E-Paper
Advertisement

Re-Division Of District Issue: జిల్లాల పునర్విభజనపై కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేల గందరగోళం!

Re-Division Of District Issue: జిల్లాల పునర్విభజనపై కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేల గందరగోళం!

Re-Division Of District Issue: జిల్లాల పునర్విభజన అంశం ఉమ్మడి కృష్ణా జిల్లాలో గందరగోళం సృష్టిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీతో ముందుకు వెళ్తుంటే ప్రజాప్రతినిధులు సరికొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. వారి వ్యక్తిగత స్వార్థం ప్రస్తుతం జిల్లా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సెగ్మెంట్ల మార్పునకు ప్రతిపాదనలు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో.. మరికొన్నింటి కృష్ణాజిల్లాలో కలపాలని ప్రతిపాదనలకు ఆదిలోనే అడ్డంకులు వస్తున్నాయట. గన్నవరం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అడుగులు వేస్తుంటే.. పెనమలూరు ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అక్కడి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయట. ఇంతలో గన్నవరం, పెనమలూరు సెగ్మెంట్లు ఎన్టీఆర్ జిల్లాలో కలిస్తే కృష్ణాజిల్లా చిన్నదైపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర మరో వాదన అందుకున్నట్టు ప్రచారం నడుస్తోందట. దీనిపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోందట.

కొత్త వాదనలతో గందరగోళం సృష్టిస్తున్న ఎమ్మెల్యేలు
వరుస చిక్కుముడులను విప్పేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే ప్రజాప్రతినిధులు మాత్రం కొత్త వాదనలతో గందరగోళం సృష్టించేలా వ్యవహరించటం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందట. నాడు జిల్లాల విభజనలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రయత్నిస్తోందట. ఇందులో ప్రధానంగా ఒక నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలని నిర్దేశిస్తోందట. ఈ విధానాన్ని ఖచ్చితంగా నూరుశాతం అమలు చేయాల్సిందేనన్నది ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది. జిల్లా పరిపాలనా కేంద్రానికి దగ్గరగా ఉండాలన్నది రెండవ అంశం కాగా.. ప్రజలు రాకపోకలకు దగ్గరగా ఉండాలన్నది మూడవ అంశం. వీటన్నింటికీ మించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిచేయటం అన్నది నాల్గవది.

విజయవాడకు చేరువగా ఉండే గన్నవరం
విజయవాడకు సమీపంలో ఉండటం.. విజయవాడ విమానాశ్రయాన్ని కలిగి ఉన్న గన్నవరం నియోజకవర్గాన్ని కూడా విజయవాడలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ, జిల్లా ఇన్చార్జి మంత్రికి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెబుతున్నారు. విజయవాడ రూరల్ మండలం ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలు మాత్రం కృష్ణాజిల్లాలో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఒక నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలను ఒకే రెవెన్యూ డివిజన్‌తో పాటు.. ఒకే జిల్లాలో ఉండాలన్నది నిర్దేశిస్తోంది.

గన్నవరం విలీనంపై సుముఖంగా ఉన్న ఎమ్మెల్యే, ప్రజలు
ఆ లెక్కన చూస్తే గన్నవరం నియోజకవర్గం విలీనంపై అక్కడి ప్రజలు, స్థానిక ఎమ్మెల్యే కూడా సమ్మతం తెలపటంతో ఎన్టీఆర్ జిల్లాలోకి తీసుకురావటం అన్నది సహేతుకంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. గన్నవరం నియోజకవర్గం, పెనమలూరు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే కృష్ణాజిల్లా చిన్నదైపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర సరికొత్త వాదనలు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ వాదనలతో అంతా గందరగోళానికి దారి తీస్తోంది. కృష్ణాజిల్లాలోకి అతిపెద్ద కైకలూరు నియోజవర్గం వచ్చి కలవనుంది. ఇలాంటపుడు కృష్ణాజిల్లా ఎందుకు చిన్నదవుతుందో మంత్రికే తెలియాలని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

పెనమలూరు వాసురాలకు దగ్గరగా ఉంటే విజయవాడ కలెక్టరేట్
పెనమలూరు ప్రజలు విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయానికి రావటం దగ్గరగా ఉండడం…పైగా విజయవాడ గ్రేటర్ విలీన జాబితాలో ఈ నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాలు ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా దాదాపుగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి భిన్నంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీకి ఎన్టీఆర్ జిల్లాలో కలపటానికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కమిటీకి పదేపదే చెబుతుండటంతో పెనమలూరు అంశంపై గందరగోళం తలెత్తుతోందట.

పెనమలూరు ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహరిస్తున్నారే చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతుందట. ఆయన ఏ కారణం చేత వద్దంటున్నారో నియోజకవర్గ ప్రజలకు అంతుచిక్కడంలేదనే టాక్ వినిపిస్తోందట. ఎమ్మెల్యే బోడె అభ్యంతరాలపై నియోజకవర్గ ప్రజలు మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారట. ఈ వ్యవహారంతో నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాపకింద నీరులా జరుగుతున్న ఇతర వ్యవహారాలన్నీ తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయట. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మంత్రి… ఒకరు కావాలని మరొకరు వద్దని ఇంకొకరు చిన్న జిల్లా అని.. మాట్లాడుతూ క్యాబినెట్ సబ్ కమిటీ ముందు తమ వాదనలు వినిస్తున్నారంట. కానీ మీరు ఎవరికీ తమ అభిప్రాయాలు పట్టకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది అంటున్నారు ప్రజలు..

వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా జిల్లాల విభజన
గత వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా జిల్లాల విభజన జరిగింది. దీనిపై అప్పట్లోనే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం తప్పులను సరిదిద్ది, ప్రజల అభీష్టం మేరకు చేర్పులు, మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా నియోజకవర్గాలలోని ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో మంత్రుల కమిటీకి తమ అభిప్రాయాలతో కూడిన అభ్యర్థనలను అందజేశారు. ప్రజాభీష్టం ఒకలా ఉంటే.. ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు మరోలా ఉండటం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు.

కేబినెట్ సబ్ కబిటీ మంత్రులతో గట్టిగ చెప్పిన ముఖ్యమంత్రి
ఇలాంటి పరిస్థితుల్లో గందరగోళానికి తావివ్వకూడదని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే కేబినెట్‌ సబ్‌ కమిటీ మంత్రులతో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యవహారం తాను చూసుకుంటానని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాలను ఎటు కలపాలన్న అంశాన్ని భవిష్యత్తులో ముఖ్యమంత్రే నిర్ణయించనున్నారు. ప్రస్తుతానికి అయితే నియోజకవర్గాల మార్పులు, చేర్పుల అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేశారు.

గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలన్న డిమాండ్‌ రావటానికి ప్రధాన కారణాలలో విజయవాడ గ్రేటర్‌ ప్రతిపాదన కూడా ఉంది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు గ్రేటర్‌ విజయవాడలో విలీనమయ్యే జాబితాలో ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం మండలం, విజయవాడ రూరల్‌ మండలం, పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు మండలాల పరిధిలోని గ్రామాలు గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదన జాబితాలో ఉన్నాయి. రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో గుంటూరు, విజయవాడ భవిష్యత్తులో జంట నగరాలుగా అభివృద్ధి చెందుతూ అమరావతితో అనుసంధానం కావటానికి అవకాశం ఉంది.

గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలను అడిగిన ప్రభుత్వం
ఈ రెండు నగరాలతో కూడా కలిపి అమరావతి సీఆర్‌డీఏ పరిధిలో అతిపెద్ద రాజధానిగా అవతరించటం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు నగరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్‌ విజయవాడ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. గ్రేటర్‌ విజయవాడకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఎన్టీఆర్‌ జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరింది. మొత్తం 75 గ్రామాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి వారు నివేదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమే మిగిలి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వం గ్రేటర్‌ విజయవాడపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాలు వేర్వేరు జిల్లాల్లో ఉన్నప్పటికీ కూడా విశాఖ తరహాలో గ్రేటర్‌ విజయవాడ దిశగా ప్రభుత్వం ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఏర్పాటు కాని గన్నవరం రెవెన్యూ డివిజన్
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి డివిజన్ల మార్పులు జరగలేదు. దీనిని బట్టి చూస్తే.. ప్రస్తుతానికి ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను విలీనం చేయాలనుకుంటే.. గన్నవరం రెవెన్యూ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేసేవారు. అలాంటిదేమీ లేకపోవటంతో ఈ రెండు నియోజకవర్గాలను విలీనం చేసే ఉద్దేశ్యం ప్రస్తుతానికి లేదన్నది అర్థమవుతోంది.

నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలన్న అంశంపై తాను పరిశీలించి న్యాయం చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను మాత్రమే కలిపితే కొత్త రెవెన్యూ డివిజన్‌ అవసరం అవుతుంది. అదే నూజివీడు నియోజకవర్గాన్ని కూడా కలిపితే అవసరం ఉండదు. ఎందుకంటే నూజివీడు వేరే జిల్లాలో ఉన్నా.. రెవెన్యూ డివిజన్‌గా ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే నూజివీడును ఎన్టీఆర్‌లో కలిపితే రెవెన్యూ డివిజన్‌గా కూడా అదే ఉంటుంది కాబట్టి .. కొత్త రెవెన్యూ డివిజన్‌ అవసరం లేదన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. సీఎం చంద్రబాబు గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలో కలుపుతారని ప్రజలు భావిస్తున్నారు.

Also Read: ఒంటరిగానే వస్తాం.. కాషాయ జెండా ఎగరవేస్తాం! సాధ్యమయ్యే పనేనా..?

ఆ క్రమంలో జిల్లాల చేర్పులు, మార్పుల నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలనుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. పెనమలూరును ఎన్టీఆర్‌ జిల్లాలో కలిపే విషయంలో తనకు అభ్యంతరాలు ఉన్నాయని ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. కృష్ణాజిల్లా పునర్విభజన విషయంలో తనను మంత్రివర్గ ఉపసంఘం సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను కూడా ఇంతవరకు ఈ విషయంపై ఎక్కడా చర్చించలేదని తెలిపారు. మెజారిటీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను ఆహ్వానిస్తానని చెప్పారు. పునర్విభజన విషయంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉందంటున్నారు.

Story By Apparao, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×