Kutami Strategy: వైసీపీ టూ జనసేన వలసల సీజన్ మొదలైంది. ప్రస్తుతానికి బాలినేని, సామినేని కనిపిస్తున్నా.. మరికొందరు జంపింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.. ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్‌కి జనసేనాని వార్నింగ్ ఇచ్చారు. గుర్తు పెట్టుకో.. నెత్తిన కాలేసి తొక్కకపోతే, నా పేరు పవన్ కాదని పవర్‌ఫుల్ పంచ్ విసిరారు.. ఇప్పుడు ఓటమి భారం నుంచి జగన్ పూర్తిగా తేరుకోకముందే.. పవన్ అన్నంత పనీ చేస్తున్నారు. అసలు చేరికలపై సేనాని వ్యూహమేంటి? కూటమి పార్టీల ఏకాభిప్రాయంతోనే ఈ జంపింగ్స్ జరుగుతున్నాయా?
వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరుపై ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీని వీడుతున్నారు. ఓటమి తర్వాత కూడా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలువనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లా వైసిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో విడివిడిగా కలిసి ఆయనతో చర్చించారు. పార్టీలో చేరతామని ప్రతిపాదించారు. అందుకు పవన్‌కల్యాణ్ అంగీకరించారు. సెప్టెంబర్ 22న జనసేనలో చేరుతున్నట్లు సామినేని ఉదయభాను ప్రకటించారు.
ఒంగోలులో పవన్‌కల్యాణ్ సమక్షంలో తాను, తన అనుచరులంతా జనసేనలో చేరుతున్నామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు … వైఎస్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని.. ఆ కుటుంబం పట్ల గౌరవంతోనే జగన్ కోసం రాజీనామా చేశామని పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డిపై గౌరవంతోనే జగన్‌ను ఇంత కాలం భరించానని.. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా ఇప్పటికీ జగన్ మారలేదని విమర్శించారు.
Also Read: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్
ఎన్నికల ప్రచారంలోనే పవన్‌కళ్యాణ్ పవర్ ఫుల్ ఛాలెంజ్ చేశారు. జగన్‌ను అధ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవనే కాదని బహిరంగ సభా వేదికపై నుంచి సవాల్ విసిరారు. దానికి తగ్గట్లే అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడంలో కీ రోల్ పోషించారు. జనసేన వైసీపీ కంటే పెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఇప్పుడు ప్రచారంలో సవాల్ చేసినట్లు జగన్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు.
జనసేనలో చేరికకు రెడీ అయిన సామినేని, బాలినేని ఆషామాషీ నేతలు కాదు. ఇద్దరూ వైఎస్ఆర్ సీఎం కాక ముందు నుంచి ఆయనకు సన్నిహితులే. వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో కలిసి నడిచారు.. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు .. పైగా బాలినేనికి జగన్‌తో బంధుత్వం కూడా ఉంది. అలాంటి వారు వైసీపీకి గుడ్‌బై చెప్పడం ఆ పార్టీ కేడర్‌ను డైలమాలో పడేస్తోందంట.
బాలినేని, సామినేనిల బాటలో మరో 25 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు మూడు మిత్రపక్షాల ప్రతినిధులు కలిసి చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారంట. వైసీపీ నుంచి వస్తున్న వారిని చేర్చుకోవాలా? వద్దా అని నిర్ణయించడానికి ముగ్గురితో కమిటీ కూడా వేశారంట.
కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బిజెపి నేత సత్యకుమార్ యాదవ్, జనసేన సీనియర్ నాదేండ్ల మనోహన్, టీడీపీ నుంచి నారా లోకేష్ ఆ స్క్రూటినీ కమిటీలో మెంబర్లుగా ఉన్నారంట. ఆయా పార్టీల్లో ఆ ముగ్గురు కీలక నేతలే అవ్వడంతో.. వారు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏ పార్టీలో చేర్చుకోవడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారంట.. మొత్తానికి పవన్ ఛాలెంజ్‌కి తగ్గట్లే కూటమి పార్టీలు వైసీపీని ఖాళీ చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నాయి.