BigTV English

CM Chandrababu: బడుల అభివృద్ధి కోసం.. సీఎం బాబు మాస్టర్ ప్లాన్

CM Chandrababu: బడుల అభివృద్ధి కోసం.. సీఎం బాబు మాస్టర్ ప్లాన్

CM Chandrababu: శాఖల వారీగా సమీక్షలు చేయడం.. ఆయా శాఖల్లో పురగతిని గుర్తించడం ఏపీ సీఎం చంద్రబాబు స్టైల్. ఏదైనా డిపార్టెమెంట్ వెనకబడినట్టు అనిపిస్తే వాటికి టార్గెట్ పెడతారాయన. ఈ వారం మెజార్టీ సమయంలో కీలక శాఖపై సమీక్షలు చేశారు సీఎం. కొందరు కార్యదర్శులు ఫైల్స్ క్లియరెన్స్ లో వెనకబడ్డారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక వాట్సాప్ సేవలను మరింత విస్తరించాలని చెప్పారు. 6 నెలల్లో అన్ని సేవలు వాట్సాప్ గవర్నెన్స్ లో అందుబాటులో ఉండాలని సీఎం సూచన.


10-02-2025 సోమవారం ( అక్రమాల వెలికితీత )

అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడుతూనే మరోవైపు గత ప్రభుత్వ అక్రమాలు వెలికితీసే ప్రయత్నాలకు సీఎం చంద్రబాబు అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వశాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. దానికి బ్యాంకుల నుంచి కొంత సమాచారం అవసరమని అన్నారు. విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు కోరే సమాచారం ఇవ్వాలని సూచించారు. సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు సీఎం. దీంతో పాటు అర్హులైన రైతులు బ్యాంకుకు వస్తే 15 నిమిషాల్లోనే లోన్ ఇవ్వాలని అన్నారు.


10-02-2025 సోమవారం (బీసీలకు భరోసా)

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో బీసీ భవన్‌లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో వీటి నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మిగిలిన చోట్ల నిర్మాణానికి వీలుగా భూమిని సేకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. కర్నూలు, ఏలూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించింది. కానీ, వైసీపీ అధికారంలోకి వాటిని పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఆ స్థలాల్లోనే నిర్మాణాలకు చర్యలు మొదలు పెట్టింది. బీసీ భవనాల్లో బీసీ స్టడీ సర్కిళ్లకు గదులు కేటాయించి, వాటిలో పోటీ పరీక్షలపై విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని ఆలోచన. మిగిలిన 24 జిల్లాల్లోనూ బీసీ భవనాల నిర్మాణాలకు 240 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అంచనా. 2025-26 బడ్జెట్‌లో దీని కోసం 60 కోట్లు కేటాయించాలనే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గరుంది.

10-02-2025 సోమవారం (ప్రభుత్వ బడికి 5 స్టార్ టార్)

మన బడి- మన భవిష్యత్తు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైసీపీ టైంలో బడుల్లో రెండో విడతగా మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన పనులను పూర్తి చేయాలంటే 3వేల నూట 21 కోట్ల నిధులు అవసరమని గుర్తించారు అధికారులు. 18 రకాల వసతుల ఆధారంగా కూటమి ప్రభుత్వం పాఠశాలలకు స్టార్‌ రేటింగ్‌ ఇస్తోంది. 5 స్టార్ రేటింగ్‌ సాధించాలంటే లైబ్రరీ, సైన్సు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఉండాలి. వీటన్నింటిని నిర్మించాలంటే 13 వేల 525 కోట్ల రూపాయలు అవసరం. ఒకవేళ 50 శాతం పనులు చేసి వదిలేసినవి పూర్తి చేయడానికైనా 15 వందల 60 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారుల లెక్క.

11-02-2025 మంగళవారం ( ఫైల్స్ ఫాస్ట్ క్లియరెన్స్)

సీఎం చంద్రబాబు పలు శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక విషయాలపై చర్చించారు. కొందరు కార్యదర్శులు ఫైల్స్ క్లియర్ చేయడానికి ఆరు నెలలు, ఏడాది సమయం తీసుకుంటున్నారని అన్నారు సీఎం. అంత సమయం తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాల్ని సమర్థంగా అమలుచేయాలని సూచించారు. కేంద్ర బడ్జెట్‌ నుంచి నిధులు తెచ్చుకోవడంలో తొలి అడుగు మనదే కావాలని సీఎం ఆకాంక్ష. వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోవాలని చెప్పారాయన.

11-02-2025 మంగళవారం ( అరచేతిలోకి ప్రభుత్వ పాలన)

ఈ సీమక్షలో వాట్సాప్ గవర్నన్స్ పై కూడా చర్చించారు . ఆఫీసులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే రోజులు పోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవ‌ల‌న్నీ వాట్సాప్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అన్ని శాఖ‌లు త‌మ బ్యాక్ ఎండ్ మెకానిజాన్ని దాని తగ్గట్టు రెడీ చేసుకోవాలని చెప్పారు సీఎం. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో ప్రస్తుతం 161 సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే 45 రోజుల్లో ఈ సంఖ్య 500కి పెరగాలని సీఎం టార్గెట్ పెట్టారు. తర్వాత మూడు లేదా ఆరు నెల‌ల్లో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే ఉండేలా చూడాలన్నారు. టీటీడీ సేవలను కూడా వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.

11-02-2025 మంగళవారం ( పథకాలకు వేళాయే)

అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేల రూపాయలు మూడు విడతల్లో పెట్టుబడి సాయంగా అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. మత్స్యకారులకు ఏప్రిల్‌లో వేట నిషేధ కాలానికి సంబంధించిన 20 వేల భృతి చెల్లిస్తామన్నారు.
మైనారిటీలకు రంజాన్‌ తోఫాను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు. ఇమామ్, మౌజమ్‌ల వేతనాల విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యే సందర్భంగా వచ్చే జూన్‌ నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సీఎం టార్గెట్. వాటిలో 2 లక్షల టిడ్కో ఇళ్లు కాగా, మిగతా మూడులక్షల ఇళ్లకు ఎస్సీ, ఎస్టీ, చేనేత వర్గాలకు అదనపు సాయం అందజేస్తామని ప్రకటించారు.

11-02-2025 మంగళవారం ( గ్రామాల పర్యటనకు అధికారులు)

గ్రూప్‌-1, ఆపై స్థాయి అధికారులందరూ ఏప్రిల్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు సూచించారు. రెండు, మూడు రోజులు గ్రామాల్లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయని సీఎం విశ్లేషణ. గ్రామాలు కూడా ఇన్నోవేటివ్‌గా తయారయ్యాయని.. పట్టణాల కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్పారాయన. ఒక్కో జిల్లాను ఒక్కో సీనియర్‌ అధికారి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం.

11-02-2025 మంగళవారం ( ఆదివాసీలకు హామీ)

గిరిజనుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ఆయన ట్వీట్ చేశారు. అలాంటి తప్పుడు ప్రచారాలను గిరిజన సోదరులు నమ్మవద్దని సూచించారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడమంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని బలంగా నమ్ముతున్నానని ఆయన చెప్పారు. అందుకే వారికి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు సీఎం.

12-02-2025 బుధవారం ( పేదల ఇళ్లకు పెద్ద సాయం)

మంగళవారం జరిగిన మంత్రులు, కార్యాదర్శుల మీటింగ్‌లో పేదల ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ఆదివాసీ గిరిజనులకు అదనపు సాయం అందిచాలని నిర్ణయించారు. దానికి బుధవారం ఆర్థికశాఖ ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో 4.05 లక్షలమందికి లబ్ధి చేకూరనుంది. వీరికి సాయం అందించేందుకు ప్రభుత్వం 2వేల 402 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. 2019-24 మధ్య జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. 12.88 లక్షల ఇళ్లను పూర్తి చేయకుండానే వదిలేసింది. 7.35 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 5.53 లక్షలమంది పునాది కూడా తీయలేదు. వాటిని ఇప్పుడు పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు.

12-02-2025 బుధవారం ( సింగిల్ డెస్క్.. ఆల్ పర్మిషన్స్ )

రాష్ట్రానికి పెట్టుబడులు తరలివచ్చేలా సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సింగిల్‌ డెస్క్‌ బ్యూరో.. టాస్క్‌ఫోర్స్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుందని చెబుతూ ప్రభ్వుతం ఉత్తర్వులు జారీ చేసింది. సులభతర వాణిజ్య నిబంధనలను మరింత సులువుగా మార్చాలన్నదే ముఖ్య ఉద్దేశమని వివరించింది. పెట్టుబడులతో వచ్చే వారికి మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దీనివల్ల అవసరమైన అన్ని క్లియరెన్స్‌లు, అనుమతులను ఒకేచోట పొందే వెసులుబాటు పారిశ్రామికవేత్తలకు లభిస్తుందని తెలిపింది.

13-02-2025 గురువారం ( పనుల ఆలస్యంపై ఆరా)

గురువారం సీఎం చంద్రబాబు జలవనరులశాఖ ప్రాజెక్టులపై సమీక్షించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాల ప్రకారం పనులు పూర్తిచేయాల్సిందేనని సీఎం ఆదేశించారు. అలా చేయకపోతే సంబంధిత అధికారులు, గుత్తేదారులనే బాధ్యత వహించాల్సి వస్తుందని తేల్చేశారు సీఎం. నిధులు జాప్యం లేని ప్రాజెక్టుల్లో పనులు ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఇక పోలవరం డయాఫ్రం వాల్‌ పనుల్లో కూడా పురోగతి లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో ఎందుకు అలసట వహిస్తున్నారని ప్రశ్నించారు. డయాఫ్రం వాల్‌ పనులు 13వందల 79 మీటర్ల మేర చేయాల్సి ఉంది. నెల కిందట పనులు ప్రారంభమయ్యాయి. కానీ.. కేవలంల 51 మీటర్ల పనులే పూర్తి కావడం సీఎం అసంతృప్తికి కారణం. పోలవరం కుడి, ఎడమ కాలువ అనుసంధాన పనుల్లో కొంత జాప్యం ఉందని అధికారులు చెప్పగా, వచ్చే సమీక్ష సమావేశం నాటికి ఈ పనుల్లో పురోగతి చూపాలని సీఎం ఆదేశించారు.

13-02-2025 గురువారం ( బనకచర్లకు స్పెషల్ కార్పోరేషన్ )

పోలవరం-బనకచర్ల అనుసంధానంపై కూడా అధికారులతో సీఎం చర్చించారు. ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా చేపడతామని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పోలవరం-బనకచర్ల పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని సూచించారు. త్వరగా విధివిధానాలు ఖరారు చేసి ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు సీఎం. ఇందులో కేంద్రం, రాష్ట్రవాటా నిధులతో పాటు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామన్నారాయన.

13-02-2025 గురువారం (పర్యాటకానికి ప్రోత్సహాకాలు )

పర్యాటకశాఖపై కూడా చంద్రబాబు గురువారం సమీక్ష జరిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఎస్క్రో ఖాతా నుంచి వెంటనే ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని సూచించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన విషయాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఆదేశించారు. మనం తీసుకున్న నిర్ణయం గురించి బయటకు తెలిస్తే పెట్టుబడులు ఆటోమోటిక్‌గా తరలి వస్తాయని సీఎం ఆలోచన. అమరావతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, శ్రీశైలం, తిరుపతిని పర్యాటక యాంకర్‌ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని సీఎం టార్గెట్. గండికోట, సూర్యలంక, లంబసింగిని టెంట్‌ సిటీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కోనసీమలో హౌస్‌ బోట్లను ప్రవేశ పెట్టడంతోపాటు విశాఖ బీచ్‌ను మరింత అభివృద్ధి చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి మూడు నెలల్లో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి.

14-02-2025 శుక్రవారం (కులవృత్తులకు కొత్త హంగులు)

కులవృత్తులపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. శుక్రవారం బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపిన ఆయన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదరణ-3గా దీన్ని అమలు చేయాలని సూచించారు. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కులవృత్తుల్లో టెక్నాలజీని కనెక్ట్ చేయాలని తెలిపారు. పనిని వేగవంతం చేసి.. ఆదాయాన్ని పెంచేలా కొత్త పరికరాలను అందించాలని ఆదేశించారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఏయే కులవృత్తులకు ఏ ఆధునిక పరికరాలు అందించాలో వివరాలు సమీకరించాలన్నారు. కులవృత్తులతో ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు సీఎం. బీసీ రక్షణ చట్టాన్ని సబ్‌కమిటీ నివేదిక రాగానే అమల్లోకి తెస్తామని తెలిపారు.

15-02-2025 శనివారం (స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర )

సీఎం చంద్రబాబు శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో.. పరిసరాలనూ అలాగే ఉంచుకోవాలని సూచించారు సీఎం. దీని కోసం ప్రతీ నెల మూడో శనివారం అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29% పచ్చదనం ఉందని.. దీన్ని 50%కు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారాయన.

రాష్ట్రంలో 84 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబరు 2 నాటికి దాన్ని తొలగించాలని మున్సిపల్‌ శాఖకు ఆదేశించారు సీఎం. చెత్తను పునర్వినియోగించేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా నెల్లూరు, రాజమహేంద్రవరాల్లో వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 670 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ల ద్వారా 1,260 టన్నుల వ్యర్థాలను వినియోగించుకోవచ్చని చెప్పారు.

ఏపీలోని క్రైమ్స్ గురించి కూడా ఈ మీటింగ్‌లో ప్రస్తావించారు చంద్రబాబు. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే ఎంతో బాధేస్తోందని అన్నారు. తప్పుచేసిన నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని చెప్పారు. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చారు.

గత ఐదేళ్లూ సంపదను సృష్టించడం మానేసి.. అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని గుర్తు చేసినా చంద్రబాబు.. పేదలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తామని హామీ ఇచ్చారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×