BigTV English

Trump vs Xi Jinping: ట్రంప్ దెబ్బకు వెనక్కి తగ్గిన డ్రాగన్.. ఇండియానే దిక్కా!

Trump vs Xi Jinping: ట్రంప్ దెబ్బకు వెనక్కి తగ్గిన డ్రాగన్.. ఇండియానే దిక్కా!

Trump vs Xi Jinping: అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఇదీ చైనా నైజం. జిన్ పింగ్ స్ట్రాటజీ. అమెరికాతో సుంకాల వార్ ముదరడం, ట్రంప్ తో సంబంధాలు బెడిసికొట్టడంతో పైకి తమకు ఎఫెక్టేమీ లేదని చెబుతూనే జిన్ పింగ్ ఆ వాణిజ్య నష్టాన్ని తగ్గించుకునేందుకు పెద్దే స్కెచ్చే వేశారు. ఆసియా దేశాలన్నీ ఒక ఫ్యామిలీలా ఉందామని, కలిసి తిరుగుదామని, కలిసి నడుద్దామని ఇలా రకరకాలుగా బుజ్జగింపు ప్రణాళికలు రెడీ చేశారు. నిజంగా జిన్ పింగ్ కు తోటి ఆసియా దేశాల మీద ప్రేమ ఉందా? లేదంటే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ లో నష్టాలను తగ్గించుకునే యత్నమా?


మళ్లీ కొత్తగా డ్రామాలు మొదలు పెట్టిన డ్రాగన్

ఈ ప్రపంచంలో చైనాను సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఆ దేశంతో కనెక్షన్ కరెక్ట్ గా ఉంటుంది. లేకపోతే పెద్ద షాక్ తప్పదు. ఇది చాలా మందికి తెలుసు. కానీ తెలియనట్లు ఉంటారు. ప్రస్తుతం జిన్ పింగ్ కు పెద్ద సమస్యే వచ్చి పడింది. అంత ఈజీగా ఏ దేశానికి వెళ్లని జిన్ పింగ్.. ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, మలేసియా, కంబోడియాలకు వెళ్లొచ్చారు. కలిసి నడుద్దామన్నారు. పరస్పరం సహకరించుకుందామన్నారు. ఆసియా అంటే ఒక ఫ్యామిలీగా ఉందామన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా జిన్ పింగ్ నోటి నుంచి ప్రేమగా వచ్చిన ఈ మాటలు విన్నామా? కానీ ఇప్పుడు వినాల్సి వచ్చింది ఆసియా దేశాలు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం. ఓవైపు ట్రంప్ సుంకాలతో చైనా విలవిలలాడుతోంది. తమకేమీ నష్టం లేదని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల చాలా టెన్షన్ పట్టుకుంది డ్రాగన్ కంట్రీకి. అందుకే ఆసియా దేశాలతో కుటుంబ కథా చిత్రానికి జిన్ పింగ్ ప్లాన్ చేశారంటున్నారు.


చైనా నుంచి అప్పులు తీసుకున్న దేశాలకు చుక్కలే

చైనాను అంత ఈజీగా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. చైనా ఏ పని చేసినా.. ఇతరుల కోసం అసలే చేయదు. అందులో తన ప్రయోజనాలు ఫస్ట్ చూసుకుని, వర్కవుట్ అయితేనే చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు చైనా అప్పులు ఇస్తుంటుంది. శ్రీలంక అయినా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా.. అప్పులు పుచ్చుకుంటాయి. అయితే భారీగా వడ్డీలతో ఆ దేశాల నడ్డి విరుస్తారు జిన్ పింగ్. అంతటితో ఆగరు.. ఏ దేశమైనా అసలు వడ్డీ కట్టకుండా చేతులెత్తేస్తే ముందుగానే పోర్టులు, ఇతర ఆస్తులు రాయించుకుంటారు. వాటిని స్వాధీనం చేసుకుంటారు కూడా. శ్రీలంకలో హంబన్ టోట పోర్టును ఇలాగే స్వాధీనం చేసుకుంది. రుణాల ఉచ్చులో బిగుసుకునేలా చేస్తుంది.

2022లో శ్రీలంకకు రూ.400 కోట్ల డాలర్లు సహాయం

భారీ వడ్డీలు కట్టలేం మహాప్రభో అని ప్రాధేయపడినా చైనా వినదు. దయాదాక్షిణ్యాలు అసలే లేవు. అదే మన దేశం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. ఉదారంగా రుణాలు ఇస్తుంటుంది. ఈ విషయం శ్రీలంకకు బాగా లేట్ గా అర్థమైంది. ఎందుకంటే లేటెస్ట్ గా శ్రీలంక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ.. స్థానిక కరెన్సీలో 240 కోట్ల రూపాయలు అందిస్తామని, ప్రస్తుత రుణాలపై వడ్డీని తగ్గిస్తామని హామీ ఇచ్చి వచ్చారు. 2022లో శ్రీలంక చాలా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు చైనా చేతులెత్తేస్తే శ్రీలంకకు 400 కోట్ల డాలర్లను భారత్ సహాయం చేసింది. అప్పుడు చైనా నోటి నుంచి అయ్యో పాపం అన్న మాట వినిపించలేదు. ఇప్పుడు మాత్రం ఆసియాదేశాలన్నీ ఒక ఫ్యామిలీగా ఉందాం అన్న మాటలు వినిపిస్తున్నాయి. అవసరం చైనాదే తప్ప ఆసియా దేశాలది కాదు.

ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో రూట్ మార్చిన జిన్ పింగ్

ఇదంతా ఎందుకంటే ఇప్పుడు చైనా ఎత్తుకున్న కొత్త రాగమే. ఆసియా దేశాలన్నీ ఒక కుటుంబంగా ఉందామని జిన్ పింగ్ పిలుపునివ్వడం చుట్టూ అలర్ట్ అవ్వాల్సింది ఆసియా దేశాలే కాబట్టి. ఎందుకంటే చైనాకు ఇప్పుడు అవసరాలు పెరిగాయి. వాణిజ్య అవకాశాలు తగ్గాయి. సరుకులు అమ్ముకోవాలంటే ఆసియా దేశాలే దిక్కు అవుతున్నాయి. అందుకే జిన్ పింగ్ నోటి నుంచి ఇలాంటి ప్రేమానుబంధాల మాటలు వినిపిస్తున్నాయి. చైనా ఎగుమతులపై ట్రంప్.. లేటెస్ట్ గా 145 శాతం టారిఫ్ లు విధించారు, ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనికి కౌంటర్ గా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలతో కౌంటర్ వార్ కు దిగింది. సో అసలు కథ ఇక్కడే మొదలైంది.

వియత్నాం, మలేసియా, కంబోడియాల్లో ఒప్పందాలు

వాణిజ్య యుద్ధం నేపథ్యంలో, జిన్‌పింగ్ ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, మలేసియా, కంబోడియాలకు వెళ్లారు. ఒప్పందాలు చేసుకున్నారు. సహాయాలు అందిస్తామన్నారు. విషయం ఏంటంటే.. ఒక దశలో ఆసియా దేశాలన్నిటిపైనా పెత్తనం చెలాయించాలని చూసింది ఈ చైనానే. అంతెందుకు సరిహద్దు దేశాలన్నిటితోనూ భూ తగాదాలు పెట్టుకుంది. మనదేశంతోనూ కయ్యానికి కాలు దువ్వింది. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో గేమ్ నడిపిస్తోంది. మన శత్రువైన పాకిస్తాన్ తో జట్టుకట్టి మనదేశానికి వ్యతిరేకంగా చాలా స్కెచ్చులు వేశారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నారు. భారత్ పైకి చాలా దేశాలను ఉసిగొల్పారు. ఇప్పుడు మాత్రం ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఆసియా ఖండం ఒక ఫ్యామిలీగా ఉందామంటున్నారు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు

జిన్‌పింగ్ తాజా విదేశీ పర్యటనల్లో ఏషియా ఫ్యామిలీ అనే భావనను ప్రచారం చేశారు. ట్రంప్ ఏకపక్ష బెదిరింపుకు వ్యతిరేకంగా ఆసియా దేశాలన్నీ ఒక్కటిగా నిలబడాలని పిలుపునిస్తున్నారు జిన్ పింగ్. ఇన్నాళ్లకు వన్ ఫ్యామిలీ గుర్తుకొచ్చిందా అన్న చర్చ ఆసియా దేశాల్లో జరుగుతోంది. సో ఎపిసోడ్ చెప్పేదేమిటంటే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని వ్యవస్థలు గుప్పిట్లో ఉండవు. ఎల్లకాలం ఆధిపత్యం నడవదు. కింద పడాల్సిందే.. కిందికి దిగి రావాల్సిందే అన్నది కాలమే రుజువు చేసింది. ఇది చైనా విషయంలో నిజమైంది.

వియత్నాంతో 40కి పైగా ఒప్పందాలు

అమెరికా సుంకాల ఎఫెక్ట్ తో చైనా డంప్ ను దిగుమతి చేసుకునేందుకు ఆసియా దేశాలు సిద్ధంగా ఉన్నాయా అంటే కష్టమే అన్న సమాధానమే వస్తోంది. అయితే జిన్ పింగ్ మాత్రం లేటెస్ట్ గా వియత్నాం, మలేసియా, కంబోడియాలకు వెళ్లొచ్చారు. ఈ దేశాలతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. వియత్నాంతో 40కి పైగా ఒప్పందాలు, మలేసియాతో 31 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, రైల్వే అభివృద్ధి, సప్లై చైన్స్ చుట్టూ ఇవి జరిగాయి. వియత్నాం అయితే.. ఆగ్నేయాసియాలో చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా వియత్నాంలో 8.3 బిలియన్ డాలర్ల రైల్వే ప్రాజెక్టు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణాలు అందిస్తోంది. ఇలాంటి పెట్టుబడులతో ఆసియా దేశాలను చైనా ఆర్థిక వ్యవస్థతో మరింత దగ్గరగా లింకప్ చేసుకునే ప్లాన్ లో జిన్ పింగ్ ఉన్నారు.

చైనా నమ్మకమైన భాగస్వామి అంటూ ప్రచారం

జిన్‌పింగ్ తన పర్యటనతో చైనాను ఒక స్థిరమైన నమ్మకమైన భాగస్వామిగా ట్యూన్ చేస్తూ, ట్రంప్ అనిశ్చిత విధానాలకు వ్యతిరేక మైండ్ సెట్ పెంచుతున్నారు. అందులో భాగంగానే మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అయితే చైనాను బలమైన, నమ్మకమైన భాగస్వామిగా చెప్పుకొచ్చారు. జిన్ పింగ్ ఆగ్నేయాసియా పర్యటనను ట్రంప్ ఓ కంట కనిపెట్టారు. అమెరికాకు హాని చేయడానికే వెళ్లారన్నారు. వారంతా అమెరికాను ఎలా దెబ్బతీయాలా అని చర్చిస్తున్నారన్నారు. అయితే ట్రంప్ అంటున్నదేంటంటే.. చైనా లేదా వియత్నాంను నిందించడం అక్కడ మెయిన్ కాన్సెప్ట్ కాదు… పొలిటికల్ గేమ్ అని అనుకుంటున్నారు.

వియత్నాం అమెరికాకు 31.4 బి. డాలర్ల ఎగుమతులు

ట్రంప్ వాణిజ్య విధానం ఆసియా దేశాలను కూడా టార్గెట్ గా చేసుకున్నాయి. దీంతో ఆ దేశాలు ఆలోచనలో పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్.. వియత్నాంపై 46 శాతం టారిఫ్ లు వేశారు. అయితే ప్రస్తుతానికి 90 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ అనిశ్చితి ఆసియా దేశాలను చైనాతో సహకారాన్ని పెంచుకోవడానికైతే ప్రోత్సహించేలా కనిపిస్తోంది. వియత్నాం, మలేసియా, కంబోడియా వంటి దేశాలు చైనాతో ఆర్థిక సహకారాన్ని స్వాగతిస్తున్నాయి. అదే సమయంలో అమెరికాతోనూ సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నాయి. ఎందుకంటే ఆ ప్రయారిటీ అలా ఉంది. వియత్నాం అమెరికాకు 31.4 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల ఎగుమతులు చేస్తోంది. ట్రంప్ సుంకాలను తగ్గించడానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి దిగుమతులను కొనసాగిస్తోంది, ఇది చైనాతో వాణిజ్య ఒప్పందాలను కోరుకుంటోంది. సో ఆసియా దేశాలు అటు అమెరికా, ఇటు చైనా మధ్య బ్యాలెన్సింగ్ గా వ్యవహారం నడపాలనుకుంటున్నాయి.

చైనా ప్రొడక్ట్స్ డంప్ సమస్య ఉంటుందా?

మరోవైపు అమెరికా మార్కెట్‌ల నుంచి బ్యాన్ అయిన చైనా ప్రొడక్ట్స్ ఆసియా దేశాల్లో డంపింగ్‌కు దారితీస్తాయన్న ఆందోళనలు ఆసియా ఉన్నాయి. ఇది లోకల్ ఇండస్ట్రీలను దెబ్బతీస్తుందనుకుంటున్నారు. చైనా ఆర్థిక సహాయం మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఆసియా దేశాలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కంబోడియా వంటి దేశమైతే చైనాను మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాయి. అయితే కథ అలాగే నడిస్తే బాగుంటుంది. కానీ అమెరికాతో టారిఫ్ వార్ క్లోజ్ అయితే.. ఈ దేశాల పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. చైనాను పూర్తిగా నమ్మితే ఏమవుతుందో గ్రహించలేకపోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది.

నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాల్లో జిన్ పింగ్

ట్రంప్ సుంకాలతో చైనా ఎగుమతులపై ఎఫెక్ట్ పడింది. దీంతో జిన్‌పింగ్ ఆసియా మార్కెట్‌లను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక నష్టాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం చైనాకు కీలకంగా మారబోతోందంటున్నారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం అమెరికా లీడర్ షిప్ ను బలహీనపరుస్తోందని చైనా భావిస్తోంది. జిన్‌పింగ్ ఈ అవకాశాన్ని ఉపయోగించి చైనాను ఒక బాధ్యతాయుతమైన సూపర్‌పవర్ గా ట్యూన్ చేసుకుంటున్నారు. అయితే ఇందులో సవాళ్లు కూడా చాలానే ఉన్నాయి. సౌత్ చైనా సీ లో చైనా దూకుడు చర్యలు వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. ఇది చైనాపై నమ్మకాన్ని దెబ్బతీయడం ఖాయమే. ఎందుకంటే ఒకవైపు వన్ ఫ్యామిలీ అంటూనే ఇంకోవైపు ఇలాంటి చర్యలతో నమ్మకం అస్సలు ఏర్పడదు.

ఓవైపు స్నేహహస్తం, ఇంకోవైపు సౌత్ చైనా సీలో దూకుడు

అంతే కాదు చైనాపై అతిగా ఆధారపడితే మొదటికే మోసం అనుకుంటున్న దేశాలూ ఉన్నాయి. చైనా ఆర్థిక ఆధిపత్యం, రుణ ఆధారిత ఒప్పందాలపై ఆందోళనగా ఉన్నాయి. ఎందుకంటే అవి రాబోయే రోజుల్లో అప్పుల ఊబిగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. సో ఇప్పుడు జిన్ పింగ్ ఆసియా దేశాల పర్యటనలు ట్రంప్ వాణిజ్య విధానాలను ఒంటరిగా చేయడానికి ఒక ప్రయత్నంగా చూడొచ్చు. ట్రంప్ టారిఫ్ లు ఆసియా దేశాలను కూడా టార్గెట్ చేసుకోవడం వల్ల చైనాతో సహకారాన్ని ఒక ఆల్టర్నేట్ గా చూస్తున్నాయి. ఇక్కడ ఎవరూ తగ్గడం లేదు. అందరూ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారంతే.

వన్ ఫ్యామిలీ నినాదం వెనుక ఆర్థిక స్థిరత్వం కాపాడుకునే యత్నం

ఓవరాల్ గా చూస్తే.. ట్రంప్ ఒత్తిడికి లొంగడం కంటే ఎకానమీ లాసెస్ ను భరించడానికి జిన్ పింగ్ సిద్ధంగా ఉన్నారు. అదే తరహాలో ప్రకటనలు చేస్తున్నారు. కౌంటర్ టారిఫ్ లు విధిస్తున్నారు. మధ్యలో కొంతలో కొంత నష్టాన్ని పూడ్చుకునేందుకు చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటున్నారంతే. ఆసియా దేశాలతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునే ప్రయత్నమే ఇది. అయితే చైనా తీరుపై నమ్మకం కలగాలి కదా. అందుకే భారత్ తో సహా మిగితా ఆసియా దేశాలు చైనా, అమెరికా ఈ రెండు దేశాల మధ్య బ్యాలెన్స్ ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ సొంత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహారం నడిపిస్తున్నాయి. అయితే ట్రంప్ ఏ రోజు ఏం మాట్లాడుతున్నారో తెలియకపోవడం, అనిశ్చిత విధానాలు ఫాలో అవుతుండడం చైనాకు ఆసియాలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి కొంతలో కొంత గ్రౌండ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×