E-Paper
Advertisement

CM Chandra Babu: అమరావతి, వైజాగ్‌ పై చంద్రబాబు కీలక నిర్ణయాలు

CM Chandra Babu: అమరావతి, వైజాగ్‌ పై  చంద్రబాబు కీలక నిర్ణయాలు
Advertisement

అమరావతి, వైజాగ్‌ డెవలప్‌మెంట్‌ విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు, శంకుస్థాపనలు జరిగాయి ఈ వారం రోజుల్లో. అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మరి ఆ నిర్ణయాలేంటి? వాటి ఇంపాక్ట్‌ రాష్ట్రాభివృద్ధిపై ఎలా ఉండబోతుంది?

12-12-2025 శుక్రవారం- నశ శకానికి నాంది

విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్‌తో బాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌ల ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు త్వరలో విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి 3వేల 740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41 వేల 700 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

12-12-2025 శుక్రవారం.. VERపై ఫోకస్

Advertisement

మొత్తం 9 జిల్లాలతో కూడిన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు VER పరిధిలో ఉంటాయి. ఈ రీజియన్ లో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, చేపట్టాల్సిన ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణపై యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం ఆపరేషన్‌లో ఉన్న విశాఖపట్నం, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్ పోర్టులతో బాటు కొత్తగా కాకినాడ గేట్ వే, మూలపేట పోర్టులు నిర్మిస్తారు. కొత్త 7 రైల్వే ప్రాజెక్టులు, 9 రహదారుల ప్రాజెక్టులు, 77 కి.మీ. మేర వైజాగ్ మెట్రో కూడా ఇందులో ఉంటాయి. అదే విధంగా 12 తయారీ కేంద్రాలు, 18 వ్యవసాయ ప్రాంతాలు, వరల్డ్ క్లాస్ నర్సరీ, ఫుడ్ పార్క్స్, ఆక్వాపార్క్, 5 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలు ఉంటాయి.

12-12-2025 శుక్రవారం.. సీఎం ఏరియల్ సర్వే

ఉత్తరాంధ్రలో నిర్మాణంలో అవుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఓడరేవులు, ఎయిర్ పోర్టులు, ఐటీ కంపెనీలకు సంబంధించిన వివిధ నిర్మాణాల్ని గగనతలం నుంచి పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ లో కీలకమైన ప్రాజెక్టుల పురోగతి, భోగాపురం ఎయిర్ పోర్టు, రాయ్ పూర్ విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంతంలోని రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టుల గురించి అధికారులతో చర్చించారు.

12-12-2025 శుక్రవారం.. సీఎం దిగ్భ్రాంతి

Advertisement

భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికుల ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

11-12-2025 గురువారం.. రాజధానిలో క్వాంటం వ్యాలీ

అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలన్నారు సీఎం చంద్రబాబు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని సూచించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల బృందంతో సచివాలయంలో సమావేశమయ్యారు. వైద్యరంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్‌పై పరిశోధనలకు గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని బృందం తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా ఏర్పాటు అవుతున్నట్టు వివరించింది. గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ బృందం సభ్యులకు సీఎం అభినందనలు తెలిపారు.

11-12-2025 గురువారం.. కేబినెట్ నిర్ణయాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు దాదాపు 9 వేల 500 కోట్లతో 506 ప్రాజెక్టులకు అనుమతులిచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో లోక్‌భవన్‌, అసెంబ్లీ దర్బార్‌ హాల్‌, గవర్నర్‌ కార్యాలయం, రెండు గెస్ట్‌ హౌస్‌లు, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీడ్ యాక్సిస్ రోడ్‌ను నేషనల్‌ హైవేకి లింక్ చేసే పనులకు 532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్‌ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 26సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తెలిపిన దాదాపు 20 వేల 444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పంట పండించడానికి రైతులు ఆరుగాలం ఎలా కష్టపడతారో.. వాటిని అమ్మేందుకు అంతే కష్టపడతారు. అయితే ఆ కష్టం ఇక ఉండకూడదంటున్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సేవలు.. ఇకపై అన్నీ ఆన్‌లైన్‌లో అందించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇక మంత్రుల పనితీరుపై స్పెషల్ క్లాస్‌ తీసుకున్నారు సీఎం. అంతేకాదు మరో కీలక ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం.

10-12-2025 బుధవారం.. పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ వేదికగా జరగనున్న యోనెక్స్–సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025 పోస్టర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ టోర్నమెంట్‌ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీలో పదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించి జాతీయ స్థాయి క్రీడాకారుల వివరాలు సీఎంకు తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం సూచించారు.

10-12-2025 బుధవారం.. సీఎం ప్రశంసలు

చిన్నతనంలోనే అంతర్జాతీయ వేదికలపై శ్రావ్యంగా పాటలు పాడుతూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న గాయని సాధ్యను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. యార్క్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో ఓపెరా హౌస్ వంటి పలు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడి అనేక విజయాలు సొంతం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 22 ప్రదేశాల్లో 22 ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ పాటల పోటీల్లో పాల్గొందని ప్రతిచోటా అవార్డులు సొంతం చేసుకుందని వివరించారు.

10-12-2025 బుధవారం.. ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

2025-26 ధాన్యం కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 32 శాతం అదనంగా ధాన్యం సేకరణ జరిగిందని, 24 గంటల్లోపే సొమ్ము చెల్లిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 4 వేల 85 కోట్లు జమ చేశామన్నారు. ధాన్యం, పత్తి, మిరప సహా వివిధ పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తినే రకాల వరి సాగు చేయాలని… వాటి కొనుగోలుతో పాటు అంతర్జాతీయ మార్కెట్లపైనా దృష్టిపెట్టాలన్నారు సీఎం. రాగులు, సజ్జలు, చిరుధాన్యాల్ని సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉల్లి కొనుగోలు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. 45 వేల 420 హెక్టార్లలో సుబాబుల్‌ సాగవుతోందని… రైతులకు ధర దక్కేలా చూడాలన్నారు. అరటి, నిమ్మ తదితర ఉద్యానపంటల కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 23 జిల్లాల్లో 2606 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు.

10-12-2025 బుధవారం.. హోమ్‌వర్క్‌ చేయాల్సిందే

మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్ధిక ఫలితాలపై సమావేశంలో సమీక్షించారు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్సు అంశాలపై సూచనలు చేశారు. దీంతో పాటు సూపర్ సిక్స్ పథకాలు, పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రుల, అధికారుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

09-12-2025 మంగళవారం.. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు

ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 58 వేల 700 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో మరో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 60 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. అలాగే పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని కేటాయించే వీలుందని.. ఇందుకు సంబంధించి త్వరలోనే పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి వరద జలాలను బొల్లాపల్లి, నల్లమల సాగర్‌లకు.. అలాగే నాగార్జున సాగర్ నుంచి 50 టీఎంసీల కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

09-12-2025 మంగళవారం.. పూర్వోదయతో వృద్ధి

పూర్వోదయ పథకం కింద వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోని 82 క్లస్టర్లలోని 20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను విస్తరించేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. పూర్వోదయ స్కీమ్‌లో 40 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో 20 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, మిగిలిన 20 వేల కోట్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందులో 5 వేల కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మించి, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. ప్రకాశం, రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు, 1,021 చెరువులను పూర్తి చేయటం ద్వారా ఉద్యాన పంటలకు నీరందించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.

09-12-2025 మంగళవారం.. స్క్రబ్‌ టైఫస్‌పై ఫోకస్

రోజురోజుకు మృతులు, రోగుల సంఖ్య పెరుగుతుండటంతో స్క్రబ్‌ టైఫస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ చేశారు. స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనం చేసేందుకు.. భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాన్నారు సీఎం. వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని, ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. దీనిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు.

09-12-2025 మంగళవారం.. రెవెన్యూ శాఖపై సమీక్ష

రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్ సహా 22ఏ, ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రీ సర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై చర్చించారు. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూటేషన్ ప్రక్రియ వేగవంతమైందని… జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులు 6 వేల 846, కాగా ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములను 22ఏ నుంచి తొలగించారు. 6 వేల 693 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా వెబ్ ల్యాండ్ 2.0లో వివరాలు నమోదు చేశారని అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు 5 లక్షల 28 వేల 217 గ్రీవెన్సులు రాగా అందులో 4 లక్షల 55 వేల 189 గ్రీవెన్సులు పరిష్కరించారు. మరో 73 వేల వరకు గ్రీవెన్సులు పరిశీలనలో ఉన్నాయి.

08-12-2025 సోమవారం.. ఆన్‌లైన్‌లోనే అన్నీ సేవలు

సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరుల‌కు అన్ని సేవ‌లూ ఆన్‌లైన్‌లోనే అందించాల‌ని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ దిశ‌గా ఆయా శాఖ‌ల‌న్నీ చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు. ఆర్టీజీఎస్‌పై స‌మీక్ష నిర్వహించారు. ప్రజ‌ల‌కు కావాల్సిన ప్రభుత్వ సేవ‌ల‌న్నీ, ప్రభుత్వ కార్యాల‌యాల‌కు తిర‌గ‌న‌వస‌రం లేకుండా మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా అంద‌జేస్తున్నామ‌ని, దీనిపై ప్రజ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు సీఎం.

08-12-2025 సోమవారం.. గాడిలో పడుతున్న ఆర్ధిక వ్యవస్థ

రాష్ట్రాభివృద్ధిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు సీఎం చంద్రబాబు. విధ్వంసమైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, నిర్వీర్యమైన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరిస్తున్నామన్నారు. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారని.. వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని, సాగునీటి వ్యవస్థను సమర్ధంగా నిర్వహిస్తున్నామని మరోసారి వివరించారు.

08-12-2025 సోమవారం.. ఈవోపై కఠిన చర్యలు

సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలో గంగమ్మ గుడిలో చోరీకి పాల్పడ్డ ఆలయ ఈవో మురళీకృష్ణ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. సీఎం ఆదేశాలతో దేవాదాయ శాఖ ఆయనను సస్పెండ్ చేసింది. గుడిలో 5 కిలోల వెండి ఆభరాణలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను అదే దేవాలయం ఈవో మురళీ కృష్ణ చోరి చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయాడు. స్థానిక దేవాదాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణలో చోరీ నిర్ధారణ కావడంతో అతడిని అరెస్ట్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Story Vamshi, Big Tv 

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×