E-Paper
Advertisement

CM Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు ఫోకస్..

CM Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్..  చంద్రబాబు ఫోకస్..
Advertisement

CM Chandrababu:  ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సహకరించాలని.. ఈ వారం కేంద్రమంత్రులను వరుసపెట్టి కలిశారు సీఎం చంద్రబాబు. ఇక.. ఏపీలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు.. ది ఎకనమిక్‌ టైమ్స్‌ బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు సీఎం చంద్రబాబుని వరించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని.. రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌ని కోరారు సీఎం. ధైర్యంగా పెట్టుబడులు పెట్టి, ల్యాండ్‌మార్క్‌ ప్రాజెక్టులు నిర్మించాలని పిలుపునిచ్చారు.

డిసెంబర్ 20 స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

అనకాపల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా.. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా.. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, శుద్ధి ప్లాంట్లు, గోబర్ దన్ ప్లాంట్లు, గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలు లాంటి.. 68 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ఇక.. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోటలో.. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి.. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను పరిశీలించారు. చెత్త సేకరణపై పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కంపోస్ట్ తయారీ యార్డ్‌ని కూడా సందర్శించారు. చెత్తను కాంపోస్ట్‌గా తయారు చేసి.. రైతులకు ఎరువులను అందిస్తున్న కంపోస్ట్ యూనిట్ నిర్వాహకుడితో మాట్లాడారు.

డిసెంబర్ 20 ముస్తాబు ప్రారంభం

Advertisement

అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా.. తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సీఎం చంద్రబాబు నాయుడు ఈ వారం సందర్శించారు. ఈ స్కూల్ నుంచే ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. విద్యార్థినులతో కాసేపు మాట్లాడి.. వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను పరిశీలించారు.

డిసెంబర్ 19 ఏపీకి సహకరించండి

ఈ వారం దేశ రాజధానిలో బిజీబిజీగా పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీ టూర్‍‌‌లో భాగంగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందన గురించి అమిత్‌ షాకు వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి, అభివృద్ధి పనులు, రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు చర్చించారు. అదేవిధంగా.. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ సీఎం భేటీ అయ్యారు. రాజధాని అమరాతి నగరాన్ని.. దేశంలోని వేర్వేరు నగరాలతో అనుసంధానించేలా.. నేషనల్ హైవే నెట్‌వర్క్‌ని కలపాలని కోరారు. కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక.. కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరీతోనూ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. 96 వేల 862 కోట్ల పెట్టుబడితో.. దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటైన నెల్లూరు జిల్లాలోని బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ని కూడా సీఎం చంద్రబాబు కలిశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు అవశ్యకతను ఆయనకు వివరించారు. సవరించిన డీపీఆర్‌లను ఆమోదించాలని కోరారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ

Advertisement

ఢిల్లీ పర్యటనలో.. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం.. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని, ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద 150 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ.. ఏపీ సీఎం ఢిల్లీలో భేటీ అయ్యారు. కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం, గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు. విద్య, నైపుణ్యాల కల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో.. పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్థికసాయం కోరుతూ.. వినతి పత్రాన్ని అందచేశారు.

సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలపై చర్చ

కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీఆర్ పాటిల్‌తో‌నూ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు.. తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం.. రాష్ట్రానికి అదనంగా వెయ్యి కోట్లు కేటాయించాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించి పెండింగ్‌లో ఉన్న అనుమతులు మంజూరు చేయాలని కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం.. శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని గుర్తుచేశారు.

డిసెంబర్ 19 అమరావతికి రండి

ఢిల్లీలో జరిగిన క్రెడాయ్‌ జాతీయ సదస్సులోనూ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతికున్న సానుకూలతలు, దీర్ఘకాల అవసరాలను రియల్ ఎస్టేట్ డెవలపర్లకు వివరించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశానికి, భావితరాలకు సరిపోయే ఆధునిక నగరం నిర్మించే అవకాశం అరుదుగా వస్తుందని.. అమరావతి నిర్మాణం కూడా మన తరానికి దక్కిన అవకాశమని చెప్పారు. డెవలపర్లు ధైర్యంగా పెట్టుబడులు పెట్టి, ల్యాండ్‌మార్క్‌ ప్రాజెక్టులు నిర్మించాలని పిలుపునిచ్చారు.

డిసెంబర్ 18 చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ప్రముఖ దినపత్రిక ఎకనమిక్‌ టైమ్స్‌ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు.. ఈసారి ఏపీ సీఎం చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గానూ.. ఆయన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ది ఎకనమిక్‌ టైమ్స్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా సీఎం ఈ అవార్డును అందుకోనున్నారు.

హెల్తీ, వెల్తీ, హ్యాపీ: ఏపీ అభివృద్ధి, సంక్షేమంలో కొత్త ఆవిష్కరణలు

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఒకవైపు.. సంక్షేమం మరోవైపు సాగుతోందన్నారు సీఎం చంద్రబాబు. నూతన ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేయొచ్చని.. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు చక్కని ఫలితం ఉండాలని.. కలెక్టర్ల సదస్సులో అధికారులకు సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా.. ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు వచ్చిన విశ్వసనీయతను కాపాడుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈవారం.. 5 వేల 757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం నియామకపత్రాలు అందించారు. ఇక.. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. మరో ఏడాదిలోగా ఏపీ ప్రజల కోసం డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు సిద్ధం చేస్తామన్నారు.

డిసెంబర్ 18 ప్రతి పైసాకు ఫలితం ఉండాలి

కలెక్టర్లే తమ ప్రభుత్వానికి అంబాసిడర్లని చెప్పారు సీఎం చంద్రబాబు. సర్కారుపై సానుకూలత రావాలంటే.. అధికారులదే కీలకపాత్ర అన్నారు. పొలిటికల్ గవర్నెన్ కీలకమని.. కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. ఏపీలో చదివే విద్యార్థులకు నాలెడ్జ్‌తో పాటు విలువలు కూడా ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. ఇంటర్‌ వరకు రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని రెండో రోజు కలెక్టర్ల సదస్సులో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే.. స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ సిటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రీవెంటివ్, క్యురెటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్‌తో ప్రజలకు వైద్యాన్ని అందించాలన్నారు సీఎం. ప్రజల్లో సంతృప్తి పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరారు. అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందన్నారు. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలు సైతం వినియోగించుకోవాలని సూచించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది చాలా ముఖ్యమన్నారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో 11 లక్షల కోట్లకు పైనే పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎస్ఐపీబీల ద్వారా ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించామని.. వాటిని క్లియర్ చేయడంలో కలెక్టర్లు వేగంగా స్పందించాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

డిసెంబర్ 17 కలెక్టర్ల సదస్సులో సీఎం

ఈ వారం ఏపీలోని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు సీఎం చంద్రబాబు. అధికారులు, ప్రజాప్రతినిధులెవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలని, నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని సీఎం సూచించారు. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిపారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. రెవన్యూ శాఖలో వేగంగా ఫ్లైళ్లు క్లియర్ చేయాలని, ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలని సూచించారు. ఇప్పటివరకు ప్రజలకు చక్కగా సేవలందిస్తున్నామని.. మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. లోటుపాట్లను సవరించుకుంటేనే.. ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు సీఎం చంద్రబాబు. జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్.. ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15 శాతం వృద్ధి రేటు సాధించడం కష్టమేమీ కాదన్నారు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ లాంటి అంశాలతో వృద్ధి సాధిద్దామన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు వచ్చిన విశ్వసనీయతని కాపాడుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించారు. వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చేందుకు తెచ్చిన సూపర్ సిక్స్ పథకాలను.. సూపర్ సక్సెస్ చేశామన్నారు సీఎం.

డిసెంబర్ 16 నియామకపత్రాల అందజేత

మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో.. ఈ వారం కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. మొత్తం.. 5 వేల 757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు అభివాదం చేశారు. నియామక పత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లతో ప్రతిజ్ఞ చేయించారు.

డిసెంబర్ 16 అమెరికాతో భాగస్వామ్యం

ఈ వారం.. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో భేటీ అయ్యారు. అమెరికాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మాట్లాడారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాల లాంటి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు.

డిసెంబర్ 16 ఆరోగ్యశాఖపై రివ్యూ

హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. ఏడాదిలోగా ఏపీ ప్రజల డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు సిద్ధం చేస్తామని తెలిపారు. వాటి ఆధారంగానే స్క్రీనింగ్‌లో టాప్‌ 10 రోగాల్ని గుర్తించి, విశ్లేషించి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే.. ముందే నియంత్రించేలా ప్రివెంటివ్‌ విధానాల్ని అమలు చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, వైద్య ఖర్చులూ తగ్గుతాయని సీఎం చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు.

మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో వర్చువల్‌గా సంప్రదింపులు జరిపారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, ప్రాజెక్టుల్ని సీఎం వారికి వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ప్రాజెక్టులు చేపట్టేందుకు వైద్య నిపుణుల నుంచి సూచనలను ఆహ్వానించారు. ముంబైలో త్వరలో జరిగే గ్లోబల్‌ ఏఐ కన్వెన్షన్‌లో టెక్నాలజీ వినియోగంపై.. పలు విధానాలు ప్రదర్శించే ఆలోచన చేస్తున్నామన్నారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా.. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు.. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మెరుగైన విధానాల అమలుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాలన్నారు సీఎం.

డిసెంబర్ 15 పొట్టిశ్రీరాములుకు నివాళి

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ వారం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి హాజరయ్యారు. అమరజీవి జీవిత విశేషాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని తిలకించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

డిసెంబర్ 15 కన్హాలో సీఎం

హైదరాబాద్ శివార్లలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని ఈ వారం సీఎం చంద్రబాబు సందర్శించారు. కన్హా శాంతి వనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సదుపాయాల గురించి.. కన్హా ధ్యాన మందిరం అధ్యక్షులు దాజీ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం, వెల్‌నెస్ సెంటర్, యోగా సదుపాయాలు, హార్ట్‌ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణ అకాడమీ, చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు.

Story By Anup, Big Tv 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×