APCC Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఏపీ కాంగ్రెస్ అల్టిమేటం జారీ చేసింది. రేపటిలోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను.. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. లేకుంటే ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం,కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమన్నారు.
విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి అని ఫైరయ్యారు. డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం కూడా లేదని మండిపడ్డారు. దిక్కున్న చోట చెప్పుకోండనే తీరున యాజమాన్యం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికే 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట గొట్టిన యాజమాన్యం.. మరో 3 వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం అన్నారు ఆమె.
అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు షర్మిల. రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలి. 2021 జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు షర్మిల.
విశాఖ ఉక్కు ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కిందనే ఊపిరి పీల్చుకునే లోపే.. సంస్కరణల దిశగా యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటికే 1100 మది పర్మినెంట్ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ అమలు చేసిన యాజమాన్యం.. మరోవైపు కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. కొద్దినెలల క్రితమే సుమారు రెండు వేల మందిని తొలగించాలని ప్రయత్నించిన ఆర్ఐఎన్ఎన్, కార్మికుల సంఘాలు ప్రభుత్వ ఒత్తిడితో వెనక్కి తగ్గింది. అయితే ఇప్పటికే కొన్ని కాంట్రాక్టుల కాలపరిమితి ముగిసిపోగా వాటిని రెన్యువల్ చేయల్లేదు. కొత్త టెండర్ల పిలవలేదు. దాంతో సుమారు ఆరువందల మంది రోడ్డున పడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వాళ్లకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్న యాజమాన్యం.. ఇప్పుడు నోట్లో మట్టికొట్టేందుకు సిద్ధమైందని కార్మికులు రగిలిపోతున్నారు.
Also Read: లిక్కర్ స్కామ్ కొత్త మలుపు.. కృష్ణమోహన్‌రెడ్డి లీలలు, నటి మోనికాబేడి
ఈ నేపథ్యంలో పీసీసీ ఛీఫ్ షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలుపుతూ.. మంగళవారం నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రేపటిలోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.