AP Politics: రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి అరెస్టుపై అధికార వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. వైసీపీ గత ప్రభుత్వ హయాంలో ధనుంజయ్‌రెడ్డి అక్రమాలు, అరాచకాలపై ఉన్నతస్థాయి అధికారులు సైతం మండిపడుతున్నారు. సహచర ఐఏఎస్‌ల విషయంలోనూ ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని బాధిత అధికారులు భగ్గుమంటున్నారు. అప్పట్లో సాధారణ కార్యదర్శిగా ఉంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే వెయిట్ చేయించిన అంశాన్ని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఓ ఐఏఎస్ అధికారి ఇంటిని ఉన్న పళంగా ఖాళీ చేయించి రాక్షసానందం పొందాడని ధనుంజయ్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.. మొత్తానికి ఆ మాజీ ఐఏఎస్ అరెస్టుతో అటు అధికార యంత్రాంగంతో పాటు వైసీపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారంట
యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ధనుంజయరెడ్డి
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి… వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంవో, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆయన గుప్పిట్లోనే ఉండేది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయన ముందు క్యూ కట్టాల్సిందే… ఏదైనా పని మీద తనను కలవడానికి వచ్చిన సీనియర్ మంత్రులకూ.. ధనుంజయ్ అన్నను కలవండని జగన్ చెప్పేవారంట. అలా అంతులేని అధికారం చలాయించిన ధనుంజయరెడ్డి లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యారు.
సీఎంఓ కేంద్రంగా కుట్ర అమల్లో కీలక పాత్ర
మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి అత్యంత సన్నిహితుడు, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి , ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఆ కేసు కీలక మలుపు తిరగనుంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడంతో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ వీరిని తెర ముందు పెట్టి నడిపించిన కుంభకోణం అంతిమ లబ్ధిదారు, కుట్రదారు గుట్టు రట్టు చేసే దిశగా ఇక దర్యాప్తు సాగనుంది. రాజ్ కెసిరెడ్డి, ఆయన అనుచరగణం మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు కృష్ణమోహన్‌రెడ్డి ద్వారానే జగన్‌కు చేర్చినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ధనుంజయరెడ్డి నాటి సీఎంవో కేంద్రంగా ఈ కుట్ర అమల్లో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో వారిద్దరి అరెస్టుతో.. తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్ వరకూ డొంకంతా కదిలే అవకాశముందంటున్నారు.
జగన్ హయంలో అన్నీ తానే అయి చలాయించిన ధనుంజయ్
ఒక కార్యదర్శి స్థాయిలో పనిచేసిన ధనుంజయరెడ్డి… తన కంటే హోదాపరంగా ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్న, మొత్తం అధికార యంత్రాంగానికి సారథి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా వెయిట్ చేయించేవారంటే జగన్ ఆయనకు ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థమవుతుంది. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్‌కు కళ్లూ, చెవులూ తానే అయి, అపరిమిత అధికారాలు చలాయించారాయన. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లూ ధనుంజయరెడ్డే డిఫాక్టో సీఎం. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాదు, మొత్తం అధికార యంత్రాంగానికి ఆయన మాటే శాసనం అన్నట్లు సాగింది. యావత్ ప్రభుత్వమే ఆయన కనుసన్నల్లో నడిచేదట.
సీఎం దగ్గరున్న శాఖలతో పాటు, అన్ని శాఖలపై ధనుంజయరెడ్డి అజమాయిషీ
సాధారణంగా ఎవరికీ కేటాయించని శాఖలన్నీ సీఎం చూస్తుంటారు. కానీ సీఎం దగ్గరున్న శాఖలతో పాటు, అన్ని శాఖలపై ధనుంజయరెడ్డి అజమాయిషీ కొనసాగింది. జూనియర్ ఐఏఎస్ అధికారి నుంచి సీఎస్ వరకు, ఎస్పీ నుంచి డీజీపీ వరకు, చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైనా ఆయన ముందు క్యూ కట్టాల్సిందే అన్నట్లు నడిపించారంట. జగన్‌కు ఆత్మలా వ్యవహరిస్తూ, కనీవినీ ఎరుగని రీతిలో అధికారం వెలగబెట్టారు ఆ మాజీ ఐఏఎస్.
వైసీపీ హయంలో జరిగిన అనేక కుంభకోణాలకు కింగ్‌పిన్
బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ మంత్రులకు కూడా.. ఏ విషయమైనా ధనుంజయ్ అన్నను కలిసి, మాట్లాడండని జగన్ చెప్పేవారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలైనా, కార్యక్రమాలైనా, చివరకు అధికారుల బదిలీలైనా ఆయనకు చెప్పి, ఆయన అనుమతితో చేయాల్సిందేనంట. అన్ని వ్యవస్థల్నీ గుప్పిట్లో పెట్టుకున్న ధనుంజయరెడ్డి సీఎంవో కేంద్రంగా భారీ ఎత్తున అక్రమాలకు, అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలకు ఆయనే కింగ్‌పిన్‌గా వ్యవహరించారని, రూ.వందల కోట్లు మూటగట్టుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
2019లో ఎన్నికల ఫలితాలప్పుడే జగన్ పక్కన ప్రత్యక్షం
2019లో ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ధనుంజయరెడ్డి జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందే జగన్ ఆయనను తన అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆ తర్వాత కార్యదర్శిగా ప్రమోట్ చేశారు. ఐదేళ్లూ జగనే సీఎం అయినా… ఆయన తరఫున అన్ని వ్యవహారాలూ ధనుంజయరెడ్డే చక్కబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు జగన్ అరుదుగా అందుబాటులో ఉండేవారు కాబట్టి వారంతా ధనుంజయరెడ్డినే ఆశ్రయించేవారు. ఆయనకు చెబితే జగన్‌కు చెప్పినట్టేనని భావించేవారు. అప్పట్లో సీఎంవోలో చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్, ముత్యాలరాజు వంటి అధికారులు కూడా ఏ పనైనా ధనుంజయరెడ్డికి చెప్పి చేయాల్సిందే. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఆయన పిలిచే వరకు ఎదురుచూడాల్సిందే. మంచి పోస్టింగ్‌లు, ఇతర పనుల కోసం ధనుంజయరెడ్డిని కలిసేందుకు ఆరు నెలలపాటు తిరిగిన అధికారులూ ఉన్నారంట
ఎమ్మెల్యేలను గంటల కొద్దీ బయట నిలబెట్టిన ధనుంజయరెడ్డి
ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఏ ఎమ్మెల్యే అయినా వెళితే ఆయనే ఒక సీఎంలా.. గంటల కొద్దీ బయట నిలబెట్టేవారంట. తీరా లోపలికి వెళ్లాక రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా పంపేసేవారని 2024 ఎన్నికల్లో వైకాపా ఓడిపోయాక రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బహిరంగంగా ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులతో ధనుంజయరెడ్డి వ్యవహారశైలికి రాజా మాటలే నిదర్శనం. అంతెందుకు వైసీపీని వీడి టీడీపీ నుంచి గెలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పటికీ ధనుంజయరెడ్డి పేరెత్తితే ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
వైఎస్ కుటుంబానికి నమ్మినబంటు ధనుంజయరెడ్డి
వైఎస్ కుటుంబానికి ధనుంజయరెడ్డి నమ్మినబంటు అంటారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ఆయన 1988లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచిగా పనిచేస్తూనే డానిక్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఉన్నా వైఎస్‌తో సంబంధాలు కొనసాగించారు. ఆయన ఆర్థిక లావాదేవీల్ని కూడా ధనుంజయరెడ్డి చక్కబెట్టేవారని చెబుతారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చి, దాదాపు ఎనిమిదేళ్లపాటు జీహెచ్‌ఎంసీలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత ఆయనను రాష్ట్ర సర్వీసులో విలీనం చేసుకున్నారు.
టీడీపీ హయంలో కీలక పోస్టులు..
ఎనిమిదేళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్‌కు ఎంపిక చేయవచ్చన్న క్లాజ్‌తో ఆయన పదోన్నతి పొందారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఆయనకు గోదావరి పుష్కరాలకు ప్రత్యేకాధికారి, వ్యవసాయశాఖ కమిషనర్, విపత్తుల నిర్వహణశాఖ డైరెక్టర్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓ, శ్రీకాకుళం కలెక్టర్, ఏపీటీడీసీ ఎండీ వంటి కీలక పదవులు కట్టబెట్టింది. ధనుంజయరెడ్డి టీడీపీ హయాంలో కీలక పోస్టుల్లో కొనసాగుతూనే, తెర వెనుక వైసీపీ కోసం పనిచేసేవారన్న విమర్శలున్నాయి. వైసీపీ హయాంలో ఫిఫో నిబంధనను తుంగలో తొక్కి, అప్పటి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇష్టానుసారం బిల్లులు చెల్లించడంలో ధనుంజయరెడ్డిదే కీలకపాత్ర అన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం రోజువారీ చెల్లించే బిల్లుల్లో ఎవరికి ఎంత చెల్లించాలో ఆర్థికశాఖ అధికారులకు ఆయనే వాట్సప్‌లో మెసేజ్ పంపేవారంట. అధికారుల పోస్టింగుల్లోనూ ధనుంజయరెడ్డి హవానే నడిచేదని, ప్రాధాన్య స్థానాల్లో పోస్టింగ్ కోసం అధికారులు ఆయన చుట్టూ తిరిగేవారని చెబుతారు.
ధనుంజయరెడ్డి అక్రమ వ్యవహారాలను చక్కబెట్టిన ఓఎస్టీ
ధనుంజయరెడ్డి అక్రమ వ్యవహారాలన్నీ తనకు ఓఎస్డీగా పనిచేసిన ఓ అధికారి ద్వారా చక్కబెట్టేవారని సమాచారం. ఆయన సేవలకు నజరానాగా అడ్డదారిలో ఐఏఎస్‌గా కూడా ప్రమోట్ చేయించారని ఆరోపణలున్నాయి. జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడంలో ధనుంజయరెడ్డిదే ప్రధాన పాత్ర అని చెబుతారు. పట్టాభిరామ్ వంటి టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి, వివిధ స్టేషన్లకు తిప్పడం, కస్టడీలో చిత్రహింసలు పెట్టడం వంటి వ్యవహారాల్ని ఆయన సీఎంవో నుంచి స్వయంగా పర్యవేక్షించేవారంట. గంట గంటకూ పోలీసులకు ఫోన్ చేసి ఏం జరుగుతోందని ఆరా తీసి, ఆదేశాలు జారీ చేసేవారంట. అప్పట్లో ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుతో కలసి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేవారన్న ఆరోపణలున్నాయి.
రాజకీయ వ్యవహారాలూ చక్కబెట్టిన మాజీ ఐఏఎస్
2019-24 మధ్య జగన్ తరఫున రాజకీయ వ్యవహారాలూ ధనుంజయరెడ్డే చక్కబెట్టేవారని వైసీపీ నేతలే చెపుతుంటారు. ఎమ్మెల్యేల పనితీరునూ ఆయనే సమీక్షించేవారంట. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎంత పెద్ద నాయకులైనా జగన్‌ను కలవాలంటే ముందు ధనుంజయరెడ్డి దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిందే. ఆయన వైఖరిపై అప్పట్లోనే వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. . 2024 ఎన్నికల సమయంలో జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా నేరుగా జగన్‌ను కలిసే అవకాశం దక్కకపోతే, ధనుంజయరెడ్డిని కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలోనూ ధనుంజయరెడ్డే కీలకంగా వ్యవహరించారంట. సర్వేలు చేయించడం నుంచి అభ్యర్థుల వడపోత వరకు ఆయనే పర్యవేక్షించారంట.
ఐఏఎస్‌ల కెరీర్ దెబ్బ తీనేలా వ్యవహరించారని మండిపాటు
పలువురు ఐఏఎస్‌ల కెరీర్ దెబ్బ తీనేలా ధనుంజయ్ రెడ్డి వ్యవహరించారని ఐఏఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లను కీలక పోస్టింగుల నుంచి తప్పించి తన వారికే ధనుంజయ్ రెడ్డి ఇప్పించారని అధికార వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడంతో ఐఏఎస్ అధికారులు తగిన శాస్తి జరిగిందంటున్నారంట. సమయమొస్తే ధనుంజయ్ రెడ్డి అక్రమాలపై మరిన్ని బయట పెట్టేందుకు పలువురు ఐఏఎస్‌లు సిద్దమవుతున్నారంట. మొత్తానికి ధనుంజయ్ రెడ్డి లాంటి వాళ్ల ఐఏఎస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని ఐఏఎస్ వర్గాలు ఫైర్ అవుతున్నాయి.
పార్టీ నేత అరెస్ట్ అయినట్లు ఫీలవుతున్న జగన్ సన్నిహితులు
పనిలో పనిగా వైసీపీకి చెందిన కీలక నేతలు కూడా ధనుంజయ్ రెడ్డి అరెస్టుపై లోలోన తెగ హ్యాపీ అయిపోతున్నారంట. ధనుంజయ్ రెడ్డి కి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అంటున్నారంట. అయితే జగన్ కోటరీ లాంటి కొందరు మాత్రం ధనుంజయరెడ్డిని తమలో ఒకరిగానే చూస్తున్నారు. మాజీ ఐఏఎస్ అరెస్ట్ అయితే పార్టీ నేత అరెస్టై నట్లు తెగ ఫీలైపోతున్నారు. అధికార మదంతో విర్ర విగడం వల్లే ధనుంజయ్ రెడ్డి కి ప్రస్తుతం ఈ దుస్థితి దాపురించిందని వైసీపీ నేతలు, అధికారులు అంటున్నారంటే ఆయనగారి హవా ఏ రేంజ్లో ఉండేదో అర్థమవుతుంది.