Trump On China: ట్రంప్ రూటే సపరేటు..! ఎప్పుడు, ఎలా , ఏం చేస్తారో కూడా అర్థంకాని స్టైల్ ఈ పెద్దన్నది. అనుకున్నది అనుకున్నట్లు చేయడంలో ఆయనకు పెట్టింది పేరు. మొండి తననానికి పరాకాష్ట ఏదైనా ఉందంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తప్ప మరొకటి కాదు. ఇంత బిల్డప్ ఎందుకంటే.. ట్రంప్ కొత్తగా తీసుకున్న నిర్ణయంతో ప్రపంచం మళ్లొకసారి తలగోక్కుంటుంది. ఆయన ప్లాన్ ఏంటో తెలియక తికమక పడుతోంది. ఇటీవల, ట్రంప్ టారిఫ్‌లు దేశాలన్నింటికీ షాక్ ఇవ్వగా… ఇప్పుడు అందులో కాస్త పాజ్ ఇచ్చారు ఈ మహానుభావుడు. అలాగని అందరికీ కాదు.. చైనాకు ఇందులో క్షమాపణే లేదంట! పరస్పర సుంకాలకే ఈ ఆఫర్ అంటున్నారు. ఇంతకీ, ఏంటీ ట్రంప్ ట్విస్ట్..?
ట్రంప్‌తో మామూలుగా ఉండదు మరి..!
ట్రంప్‌తో మామూలుగా ఉండదు మరి..! ఎన్నికలకు వచ్చే ముందే అన్నీ చెప్పేశారు. అమెరికాను మళ్లొకసారి గ్రేట్‌గా ఎలా మార్చుతారో వెల్లడించారు. మొత్తానికి బంపర్ మెజారిటీతో గెలిచారు. అనుకున్నట్లే… ఆయన మొదటి టర్మ్‌లో మొదలుపెట్టిన ప్లాన్స్ అన్నీ.. ఇప్పుడు రెండో టర్మ్‌లో మరింత అగ్రసీవ్‌గా అమలు చేసేస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ వైపు నుండీ అంతా క్లియర్‌గానే ఉంది. అమెరికా ప్రెసిడెంట్‌గా రెండోసారి గద్దెనెక్కిన తర్వాత ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లపైన ఆయన చేసిన సంతకాలు అమెరికాతో పాటు అంతర్జాతీయంగా అల్లకల్లోలం సృష్టించాయి. ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం.. ‘అయితే, నాకేంటీ?’ అనే స్టైల్లో ఏమాత్రం తగ్గలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థను అంతరిక్షానికి ఎత్తేస్తానంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసిన ట్రంప్.. చెప్పినట్లే, మనా తనా భేదం లేకుండా అన్ని దేశాలపై సుంకాల సమరం మొదలుపెట్టేశారు.
అమెరికా విధించిన టారీఫ్‌ల అమలుకు 90 రోజులు పాజ్
ముఖ్యంగా, ప్రత్యర్థి చైనా టార్గెట్‌గా టారిఫ్ వార్‌కి పదునుపెట్టారు. కట్ చేస్తే ప్రపంచ మార్కెట్ మొత్తం కుదేలయ్యింది. స్టాక్‌లన్నీ ఎప్పుడూ చూడని నష్టాలను చవిచూశాయి. మదుపరులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ట్రంప్ వేసిన లెక్క తల్లకిందులయ్యింది. ప్రపంచదేశాలన్నీ ఏం చేస్తాయని ట్రంప్ ఊహించారో అలాంటిదేమీ జరగలేదు. కట్ చేస్తే.. ట్రంప్ ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచదేశాలపై అమెరికా విధించిన టారీఫ్‌ల అమలుకు 90 రోజులు పాజ్ ఇచ్చారు.
అమెరికాతో ఫెయిర్ వాణిజ్యం చేయట్లేదన్న ట్రంప్
ఏప్రిల్ 9న ప్రెసిడెంట్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మినహా అన్ని దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ చర్యను ఎవ్వరూ ఊహించలేదు. ట్రంప్ టారిఫ్‌లపై తీవ్రమైన విమర్శలు, అంతకుమించిన చర్చలు జరిగినప్పటికీ.. ట్రంప్ టారిఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యం అనుకున్నారంతా. అయితే, అమెరికాతో ఫెయిర్ వాణిజ్యం చేయట్లేదన్న కారణంతో సుంకాలను ప్రవేశపెట్టిన ట్రంప్.. 75కి పైగా దేశాలపై పరస్పర సుంకాల పేరుతో భారీగా టారిఫ్‌లు విధించారు. కాగా.. ఈ దేశాలన్నీ చర్చలు జరిపి, అమెరికాతో మంచి డీలింగ్‌కి వస్తారన్నది ట్రంప్ వ్యూహం.
కెనడా, మెక్సికోలు పరస్పర సుంకాలపై బెట్లు
అయితే, చైనా మినహా ఏ దేశమూ ట్రంప్‌పైన అంతగా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయలేదు. కెనడా, మెక్సికోలు కూడా పరస్పర సుంకాలతో బెట్టు చేయాలని చూసినా ఫలితం లేదు. ఇక, చైనా మాత్రం… ట్రంప్‌తో ఏ యుద్ధానికైనా రెడీ అంటూ సంచలన రెస్పాన్స్ ఇచ్చింది. ఈ పరిణామాన్ని ఊహించని ట్రంప్ తన దూకుడుకి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్న యూ-టర్న్ తీసుకొని.. తన టారిఫ్ అమలులో 90 రోజుల పాజ్ ఇచ్చారు. అయితే, 75 దేశాలపై వేసిన 10% బేస్ టారిఫ్ రేటును అలాగే ఉంచడంతో పాటు.. చైనాపై వేసిన భారీ సుంకంలో ఎలాంటి మార్పూ లేకుండా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
చైనాపై వేసిన సుంకాలను వెంటనే 125 శాతానికి పెంపు
ఇప్పటికే, చైనా-అమెరికాల మధ్య టారీఫ్ వార్ ఢీ అంటే ఢీ అన్నట్లుగా మారింది. ఎవ్వరూ తగ్గేదేలే! అంటున్నారు. ఈ క్రమంలో.. ట్రంప్ చైనాపై వేసిన సుంకాలను వెంటనే 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది దీనికి ముందు ప్రకటించిన 104 శాతం కంటే మరింత ఎక్కువగా ఉంది. అయితే, ఈ పరిస్థితికి కూడా ట్రంప్ చైనాను నిందించారు.
ప్రపంచ మార్కెట్లపై చైనాకు గౌరవం లేదన్న ట్రంప్
“ప్రపంచ మార్కెట్లపై చైనాకు ఏ మాత్రం గౌరవం లేదనీ.. అమెరికా పరస్పర సుంకాల్లో డిస్కౌంట్‌లు ఇచ్చినప్పటికీ.. దానికి విరుద్ధంగా చైనా అమెరికాపై సుంకాలను పెంచడం దారుణమని అన్నారు. దీని ఆధారంగా, అమెరికా చైనాపై విధించిన సుంకాన్ని 125%కి పెంచుతున్నాను అనీ.. ఇది వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఇకపై ఇతర దేశాలను దోచుకునే రోజులు పోయాయని చైనా గ్రహిస్తుందని అనుకుంటున్నాను” అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. “ఒకవేళ, చైనా ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నా.. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారికి తెలియదని” ఎద్దేవా చేశారు. అంతేకాదు, “చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు గర్వం ఎక్కువనీ.. అయితే, త్వరలోనే వారు చేసింది ఏంటో వారికే తెలుస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్‌ని సుంకాలు ఆపమని పెరిగిన ఒత్తిడి
నిజానికి, చాలా రోజులుగా, ట్రంప్ సొంత పార్టీలో రిపబ్లికన్లు, అమెరికాలోని ఆర్థిక నిపుణులు, వ్యాపార కార్యనిర్వాహకులు అంతా కలిసి, ట్రంప్‌ని సుంకాలు ఆపమని పట్టుబడుతున్నారు. లేకపోతే, ప్రపంచంలో పెద్ద వాణిజ్య యుద్ధం మొదలౌతుందని హెచ్చరించారు. ఇప్పటికే.. ప్రపంచ మార్కెట్ మాంద్యానికి దారితీసిందనే సూచనలు కూడా వచ్చాయి. అయితే, ట్రంప్ మాత్రం “నా విధానాలు ఎప్పటికీ మారవు” అని చెబుతూనే రోజులు గడిపారు. ఇక, ఏప్రిల్ 9 నాటికి, సుంకాలన్నీ అమలులోకి రావడంతో… సుంకాలను వెనక్కి తీసుకోవాలని ట్రంప్‌ను ఒప్పించే ప్రచారం కొండెక్కింది.
మార్కెట్ పరిణామాలపై ట్రెజనీ డిపార్ట్ మెంట్‌లో ఆందోళన
ఇక, ఈలోపే.. బాండ్ మార్కెట్‌లో పరిణామాలపై అమెరికన్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో ఆందోళనలు పెరిగాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్.. ప్రెసిడెంట్ ట్రంప్‌కు పరిస్థితులన్నీ వివరిస్తూ.. అమెరికా ట్రెజరీ మార్కెట్లో పెరుగుతున్న అమ్మకాలపై క్లారిటీ ఇవ్వడం.. దీనికి తోడు.. ట్రంప్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్న ఎలన్ మస్క్ కూడా చైనాపై దూకుడు తగ్గించమని సలహా ఇవ్వడం వంటి పరిణామాలతో డొనాల్డ్ ట్రంప్ కాస్త డౌన్ అయినట్లు నివేదికలు వెల్లడించాయి.
Also read: రూల్స్ బ్రేక్..! గాంధీభవన్ వైపు చూడని మంత్రులు..
ట్రంప్ తీరులో పాజ్ అనేది ఒక వ్యూహాత్మక అడుగు
అయితే, ట్రంప్ తీరులో పాజ్ అనేది ఒక వ్యూహాత్మక అడుగుగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. అమెరికా వేసిన సుంకాలపై 90 రోజుల పాజ్ ప్రకటించిన తర్వాత… ట్రంప్ విలేకరులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ నిర్ణయం ఒక మ్యాప్-అవుట్ వ్యూహం కంటే భిన్నమైనదనీ.. ఇప్పుడైనా ఏదైనా మార్పు జరుగుతుందనే ఒక చిన్న ఆశతో చేసిందని” అన్నారు. బాండ్ మార్కెట్ గురించి కూడా స్పందించిన ట్రంప్.. ప్రస్తుతం బాండ్ మార్కెట్ బానే ఉంది కానీ.. ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారని గమనించినట్లు చెప్పారు. అయితే, ప్రజలు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని కూడా భరోసా ఇచ్చారు. మరోవైపు.. కొత్త సుంకాల్లో ఈ తాత్కాలిక బ్రేక్ తర్వాత.. ఏప్రిల్ 9న వాల్ స్ట్రీట్ స్టాక్‌లు దూసుకుపోయాయి.
ట్రంప్ పాజ్ ప్రకటన వెలువడిన క్షణాల్లోనే..
పెరుగుతున్న మాంద్యం ఆందోళనల మధ్య రోజుల తరబడి నష్టాలతో కుప్పకూలిన ఈక్విటీ.. మార్కెట్‌ను కొంత మేరకు పైకిలేపింది. ట్రంప్ పాజ్ ప్రకటన వెలువడిన క్షణాల్లోనే.. డౌ ఇండెక్స్ దాదాపు 2 వేల 500 పాయింట్లు పెరిగి సెషన్‌లో దాదాపు 8% లాభాలను చూసింది. టెక్-రిచ్ నాస్‌డాక్ 12.2 శాతం పెరిగి 24 సంవత్సరాల్లో అత్యుత్తమ రోజును నమోదు చేసింది. అలాగే, S&P 500 6.0 శాతం పెరిగి, 5 వేల 281.44 పాయింట్లకు చేరుకుంది. చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి. డాలర్ కూడా బలపడింది.