Dharmavaram: ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? మిగతా చోట్ల అన్నింటికంటే అక్కడే టీడీపీ శ్రేణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎందుకు టీడీపీ శ్రేణులకు ఇబ్బందులు తప్పడం లేదనే ప్రచారం జరుగుతోంది? వైసీపీలో కూడా ఇన్ని ఇబ్బందులు పడలేదు అని ఎందుకు అంటున్నారు నేతలు? ఓపిక నశిస్తే అరచేయి ఆయుధం అవుతుందంటూ ఆ యువనేత ఎందుకు అన్నాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే మనం ధర్మవరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం టీడీపీకి పెట్టని కోట. టీడీపీ ఆవిర్భావం నుంచి రెండు సార్లు తప్పించి ఇక అన్ని సార్లు విజయం ఆ పార్టీదే. కానీ 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడ బీజేపీతో పొత్తు కుదిరి టికెట్ ఎవరికి అంతు చిక్కకుండా సత్య కుమార్ ఎగరేసుకొని పోయారు. అదే ఊపులో ధర్మవరంలో కాషాయ జెండా రెపరెపలాడింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు సహాకరించడంతో మంచి మెజార్టీతో గట్టెక్కారు సత్య కుమార్. ఇదే ఊపులో ఊహకందకుండా మంత్రి పదవి కూడ సొంతం చేసుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కొద్దికొద్దిగా విబేధాలు మొదలయ్యాయి. క్షేత్ర స్థాయిలో పదవుల పంపకం దగ్గరి నుంచి అనేక సార్లు విబేధాలు బయటపడ్డాయి. కానీ అవి కేవలం కార్యకర్తల వరకే ఉండడంతో మీడియా వరకు రాలేదు. మొదటిసారి ఓ అధికారి విషయంలో ఇరు పార్టీల నాయకులు వీధికెక్కారు. మునిసిపల్ కమిషనర్‌గా మల్లికార్జునని నియమించడం దగ్గరి నుంచి అన్ని విబేధాలే. వరుస పెట్టి కూటమి పార్టీల మధ్య విబేధాలు జరుగుతున్నాయి. దీనిని అనేక మార్లు మంత్రి సత్య కుమార్, పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్చార్జి చిలకం మధుసూదన్ రెడ్డి ఖండించిన ఆ విబేధాలు మాత్రం ఆగడం లేదు
అసలు ఈ విభేదాలకు కారణం ఎంటా అని ఆరా తీస్తే ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ధర్మవరం మంత్రి సత్య కుమార్ ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఇక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు హరీష్ బాబుకు అప్పగించారు. ధర్మవరంలో మంత్రికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా అది ప్రజా కార్యక్రమమైన పార్టీ కార్యక్రమమైన మొత్తం హరీష్ బాబు చూసుకుంటారు. అదేవిధంగా ధర్మవరంలో బీజేపీ బలపడేందుకు హరీష్ బాబు మొత్తం కార్యాచరణ రూపొందిస్తూ గ్రామాలు వార్డుల్లో ఎవరైతే బలమైన బీసీ నేతలు ఉంటారో.. వారు ఏ పార్టీ అయినా సరే బీజేపీ కండువా కప్పుతూ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.
వరుసగా వైసీపీ నేతలను బీజేపీలోకి చేర్చుకుంటూ ఉండగా.. రెడ్డి సామాజికవర్గ నేతలు మాత్రం జనసేన బాట పడుతున్నారు. ఇలా గత ఐదేళ్లు రాజభోగం అనుభవించిన వైసీపీ నేతలు ఇప్పుడు మరోసారి పార్టీ మారి బీజేపీలోనో లేక జనసేనలోనో చేరి తమ కాలం గడుపుకుంటున్నారట. ఇది టీడీపీ నేతలకు.. క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు ఏమాత్రం రుచించడంలేదట. ఇన్నాళ్లు తాము కష్టపడితే ఇప్పుడు వైసీపీ నేతలు తాపీగా ఆ రెండు పార్టీల్లో చేరి అన్ని పనులు చేసుకుంటున్నారనేది టీడీపీ కార్యకర్తల ఆవేదన.
Also Read: వికసిత్ భారత్-2047.. చంద్రబాబు ప్రజంటేషన్.. మోదీ ఫిదా
ఈ కార్యకర్తల ఆక్రోషం ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ వరకు చేరింది. ఇటీవల జరిపిన మినీ మహానాడులో శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం ప్రాంతం నాకు చాలా ఓపిక నేర్పించిందని అందుకోసమే చాలా ఓపికతో ఉన్నానని లేదంటే నా ఒరిజినల్ లోపల అలానే ఉందంటూ పార్టీ మారుతున్న వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం వచ్చినప్పుడు అరచేయి ఆయుధం అవుతుందని ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏం చేసినా దాని వెనుక తానే ఉంటానంటూ మినీ మహానాడు సాక్షిగా కార్యకర్తలకు ధైర్యం నింపారు. నాయకుడంటే పదిమంది వెనకాల ఉండేవాడు కాదని పదిమందిని ముందుకు నడిపించేవాడని.. ఒకవేళ అలా లేకుంటే చచ్చిన శవంతో సమానమని పరిటాల శ్రీరామ్ అలా ఉండలేడని కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందూపురం పార్లమెంట్ పరిధిలో జరిగిన జిల్లా మహానాడులో కూడా ధర్మవరం గురించి టాపిక్ వచ్చింది. జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న ప్రాంతం ధర్మవరం అని వారికి న్యాయం జరిపేలా మనం అందరం చూడాలన్నారు టీడీపీనేతలు. ధర్మవరం టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపే బాధ్యత మనపై ఉందని సత్యసాయి జిల్లా టిడిపి నేతలు వ్యాఖ్యానించారు. ఇటు ధర్మవరం మహానాడులో అటు జిల్లా మహానాడులో కూడా ధర్మవరం గురించి చర్చ రావడంతో కడపలో జరిగే మహానాడుపై ధర్మవరం టిడిపి కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.చూడాలి మరి ధర్మవరం టీడీపీ క్యాడర్ ఆశలు నెరవేరతాయో లేదో.
— Story By Apparao Thummala, Big Tv Live