CM Revanth Reddy: ఈవారం ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు, ముఖ్యమైన పనులకు శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్లు మరింత ఈజీ చేసేలా మరిన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ ఆప్షన్ తీసుకురావడం, ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే అంటూ మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం, రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చే ఆప్షన్ ను అందుబాటులోకి తేవడం, వైద్య ఆరోగ్యశాఖలో నియామకాల జాతరకు ఏర్పాట్లు చేయడం, ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక ఇలాంటివన్నీ ఈ వారం తీసుకున్న నిర్ణయాల్లో కీలకంగా ఉన్నాయి. ఫుల్ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.
01-05-2025 గురువారం ( అసంఘటిత కార్మికుల కోసం.. )
తెలంగాణలోని అసంఘటిత కార్మికుల కోసం దేశానికి రోల్ మాడల్‌గా ఉండే ఒక మంచి విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈనెల 1న మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఏ వెసులుబాటు ఉన్నా ప్రతి రూపాయి కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే బాధ్యత తీసుకుంటానన్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని, సమ్మెకు వెళ్లాలన్న ఆలోచన విరమించుకోవాలన్నారు.
01-05-2025 గురువారం ( మే డే అవార్డులు )
పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మేడే సందర్భంగా అవార్డులు అందించింది. నాట్కో ఫార్మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ యాజమాన్య అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ అవార్డులు అందించారు. ఐటీసీ లిమిటెడ్ పేపర్‌బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ డివిజన్, గ్రాన్యూల్స్ ఇండియా, హింద్‌వేర్ లిమిటెడ్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్, క్రియేటివ్ స్కైజ్, సుప్రీం ఇండస్ట్రీస్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, భీమ్‌బాయి ఆదివాసి మహిళా సహకార సంఘం, నిర్మల్ టాయ్స్ అండ్ ఆర్ట్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీలకు కూడా ఉత్తమ యాజమాన్య అవార్డులు లభించాయి.
01-05-2025 గురువారం ( చేనేత రుణమాఫీ గైడ్ లైన్స్ ఇవే )
చేనేతలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం ఈనెల 1న చేనేత రుణమాఫీ అమలుపై గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. రాష్ట్ర చేనేతశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ ఈ మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ప్రకారం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు, వడ్డీ కలిపి లక్ష రూపాయల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఈ పథకం 2017 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలకు వర్తించనుంది. ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన, చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే జిల్లాస్థాయి కమిటీలో డీసీసీబీ సీఈవో, చేనేతశాఖ ఆర్‌డీడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారి సభ్యులుగా, చేనేతశాఖ ఏడీ కన్వీనర్‌గా ఉంటారు.
01-05-2025 గురువారం ( ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుక )
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని గనులు, భూగర్భ వనరుల శాఖ నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అందించనున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి సీనరేజీ ఛార్జీలు, రవాణా భారం పడకుండా శాండ్ సప్లై చేయనున్నారు. ఈ గైడ్ లైన్స్ కు సంబంధించి ప్రభుత్వం ఈనెల 1న జిల్లా కలెక్టర్లకు ఇంటర్నల్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఏ ప్రాంతం నుంచి ఇసుకను సరఫరా చేయాలో వివరించారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు చొప్పున ఇసుకను సరఫరా చేస్తారు.
01-05-2025 గురువారం ( GST వసూళ్లలో నెంబర్ 1 )
తెలంగాణ జీఎస్‌టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో 12 శాతం పెరిగాయి. 2024 ఏప్రిల్‌లో రాష్ట్రానికి 6,236 కోట్లు రాగా, ఈసారి అది 6,983 కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌లో జాతీయస్థాయిలో నమోదైన 10.72 శాతం యావరేజ్ గ్రోత్ కంటే తెలంగాణ వసూళ్లే ఎక్కువ. SGST సెటిల్‌మెంట్ తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో మాత్రం 11% తగ్గుదల నమోదైంది.
02-05-2025 శుక్రవారం ( సీడబ్ల్యూసీలో తెలంగాణం )
కేంద్రం చేపట్టే కులగణనలో తెలంగాణ మోడల్ ఫాలో అవ్వాలని సీడబ్ల్యూసీ తీర్మానం పాస్ చేసింది. కులాల లెక్కలు తెలియజేయడానికే కులగణన పరిమితం కాకూడదని, బడుగు, బలహీనవర్గాల స్థితిగతులకు అద్దంపట్టేలా ఉండాలని ఇదే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో కులగణను సక్సెస్ చేసిన వారందరికీ సీఎం ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. నాలుగు గోడల మధ్య నలుగురి ఆలోచనలతో కాకుండా మొత్తం పౌర సమాజం, మేధావులు, వివిధ కులసంఘాల నాయకులు, విద్యావేత్తల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించి పూర్తి సైంటిఫిక్ గా కులగణన చేశామన్నారు.
02-05-2025 శుక్రవారం ( వైద్యశాఖలో కొలువుల జాతర )
కొలువుల భర్తీకి కట్టుబడి ఉన్న రేవంత్ ప్రభుత్వం.. దాన్ని కంటిన్యూ చేస్తోంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో సర్కారు కొలువుల కోసం పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. 6 వేల మందికి పైగా జాబ్స్ పొందబోతున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్ లో నర్సులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్‌లు వంటి పోస్టుల భర్తీకి ఎగ్జామ్స్ నిర్వహించారు. వాటి రిజల్ట్స్ వరుసగా ఈ నెలలో వెలువడనున్నాయి. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో 6,175 పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. నర్సులు, ఫార్మసిస్టులు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ జరగబోతోంది.
02-05-2025 శుక్రవారం ( రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులకు ఆమోదం )
రేషన్ కార్డులకు సంబంధించి మరో కీలక అప్డేట్ ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఎనిమిదేళ్ల నిరీక్షణకు మోక్షం కల్పించింది. పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోద ప్రక్రియ ఆరంభమైంది. పౌర సరఫరాల శాఖ ఆన్‌లైన్ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది. గత ఎనిమిదేళ్లుగా రేషన్‌కార్డుల్లోని సభ్యుల పేర్లు వివిధ కారణాలతో తొలగిస్తున్నా.. కొత్త సభ్యుల్ని మాత్రం ఎంట్రీ చేయలేకపోయారు. మీ సేవా ద్వారా వచ్చిన ప్రతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉంటే ఆమోదిస్తున్నారు. ఏప్రిల్ చివరి నాటికి తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్దిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. తాజాగా 31 వేల 84 కుటుంబాలకు కొత్త కార్డులు ఇవ్వగా.. పాత కార్డుల్లో 10,12,199 పేర్లు యాడ్ చేశారు.
03-05-2025 శనివారం ( రిజిస్ట్రేషన్లు సాఫీగా )
స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో చేపట్టిన సంస్కరణలను మరింతగా విస్తృతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 2 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తీసుకొచ్చిన సర్కారు.. ఈ వెసులుబాటును మరో 4 SRO లకు విస్తరించబోతోంది. హైదరాబాద్ పరిధిలోని చంపాపేట, సరూర్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 17 నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండింటి పరిధిలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే.. ఆ టైంకు ఆ రెండింటిలో రష్ ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ స్లాట్ బుక్ అవుతుంది.
లేటెస్ట్ గా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్- ఫరూక్‌నగర్, అలాగే సిద్దిపేట అర్బన్ – సిద్దిపేట గ్రామీణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఈ సేవల పరిధిలోకి తీసుకొచ్చారు. ఈనెల రెండో వారంలో ఈ ఆఫీసుల్లో ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజుకు 48 స్లాట్స్ కన్నా ఎక్కువగా వస్తున్న ఉప్పల్, మహేశ్వరం, గండిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో రోజుకు 96 స్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయబోతున్నారు.
03-05-2025 శనివారం ( ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే! )
మిస్ వరల్డ్ పోటీలకు సమయం రానే వచ్చింది. వీటిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే ఉద్దేశంతో భారీ ప్రణాళికలు రెడీ చేసింది. దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్‌లు పాల్గొననున్న ఈ మెగా ఈవెంట్‌ను మంచి అవకాశంగా మలుచుకోవాలనుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే అన్న స్లోగన్ తో వరుసగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్స్ కు ప్లాన్ చేశారు.
మే 12న చార్మినార్ దగ్గర హైదరాబాద్ హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. మే 13న చౌమహల్లా ప్యాలెస్ సందర్శన, అక్కడ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొననున్నారు. మే 16న ఎక్స్పీరియా ఎకో పార్క్ సందర్శన, మే 16న AIG హాస్పిటల్ లో మెడికల్ టూరిజం పై పరిచయం.., మే 17న రామోజీ ఫిలిం సిటీ సందర్శన, మే 18న తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో సేఫ్టీ టూరిజంపై అవగాహన, మే 18న సచివాలయానికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను తీసుకెళ్లనున్నారు. చివరగా 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు.
27-04-2025 ఆదివారం (మామిడికి తెలంగాణ బ్రాండ్)
రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను ప్రాసెస్ చేసి తెలంగాణ బ్రాండ్ పేరిట రైతుల ద్వారానే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఉద్యానశాఖ 35 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. తెలంగాణ మామిడికి విదేశాల్లో ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో ఏటా 6 వేల టన్నుల మామిడి కాయలు కాస్తుండగా.. అందులో వేయి టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి మామిడి పండ్లను ప్రైవేట్ కంపెనీలు కొని, ముంబయి, బెంగళూరులకు తీసుకెళ్లి ప్రాసెస్ చేసి, విదేశాలకు పంపి లాభాలు పొందుతున్నాయి.
అయితే ఆ లాభం స్థానిక రైతులకే రావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్‌ల పేరిట యంత్ర పరికరాల కొనుగోలుకు సిద్ధమైంది. మామిడిపై ఉండే పురుగులను తొలగించేందుకు వీలుగా రేడియేషన్ ప్రక్రియను నిర్వహించేందుకు 24 కోట్లతో అటామిక్ రీసెర్చ్ ఎనర్జీ మిషన్, మామిడిని మెరిసేలా చేసేందుకు 5 కోట్లతో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మగ్గబెట్టేందుకు 3 కోట్లతో హాట్‌వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 4 కోట్లతో కోల్డ్ రూమ్స్ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్‌కు 2కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్‌ల కింద బాటసింగారం పండ్ల మార్కెట్‌తో పాటు పలుచోట్ల మౌలిక వసతుల కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కోహెడలో ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్ ప్రారంభమయ్యాక అక్కడ పదికి పైగా ప్యాక్‌హౌస్‌లను ప్రారంభించాలని ఉద్యానశాఖ భావిస్తోంది.
28-04-2025 సోమవారం ( శాంతి చర్చల దిశగా.. )
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం నిర్వహిస్తున్న చర్యపై పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడం.. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కోరడంతో సీఎం రేవంత్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏప్రిల్ 28న మావోయిస్టులతో చర్చల విషయంలో అనుభవం ఉన్న జానారెడ్డి, కేకేలతో భేటీ అయ్యారు. అంతకు ముందు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్ ముఖ్యమంత్రిని కలిసి మావోయిస్టులతో చర్చలు జరిపే అంశంపై వినతి పత్రాన్ని అందించారు. ఈ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని కమిటీ ప్రతినిధులు కోరారు. నక్సలిజం అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లొచ్చనే అంశంపై జానారెడ్డి , కేకేతో సీఎం సమాలోచనలు జరిపారు.
29-04-2025 మంగళవారం ( మిస్ వరల్డ్ పోటీలపై సమీక్ష ) మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై ఏప్రిల్ 29న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మే 10 తేదీ నుంచి ప్రారంభం కానున్న MISS WORLD-2025 ఏర్పాట్లపై సీఎం సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చేపట్టిన చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అతిథుల కోసం ఎయిర్‌పోర్టు, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో టైట్ సెక్యూరిటీ పెట్టాలని సీఎం పోలీసులకు సూచించారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
30-04-2025 బుధవారం ( ప్రగతి బాట )
తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం నూటికి నూరు శాతం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి బసవేశ్వర జయంతి సందర్భంగా చెప్పారు. ఏప్రిల్ 30న రవీంద్రభారతిలో బసవేశ్వర జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణలో బీసీ కులగణన చేశామని, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశామన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 లకే సిలిండర్ అందివ్వడంతో పాటు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చామన్న విషయాన్ని గుర్తు చేశారు.
అంతేకాదు రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని వివరించారు. హైదరాబాద్ సిటీ విస్తరణకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మాట ఇస్తే నూటికి నూరుపాళ్లు అమలు చేస్తానన్నారు. అదే వేదికపై పదో తరగతి ఫలితాలు రిలీజ్ చేసిన సీఎం రేవంత్.. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రైవేట్ సంస్థలకన్నా మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల సిబ్బందిని, అధ్యాపకులను, విద్యార్థులను సీఎం రేవంత్ అభినందించారు. ప్రైవేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లు మెరుగైన రిజల్ట్స్ సాధించడం ప్రజా ప్రభుత్వం పనితీరుకు గీటురాయి అని అన్నారు.
30-04-2025 బుధవారం ( ఇక ప్రతి పల్లెకూ తారు రోడ్డు )
నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బీ రోడ్ల మాదిరే రూరల్ రోడ్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. మండల కేంద్రాలను, రూరల్ ఏరియాస్ తో లింక్ చేసేలా రాష్ట్రంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యూటి మోడ్ – HAM విధానంలో 17 వేల 300 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించింది. ఇందులో తొలి దశలో 7,393 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మూడు దశల్లో పనులు పూర్తిచేయాలని, మొదటి దశ పనులను 2026 జనవరిలో, రెండో దశను 2026 మార్చిలో, మూడో దశను 2026 జూన్‌లో చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాలను స్టడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించేందుకు టెండర్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థలను ఎంపిక చేసింది.
హ్యామ్ ప్రాజెక్టుకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని నోడల్ విభాగంగా సర్కారు నియమించింది. ఆ శాఖ ఈఎన్‌సీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తారురోడ్డు నిర్మించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు చేపట్టినందున గ్రౌండ్ లెవెల్ లో సర్వే నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధుల ఆమోదంతో సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని సూచించింది. దీంతో 7,393 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. డీపీఆర్ ఇవ్వాలని కన్సల్టెన్సీ సంస్థకు సూచనలు వెళ్లాయి. క్యాబినెట్ నిర్ణయం తర్వాత ఆమోదం తెలుపుతారు.