Dera Baba: డేరాబాబా హత్య, అత్యాచారం కేసుల్లో జైల్లో ఉన్నారు. ఆయన ఇంత తీవ్రమైన కేసుల్లో జైల్లో ఉంటే, వరుస పెరోల్స్ ఎలా వస్తున్నాయి? ఆయనకంత వెసలుబాటు ఎక్కడిది? ఆ వివరాలు ఎలాంటివి?
డేరా సచ్చా సౌదా అధినేత, డేరా బాబాగా పిలిచే గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు హర్యానా ప్రభుత్వం మరోసారి 30 రోజుల పెరోల్ ఇచ్చింది. దీంతో ఆయన మరోసారి రోహ్‌తక్ లోని సునారియా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనను భారీ భద్రతతో సిర్సాలోని డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి తరలించారు.
2017లో అత్యాచారం, హత్య కేసుల్లో శిక్ష పడిన తర్వాత ఆయన జైలు నుంచి పెరోల్‌పై బయటకు రావడం ఇది 16వ సారి కాగా, ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆయన 430 రోజులకు పైగా జైలు బయటే ఉన్నారు. డేరాబాబాపై పలు కేసులు ఉన్నా ప్రధానంగా నాలుగు కేసులపై విచారణలు ఎదుర్కొంటున్నారు. 2002లో తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో ఆగస్టు 2017లో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. రెండు అత్యాచార కేసులకు 10 ఏళ్ల చొప్పున 20 ఏళ్ల జైలు శిక్ష, 30 లక్షల రూపాయల జరిమానా సైతం విధించింది కోర్టు. ప్రస్తుతం ఆయన ఈ కేసులోనే రోహ్ తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
ఇక డేరా ఆశ్రమంలోని అసాంఘిక కార్యకలాపాలను బయటపెట్టినందుకు పూరా సచ్ పత్రిక జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతిని హత్య చేసిన కేసులో దిగువ కోర్టు డేరా బాబాకు జీవిత ఖైదు విధించింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవంటూ హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
ఇక సాధ్వీల అత్యాచార లేఖ బయట రావడం వెనక మేనేజర్ రంజిత్ సింగ్ హస్తం ఉందనే అనుమానంతో.. అతడిని హత్య చేయించినట్లు కూడా అభియోగాలు ఎదుర్కొన్నారు డేరాబాబా. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవనే కారణంతో 2024లో డేరాబాబాకు హర్యానా హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
ఇవే కాకుండా, దేవుడికి దగ్గరవుతారనే నమ్మకంతో ఆశ్రమంలోని 400 మంది పురుష అనుచరులకు బలవంతంగా నపుంసకత్వ శస్త్రచికిత్సలు చేయించారనే కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ప్రధాన హత్య కేసుల నుంచి నిర్దోషిగా విడుదలైనా, అత్యాచారం కేసులో 20 ఏళ్ల శిక్ష అమలులోనే ఉంది. సాధారణంగా అయితే ఇన్ని కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉండి, అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఇన్ని సార్లు పేరోల్ రావడం చాలా చాలా కష్టం. కాని 9 ఏళ్లలో 16 సార్లు పేరోల్ ఇవ్వడం దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు కారణమైంది కూడా.
డేరా బాబాకు ఇప్పటి వరకూ ఇన్ని సార్లు పెరోల్ ఎందుకు ఇస్తున్నారు? ఆయనకు మాత్రమే ఆ ఫెసిలిటీ ఎలా సాధ్యం? 2017లో అత్యాచారం కేసులో దోషిగా తేలి సునారియా జైలుకు వెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు మొత్తం 16 సార్లు పెరోల్ మంజూరైంది. తాజాగా మే 26న కూడా హర్యానా ప్రభుత్వం డేరాబాబాకు మరో 30 రోజుల పెరోల్ మంజూరు చేయడంతో, ఆయన జైలు నుంచి విడుదలయి సిర్సాలోని తన ప్రధాన ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ 9 ఏళ్ల కాలంలో ఆయన 430 రోజులకు పైగా జైలు బయటే గడిపారు.
సాధారణ ఖైదీలతో పోలిస్తే, డేరాబాబాకు ఇంత సులభంగా, పెరోల్ లభించడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు చెబుతారు. వాటిలో ఒకటి రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినది- ఓటు బ్యాంకు పాలిటిక్స్. కాగా హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో డేరా సచ్చా సౌధాకు లక్షలాది మంది అనుచరులు ఉన్నారు. వీరందరికీ ఓట్లుంటాయి. ఎన్నికల టైంలో ఈ ఓట్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు డేరాబాబా మద్దతు కోరుతుంటాయి. ఆయనకు లభించిన 16 పెరోల్స్‌లో ఎక్కువ భాగం ఎన్నిల సమయమే అయి ఉంటుంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ముందు- వెనక పెరోల్ మంజూరు కావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
గతంలో ఆయనపై ఉన్న రెండు ప్రధాన హత్య కేసుల్లో అంటే, జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి, మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులలో.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఇందువల్ల ఆయనపై ఉన్న లీగల్ కాంప్లికేషన్స్ కొంత తగ్గి, టెక్నికల్‌గా పెరోల్ పొందడం సులువైంది. ఆయనకు మాత్రమే ఆ ఫెసిలిటీ ఎలా సాధ్యం? అని చూస్తే.. భారత చట్టంలో ఉన్న కొన్ని లొసుగులు, రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణాధికారాలు ఆయనకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఐదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఏ హార్డ్ కోర్ ఖైదీకైనా, జైల్లో ప్రవర్తన బాగుంటే ఏడాదికి 10 వారాల వరకు పెరోల్ పొందే అర్హత లభిస్తుంది. జైలు అధికారులు ఆయన ప్రవర్తన చాలా బాగుంది అని రిపోర్ట్ ఇవ్వడం ద్వారా.. ఈ నిబంధనను డేరాబాబా తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు. పెరోల్ ఇవ్వాలా వద్దా? అనేది పూర్తిగా రాష్ట్ర హోం శాఖ, స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ పరిధిలోని అంశం. ప్రభుత్వం అనుకూలంగా ఉన్నంతవరకు స్థానిక యంత్రాంగం నుంచి అనుమతులు రావడం పెద్ద కష్టం కాదు.
ఇటు కోర్టులు, అటు ప్రభుత్వం ఆయనకు పెరోల్ ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు పెడతాయి. రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, ఆన్‌లైన్ సత్సంగాలు నిర్వహించకూడదని అంటారు. ఇక శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని కూడా రూల్స్ పెడతారు. ఈ నిబంధనలను పాటిస్తున్నామనే కారణంతో ఆయన లాయర్లు పదే పదే పెరోల్ దరఖాస్తులు చేసుకుని సక్సెస్ అవుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని రాజ్యాంగం చెబుతున్నా, డేరాబాబా విషయంలో ఇందుకు భిన్నంగా నడుస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టంలోని లొసుగులను- ఎంతో చాకచక్యంగా వాడుకుంటున్నారనేది ఓపెన్. అందుకే దీన్ని ప్రతిపక్షాలు, సిక్కు సంఘాలు న్యాయాన్ని అపహాస్యం చేయడమే అంటూ తీవ్రంగా విమర్శిస్తుంటాయి.
పెరోల్ దుర్వినియోగం ఎలా జరుగుతుంది? డేరాబాబా విషయంలో జరుగుతోన్నది ఎలాంటిది? అసలు పెరోల్ రూల్స్ ఏం చెబుతుంటాయి? డేరాబాబా వీటిని ఎలా అధిగమిస్తున్నారు? పెరోల్ అనేది ఖైదీలకు ఇచ్చే ఒకానొక చట్టపరమైన సదుపాయం. అయితే, ఇది సాధారణ ఖైదీలకు ఒకలా, డేరాబాబా లాంటి వ్యక్తులకు మరోలా వర్తిస్తోందనే విమర్శలు ఉన్నాయి. భారతదేశంలో జైళ్ల నిర్వహణ, ఖైదీల విడుదల అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం. హర్యానాలో గుడ్ కండక్ట్ ప్రిజనర్ చట్టం, 2022 అమలులో ఉంది. దీని ప్రకారం అర్హతలేంటో చూస్తే.. జైల్లో ఖైదీ ప్రవర్తన బాగుండాలి. కనీస శిక్షా కాలాన్ని పూర్తి చేసి ఉండాలి. ఈ చట్టం ప్రకారం, ఒక ఖైదీ ఒక క్యాలెండర్ సంవత్సరంలో 10 వారాలు అంటే, 70 రోజుల వరకూ రెగ్యులర్ పెరోల్ పొందవచ్చు. దీన్ని రెండు విడతలుగానూ వాడుకోవచ్చు.
కుటుంబంలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం, వివాహాలు, ఇంటి నిర్మాణం, వ్యవసాయ పనులు చూసుకోవడం వంటి కారణాలపై పెరోల్ ఇస్తారు. ఖైదీ బయటకు వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలగదని స్థానిక పోలీసులు, జిల్లా మెజిస్ట్రేట్ సైతం ధృవీకరించాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం పెరోల్ అనేది ఖైదీల మానసిక పరివర్తన కోసం ఇచ్చే సదుపాయం. కానీ ప్రాసెస్ అంతా ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉంటుంది. ఇందువల్ల ఇది తరచూ దుర్వినియోగం అవుతుంది. సాధారణ ఖైదీలు తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు, ఇతర ఎమర్జెన్సీకి పెరోల్ దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి ఫైళ్లు కదలవు. కానీ బలమైన రాజకీయ సిఫార్సులు, డబ్బు, అధికారం ఉన్న వారికి రోజుల్లోనే అనుమతులు వచ్చేస్తాయి.
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయగల నేరగాళ్లను తాత్కాలికంగా బయటకు తీసుకురావడానికి అధికార పార్టీలు జైలు యంత్రాంగంపై ఒత్తిడి తెస్తుంటాయి. పెరోల్ పై వచ్చిన వ్యక్తి.. సాక్షులను బెదిరించడం, నేరపూరిత నెట్‌వర్క్‌ను నడపడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం వంటివి చేసినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంటారు అధికారులు. డేరాబాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కేసులో పెరోల్ రూల్స్ ఉల్లంఘించారని చెప్పలేం, కానీ చట్టబద్ధమైన లొసుగులను వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆయన 9 ఏళ్లలో 16 సార్లు బయటకు రావడానికి పలు వ్యూహాలు పనిచేశాయాని చెప్పాలి.
హర్యానా ప్రభుత్వం 2022లో తెచ్చిన కొత్త చట్టం డేరాబాబాకు ఒక వరంగా మారింది. అంతకుముందు అత్యాచారం, హత్య లాంటి ఘోర నేరాలకు పాల్పడిన వారిని హార్డ్‌కోర్ ఖైదీలుగా పరిగణించి.. పెరోల్ ఇవ్వడానికి కఠిన నిబంధనలు ఉండేవి. కానీ, కొత్త చట్టం ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఏ ఖైదీ అయినా, హార్డ్‌కోర్ ఖైదీలతో సహా గుడ్ కండక్ట్ కిందకు వస్తారు. డేరా బాబా 2017 నుంచి జైల్లో ఉండి- ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో, టెక్నికల్‌గా ఆయనకు ప్రతి ఏటా 10 వారాల పెరోల్ పొందే హక్కు లభించింది. డేరాబాబా జైల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటారని, తోటపని చేస్తారని జైలు అధికారులు ప్రతిసారీ గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. స్థానిక జిల్లా యంత్రాంగం కూడా ఆయన వల్ల శాంతిభద్రతలకు ముప్పు లేదని నివేదికలు సమర్పిస్తుంది. ప్రభుత్వమే ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ నివేదికలు రావడం ఎంతో సులువుగా మారింది.
గతంలో ఆయనకు పెరోల్ ఇవ్వడానికి.. ఆయనపై ఉన్న హత్య కేసులను సాకుగా చూపేవారు. కానీ, హర్యానా హైకోర్టు ఆయనను జర్నలిస్ట్, మేనేజర్ హత్యల నుంచి నిర్దోషిగా ప్రకటించడంతో, ప్రస్తుతం ఆయన కేవలం అత్యాచారం కేసులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇది ఆయన లాయర్లకు పెరోల్ సాధించడాన్ని మరింత సులభతరం చేసింది. మాములుగా డేరాబాబాకు పెరోల్ ఇచ్చేటప్పుడు రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, డిజిటల్ సత్సంగాలు పెట్టకూడదని అంటాయి కోర్టులు. ఆయన నేరుగా మైకు పట్టుకుని మాట్లాడరు. కానీ, ఆయన ఆశ్రమానికి రావడం, అక్కడ అనుచరులను కలవడం ద్వారా.. తెరవెనుక రాజకీయ సందేశాలు చేరాల్సిన చోటుకు చేరిపోతుంటాయి. ఏ పార్టీకి ఓటు వేయాలనేది- అనుచరులకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంటాయి. డేరాబాబా విషయంలో చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదు. కానీ, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ రాజకీయ ఓటు బ్యాంక్ ప్రయోజనాల కోసం చట్టాన్ని ఆయనకు అనుకూలంగా ఎలా మలచవచ్చో చూపించడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి.
Also Read: ‘ఇళ్లు కట్టకపోతే నేను పోటీ చేయను.. మరి కేటీఆర్ సిద్ధమేనా’? మంత్రి పొంగులేటి సవాల్!
Story by: Anup, Big Tv