BigTV English

CM Revanth Reddy: మోదీ, రేవంత్ భేటీలో చర్చించిన అంశాలు ఇవే..

CM Revanth Reddy: మోదీ, రేవంత్ భేటీలో చర్చించిన అంశాలు ఇవే..

01-03-2025 శనివారం ( రివ్యూ టైమ్ )

క్రమం తప్పకుండా శాఖలపై సీఎం రివ్యూలు చేస్తూనే ఉన్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తూనే ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల పని తీరుపై సూచనలు చేస్తున్నారు. తాజాగా మార్చి 1న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మైన్స్ డిపార్ట్‌మెంట్ పై సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అటు కార్మిక శాఖపై రివ్యూ చేశారు సీఎం. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్షా సమావేశం నిర్వహించి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. హై సిటీ పనులు, సహా ఇతర కీలక పనులపై అప్డేట్ చేశారు.


28-02-2025 శుక్రవారం ( త్వరలో హెల్త్ టూరిజం పాలసీ )

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం.. త్వరలో హెల్త్ టూరిజం పాలసీని తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వ్యవస్థాపకులు, ప్రముఖ డాక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డికి కేంద్రం ఇటీవల పద్మవిభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు విదేశీయులకు వైద్య సేవలందించే హబ్‌గా తెలంగాణను తీర్చి దిద్దుతామన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో సుమారు వెయ్యి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. సీఎం సహాయ నిధి నుంచి ఏడాదిలోనే 900 కోట్లు పేదలకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులిచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.

28-02-2025 శుక్రవారం ( కులగణన కొత్త లెక్కలివే.. )

తెలంగాణలో కులాల వారీగా లెక్కలు తీయడంపై సీరియస్ గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గత సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి రీ సర్వే కండక్ట్ చేసింది. ఇది ఫిబ్రవరి 28తో పూర్తయింది. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోలేదు. వీరికోసం రెండోసారి సర్వే నిర్వహించినా.. 18,539 కుటుంబాలు అంటే 5.21 శాతం మాత్రమే ఎంట్రీ చేయించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించగా.. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు జరిగిన మొదటి సర్వేలో 1,12,15,134 కుటుంబాల వివరాలు నమోదయ్యాయి.

ఇంకా 3,56,323 కుటుంబాలు మిగిలిపోవడంతో వారి వివరాల నమోదు కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండోసారి సర్వే నిర్వహించారు. దీంతో రెండు సర్వేలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా 3,37,964 ఫ్యామిలీలు సర్వేకు దూరంగా ఉండిపోయాయి. సర్వే ఈజీగా పూర్తయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వివిధ రకాలుగా ఛాన్స్ ఇచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే అధికారులే ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. కుల గణన రీసర్వేలో నమోదైన18 వేలకుపైగా కుటుంబాలను అప్ డేట్ చేయడంతో కులాల లెక్కల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి.

28-02-2025 శుక్రవారం ( కావాలి డిఫెన్స్ కారిడార్ )

దేశ రక్షణ రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. రక్షణ శాఖకు సంబంధించి విభాగాలు, పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వివిధ విడిభాగాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. అలాంటిది బెంగళూరు తరహాలో డిఫెన్స్ కారిడార్లు కూడా ఏర్పాటైతే హైదరాబాద్ మరో లెవెల్ కు వెళ్తుంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో విజ్ణాన్ వైభవ్ 2కే 25 ఎగ్జిబిషన్ ను కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మిస్సైల్స్ తయారు చేసే ప్రముఖ పరిశ్రమలైన డీఆర్‌డీఎల్, బీడీఎల్, డీఆర్‌డీవో, మిథానీ లాంటి కంపెనీలు తెలంగాణలోనే ఉన్నాయని, అయితే బెంగళూరు తరహాలో హైదరాబాద్ చుట్టుపక్కల రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.

28-02-2025 శుక్రవారం ( ఫండ్స్ కోసం )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి ఫిబ్రవరి 28న 9 పేజీల లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతను గుర్తు చేస్తూ లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, రీజినల్ రింగు రోడ్డు, మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలుకు సంబంధించి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నామన్నారు.

28-02-2025 శుక్రవారం ( మామునూర్ కు మహర్దశ )

తెలంగాణలో ఎయిర్ పోర్ట్ ల విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లపై కదలిక తీసుకొచ్చింది. ఎప్పుడో ఏర్పాటు కావాల్సిన వరంగల్ – మామునూర్ ఎయిర్ పోర్ట్ అనుమతులను తాజాగా సాధించింది. దీని కోసం సీఎం రేవంత్ స్వయంగా ఇటీవలే విమానయాన శాఖ మంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కలిసి భూసేకరణ సహా ఇతర పెండింగ్ పనులపై చర్చించారు. అనుమతి వేగంగా వచ్చేలా చేశారు. గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న NOC అడ్డంకిని జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి NOC ఇచ్చేలా చేశారు.

దీంతో HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ NOC ఇచ్చారు. ఇప్పుడు ఈ NOC ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. 1930లో ఏర్పాటు చేసిన వరంగల్‍ మామునూర్ ఎయిర్‍పోర్టు అప్పట్లో సౌత్ ఏషియాలోనే అతి పెద్దదిగా రికార్డుల్లో ఉంది. దాదాపు వెయ్యి ఎకరాల స్థలంలో విమానాల రాకపోకలతో 1981 వరకు కళకళలాడింది. ఎయిర్ పోర్ట్ మంజూరుపై ప్రధాని మోడీ, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.

27-02-2025 గురువారం ( రైజింగ్ హైదరాబాద్ )

పరిశ్రమలకు, పెట్టుబడులు పెట్టే వారికి ప్రతి క్షణం అండగా ప్రోత్సాహాన్నిస్తూ వస్తోంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27న మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హెచ్‌సీఎల్ భారతదేశాన్ని గర్వంపడేలా చేస్తోందని 60 దేశాల్లో 2.2 లక్షల మందితో పని చేస్తోందని ప్రశంసించారు. 2007లో హైదరాబాద్ సిటీలో అడుగుపెట్టిన హెచ్‌సీఎల్ ఇప్పుడు భారీగా ఎదిగిందని గుర్తు చేశారు. మల్టినేషనల్ కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.

ప్రతి రోజు తాను ఏదో ఓ సంస్థతో ఎంవోయూలు చేసుకుంటూనే.. లేదా కొత్త ఆఫీసుల ప్రారంభోత్సవాలో చేస్తునే ఉన్నానని సీఎం గుర్తు చేశారు. సీఎం స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేకపోయినా సరే… పారిశ్రామిక వేత్తలను, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అత్యధిక పెట్టుబడులు సాధించి రికార్డు సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎక్కువ ఏఐ వినియోగం తక్కువ ద్రవోల్బణంతో ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం రేవంత్. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ జీడీపీ రాష్ట్రంగా మార్చే టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ ను ఎవరూ అడ్డుకోలేరన్నారు.

27-02-2025 ( గురువారం ) (కన్వీనర్ కోటా సీట్లపై కీలక నిర్ణయం)

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న 15 శాతం ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్లు, స్థానికత ఇక్కడ ఉండి ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది. దీనికి సంబంధించి జీవో నంబర్ 15ను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఫిబ్రవరి 27న రిలీజ్ చేశారు.

స్టేట్​లోని ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో 85 శాతం స్థానిక తెలంగాణ స్టూడెంట్లకు, 15శాతం ఓపెన్ కేటగిరిలో సీట్లు నింపేవారు. కానీ ఇప్పుడిది పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కనుంది. రాష్ట్ర విభజన సమయం నుంచి పదేళ్ల దాకా ఈ విధానాన్ని అమలు చేశారు. ఏపీ, తెలంగాణ విభజన జరిగి పదేళ్లు పూర్తవడంతో పాత విధానానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ బై చెప్పింది. తెలంగాణలో పదేళ్ల పాటు నివాసముండాలనే షరతుతో స్థానికులకే ఎక్కువ సీట్లు దొరకనున్నాయి.

27-02-2025 గురువారం ( వివాదాలకు పుల్ స్టాప్ )

పరిశ్రమలకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గతంలో వివాదాల్లో చిక్కుకున్న సంస్థల వ్యవహారాలపై ఫోకస్ పెట్టింది. అందులో చట్టబద్ధంగా ఉన్న ఒప్పందాలను రివ్యూ చేసేందుకు అంగీకరించింది. తెలంగాణలో వివిధ ప్రాజెక్టులపై సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో రివ్యూకు అంగీకరించింది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు ఫిబ్రవరి 27న సచివాలయంలో సీఎంను కలిశారు. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ 2001లో హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాల నిర్మాణం తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది.

ఆనాటి ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాల పరిష్కారానికి 2015లోనే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అయితే తాజాగా అదనంగా న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. న్యాయ వివాదాలను స్టడీ చేయడానికి, సామరస్య పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ఎమ్మార్ సంస్థ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఆమోదించారు. దీంతో ఎమ్మార్ ప్రాపర్టీస్ చిక్కులకు ఒక పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది.

26-02-2025 బుధవారం ( 5 కీలక ప్రాజెక్టుల కోసం )

తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరోసారి ప్రధాని మోడీని కలిశారు. ఫిబ్రవరి 26న జరిగిన భేటీలో తెలంగాణకు ఏయే రంగాల్లో కేంద్ర సహకారం అవసరమో మరోసారి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. ఐదు కీలక ప్రాజెక్టులకు నిధులివ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోడీని కోరారు. కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ ఆగిపోయిందని, ఈ ప్రాజెక్టు ముందుకు సాగడానికి తోడ్పడాలని కోరారు. దీంతోపాటే రీజినల్‌ రింగ్‌ రోడ్‌ సౌత్ పార్ట్ ను మంజూరు చేయాలని, ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైల్వే లైన్‌కు అనుమతించాలన్నారు.

అలాగే డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందర్‌ పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను నిర్మించాలని, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టుకు భారీ నిధులు మంజూరు చేయాలని, సెమీకండక్టర్‌ ప్రాజెక్టు తెలంగాణకు ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్. దీనికి ప్రధాని మోడీ సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్టులను మంజూరు చేయించడంతో పాటు భారీ ఎత్తున నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ తోడ్పడాలన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌-2కు వెంటనే అనుమతులు ఇవ్వాలని ప్రధానిని కోరానన్నారు సీఎం రేవంత్. ఫేజ్‌-2 కింద 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన 5 మెట్రో కారిడార్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.

26-02-2025 బుధవారం ( ఆత్మీయ భరోసా రిలీజ్ )

నిధులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా.. సంక్షేమాన్ని మాత్రం రేవంత్ ప్రభుత్వం ఎక్కడా ఆపడం లేదు. ఈ క్రమంలోనే ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు భరోసా నిధులను జమ చేసింది. ఈ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్దిదారుల ఖాతాల్లో 39.74 కోట్లు జమ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగితా లబ్దిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు అందనున్నాయి.

25-02-2025 మంగళవారం ( పెట్టుబడుల వరద )

తెలంగాణను అన్ని రంగాల్లో టాప్ లో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ సర్కార్.. మరో ముందడుగు వేసింది. HICCలో బయో ఏషియా-2025 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పలు సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 11 సంస్థలు రాష్ట్రంలో 5,445 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. గ్రీన్‌ ఫార్మా సిటీ కోసం 6 ఫార్మా కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.

మరో 11 కంపెనీలు.. భారత్‌ బయోటెక్, గ్రాన్యూల్స్, ఆర్బిక్యులర్, ఐజాంట్, బయోలాజికల్‌ ఇ, విర్కో, విరూపాక్ష, జుబిలెంట్, విమ్టా, అరాజెన్, సాయి లైఫ్‌ సైన్సెస్‌ ఫిబ్రవరి 25న ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటితో కొత్తగా 9,800 ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తాజా ఒప్పందాలతో కలిపి.. ఇప్పటివరకూ గ్రీన్‌ ఫార్మా సిటీలో మొత్తం 11,100 కోట్ల పెట్టుబడులు రాగా.. 22,300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అటు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ స్టేట్‌ ప్రతినిధులతో హెచ్‌ఐసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో పరిశ్రమలు, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, ఇతర రంగాల్లో పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చించారు.

24-02-2025 సోమవారం ( ప్రచారంలో ప్రశ్నలు )

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 24న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో సుడిగాలి ప్రచారం చేశారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ చేశారు. ప్రజల కోసం తాము ఏం చేస్తున్నాం.. కేంద్రం ఏం చేస్తోందో గ్రాడ్యుయేట్లకు వివరించారు.

23-02-2025 ఆదివారం ( స్వర్ణ గోపురం సాక్షాత్కారం )

యాదగిరిగుట్ట నారసింహుడి దివ్యవిమాన స్వర్ణ గోపురం సాక్షాత్కారమైంది. దేశంలోనే ఎత్తయిన బంగారు గోపురాన్ని ఫిబ్రవరి 23న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రేవంత్ ​రెడ్డి దంపతులు గోపురంపై ఉన్న సుదర్శన చక్రానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేసి.. దివ్యవిమాన స్వర్ణగోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. మొదట కొండపైన ఏర్పాటు చేసిన యాగశాలకు చేరుకొని, మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. దేశంలోనే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఐదంతస్తుల దివ్యవిమాన గోపురం ఎత్తయిన గోపురంగా నిలిచింది.

50.5 అడుగులు ఎత్తు, 10,754 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న స్వామివారి పంచతల దివ్యవిమాన గోపురాన్ని 65 కిలోల 633 గ్రాముల బంగారంతో చేశారు. దేశంలో కొన్ని ఆలయాలకు మూడంతస్తుల గోపురాలుండగా.. ఐదంతస్తుల స్వర్ణగోపురం ఉన్న ఏకైన క్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ క్షేత్రం రికార్డు సృష్టించింది. 60 నదుల నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలతో స్వామివారి దివ్యవిమాన గోపురానికి, స్వర్ణ సుదర్శన చక్రానికి అర్చకులు కుంభాభిషేకం నిర్వహించారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×