CM Revanth Reddy: ఏఐసీసీ మీటింగ్ లో తెలంగాణ కులగణన, సీఎం రేవంత్ చర్యలపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అటు గోద్రెజ్ క్యాపిటల్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం, సర్కారీ స్కూళ్లలో ఏఐ ఆధారిత విద్యాభోదనకు శ్రీకారం, నియామకాలు కంటిన్యూ, సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరాలు ఇలాంటివి ఈ వారం ప్రభుత్వ చర్యల్లో హైలెట్ గా నిలిచాయి.
09-04-2025 బుధవారం ( కులగణన చారిత్రాత్మకం )
అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ మీటింగ్ లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన, సీఎం రేవంత్ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. స్వయంగా రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని ప్రస్తావించి ఇది దేశానికే రోల్ మోడల్ అని, సీఎం చేసిన పనిని ప్రశంసించారు. కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు రాహుల్.
09-04-2025 బుధవారం ( MSMEలకు అండగా.. )
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూపు సంస్థ అయిన గోద్రెజ్ క్యాపిటల్ తెలంగాణ ప్రభుత్వంతో ఈనెల 9న ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రుణ సదుపాయాలను విస్తరించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. మొదటిసారి అప్పులు తీసుకునే యూనిట్లకు చేయూతనిస్తుంది. గోద్రెజ్ క్యాపిటల్‌లో మహిళల కోసం ఆరోహి అనే స్కీం ఉంది. ఔత్సాహిక మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ స్కీం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలోని ఔత్సాహిక వ్యాపారులకు త్వరగా రుణాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని గోద్రెజ్ క్యాపిటల్ ఈ సందర్భంగా తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా గోద్రెజ్ క్యాపిటల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ వివరించారు. ప్రాపర్టీపై రుణాలు, చిన్న మొత్తాల లోన్లు, లోన్ఎగెనెస్ట్ ప్రాపర్టీ, అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.
08-04-2025 మంగళవారం ( సర్కారీ స్కూళ్లలో AI విప్లవం )
విద్యావ్యవస్థపై స్పెషల్ ఫోకస్ పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధనను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు అందించే లక్ష్యంతో, రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసింది. ఇందులో భాగంగా, ప్రతీ జిల్లా నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధనను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.
ప్రతీ జిల్లా నుంచి ఐదుగురు టీచర్లకు హైదరాబాద్‌లో డిజిటల్ లిటరసీ, ఏఐ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిజిటల్ అభ్యసన పరిజ్ఞానం అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా విద్యాశాఖ ఐటీ విభాగం జి కంప్రైస్, ఎడ్యు యాక్టివ్ 8, కోడ్ మిత్ర వంటి ఏఐ యాప్‌లను డెవలప్ చేసింది. ఈ యాప్‌ల ద్వారా మ్యాథ్స్ ను ఫాస్ట్ గా, ఇంట్రెస్ట్ తో నేర్చుకునేలా రూపొందించారు. వెనుకబడిన విద్యార్థులకు కూడా ప్రేరణ కలిగేలా ఈ యాప్‌లు రూపొందాయి. ప్రభుత్వ విద్యావ్యవస్థలో చెప్పాలంటే ఇదో రోల్ మోడల్ కార్యక్రమం.
07-04-2025 సోమవారం ( సంప్రదింపుల కోసం )
కంచె గచ్చిబౌలి భూములపై మంత్రుల కమిటీ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించింది. HCUలో విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ సమావేశానికి యూనివర్శిటీస్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు.
06-04-2025 ఆదివారం ( సన్నబియ్యం-సహపంక్తి భోజనం )
దేశంలోనే తొలిసారి పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందులో భాగంగా మరో అడుగు ముందుకేసింది. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులంతా లబ్దిదారుల ఇళ్లల్లోకి వెళ్లి సహపంక్తి భోజనాలు చేశారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యంపై వారి స్పందన తెలుసుకున్నారు. ఈనెల 6న సీఎం రేవంత్ కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో కలిసి భోజనం చేశారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ సీఎం ఆరా తీశారు. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని, ఇప్పుడు సన్నబియ్యంతో కుటుంబానికి ఎంతో ఉపయోగంగా ఉందని లబ్దిదారు తులసమ్మ సీఎంకు వివరించారు. అంతేకాదు పేదలకు 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ బస్ సౌకర్యంతో డబ్బులు ఆదా అవుతున్నాయన్న విషయాన్ని సంతోషంతో చెప్పారు.
06-04-2025 ఆదివారం ( ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరాలు )
అటు విద్య, ఇటు రైతు సంక్షేమం. ఒకేసారి రెండు అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 6న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పర్యటనకు వెళ్లినప్పుడు శ్రీరామ నవమి వేళ వరాల జల్లు కురిపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు కాబోతోంది. ఇక సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి గానూ సవరించిన అంచనా బడ్జెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు అంచనాలను 13 వేల 57 కోట్ల రూపాయల నుంచి 19 వేల 324 కోట్ల రూపాయలకు సవరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4 లక్షల 15 వేల 621 ఎకరాలకు సాగు నీటిని, మరో 3 లక్షల 89 వేల 366 ఎకరాలను స్థిరీకరించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
06-04-2025 ఆదివారం ( నియామకాలు కంటిన్యూ )
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల డైరెక్ట్ నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈనెల 6న రిలీజ్ చేశారు. గతంలో తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 2,500కు పైగా బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామకాలను ఎలా చేపట్టాలనే దానిపై కొన్ని నెలల క్రితం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సు చేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యూజీ, పీజీతో పాటు సాంకేతిక, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధించే అధ్యాపకుల నియామకానికి రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు వర్తించనున్నాయి. ప్రతీ యూనివర్సిటీలోనూ కమిటీ ఏర్పాటు చేసి, రోస్టర్ విధానం, రిజర్వేషన్ విధానానికి సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేస్తారు.
ఈవారం కీలక సమీక్షలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో సీఎం షెడ్యూల్ గడిచింది. వ్యవసాయ శాఖలో కొత్త స్కీం, ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే కార్యక్రమం, రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ విధానం, RRR వేగవంతం, ఫ్యూచర్ సిటీదాకా మెట్రో, మూసీ పునరుజ్జీవం దిశగా తొలి అడుగు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చేలా చర్యలు, దశల వారీగా భూభారతి అమలుకు నిర్ణయాలు జరిగాయి. ఫుల్ డిటైల్స్ ఈవారం సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ లో చూద్దాం.
12-04-2025 శనివారం ( దశలవారీగా భూభారతి )
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ కానుంది. భూ భారతి చట్టం ప్రొవిజన్స్‌తో కొత్త పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ధరణిలో 33కు పైగా మాడ్యూల్స్ ఉండగా, భూ భారతిలో కేవలం 6 మాడ్యూల్స్‌తో సమస్యలను సులభంగా పరిష్కరించేలా కొత్త వెబ్ సైట్ రూపొందించింది. దీంతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండానే అప్లికేషన్లు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ధరణి పోర్టల్ స్లోగా ఉండటంతో పాటు యూజర్ ఫ్రెండ్లీగా లేదు. దీంతో యూజర్ ఫ్రెండ్లీ భూ భారతిని తీసుకురావడమే కాకుండా.. తాజా వెబ్ పోర్టల్ స్పీడ్ ను కూడా పెంచారు.
ఇక అప్పీళ్ల వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. భూ భారతి చట్టంలో తహసీల్దార్, ఆర్‌డీఓ, కలెక్టర్ స్థాయిలో అప్పీల్ వ్యవస్థ ఉంది. ధరణిలో ఏం రిజెక్ట్ చేసినా కోర్టులపై ఆధారపడాల్సి వచ్చేది. భూ భారతిలో జిల్లా స్థాయిలోనే అప్పీల్ వ్యవస్థ పెట్టారు. దీంతో రైతులకు సమయం, ఖర్చు ఆదా కానుంది. గతేడాది డిసెంబర్ లో అసెంబ్లీ, కౌన్సిల్లో భూ భారతి బిల్లుకు ఆమోదం లభించింది. గవర్నర్ జనవరి 3వ తేదీన ఆమోదించగా.. జనవరి 20వ తేదీన ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భూ భారతి పోర్టల్‌లో ఒక చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏ డౌట్ అడిగినా ఇందులో ఆన్సర్ వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. దీంతో పాటు ఒక ప్రత్యేక యాప్ కూడా రానుంది.
11-04-2025 శుక్రవారం ( మూసీ పునరుజ్జీవం దిశగా అడుగులు )
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియలో వేగం పెంచారు. అందులో భాగంగా మూసీపై సీఎం రేవంత్ ఈనెల 11న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రివ్యూ చేశారు. బాపూఘాట్ లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ తో పాటు మీరాలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. మీరాలం బ్రిడ్జి పనులకు జూన్ లో టెండర్లు పిలవాలన్నారు. ఆ లోగా డీపీఆర్ రెడీ చేసిపెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు ప్రాధాన్యముండే డిజైన్లను ఎంచుకోవాలన్నారు సీఎం. సింగపూర్ లోని గార్డెన్స్ బై ది బే ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను సుందరంగా అభివృద్ధి చేయాలన్నారు సీఎం. అంతే కాదు వెడ్డింగ్ డెస్టినేషన్ కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, థీమ్ పార్క్, ఆంఫీ థియేటర్ ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు.
11-04-2025 శుక్రవారం ( RRR మరింత వేగం )
RRR పనులపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. భవిష్యత్ అవసరాల మేరకు డ్రైపోర్ట్‌కు రూపకల్పన చేయాలన్నారు సీఎం. ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉత్తర ఆర్ఆర్ఆర్ భూ సేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సౌత్ ఆర్ఆర్ఆర్ డీపీఆర్‌ను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. హైదరాబాద్ – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే డీపీఆర్‌పై దృష్టి సారించాలన్నారు సీఎం. వాటితో పాటే హైదరాబాద్ – రాయ్‌పూర్ నేషనల్ హైవే ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు. అటు హైదరాబాద్ – మంచిర్యాల కొత్త హైవే ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు సీఎం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల విస్తరణపైనా రివ్యూలో కీలక సూచనలు చేశారు.
11-04-2025 శుక్రవారం ( ఫ్యూచర్ సిటీ దాకా మెట్రో )
తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి ప్రయారిటీ పెంచుతోంది. మెట్రోపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసిన టైంలో ఫ్యూచర్ సిటీ దాకా మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. ఈ విస్తరణకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు కొత్తగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్‌పేట్ వరకు పొడిగించాలని చెప్పారు. అటు మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనల పురోగతిని ఆరా తీశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు. సెకండ్ ఫేజ్ లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రూట్, రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్ మార్గం, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట రూట్, మియాపూర్ – పటాన్‌చెరు , ఎల్‌బీ నగర్ – హయత్‌నగర్ మొత్తం కలిపి 76 కిలోమీటర్ల విస్తరణకు 24,269 కోట్ల రూపాయల అంచనాలతో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది.
11-04-2025 శుక్రవారం ( కొత్త సభ్యులు వీరే )
లోకాయుక్త, ఉపలోకాయుక్త నియమిస్తూ ప్రభుత్వం ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. HRC చైర్ పర్సన్, మెంబర్స్ ను నియమించింది. HRC చైర్ పర్సన్ గా జస్టిస్ షమీమ్ అక్తర్ , లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖరరెడ్డి, ఉపలోకాయుక్త జస్టీస్ BS జగ్జీవన్ కుమార్ , హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్స్ గా శివాది ప్రవీణ, డాక్టర్ బి కిషోర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
11-04-2025 శుక్రవారం ( టెట్ నోటిఫికేషన్ రిలీజ్ )
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఈనెల 11న రిలీజ్ చేసింది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య తెలంగాణలో టెట్ నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఏప్రిల్ 15న పూర్తి స్థాయి షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ను ఏటా రెండు సార్లు నిర్వహించాలని రేవంత్ సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. ప్రతి ఏటా జూన్, డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించేలా ప్రభుత్వం స్పెషల్ షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. ఆ ప్రకారమే పరీక్షలు పెడుతున్నారు.
10-04-2025 గురువారం ( ప్రభుత్వ బడుల్లోనూ ప్రీ స్కూల్ సిస్టమ్ )
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి వచ్చిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం ఈనెల 10న ఉత్సాహంగా జరిగింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గత ఏడాది అక్టోబర్ 21 న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఆరు నెలల స్వల్ప కాలంలోనే ప్రారంభమైంది. మంచిరేవులలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్కూల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. పిల్లలకు బోధనా సౌకర్యాలు, వారికి ప్రత్యేకంగా రూపొందించిన యూనిఫామ్‌లను పరిశీలించారు. యూనిఫామ్‌లతో పాటు కిట్లను పిల్లలకు అందజేశారు.
పిల్లల కోసం ప్రత్యేక బస్సును ప్రారంభించారు. స్కూల్ గ్రౌండ్ లో పిల్లలతో కలిసి సరదాగా కొద్ది సేపు ఫుట్‌బాల్ ఆడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు సీఎం. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతలన్నారు. యంగ్ ఇండియా తన బ్రాండ్ గా చెప్పుకొచ్చారు సీఎం. విధి నిర్వహణలో కాలం గడుపుతూ కుటుంబాలకు సమయం ఇవ్వలేక, పిల్లల చదువులపై సరైన దృష్టిని సారించలేక.., వారు ఎలా చదువుకుంటున్నారో తెలియక ఆందోళన పడుతున్న పోలీసు సిబ్బందికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఒక మంచి అవకాశమని, హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు కాకీ డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసుకు ఈ స్కూల్ అత్యంత ప్రాముఖ్యమైందన్నారు సీఎం.
10-04-2025 గురువారం ( వ్యవసాయ శాఖ కొత్త స్కీం ఇదే )
రైతులకు అన్ని వేళల్లో సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం అనే పేరుతో ఈ పథకాన్ని జూన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులందరికి నాణ్యమైన విత్తనాలను అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. సుమారు 40 వేల మంది రైతులకు, 2500 నుంచి 3000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి ముగ్గురు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథక కింద పంపిణీ చేయనుంది ప్రభుత్వం. అంతే కాదు మార్చి, ఏప్రిల్ లో కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం అందించబోతోంది. మార్చిలో కురిసిన వడగళ్ల వర్షాలకు 8,408 ఎకరాల్లో జరిగిన పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది.
10-04-2025 గురువారం ( భూములు – నిజాలు )
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం లో పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఈనెల 10న భేటీ అయి రిపోర్ట్ సమర్పించారు. దాదాపు 3 గంటలపాటు ప్రభుత్వ అధికారులతో కమిటీ భేటీ అయింది. సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. 400 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు, ప్రభుత్వ విధివిధానాలు, ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కమిటీకి నివేదిక ఇచ్చారు.
10-04-2025 గురువారం ( ఇంటింటికీ ఇంటర్నెట్ )
ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం స్రీకారం చుట్టింది. ఈనెల 10న హైదరాబాద్‌లోని బేగంపేటలో టీ ఫైబర్ కొత్త ఆఫీసును మంత్రి శ్రీధర్ బాబు ప్రాంభించారు. కేబుల్ ఆపరేటర్ల సహకారంతో మారుమూల ప్రాంతాలకూ కేబుల్ టీవీ సదుపాయాలు కల్పిస్తామన్నారు. టీవీ సెట్లను కంప్యూటర్ మానిటర్‌గా వినియోగించుకుని విద్యార్థులు ప్రయోజనం పొందేలా టెక్నాలజీ రూపొందించినట్టు తెలిపారు. టీ ఫైబర్ ఇప్పటికే 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసిందని, మరో 7,187 పంచాయతీల్లో సేవలు అందిస్తామన్నారు. ఈ ఏడాది 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కల్పించింది ప్రభుత్వం. 2027 నాటికి 60 వేల కార్యాలయాలను అనుసంధానం చేసే ప్రణాళికతో ఉంది. టీ ఫైబర్ ఇకపై టీ నెక్ట్స్ పేరుతో సేవలు అందించబోతోంది. ఈ కార్యక్రమంలో వ్యాపార భాగస్వాములతో 9 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన డేటాను సేఫ్టీగా ఉంచే సావరిన్ క్లౌడ్, టీ ఫైబర్ కోసం కొత్త విజన్ డాక్యుమెంట్‌ను కూడా ఆవిష్కరించారు.
Also Read: దాసరి మనోహర్ మిస్సింగ్?
10-04-2025 గురువారం ( ఇక రిజిస్ట్రేషన్లు మరింత వేగం )
తెలంగాణలోని సబ్ -రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ఈనెల 10 నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానం ప్రారంభించింది ప్రభుత్వం. ప్రజలు registration.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తమకు అనుకూలమైన టైమ్ లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రోజువారీ పని వేళలను 48 స్లాట్‌లుగా విభజించి, రద్దీని తగ్గించే ఏర్పాట్లు చేశారు. స్లాట్ బుక్ చేయని వారి కోసం అత్యవసర సందర్భాల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 వాక్-ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు.
రాష్ట్రంలో 144 సబ్ -రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యను అరికట్టేందుకు చట్ట సవరణలు చేసేలా, రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22-బీ చేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది సర్కారు. ప్రజలు స్వయంగా దస్తావేజులు తయారు చేసుకునేందుకు వెబ్‌సైట్‌లో మాడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్పీడప్ చేసేలా ఆధార్ e – సైన్ సౌలభ్యాన్ని ఈ నెలాఖరులో ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. దీంతో టైమ్ చాలా వరకు ఆదా అవబోతోంది.