BigTV English

CM Revanth Reddy: ఇందిరమ్మ ఇండ్లపై.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

CM Revanth Reddy: ఇందిరమ్మ ఇండ్లపై.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

CM Revanth Reddy: దశాబ్దాల కల ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కు శంకుస్థాపన, చారిత్రక కులగణన, ఎస్సీ వర్గీకరణపై మరింత ముందుకు వెళ్లేలా.. విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా NIN సహకారం తీసుకోవడం, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సప్లై, టీటీడీ బోర్డు తరహాలో యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటు, కొత్త టూరిజం పాలసీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


01-02-2025 శనివారం ( ఆర్థికంగా ముందుకు.. )

ఆర్థిక శాఖ, ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ శనివారం సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్రానికి దక్కే కేటాయింపుల లెక్కల ప్రకారం ఎలా ముందుకెళ్లాలన్న విషయాలపై సమాలోచనలు జరిపారు. ఓవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి కోసం ఆదాయం పెంచుకోవడం దిశగా కీలక సూచనలు చేశారు. అటు ముఖ్యమైన పథకాలకు అవసరమయ్యే నిధుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించారు.


31-01-2025 శుక్రవారం ( ఇక నయా ఉస్మానియా )

సీఎం రేవంత్ జనవరి 31న పేదల ఆస్పత్రి ఉస్మానియా కొత్త బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించే లక్ష్యంతో ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ అఫ్జల్‌గంజ్‌లో ఉండగా.. కొత్త భవనాన్ని గోషామహల్‌ స్టేడియంలో నిర్మించనున్నారు. 2 వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం రానుంది. 30 ఏళ్ల కల కొత్త ఉస్మానియా హాస్పిటల్. ఈ ఆస్పత్రి భవనం కోసం 6 నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేసి రెగ్యులర్ గా రివ్యూలు చేసి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. వేలాది మంది రోగులకు ఉస్మానియా అంటే ఓ నమ్మకం. అందుకే ఇతర ప్రాంతాలకు దీన్ని తరలించకుండా గోషామహల్‌లోనే ఉంచి ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారు. 5 భాగాలుగా నిర్మాణం జరుగుతుంది.

100 శాతం ఫ్రీగా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం 2700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. రెండేళ్లలో మొత్తం భవన నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్‌ ఆసుపత్రులను మించేలా ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ ఉండబోతోంది. రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని సీఎం సంకల్పించారు. అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్‌ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్‌ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, కిందిభాగంలో ఒకేచోట అన్నిరకాల డయాగ్నొస్టిక్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజూ 5 వేల మంది ఓపీ రోగులను చూసేలా.., 30 విభాగాలతో రోబోటిక్‌ సర్జరీలు చేసేలా కార్యాచరణ రెడీ చేస్తున్నారు.

31-01-2025 శుక్రవారం ( గద్దర్ కు గౌరవం )

గద్దర్ జయంతి, వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. జనవరి 31న జరిగిన గద్దర్ 77వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారిని జాగృతం చేశారన్నారు. గద్దర్ నేర్పిన పోరాట స్ఫూర్తితోనే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. వచ్చే వారమే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై సమగ్ర రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

31-01-2025 శుక్రవారం ( అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ )

రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొగిలిగిద్దలో కొత్తగా నిర్మించనున్న పాఠశాల భవనానికి సీఎం భూమి పూజ చేశారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద పాఠశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మొగిలిగిద్దలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. అంతే కాదు విద్యాశాఖ ద్వారా చేస్తున్న పనులను వివరించారు.

30-01-2025 గురువారం ( ఎడ్యుకేషన్ లో ఏఐ )

విద్యలో క్వాలిటీ పెంచేందుకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ మెథడ్స్ ను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ వేగం పెంచింది. విద్యాశాఖను సీఎం స్వయంగా చూస్తుండడంతో ఆయన గైడెన్స్ లో ఆధునిక విద్యా విధానాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా బెంగుళూరు కేంద్రంగా పని చేసే ఎక్ స్టెప్ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించింది. జనవరి 30న రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితా రాణా నేతృత్వంలోని బృందం ఎక్ స్టెప్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించింది. అంతకు ముందు ఇదే బృందం కేరళలోనూ పర్యటించింది.

30-01-2025 గురువారం ( పిల్లలకు క్వాలిటీ ఫుడ్ కోసం )

ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో క్వాలిటీ ఫుడ్ అందించేందుకు ఇకపై ఎన్ఐఎన్ సహకారం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్ విషయంలో కంప్లైంట్స్ పెరుగుతుండడంతో వారికి మరింత నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 268 రెసిడెన్షియల్ విద్యాసంస్థలున్నాయి. వీటిలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులున్నారు.

వీరికి ప్రతిరోజు భోజనంతో పాటు స్నాక్స్ ను అందించే కామన్ డైట్ ప్రోగ్రాంను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుండడం, ఫుడ్ క్వాలిటీ తగ్గిందని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఇలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వంట గదితో పాటు, స్టోర్ రూమ్, భోజనం వడ్డించే చోట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. ఇందుకోసం ప్రభుత్వం ఎన్ఐఎన్ సహకారం కోరింది. వీటితో పాటు సిబ్బందికి సరైన ట్రైనింగ్ ఇచ్చేలా మాడ్యూల్ ను అభివృద్ధి చేయనున్నారు.

30-01-2025 గురువారం ( కరెంట్ కెపాసిటీ పెంచేలా )

తెలంగాణ కరెంట్ కెపాసిటీ పెంచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్‌ ప్రభుత్వం బిల్డ్‌ ఆన్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించగా.. తెలంగాణ విద్యుత్‌శాఖ అధికారుల బృందం ఆయా ప్రతిపాదనలపై స్టడీ చేసి.. 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది. హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌సింగ్‌ సుఖుతో జనవరి 30న ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన చేసి ఆ వెంటనే ఎంవోయూపై సంతకం చేసేలా చర్యలు చేపడుతుందని భట్టి విక్రమార్క అన్నారు.

30-01-2025 గురువారం ( ప్రొఫెసర్ల సేవల కోసం )

యూనివర్సిటీల ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచుతూ.. రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 30న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును పెంచాలని ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. దాన్ని పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిధిలో ప్రస్తుతం 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో 2 వేల 817 ప్రొఫెసర్లు పనిచేయాలి. కానీ.. ప్రస్తుతం 757 మందే పని చేస్తున్నారు. అందుకే ఉన్న వారి సేవలను వినియోగించుకునేలా ఈ ప్రయత్నం చేశారు.

29-01-2025 బుధవారం ( టెన్త్ స్టూడెంట్స్ కు స్నాక్స్ )

టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనవరి 29న ఆదేశాలు జారీ చేశారు. 2025 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు మొత్తం 38 వర్కింగ్ డేస్ స్నాక్స్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 21 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ బడుల్లో చదివే స్టూడెంట్స్ కు స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

29-01-2025 బుధవారం ( గుట్టపై పాలకమండలి )

టీటీడీ త‌ర‌హాలోనే యాద‌గిరి గుట్ట దేవ‌స్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ అధికారుల‌ను ఆదేశించారు. పాలకమండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో ప‌లు మార్పుల‌ను సీఎం సూచించారు. యాద‌గిరిగుట్ట బోర్డు నియామ‌కపు నిబంధ‌న‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి జనవరి 29న స‌మీక్ష నిర్వహించారు. తిరుమ‌లలో మాదిరే యాద‌గిరిగుట్ట ఆల‌యం స‌మీపంలో రాజ‌కీయాలకు తావులేకుండా చూడాల‌ని, ఆల‌య ప‌విత్రతకు భంగం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు.

29-01-2025 బుధవారం ( ఇకపై కొత్త టూరిజం పాలసీ )

కొత్త టూరిజం పాలసీని ఫిబ్రవరి 10లోగా రెడీ చేయాలని సీఎం రేవంత్‌ అధికారుల సమీక్షంలో ఆదేశించారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యుత్తమ పాలసీ తయారు చేయాలన్నారు. ఎకో, టెంపుల్‌ టూరిజంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జాతర సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్‌గా డెవలప్ చేయాలన్నారు.

ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలన్నారు. ఇక హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలన్నారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు ఇప్పటి నుంచే రెడీ చేయాలన్నారు. రాష్ట్రానికి గుర్తింపు, ఆదాయం పెంచేలా పాలసీ ఉండాలన్నారు.

29-01-2025 బుధవారం ( ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక )

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా సప్లై చేయాలనే అంశంపై స్టడీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. జనవరి 29న ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల కమిషనర్ శశాంక, టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్ ​తో కమిటీని ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఏటా నిర్మాణాలు పెరుగుతున్నప్పటికీ ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావ‌డం లేద‌ని, ఇసుక మాఫియాకు చెక్ పెట్టాలన్నారు.

28-01-2025 మంగళవారం ( వికారాబాద్ ఎకోటూరిజం హబ్ )

పర్యావరణం అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం పట్టుదలగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగానే వికారాబాద్ ఏరియాలో అభివృద్ధి జరుగుతుండడంతో ఎక్స్ పీరియం ప్రారంభోత్సవానికి హాజరయ్యానని సీఎం రేవంత్ అన్నారు. జనవరి 28న దీన్ని ప్రారంభించారు. పర్యావరణ ప్రేమికుడు రాందేవ్‌ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరులో ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును ఏర్పాటు చేశారు. హీరో చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐటీ, ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సహా వివిధ రంగాల్లో ముందున్న తెలంగాణలో టెంపుల్‌ టూరిజం, హెల్త్‌ టూరిజం అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు సీఎం. అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణలో హెల్త్‌, ఎకో టూరిజం అభివృద్ధిపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదన్నారు. ఎకో టూరిజం పాలసీలో ప్రభుత్వం కూడా పార్కులను అభివృద్ధి చేయనుందని ప్రకటించారు. పొద్దుటూరులో 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియం పార్కులో 25 వేల జాతుల మొక్కలు, అద్భుతమైన శిల్పాలున్నాయి. 85 దేశాల నుంచి వీటిని దిగుమతి చేశారు. 50 కోట్ల వ్యయంతో 12 ఎకరాల్లో ఓ బీచ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

27-01-2025 సోమవారం ( మధ్యాహ్న భోజనంలో మార్పులు )

పిల్లలకు, వారి చదువుల విషయంలో రేవంత్ ప్రభుత్వం చాలా కీలకంగా ఉంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు చేయాల్సి ఉందని విద్యా కమిషన్ అభిప్రాయపడింది. ఇటీవల పలు ప్రభుత్వ బడులు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో వెలుగు చూసిన ఫుడ్ పాయిజన్ ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వ స్కూళ్లను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి సారథ్యంలోని బృందం సందర్శించింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఫుడ్ క్వాలిటీ, శుచి, మౌలిక సదుపాయాల కల్పన.. వంటి అంశాలను కమిషన్‌ పరిశీలించి రిపోర్ట్ తయారు చేసి జనవరి 27న సీఎస్ శాంతికుమారికి అందించారు.

మధ్యాహ్న భోజన పథకం మెనూలో చేయాల్సిన మార్పులపై నివేదికలో సూచనలు చేశారు. వారం వారం బిల్లుల చెల్లింపు, ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు, రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ కు సాయంత్రం స్నాక్స్, విద్యార్థులకు అవసరమైన కాస్మొటిక్స్, ఇతరత్రా సామగ్రిని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడం, ఇలా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానం వల్ల విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించవచ్చని రిపోర్ట్ లో కమిషన్ పేర్కొంది. సో ఇవి కార్యరూపం దాల్చితే మరింత పారదర్శకత పెరుగుతుందంటున్నారు.

26-01-2025 ఆదివారం ( పేదలకు భరోసా )

ప్రజాపాలనలో భాగంగా జనవరి 26న 4 కీలక పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించారు. లబ్దిదారులకు చెక్కులు అందించారు. గణతంత్ర దినోత్సవం రోజున 4 సంక్షేమ పథకాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదని గుర్తు చేశారు. 25.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 21 వేల కోట్లు జమ చేశామన్నారు. పేదలంతా ఎక్కడ ఉన్నా రేషన్ కార్డు తీసుకోవాలన్నారు.

 

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×