E-Paper
Advertisement

ట్రంప్ ‘షాడో వార్’.. గన్ వాడకుండానే గొంతు నులుముతున్న వైట్ హౌస్!

ట్రంప్ ‘షాడో వార్’.. గన్ వాడకుండానే గొంతు నులుముతున్న వైట్ హౌస్!
Advertisement

Donald Trump: ట్రంప్ లెక్కే వేరు. అవునంటే కాదని.. కాదంటే అవుననే రకం. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన రకం. అంతా సైలెంట్ గా ఉన్నప్పుడు హడావుడి.. అంతా హడావుడి ఉన్నప్పుడు సైలెంట్.. ఇదే ట్రంప్ స్టైల్. ఇదంతా ఇంట్రొడక్షన్ ఎందుకంటే.. ఇరాన్ పై యుద్ధం ఆపేసినట్లు తాజాగా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని యూఎస్ కాంగ్రెస్‌కు మే 1న వైట్ హౌజ్ అధికారికంగా తెలిపింది. అయితే, ఇది యుద్ధం పూర్తిగా సద్దుమణిగిందని కాదు, దీని వెనుక కీలకమైన చట్టపరమైన, రాజకీయ వ్యూహం ఉంది. ఇంకో దశలో తాము ఇరాన్ తో చేస్తున్నది అసలు యుద్ధమే కాదంటారు. ఒక చర్య.. రెండు ప్రతి చర్యలు అన్నట్లుగా వ్యవహారం ఉంటోంది.

అమెరికా యుద్ధ నిర్ణయాల్లో కాంగ్రెస్ పాత్ర ఏమిటి?

నిజానికి ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధమిది. ఇందులో ట్రంప్ మధ్యలో తలదూర్చారు. బయటి నుంచి సపోర్ట్ ఇవ్వడానికి బదులు డైరెక్ట్ గానే రంగంలోకి దిగారు. అమెరికాలో ట్విస్ట్ ఉంటుంది. యుద్ధం మొదలు పెడితే పెట్టామని అమెరికన్ కాంగ్రెస్ కు చెప్పాలి. అదే సమయంలో వార్ 2 నెలలు దాటితే అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకునే టైంలో డిబేట్ జరుగుతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుంది.

అధ్యక్షుడికి ఉన్న పరిమితులు

Advertisement

అయితే అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడు స్వయంగా సైనిక చర్యకు ఆదేశించవచ్చు. కానీ వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్షుడు సైన్యాన్ని మోహరించిన 48 గంటల్లోపు కాంగ్రెస్‌కు రిపోర్ట్ ఇవ్వాలి. కాంగ్రెస్ అధికారికంగా యుద్ధాన్ని ఆమోదించకపోతే, ఆ సైనిక చర్యను 60 రోజులకు మించి కొనసాగించకూడదు. మరో 30 రోజులు ఉపసంహరణ కోసం అదనంగా టైం ఇస్తారు. అంటే మొత్తం 90 రోజుల్లో దళాలు వెనక్కి రావాలి.

ఇరాన్ ముప్పు ఇంకా ఉందా?

నిజానికి ఇరాన్‌పై దాడులు ఫిబ్రవరి 28న మొదలయ్యాయ్. ఆ లెక్కన మే 1తో 60 రోజుల డెడ్ లైన్ ముగిసింది. ఏప్రిల్ 7 నుంచి ఇరాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతుండడంతో, యుద్ధ వాతావరణం ముగిసింది అని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు. వైట్‌హౌస్ పంపిన లేఖలో యుద్ధం ముగిసిందని చెప్పినప్పటికీ, గ్రౌండ్ లో మాత్రం పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా దళాలు యుద్ధ విమానాలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఇరాన్ నుంచి ప్రమాదం ఇంకా పొంచి ఉందని, అందుకే తమ దళాలు అక్కడ అలర్ట్ గా ఉంటాయని అధ్యక్షుడు ట్రంప్ మరో తెలివిన మాట మాట్లాడారు.

ట్రంప్ స్ట్రాటజీపై చర్చ

Advertisement

ఈ ప్రకటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్‌తో గొడవలను నివారించడం. యుద్ధంపై తనకున్న స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడం ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది. రిపబ్లికన్లలో కూడా యుద్ధంపై అసంతృప్తి పెరుగుతుండడంతో యుద్ధం ముగిసింది అని చెప్పడం ద్వారా ప్రస్తుతానికి ఆ ఒత్తిడిని తగ్గించుకోవడం. చెప్పాలంటే ఇది కేవలం టెక్నికల్ ఎండ్ మాత్రమే. కాంగ్రెస్ అనుమతి పొందకుండానే సైనిక చర్యను కొనసాగించేందుకు లేదా హోల్డ్‌లో పెట్టేందుకు వైట్‌హౌస్ ఈ వ్యూహం అమలు చేసిందంటున్నారు. భవిష్యత్ లో శాంతి చర్చలు విఫలమైతే యుద్ధం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.

కాంగ్రెస్ vs అధ్యక్షుడు

నిజానికి కాంగ్రెస్ కు యుద్ధం ముగియలేదు అని చెప్పి ఉంటే గనక పరిస్థితి మరో ఉండేది. యుద్ధ కొనసాగింపుపై కాంగ్రెస్ లో చర్చ, ఓటింగ్ రెండూ జరిగి ఉండేవి. అధ్యక్షుడు యుద్ధాన్ని కొనసాగించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని కాంగ్రెస్‌కు పంపిస్తారు. దీనిపై సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ యుద్ధానికి వ్యతిరేకంగా ఉంటే, యుద్ధానికి అవసరమైన నిధులను నిలిపివేసే అధికారం వారికి ఉంటుంది. ఇది అధ్యక్షుడికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేలా ట్రంప్ వ్యూహాత్మకంగా యుద్ధం ముగిసిందని చెప్పారంటున్నారు.

ట్రంప్ స్టాండ్‌పై రాజకీయ దుమారం

ఇరాన్‌పై తాము చేస్తున్నది యుద్ధమే కాదంటున్నారు అధ్యక్షుడు ట్రంప్. యుద్ధంపై 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్ట విరుద్ధమన్నది ట్రంప్ వాదన. సెనెట్‌లో విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌.. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగలేదన్నారు. అందుకే 1973 నాటి చట్టానికి అనుగుణంగా ఆ యుద్ధానికి కాంగ్రెస్‌ అనుమతి పొందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 60 రోజుల్లోగా చట్టసభ ఆమోదం పొందాలన్న నిబంధన ప్రస్తుతానికి వర్తించదన్నారు. ప్రతిపక్ష డెమోక్రాట్లు 60 రోజుల అనుమతి వాదన చేస్తున్నారని.. వాళ్లసలు దేశ భక్తులే కాదని ట్రంప్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

కాంగ్రెస్ ప్రశ్నలను తప్పించుకోవడమే ట్రంప్ ప్లానా?

ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రకటన వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. యుద్ధం కోసం అనుమతి కోరితే కాంగ్రెస్‌లో విపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం ఉండదు. ఇక వార్‌ కోసం వినియోగించే నిధుల కోసం కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మరోవైపు భవిష్యత్తులో ఇరాన్ విషయంలో మళ్లీ అవసరమైతే తక్షణ నిర్ణయాలు తీసుకునేలా తమ చేతుల్లో అధికారం పెట్టుకునేందుకే ట్రంప్ ఈ వ్యూహాత్మక అడుగు వేశారంటున్నారు. అసలు యుద్ధమే లేనప్పుడు దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదనేది వైట్‌హౌస్ వాదన. కానీ.. క్షేత్రస్థాయిలో ఆంక్షలు, దిగ్బంధం కొనసాగిస్తున్నారు. దీనినే ప్రతిపక్ష డెమొక్రాట్లు తప్పుబడుతున్నారు. యుద్ధం ముగిసిందని చెబుతూనే సైన్యాన్ని ఎందుకు వెనక్కి పిలవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

ట్రంప్ చర్య రాజ్యాంగ విరుద్ధమా..?

ఈ చర్యను డెమొక్రాట్లు రాజ్యాంగ విరుద్ధమంటున్నారు. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, ట్రంప్ ఇలా యుద్ధం ముగిసింది అని అబద్ధం చెబుతూ కాంగ్రెస్ అధికారాలను లాక్కుంటున్నారని వారు వాదిస్తున్నారు. యుద్ధం ఎక్కడ ముగిసిందని అడుగుతున్నారు. అక్కడ బాంబులు పడుతూనే ఉన్నాయి, మన నౌకలు ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తూనే ఉన్నాయని, అలాంటప్పుడు యుద్ధం ముగిసిందని ఎలా చెబుతారంటున్నారు. ఇది అమెరికన్లను, కాంగ్రెస్‌ను తప్పుదోవ పట్టించడమేనంటున్నారు. ట్రంప్ చర్యకు ప్రతిచర్యగా డెమొక్రాట్లు తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. పవర్ ఆఫ్ పర్స్ ను వాడాలని చూస్తున్నారు.

ఇరాన్ ఆపరేషన్లకు నిధులు కట్?

అంటే ఇరాన్ తీరంలో ఉన్న నౌకలకు లేదా అక్కడ జరుగుతున్న ఆపరేషన్లకు పైసా కూడా ఇవ్వకూడదని వారు పట్టుబట్టే అవకాశం ఉంది. అంతే కాదు కాంగ్రెస్ కు వైట్‌హౌస్ పంపిన లేఖపై చట్టపరమైన పోరాటం చేయాలని వారు భావిస్తున్నారు. ట్రంప్ ఇలాంటి నిర్ణయాల ద్వారా అమెరికాను మరో సుదీర్ఘమైన, అర్థం లేని యుద్ధంలోకి నెడుతున్నారని విమర్శిస్తున్నారు. ట్రంప్ 60 రోజుల గడువును తప్పించుకోవడానికి ఆడిన ఈ మైండ్ గేమ్ ను తాము ఒప్పుకోబోమని, త్వరలోనే కాంగ్రెస్ దీనిపై ఒక ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడుతుందని డెమొక్రాట్ ప్రతినిధులు అంటున్నారు. దీంతో ఇరాన్ తో యుద్ధంపై అమెరికాలోనే రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నాయ్.

ట్రంప్ విదేశీ వ్యూహం

మ్యాడ్ మ్యాన్ థియరీని ట్రంప్ ప్రభుత్వం ఫాలో అవుతోంది.. ట్రంప్ విదేశీ విధానంలో ఇది ఒక కీలక భాగం. శత్రువుకు నెక్ట్స్ స్టెప్ ఏంటో అర్థం కాకుండా చేయడం ఇందులో లాజిక్.. ఇరాన్ చర్చలకు వస్తే తాను శాంతి కోరుకుంటున్నానని చెబుతారు. ఒకవేళ చర్చలు బెడిసికొడితే నేను ఎప్పుడైనా విరుచుకుపడతాను అనే సిగ్నల్స్ ఇస్తారు. యుద్ధం ముగిసిందని ప్రకటిస్తూనే మా బటన్ ఎప్పుడూ రెడీగా ఉంటుందన్న ధోరణి ఇరాన్‌ను డిఫెన్స్ లో పడేస్తోంది.

ట్రంప్ స్టైల్ పై చర్చ

ఈ సిద్ధాంతం మొదట రిచర్డ్ నిక్సన్ కాలంనాటిది. యుద్ధంలో లేదా చర్చల్లో తనను తాను పిచ్చి వాడిలా, కోపిష్టిలా.. అనూహ్యంగా, ఏమైనా చేసేస్తానని చూపించి, అవసరమైతే అణు యుద్ధానికి కూడా వెనకాడనని చెప్పి, శత్రువును భయపెట్టి రాజీకి లాగడం ఈ మ్యాడ్ మ్యాన్ థియరీ ఉద్దేశం. తాను పిచ్చోడిని, ఏమైనా చేయగలను అనే అభిప్రాయం కలిగించి ఒత్తిడి పెంచడం. వియత్నామ్ యుద్ధంలో నిక్సన్ ఈ తంత్రం వాడాడు. ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం ప్రారంభించడానికి ముందు ఆ తర్వాత ట్రంప్ ఇచ్చిన బెదిరింపులు, డెడ్‌లైన్లు కూడా ఇలాగే ఉన్నాయ్. ఇరాన్ సివిలైజేషన్ అంతం చేస్తాం, న్యూక్లియర్ సైట్లు పూర్తిగా ధ్వంసం చేస్తాం వంటి తీవ్రమైన ప్రకటనలు ఈ థియరీ కిందికే వస్తాయ్. 60 రోజుల గడువు ముగియగానే యుద్ధం ముగిసింది అని ప్రకటించడం ఒక ఎత్తుగడ. కానీ బలగాలను అక్కడే ఉంచి తాను ఎప్పుడైనా దాడి చేయగలనని అనే సిగ్నల్స్ ఇవ్వడం మరొక ఎత్తుగడ. సో ఇరాన్ తో యుద్ధంలో ముందుకా వెనక్కా అంటే ఏదీ క్లారిటీ ఉండదన్న మాట.

ట్రంప్ డబుల్ గేమ్

నిజానికి అమెరికా ప్రజలు సుదీర్ఘ యుద్ధాలను ఇష్టపడరు. అందుకే ట్రంప్ ఇక్కడ మైండ్ గేమ్ ప్లే చేశారంటారు. తాను మరో యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పుకోవడం దీని ఉద్దేశంగా చెబుతున్నారు. మరోవైపు ఇరాన్ నుండి ముప్పు ఇంకా ఉందని చెబుతూ పశ్చిమాసియాలో బలగాలను అలాగే ఉంచుతున్నారు. ఇది అటు యుద్ధ వ్యతిరేకులను, ఇటు జాతీయవాదులను ఇద్దరినీ సంతృప్తి పరిచే ప్రయత్నమిది. ఇరాన్‌ పై అన్ని వైపు నుంచి ఒత్తిడి తీసుకురావడం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టి, వారు తమ షరతులకు లొంగేలా చేయడం ట్రంప్ అసలు ప్లాన్. అందులో భాగంగానే తాజాగా ఇరాన్ క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్ చేయించారు.

వైట్ హౌస్ కొత్త గేమ్ ప్లాన్..

యుద్ధం ముగిసిందని చెప్పడం ద్వారా ఇరాన్‌కు రావాల్సిన అంతర్జాతీయ మద్దతును లేదా సానుభూతిని తగ్గించడం. అదే సమయంలో ఆంక్షలు కొనసాగిస్తూ ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడం. సో ట్రంప్ చేస్తున్నది యుద్ధ విరమణ కాదు, యుద్ధ రూపాన్ని మారుస్తున్నారంతే. సైనికులతో చేసే ప్రత్యక్ష యుద్ధం కంటే, చట్టపరమైన, ఆర్థిక వ్యూహాలతో చేసే యుద్ధం ఇది. ఇరాన్‌ను చర్చల టేబుల్ దగ్గరికి రప్పించే వరకు ఈ దాగుడుమూతలు కొనసాగే అవకాశం ఉంది.

ట్రంప్‌పై గ్లోబల్ వార్నింగ్స్

మరోవైపు ట్రంప్ పై అంతర్జాతీయ ఒత్తిడి కూడా పని చేస్తోంది. క్రూడ్ ధరలు పెరుగుతున్నాయ్. అంతర్జాతీయంగా సమస్యలు ఎక్కువవుతున్నాయ్. ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయ్. వీటిని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే వార్నింగ్ కూడా ఇచ్చారు. టెహ్రాన్‌పై మళ్లీ సైనిక చర్యకు దిగితే.. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు తప్పవన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ట్రంప్, పుతిన్ ఇద్దరూ ఇటీవలే 90 నిమిషాలకు పైగా ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్‌ నిర్ణయాన్ని పుతిన్‌ స్వాగతించారు. ఈ చర్యతో దౌత్య చర్చలకు రూట్ క్లియర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అమెరికా- ఇజ్రాయెల్‌ మరోసారి ఇరాన్‌ పై దాడులకు దిగితే.. పశ్చిమాసియాతో సహా మొత్తం ప్రపంచదేశాలన్నీ చాలా ఇబ్బందులు పడుతాయని పుతిన్ హెచ్చరించారు.

డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

ఈ ఫోన్ కాల్ లో ఇరాన్‌ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి మాట్లాడుకున్నారు. ఈ నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ చెప్పినట్లు ట్రంప్ అన్నారు. ఇరాన్ దగ్గర ఉన్న సుమారు 970 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియంను రష్యాకు తరలించి, సమస్యను పరిష్కరించడంలో సాయం చేస్తానని పుతిన్ ఆఫర్ ఇచ్చారు. అమెరికా ప్రకటనపై ఇరాన్ సానుకూలంగా స్పందిస్తూనే, తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరే అవకాశం ఉంది. గతంలో జరిగిన దాడుల నేపథ్యంలో ఇరాన్ అంత ఈజీగా అమెరికాను నమ్ముతుందా లేదా అన్నది చూడాలి.

2026 నోబెల్ రేసులో ట్రంప్ పేరు?

యుద్ధం ముగిసింది అని చెప్పుకోవడం ద్వారా ట్రంప్ మరో బెనిఫిట్ ఆశిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే నోబెల్‌ శాంతి బహుమతి- 2026 కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అందరి దృష్టి మళ్లీ ట్రంప్‌పై పడింది. ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతి కోసం చాలా ఆశపడుతున్నారు ట్రంప్. శాంతి బహుమతి కోసం నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీకి 287 నామినేషన్లు రాగా.. అందులో ట్రంప్‌ పేరు కూడా ఉందంటున్నారు.

ట్రంప్‌కు గుడ్ న్యూస్ వస్తుందా..?

208 మంది వ్యక్తులు, 79 సంస్థల నుంచి నామినేషన్లు వచ్చినట్లు నోబెల్‌ కమిటీ తెలిపింది. ఆయనతో పాటు జెలెన్‌స్కీ, గ్రెటా థన్‌బర్గ్‌, సహా మరికొంతమంది పేర్లు కూడా ఇందులో ఉన్నాయంటున్నారు. నామినేషన్లకు సంబంధించిన పేర్లను కమిటీ అత్యంత రహస్యంగా ఉంచుతారు. 8 యుద్ధాలు ఆపానని ప్రకటించుకుంటూ.. నోబెల్‌ శాంతి బహుమతిపై గతేడాది ట్రంప్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు దక్కడంతో ట్రంప్‌ కు నిరాశ తప్పలేదు. 2026 నోబెల్‌ శాంతి బహుమతి అక్టోబరు 9న ప్రకటిస్తారు. మరి ఇరాన్ తో యుద్ధం ముగిసిందన్న ప్రకటన ట్రంప్ కు కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.

Also Read:కాంగ్రెస్ పని ఖతం.. రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే దిక్కులేదు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×