BigTV English

CM Revanth Reddy: రేవంత్ కీలక నిర్ణయం కొత్తగా మరో 7 ఫ్లై ఓవర్లు

CM Revanth Reddy: రేవంత్ కీలక నిర్ణయం కొత్తగా మరో 7 ఫ్లై ఓవర్లు

CM Revanth Reddy: ఈవారం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధి పనులపై వరుస సమీక్షలు, పలు కంపెనీలతో ఒప్పందాలు, కొత్త టార్గెట్లు ఇచ్చేలా దిశానిర్దేశం చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ తో ఒప్పందాల విషయంలో మరో ముందడుగు పడింది. పారదర్శకంగా ఉండేందుకు ఇందిరమ్మ ఇండ్ల ప్రత్యేకంగా వెబ్ సైట్ తీసుకొచ్చారు.


14-02-2025 శుక్రవారం ( విద్యార్థులకు గుడ్ న్యూస్ )

రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో యంగ్‌ ఇండియా గురుకుల పాఠశాలల నిర్మాణం వందశాతం పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. యంగ్‌ ఇండియా గురుకులాలు, చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం పనులపై విద్యాశాఖ అధికారులతో ఈనెల 14న సీఎం రేవంత్ సమీక్షించారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థలాలు కేటాయిస్తే అనుమతుల పనులు వేగవంతం చేయాలన్నారు. వారంలోగా నివేదిక ఇవ్వాలని, 105 సెగ్మెంట్లలో రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు సీఎం.


14-02-2025 శుక్రవారం ( ఇండిగో రూరల్ జాబ్ మేళా )

విమానయాన రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన హెచ్‌ఆర్ బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. యువతకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి విమానయాన రంగంలో అవకాశాలపై చర్చించారు. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలపై ఇండిగో ఎయిర్‌లైన్స్ సానుకూల స్పందనను వ్యక్తం చేసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో త్వరలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించడానికి ఏర్పాటు చేయడానికి ఇండిగో ముందుకొచ్చింది.

14-02-2025 శుక్రవారం ( ఇందిరమ్మ ఇండ్ల కోసం వెబ్ సైట్ )

ఇందిరమ్మ ఇండ్లను తొలివిడత లబ్దిదారులకు కేటాయించిన ప్రభుత్వం ఆ ఇంటి నిర్మాణం పురోగతి, స్టేటస్ ఏంటో చెక్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా వెబ్ సైట్ తీసుకొచ్చింది. అలాగే లబ్దిదారుల దరఖాస్తులు ఏ స్టేజ్ లో ఉన్నాయో గుర్తించేందుకు ఉపయోగపడనున్నాయి. ఇంటి కోసం సర్వే నిర్వహించారా లేదా? ఇల్లు మంజూరు అయిందా లేదా?
మంజూరైన ఇల్లు ఏ జాబితాలో ఉంది? అన్న వివరాలు www.indirammaindlu.telangana.gov.in తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. ఇందులో ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్లలో ఏదైనా ఒకటి ఎంటర్ చేసే డిటైల్స్ వస్తాయి. దరఖాసుదారులకు ఏమైనా తమ అభ్యంతరాలు ఉంటే ఈ వెబ్ సైట్ ద్వారా కూడా తెలపవచ్చు.

14-02-2025 శుక్రవారం ( డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇన్ తెలంగాణ )

రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఉపాధి క‌ల్పించే వ‌న‌రుగా టూరిజం శాఖ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప‌ర్యాట‌క శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంటర్​లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు కల్పించాలన్నారు. నాగార్జున సాగ‌ర్‌ బ్యాక్ వాట‌ర్‌లో బోట్ హౌస్‌ అందుబాటులో ఉంచాల‌ని, డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాల‌ని సీఎం సూచించారు. అట‌వీ, ఐటీ, విద్యుత్‌, టీజీఐఐసీ, వైద్య, క్రీడ‌ల శాఖ‌ల‌తో సమన్వయం చేసుకొని ప‌ర్యాట‌క శాఖ పాల‌సీకి తుది రూపు ఇవ్వాలన్నారు. ఒక శాఖ విధానాలు మ‌రో శాఖ పాలసీలకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ కు ప‌ర్యాట‌క శాఖ‌లో ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు.

14-02-2025 శుక్రవారం ( మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కు లైన్ క్లియర్ )

రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తెచ్చిన జీవో 317తో ఇబ్బంది పడుతున్న వారి మ్యూచువల్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఆయా శాఖలకు నోట్‌‌‌‌ జారీ చేసింది. జీవో 317తోపాటు, స్పౌజ్‌‌‌‌, మెడికల్‌‌‌‌, మ్యూచువల్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌లో ఉద్యోగులు చేసుకున్న ట్రాన్స్ ఫర్ దరఖాస్తులను ఈనెల 20వ తేదీలోగా క్లియర్‌‌‌‌ చేసి, వారిని కోరుకున్న జిల్లాలకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఈనెల 28వ తేదీలోగా అందజేయాలని ఆయా శాఖల స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌లు, ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీలు, సెక్రటరీలను సర్కారు ఆదేశించింది.

13-02-205 గురువారం ( మైక్రోసాఫ్ట్, గూగుల్ డబుల్ ఇంజిన్)

ఈనెల 13న మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అటు ఏఐ పై గూగుల్ తో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అవుతున్న ఈ సందర్భంలో తెలంగాణ విద్యార్థులు, పరిశ్రమల్లో నిపుణులు, ప్రభుత్వ అధికారులు మొత్తం 1.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రభుత్వ పాఠశాలల్లో 100 మంది చొప్పున మొత్తం 50 వేల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలో వ్యవసాయం, ట్రాఫిక్‌ రంగాల్లో భారీఎత్తున ఏఐని వాడేందుకు రూట్ క్లియర్ అయింది.

ఇందుకు సంబంధించి ఆయా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏఐలో శిక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు రెండు ప్రపంచ దిగ్గజ ఐటీకంపెనీలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ ముందుకొచ్చాయి. ఈ మేరకు రెండు కంపెనీలతో ఈనెల 13న రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ నిర్మించిన భవనం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒక ఒప్పందం కుదరగా, టీ హబ్‌లో సీఎం సమక్షంలోనే జరిగిన మరో కార్యక్రమంలో గూగుల్‌తో మరో ఒప్పందం చేసుకున్నారు.

13-02-205 గురువారం ( కోర్ అర్బన్ ఏరియా డెవలప్ )

హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నానక్‌రామ్‌గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ఈనెల 13న సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ఏరియా మొత్తాన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు.. నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు.

డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలన్నారు. నగరంలో కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. GHMCలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ క్లౌడ్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

12-02-2025 బుధవారం ( సర్వేకు మరో ఛాన్స్ )

కులగణన సర్వేపై చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే లెక్కలను బయటపెట్టింది. పకడ్బందీగా సర్వే నిర్వహించింది. అయితే సర్వేలో సంఖ్య తగ్గిందన్న వాదనలపై ప్రభుత్వం రివ్యూ చేసింది. ఈనెల 12న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పై సీఎం చర్చించారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. వివిధ కారణాలతో ఈ కుల గణనలో సర్వేలో కొందరు పాల్గొనలేదు. గతంలో 96.9 శాతం మంది కుల గణన సర్వేలో పాల్గొనగా, 3.1 శాతం మంది వేర్వేరు కారణాలతో వివరాలు ఇవ్వలేకపోయారు.

అయితే ఈ సర్వేలో పాల్గొనని వారి కోసమే రీ సర్వే చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే చేస్తామని అప్డేట్ ఇచ్చింది సర్కారు. ఆన్‌లైన్, టోల్‌ ఫ్రీ నంబర్ లేదా మండల కార్యాలయానికి వెళ్లి తమ వివరాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి, అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఒత్తిడి తెస్తామన్నారు.

12-02-2025 బుధవారం ( చెప్పినట్లుగా రైతు భరోసా )

రైతు భరోసాను ఎకరానికి 12 వేల రూపాయలుగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే వరుసగా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈనెల 12న మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. బుధవారం 1,230 కోట్లను రైతు అకౌంట్లలో వేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు 3,487 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి. జనవరి 26న పైలెట్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి 569 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న 17 లక్షల మంది రైతులకు 557 కోట్లు జమ చేశారు. ఫిబ్రవరి 10న రెండెకరాల వరకు ఉన్న వారికి ఇచ్చారు.

11-02-2025 మంగళవారం ( డిమాండ్ ఎంతున్నా కరెంట్ సప్లై )

ఎండాకాలంలో కరెంట్ డిమాండ్ పీక్ స్టేజ్ కు వెళ్తుంది. ఈ నేపథ్యంలో డిమాండ్ ఎంతున్నా రెప్పపాటు కూడా కరెంట్ కట్ కావొద్దని ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 11న డిప్యూటీ సీఎం భట్టి సెక్రటేరియట్ లో టీజీఎస్పీడీసీఎల్‌ అధికారులతో సమీక్షించారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయుల్లో సమావేశాలు నిర్వహించుకుని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారుప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ ఎమర్జెన్సీ వెహికిల్ సేవలను గ్రామాలకూ విస్తరించాలన్నారు. నిర్మాణంలో ఉన్న సబ్‌-స్టేషన్లను మార్చి 1లోగా పూర్తి చేయాలన్నారు. కరెంట్ సమస్యలు వస్తే డయల్‌ 1912పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని డిసైడ్ అయ్యారు.

11-02-2025 మంగళవారం ( బర్డ్ ఫ్లూ అలర్ట్ )

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్ని రోజులు కోళ్ల పెంపకం.. మాంసం వాడకంపై జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అలర్ట్ తో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బర్డ్‌ ఫ్లూ వచ్చిన కోళ్లను తాకొద్దని నిర్వాహకులకు సూచిస్తూనే.. సరిహద్దుల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల దిగుమతులపై నిఘా పెట్టింది. బర్డ్‌ ఫ్లూ భయంతో ఇప్పటికే చికెన్‌ అమ్మకాలు భారీ పడిపోయాయి. ఇదే సమయంలో చికెన్‌ రేట్లు కూడా తగ్గిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా 24 చెక్‌ పోస్టులను ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లు, గుడ్ల వాహనాలను అడ్డుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై 040-23314876 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు అధికారులు.

11-02-2025 మంగళవారం ( స్థానిక సంస్థల్లో సంస్కరణలు )

పంచాయతీ, స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. త్వరలోనే రిజర్వేషన్లు ఖరారు అయ్యాక ఎన్నికలు నిర్వహించబోతోంది. ఆ తర్వాత గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా మార్చే ప్రణాళికలు, స్థానిక సంస్థల్లో సంస్కరణలు తెచ్చేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా ఈనెల 11న సెక్రటేరియట్‌లో మంత్రి సీతక్క, క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ సభ్యుల మధ్య చర్చలు జరిగాయి.

పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారత బలోపేతంపై చర్చ జరిగింది. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు క్రిస్ప్ ముందుకొచ్చి ఎంవోయూ కుదుర్చుకుంది. మన దేశంలో 14 రాష్ట్ర ప్రభుత్వాలతో క్రిస్ప్ కలిసి పనిచేస్తోంది. ఆయా రాష్ట్రాలకు క్రిస్ప్ ఉచితంగా సేవలందిస్తోంది.

10-02-2025 సోమవారం ( ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక )

ఇసుక విధానంపై ఈనెల 10న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వడంపై చర్చించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక దొరికేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్నారు. అధికారులు ఇసుక రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమాల నివారణకు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, హైదరాబాద్ పరిసరాల్లో ఆ బాధ్యత హైడ్రాకు అప్పగించాలన్నారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలకు ప్లాన్ చేస్తున్నారు.

09-02-2025 ఆదివారం ( సౌత్ స్టేట్స్ హక్కుల కోసం )

దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరువనంతపురంలోని మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ లో ఈనెల 9న పాల్గొన్నారు. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేయడం, అభివృద్ధిలో ముందుండడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు అన్యాయంగా శిక్షకు గురవుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ జీడీపీ ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లు ఉందని, 2035 నాటికి దాన్ని 1 ట్రిలియన్‌ డాలర్లకు పెంచడం లక్ష్యమన్నారు. AI వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు సీఎం రేవంత్. ఇప్పటికే తలసరి ఆదాయంలో నంబర్ వన్ స్థానంలో ఉందని గుర్తు చేశారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×