War: దశాబ్దాలుగా రగులుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వైరం.. యుద్ధానికి దారితీసింది. దీనికి అమెరికా కూడా తోడవడంతో.. యుద్ధం పీక్ స్టేజ్‌కి చేరింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి.. ఇరాన్‌పై చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో.. మిడిల్ ఈస్ట్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం, దాని బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యంపై అమెరికా జరిపిన చర్చలు విఫలం కావడంతో.. ఉద్రిక్తతలు మొదలయ్యాయ్. ఇరాన్ తన అణు కేంద్రాలను మూసివేయడానికి నిరాకరించడం, ప్రాంతీయంగా తన ప్రాక్సీ గ్రూపులకు మద్దతు కొనసాగించడంతో.. యుద్ధ వితావరణం ఏర్పడింది.
దీనికి తోడు ఇరాన్‌లో అంతర్గతంగా జరుగుతున్న నిరసనలు, అశాంతి కూడా ఈ పరిణామాలకు కారణమయ్యాయ్. ఇరాన్‌పై.. ఇజ్రాయెల్ మిసైల్ దాడులకు పాల్పడింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు వినిపించాయి. దాంతో.. ఆ ప్రాంతంలో భారీగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే.. ఇజ్రాయెల్ దాడులకు దిగింది. శత్రుదేశం నుంచి పొంచి ఉన్న ముప్పుని తప్పించేందుకే.. ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ నివాసం, సర్వీలియన్స్ హెడ్ క్వార్టర్స్ సహా మొత్తం 30 కీలక ప్రాంతాలు టార్గెట్‌గా ఈ దాడులు జరిగాయ్. మినాబ్‌లోని స్కూల్‌పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 36 మంది విద్యార్థులు చనిపోయారు.
మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యం తమ దేశ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎయిర్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉన్నందున.. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. టెల్ అవీవ్‌తో సహా అనేక నగరాల్లో వార్ సైరన్లు మోగాయి. స్కూళ్లు, ఆఫీసులను మూసివేయాలని ఆదేశించింది. ఈ దాడులతో.. పౌర విమానాలకు ఇజ్రాయెల్ తన ఎయిర్‌స్పేస్‌ని మూసేసింది. అటు ఇరాన్, ఇరాక్ కూడా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్‌లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దశాబ్దాకాలంగా సాగుతున్న షాడో వార్.. ఇప్పుడు నేరుగా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై చర్చలు విఫలమైన కొన్ని గంటల్లోనే.. ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఇస్ఫహాన్, కోమ్, కరాజ్, కెర్మాన్‌షాలపై బాంబుల వర్షం కురిసింది. అణు కేంద్రాలు, మిసైల్ తయారీ కేంద్రాలు, సైనిక స్థావరాలపైనా.. ఇజ్రాయెల్ ప్రివెంటివ్ స్ట్రైక్స్ నిర్వహించింది.
ఇరాన్‌పై.. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన వెంటనే, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మేజర్ కాంబాట్ ఆపరేషన్స్ మొదలైనట్లు ప్రకటించారు. అమెరికా తన యుద్ధ విమానాలు, నౌకా దశాల ద్వారా ఇరాన్‌లోని.. మిసైల్ సిస్టమ్స్‌ని టార్గెట్‌గా చేసుకుంది. ఇరాన్ పాలనని మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. తాము ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఇరాన్ తన అణు కేంద్రాలను పునర్నిర్మించడానికి, క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు ట్రంప్. అందువల్లే.. భారీ సైనిక చర్య చేపట్టామన్నారు. ఇక.. ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తున్నామన్నారు. ఇరాన్ నాయకత్వం ఇప్పటికైనా తమ మాట వినకపోతే.. మొత్తం దేశాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచంలోని ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారని ట్రంప్ అన్నారు. ఇటీవల నిరనసలు చేపట్టిన తన సొంత పౌరులనే.. అక్కడి ప్రభుత్వం వీధుల్లో దారుణంగా చంపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండటం ప్రమాదకరమని, అందువల్లే.. వాటిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యమన్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం ఒక్కరోజులో మొదలైంది కాదు. 2023 అక్టోబర్‌లో హమాస్.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడి దీనికి ప్రధాన కారణం. హమాస్ వెనుక ఇరాన్ మద్దతుందని, ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. అప్పటి నుంచి ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, హౌతీల్లాంటి గ్రూపులు.. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తూనే ఉన్నాయ్. ఇప్పుడు.. ఇరాన్ అణ్వాయుధాలు తయారుచేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ యుద్ధం జరుగుతోంది. ఇరాన్ దగ్గరున్న బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసం, ప్రెసిడెంట్ కార్యాలయం, ఇతర కీలక భద్రతా సంస్థలు లక్ష్యంగా దాడులు జరిగాయి.
పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ ఇప్పుడు అగ్నిపర్వతంలా మారాయ్. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అంతే వేగంగా స్పందించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వందల సంఖ్యలో క్షిపణులను ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించింది. వందలాది బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో.. ఇరాన్ జరిపిన దాడులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అంతేకాదు.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలటరీ బేస్‌లపైనా దాడులకు దిగింది. బహ్రెయిన్, కువైట్, యూఏఈ, జోర్డాన్, ఖతార్ సహా మధ్యప్రాచ్యం అంతటా ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. దాంతో.. మిడిల్ ఈస్ట్ మొత్తం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మిడిల్ ఈస్ట్‌లోని దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయ్. అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్‌బేస్, బహ్రెయిన్‌లోని జుఫైర్ ప్రాంతంలోని యూఎస్ ఐదో నౌకాదళ సేవా కేంద్రం, ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్‌బేస్, కువైట్‌లోని అల్ సలీం ఎయిర్‌బేస్ ఉన్నాయి. ఖతార్, బహ్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికి.. షెల్టర్ ఇన్ ప్లేస్‌ని అమలు చేసింది. తదుపరి నోటీస్ వచ్చే దాకా పౌరులంతా అలాగే చేయాలని సిఫారసు చేసింది. ఇరాన్ దాడులతో.. ఇజ్రాయెల్‌లోని హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ కూడా రెడ్ కలర్‌లోకి మారిపోయింది. ఈ యాప్ ఎప్పటికప్పుడు రియల్ టైమ్ హెచ్చరికలు, అత్యవసర గైడ్ లైన్స్ అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులని గుర్తించడం వల్లే.. రెడ్ కలర్‌లోకి మారిపోయిందంటున్నారు.
ఇజ్రాయెల్ దాడుల తర్వాత.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షితమైన ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఖమేని కార్యాలయం సమీపంలో మిసైల్ దాడి జరిగింది. ఖమేని ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణశాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసు సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాడులకు ముందే ఖమేనీ బంకర్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం మీరు మొదలుపెట్టారు.. మేం ముగింపు పలుకుతామని ప్రకటించింది. అయితే.. అమెరికా కూడా గణనీయమైన స్థాయిలో సైనిక సిబ్బంది, ఆయుధ సంపత్తిని సేకరించింది. ఈ మోహరింపులో.. అధునాతన యుద్ధ నౌకలు, అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్స్, కీలక ఆయుధాలు ఉన్నాయి. గతేడాది జూన్‌లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల పాటు వైమానిక ఘర్షణ జరిగింది. ఇప్పుడు.. దీర్ఘకాల ప్రత్యర్థుల మధ్య పూర్తి స్థాయి యుద్ధమే మొదలైంది. ఇరాన్ తమపై జరుగుతున్నది ఉనికికి సంబంధించిన యుద్ధంగా భావిస్తోంది. హిజ్బుల్లా, హౌతీల లాంటి తమ ప్రాక్సీ గ్రూపులను కూడా ఇజ్రాయెల్‌పైకి ఉసిగొల్పుతోందనే వాదన వినిపిస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం కేవలం ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించడం కాదు. ఇరాన్‌లో ప్రభుత్వ మార్పుని తీసుకురావడం. ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని తామే కూల్చివేసి నియంత్రణలోకి తీసుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే.. ఇరాన్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. కేవలం.. ఎయిర్‌స్ట్రైక్స్‌తో దాన్ని లొంగదీసుకోవడం అసాధ్యం. ఎందుకంటే.. గ్లోబల్ ఫైర్ పవర్ గణాంకాల ప్రకారం.. అమెరికా, ఇజ్రాయెల్‌ని తట్టుకోవడం ఇరాన్ వల్ల కాదు. అమెరికా దగ్గర 1790 ఎయిర్‌క్రాఫ్ట్ ఫైటర్స్ ఉంటే.. ఇరాన్ దగ్గర 188 మాత్రమే ఉన్నాయ్. అటాక్ హెలికాప్టర్స్ అమెరికా దగ్గర వెయ్యికి పైగా ఉంటే.. ఇరాన్ దగ్గర 13 ఉన్నాయి. యూఎస్ దగ్గర యుద్ధ ట్యాంకులు 4 వేల 640 ఉంటే.. ఇరాన్ దగ్గర 1713 మాత్రమే ఉన్నాయ్. అమెరికా దగ్గర 11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే.. ఇరాన్ దగ్గర ఒక్కటి కూడా లేదు. యూఎస్ దగ్గర 70 సబ్‌మెరైన్లు ఉంటే.. ఇరాన్ దగ్గర 25 మాత్రమే ఉన్నాయ్. అగ్రరాజ్యం దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ 5 వేల 244 ఉంటే.. ఇరాన్ దగ్గర ఒక్కటి కూడా లేదు. కానీ.. మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద మిసైల్ నిల్వలు ఇరాన్ దగ్గరున్నాయ్. ఖైబర్ షెకాన్, ఫత్తా లాంటి బాలిస్టిక్ మిసైళ్లు.. వందల కిలోమీటర్ల టార్గెట్లని ఈజీగా చేరుకోగలవు. ఇరాన్ మేడ్ షాహిద్ డ్రోన్లు కూడా ఎక్కువ నష్టం కలిగించగలవు. వీటిని వందల సంఖ్యలో ప్రయోగించి.. శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని దెబ్బతీయడమే ఇరాన్ స్ట్రాటజీ. లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీ గ్రూపుల ద్వారాను ఇరాన్ ఏకకాలంలో అనేక చోట్ల దాడులు చేయించగలదు.
ఇరాన్ దగ్గర ఎన్ని మిసైళ్లు ఉన్నా.. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్, ఆరో-3 లాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇవి దాదాపు 90 శాతానికి పైగా మిసైళ్లని.. గాల్లోనే పేల్చేయగలవు. ఇజ్రాయెల్ దగ్గరున్న అడ్వాన్స్‌డ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్.. ఇరాన్ రాడార్లకు చిక్కకుండా వెళ్లి దాడులు చేయగలవు. వీటిని ఇరాన్ అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. యుద్ధం మేం ముగిస్తామంటూ ఇరాన్ చెబుతున్నా.. వాస్తవిక పరిస్థితులు ఆ దేశానికి అంత అనుకూలంగా లేవు. ఇరాన్ తన డ్రోన్లు, మిసైళ్లతో.. ఇజ్రాయెల్‌ని ఇబ్బంది పెట్టొచ్చు. కానీ, ఇజ్రాయెల్, అమెరికా కలిసి వైమానిక దాడులు చేస్తున్నందు వల్ల.. ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే.. యుద్ధం త్వరగా ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టే వరకు వెనక్కి తగ్గొద్దని అమెరికా భావిస్తోంది. ఇది.. ఒక్కరోజుతో ముగిసే ఆపరేషన్ కాదని, కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే.. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, శాంతిని దెబ్బతీసే వ్యవహారం కూడా.
Story by: Anup, Big Tv