Ballari Politics: న్యూ ఇయర్ వేళ బళ్లారిలో పాలిటిక్స్ హీట్ పెంచాయి. వాగ్వివాదంగా మొదలై అది దాడులుగా మారడం.. ఆ దాడులు కాస్త కాల్పుల వరకు వెళ్లడంతో ఇప్పుడు బళ్లారి పాలిటిక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాయి. గాలి జనార్ధన్ రెడ్డిపైనే హత్యాయత్నం జరిగిందన్న న్యూస్ బళ్లారిని షేక్ చేసింది. ఇంతకీ గాలి, భరత్ వర్గాలు సై అంటే సై అని ఎందుకు అనుకుంటున్నాయి? ఈ వివాదానికి వాల్మీకి విగ్రహ ఏర్పాటే కారణమా? లేక తెర వెనక తరతరాల పగలున్నాయా? బళ్లారిపై ఆధిపత్యం కోసమే ఈ గన్ పేలిందా?
ప్లేక్సి వివాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
గురువారం సాయంత్రం.. అంతా న్యూ ఇయర్ మూడ్‌లో ఉన్నారు. కానీ బళ్లారిలో మాత్రం ఆ సీన్ కనిపించడం లేదు. దీనికి కారణం ఒక్క ఫ్లెక్సీ ఏర్పాటుకు చేసిన ప్రయత్నం. యస్.. ఓ ఫ్లెక్సీ ఏర్పాటు కారణంగా మొదలైన వివాదం.. ఏకంగా ఒకరి ప్రాణం తీసింది. మరికొందరిని హాస్పిటల్‌లో చేరేలా చేసింది. కర్ణాటక రాజకీయాల్లో ఏకంగా రాజకీయ దుమారం రేపేలా చేసింది.
గాలి జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో భరత్ రెడ్డి బ్యానర్..
బళ్లారిలో వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. దీనికి సంబంధించి బళ్లారి అంతటా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బళ్లారిలోనే ఉన్న గాలి జనార్దన రెడ్డి ఇంటి సమీపంలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బ్యానర్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన వారు కాబట్టి.. కామన్‌గానే దీన్ని గాలి జనార్ధన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. సరిగ్గా ఇక్కడే మొదలైంది వివాదం. ఈ బ్యానర్లను దగ్గరుండి మరీ కట్టించే పనిలో ఉన్నారు భరత్ రెడ్డి ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డి. బ్యానర్లను ఎలా అడ్డుకుంటారో చూస్తానని పంతానికి పోయిన సతీష్ రెడ్డి.. అక్కడే కుర్చీ వేసుకొని మరీ కూర్చున్నారు. దీంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టైంది.
పరస్పరం రాళ్ల దాడి వరకు వెళ్లిన వివాదం..
సరిగ్గా ఇదంతా జరుగుతున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి తన ఇంటికి వచ్చారు. దీంతో సతీష్ రెడ్డి అనుచరులు మరింత రెచ్చిపోయారు. మాట మాట మరింత పెరిగింది. ఇరు వర్గాలకు చెందిన మరికొందరు మద్దతుదారులు వచ్చారు. వాగ్వాదం కాస్త పెనుగులాటగా.. ఆ తర్వాత రాళ్ల దాడి వరకు వెళ్లింది. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. లాఠీచార్జ్ చేశారు.. చెదరగొట్టేందుకు గాలి గన్‌మెన్‌లు కాల్పులు జరిపారు. ఒక గన్‌మెన్ వద్ద ఉన్న గన్‌ను సతీష్ రెడ్డి బలవంతంగా లాక్కోవడం.. జనార్దన్ రెడ్డిపై కాల్పులు జరపడం క్షణాల్లో జరిగిపోయింది. ఈ ఘటన నుంచి జనార్దన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఈ హడావుడిలోనే భరత్ రెడ్డి వర్గానికి చెందిన రాజశేఖర్ మరణించాడు.
కావాలనే హత్య చేశారు అంటోంది భరత్ రెడ్డి వర్గం
ఒకరి ప్రాణం పోవడం.. నలుగురు హాస్పిటల్‌లో ఐసీయూలో చేరిన తర్వాత కానీ పరిస్థితి కంట్రోల్‌లోకి రాలేదు. అలా వివాదానికి కాస్త బ్రేక్ పడగా.. రాజకీయం నిద్రలేచింది. తనపై హత్యాయత్నం జరిగింది.. ఇదిగొండి సాక్ష్యం అంటూ బుల్లెట్‌ను చూపించారు గాలి జనార్ధన్ రెడ్డి.. తమ వాడిని కావాలనే హత్య చేశారు అంటోంది భరత్ రెడ్డి వర్గం. ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి, అతని సోదరులు, మాజీ మంత్రి శ్రీరాములు సహా పది మందిపై కేసులు నమోదయ్యాయి. విచారణ జరుగుతోంది.
కానీ ఇక్కడో విషయం ఉంది.. కేవలం ఒక ఫ్లెక్సీ ఏర్పాటుపై ఇంత రాద్దాంతం ఎందుకు అయ్యింది? పిలవగానే క్షణాల్లో అంత మంది మద్దతుదారులు ఎలా వచ్చారు? ఏకంగా దాడులు, కాల్పుల వరకు వ్యవహారం ఎందుకు వెళ్లింది? అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఒక చిన్న ఫ్లెక్సీకి వివాదానికి కారణం కావొచ్చు.. కానీ ఇంత రచ్చ వెనక మాత్రం డెఫినెట్‌గా ఇతర కారణాలు ఉంటాయి. బళ్లారి గన్‌ఫైట్‌కు కూడా ఉన్నాయి.
బళ్లారిపై పట్టుకోసం ఓ రెండు వర్గాలు చేసిన ఆధిపత్య పోరాటం..
బళ్లారి పాలిటిక్స్‌లో దశాబ్ధాల కాలం నుంచి జరిగిన పరిణామాలను ఓ సారి తెలుసుకోవాలి. బళ్లారిపై పట్టుకోసం ఓ రెండు వర్గాలు చేసిన ఆధిపత్య పోరాటం.. మైనింగ్ దందాలు, రాజకీయ విబేధాలపై మనం కాస్త ఫోకస్ చేయాలి. నిజానికి ఈ బళ్లారి ప్రాంతం ఒక్కప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న భరత్ రెడ్డి తండ్రి నారా సూర్యనారాయణరెడ్డిదే హవా. బళ్లారిలో ఆయన చెప్పిందే వేదం అనేలాగా ఉండేవి పరిస్థితులు. అందుకే కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీని ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా.. సూర్యనారాయణరెడ్డి ఆధిపత్యం ఎలా ఉండేదో. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ చేతి నుంచి కంచుకోట చేజారిపోయింది.
అస్తిత్వ పోరుగా మారిన ఆధిపత్య పోరు
ఇక్కడ గాలి జనార్ధన్ రెడ్డి గాలి వీయడం మొదలైంది. మెల్లిమెల్లిగా నారా వారి ఆధిపత్య పోరు కాస్త అస్తిత్వ పోరుగా మారింది. అప్పటి నుంచి రగులుతున్నాయి ఈ రెండు వర్గాల మధ్య విద్వేషాలు. అసలు బళ్లారిలో కాంగ్రెస్ పతనం.. బీజేపీ ఎదుగుదల ఎలా సాగింది? దానికి గాలి సోదరులు చేసిందేంటి? ఆ పంతాలకు, ఇప్పుడు కాల్పులకు లింకేంటి?
రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదు. ప్రతి మాటకు, ప్రతి చర్యకు ఓ లెక్క ఉంటుంది. బళ్లారి కూడా అందుకు అతీతం కాదు. ఇక్కడి పంతాలకు, పోరాటాలకు ఆజ్యం పడింది ఇప్పుడు కాదు. ఇది దశాబ్ధాల నాటి కథ. ఈ కథ తెలియాలంటే మనం కాస్త వెనక్కి వెళ్లాలి. రెండు దశాబ్ధాల క్రితం నుంచి జరిగిన రాజకీయ పరిణామాలను ఓసారి తెలుసుకోవాలి. అప్పుడే బళ్లారిలో రెండు కుటుంబాల ఆధిపత్య పోరు అర్థమవుతుంది.. అప్పుడే బళ్లారిలో గన్ ఎందుకు గర్జించిందో తెలుస్తుంది..
బరిలో నిలిచిన సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్
బళ్లారి కథ మార్చింది 1999 నాటి ఎన్నికలని చెప్పాలి. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ బరిలో నిలిచారు. హోరాహోరిగా సాగిన ప్రచారం.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌నే వరించింది. కానీ సుష్మా స్వరాజ్ గెలుపు కోసం గాలి జనార్ధన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి.. తీవ్రంగా కష్టపడ్డారు. నేరుగా సుష్మ స్వరాజ్ బరిలోకి దిగడంతో బీజేపీ అధిష్టానం కూడా ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో సుష్మా ఓడినా కానీ.. గాలి సోదరులు మాత్రం అధిష్టానానికి దగ్గరయ్యారు. దీంతో వారి ఆశీస్సులు వీరిపై మెండుగా ఉండేవి. ఇది ఫస్ట్ టర్న్.
వరల్డ్ మార్కెట్‌లో ఐరన్ ఓర్‌కు ఫుల్ డిమాండ్
ఇక 2001లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీని ప్రారంభించారు గాలి జనార్ధన్ రెడ్డి. ఎప్పుడైతే ఆయన మైనింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారో.. అదే సమయంలో వరల్డ్ మార్కెట్‌లో ఐరన్ ఓర్‌కు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇదే అదునుగా ఆయనకు వేల కోట్ల ఆదాయం గడించారు. ఈ డబ్బును ఆయన రాజకీయాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారనే చర్చ ఉంది. కర్ణాటక రాజకీయాలపై ఆయన ప్రభావం మొదలైంది. చేతిలో అధికారం ఉన్నా, లేకపోయినా.. ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. ఎట్ ది సేమ్ టైమ్ అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో సత్తా చాటుతూ వస్తున్న సూర్యనారాయణ రెడ్డి ఆధిపత్యానికి గండి పడటం ప్రారంభమైంది. ఇది సెకండ్ టర్న్.
ఇక అతి ముఖ్యమైన మరో టర్న్.. 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం. ఈ ఎన్నికలో బీజేపీ గెలుపులో కీలకపాత్ర గాలి సోదరులదే అంటారు. ఆ టైమ్‌లో ఆపరేషన్ కమల ద్వారా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకురావడంలో ఈ ముగ్గురు సోదరులు, వారి ప్రధాన అనుచరుడు శ్రీరాములు చాలా కృషి చేశారంటారు. దీంతో గాలి సోదరులకు, శ్రీరాములుకు ఏకంగా మంత్రి బాధ్యతలు దక్కాయి. దీంతో బళ్లారి ఇక వారి రాజ్యంగా మారిపోయింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. బళ్లారిలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా పరిస్థితులు మారాయి.
కర్ణాటక ఏపీ ప్రభుత్వాలపై అక్రమ మైనింగ్ ఇంపాక్ట్..
ఓబుళాపురం మైనింగ్ అక్రమాలు బయటపడ్డాయి. సరిహద్దులను చెరిపేసి సహజ వనరులను తవ్వుకుంటూ వెళ్లిపోయారని తేలింది. ఈ ఇంపాక్ట్ అటు కర్ణాటక ప్రభుత్వంపై మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వంపై చూపించింది. 2011లో సీబీఐ గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. 2025లో మేలో సీబీఐ కోర్టు ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఇవన్నీ గాలి సోదరులకు మైనస్‌గా మారాయి. ఇదే సమయంలో ఆయనను బీజేపీ దూరం పెడుతూ రావడం మళ్లీ సూర్యనారాయణ వర్గానికి ఓ చాన్స్ ఇచ్చింది.
గంగావతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గాలి జనార్ధన్ రెడ్డి
కానీ.. పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. మళ్లీ టైమ్ మారింది. బీజేపీకి గాలి దూరమయ్యారు. 2023 ఎన్నికలకు ముందు కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే సొంత పార్టీని పెట్టారు. ఆ ఎన్నికల్లో ఆయన గంగావతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో బళ్లారి నుంచి ఆయన భార్యను బరిలోకి దించారు. కానీ గెలుపు మాత్రం సూర్య నారాయణ రెడ్డి తనయుడు భరత్ రెడ్డినే వరించింది. దీంతో బళ్లారి కథ మారడం మొదలైంది. ఓ వైపు కేసులు, కోర్టు తీర్పులు, జైలు శిక్షతో గాలి జనార్ధన్ రెడ్డి వర్గం బిజీగా ఉంది. ఇదే సమయంలో గాలి హవాను తగ్గించడంలో భరత్ రెడ్డి వర్గం మరింత బిజీగా మారింది. మళ్లీ బళ్లారిలో సూర్యనారాయణరెడ్డి కుటుంబం పట్టు బిగించడం మొదలయ్యింది. అసలే యువకుడు కావడంతో భరత్‌రెడ్డి కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు. దీనికి తోడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భరత్ రెడ్డికి పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయి. దీంతో గాలి ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టేందుకు ఒక్కో పావు కదుపుకుంటూ రావడం ప్రారంభమైంది.
బళ్లారిని కంచుకోటగా మార్చాలనేది కాంగ్రెస్ ఆలోచన
బళ్లారిని మరోసారి కాంగ్రెస్ కంచుకోటగా మార్చాలనేది కాంగ్రెస్ ఆలోచన.. గాలి ఆధిపత్యానికి చెక్ పెట్టి మళ్లీ తమ కుటుంబానిదే పెత్తనం అని ప్రకటించాలనేది భరత్ రెడ్డి కోరిక.. అందుకే విషయం ఏదైనా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అనేది కామన్‌గా మారింది. సరిగ్గా ఇదే సమయంలో వచ్చింది వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ. బళ్లారిలో ఈ విగ్రహ ఏర్పాటు ఆలోచన భరత్ రెడ్డిదే. కానీ ఈ విగ్రహం ఏర్పాటుతో కావాలనే వివాదం సృష్టించాలనే కుట్ర జరుగుతోందంటోందనేది గాలి జనార్ధన్ రెడ్డి వర్గం ఆరోపణ. ఇప్పుడీ గన్‌ఫైట్ ఘటన దానికి సాక్ష్యమని చెబుతున్నారు.
ఆయుధంగా గాలి సోదరులు అవినీతి, అక్రమాలు
ఎప్పుడైతే గాలి జనార్ధన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మీని ఎన్నికల్లో ఓడించి భరత్ రెడ్డి కాంగ్రెస్ జెండా పాతారో ఈ నియోజకవర్గ కథ మారిందనే చెప్పాలి. ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత కూడా గాలి సోదరుల అవినీతి, అక్రమాలను తమ ఆయుధంగా మలుచుకున్నారు భరత్ రెడ్డి. తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎప్పటికప్పుడు వారి ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వివాదానికి కారణం గాలి సోదరులే అనేది భరత్ రెడ్డి ఆరోపణ. కావాలనే కాల్పులు జరిపి కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతికి కారణమని ఆరోపిస్తున్నారు భరత్ రెడ్డి. అయితే భరత్ రెడ్డి నియోజకవర్గంలో రౌడీయిజం చేస్తున్నారని.. బీజేపీ కార్యకర్తలను, తన అనుచరులను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు గాలి జనార్ధన్ రెడ్డి. కావాలనే సీన్ క్రియేట్ చేసి ఏకంగా తనను చంపించే కుట్ర చేశారని చెబుతున్నారు గాలి జనార్ధన్ రెడ్డి.
Also Read: టెన్షన్.. టెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆటో సంఘాల అరెస్ట్
మొత్తానికైతే ప్రస్తుతం బళ్లారిలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. దీనికి కారణం రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆధిపత్య పోరు అనేది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అయితే అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. ఇప్పటికే గాలి సోదరులతో పాటు మరికొంత మందిపై కేసులు నమోదయ్యాయి. మరి ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని టర్న్‌లు తీసుకుంటుందో చూడాలి.
Story By Vamshi Krishna, Bigtv