Donald Trump: అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. ప్రపంచ దేశాలను టెన్షన్‌లో పడేశారు. ముందుగా, అమెరికాలోని వలసదారులపై దృష్టి పెట్టారు. వైట్ హౌస్‌కు వెళ్లిన మొదటి రోజే ఇల్లీగల్ మైగ్రెంట్లను తరిమేసే, సంచలన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌పై మొదటి సంతకం చేశారు. ఈ ఆర్డర్‌తో అమెరికా పౌరసత్వం కోసం ఆరాటపడే చాలా మందికి పెద్ద షాక్ తగిలింది. సంవత్సరాలుగా కనిని అమెరికన్ డ్రీమ్స్ అన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. అంతేకాదు, ట్రంప్ 2.0 మొదటి రోజే.. ప్రపంచ దేశాలకు ట్యాక్స్ వార్నింగ్ ఇచ్చారు. దీనితో, భారత్ లాంటి దేశాలకు భారం కానుంది. అసలు ట్రంప్ పెట్టిన టెన్షన్ ఏంటీ..? ట్రంప్ ఎఫెక్ట్ భారతీయులపై ఎలా పడనుంది..?
బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్
నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత వైట్ హౌస్‌ను తిరిగి దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్.. యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదికపై ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ.. సంచలన ప్రకటనలు చేశారు. పదివి చేపట్టిని మొదటి రోజే.. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లపై సంతకం చేసి, చాలా మందికి షాకిచ్చారు. వాటిలో ముఖ్యమైనది. ఒకటి బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేయడం. దీనితో.. అమెరికా పౌరులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ వచ్చే పౌరసత్వం రద్దవుతుంది. నిన్నటి వరకూ అమెరికాలో పుట్టిన వారికి ఆ దేశ పౌరసత్వం వచ్చేది.
అమెరికాలో జన్మించిన బిడ్డ పౌరసత్వం పొందాలంటే..
ఈ ఉత్తర్వు ప్రకారం, అమెరికాలో జన్మించిన బిడ్డ పౌరసత్వం పొందాలంటే, కనీసం ఒక పేరెంట్ అయినా అమెరికా సిటిజన్‌గా ఉండాలి. లేదంటే, చట్టబద్ధమైన శాశ్వత నివాసి.. అంటే, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి లేకపోతే.. అమెరికా సైన్యంలో సభ్యుడిగా అయినా ఉండాలి. అయితే, అమెరికాలోకి అక్రమ ప్రవేశాలను వెంటనే నిలిపివేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో, లక్షలాది మంది అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించే ప్రక్రియ ప్రారంభం కానుందని ట్రంప్, తన మొదటి ప్రసంగంలోనే స్పష్టం చేశారు.
యూఎస్ జన్మహక్కు పౌరసత్వం ప్రకారం..
అయితే, అసలు ఏంటీ బర్త్ రైట్ సిటిజన్‌షిప్..? యూఎస్ జన్మహక్కు పౌరసత్వం ప్రకారం, అమెరికన్ గడ్డపై జన్మించిన ఎవరికైనా సరే.. వారి తల్లిదండ్రుల పౌరసత్వం, వలస స్థితితో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధన 1868లో అమలులోకి వచ్చింది. దీనితో అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికన్ పౌరసత్వం వచ్చింది. అయితే, ఇప్పుడు, ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ప్రకారం అది పూర్తిగా రద్దయ్యింది.
భారత్, చైనాతో సహా అమెరికాకు అధిక స్థాయిలో వలసలు
అయితే, ట్రంప్, ఈ జన్మహక్కు పౌరసత్వాన్ని అంతం చేయాలనుకుంటున్నానని తన మొదటి పదవీ కాలం నుండీ స్పష్టంగా చెబుతూనే వచ్చారు. భారత్, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుండి అమెరికాకు అధిక స్థాయిలో వలసలు పెరిగాయి. వీరింతా కలిసి అమెరికా వ్యవస్థను దోపిడీ చేశారని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే, అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకముందే దీనిపై పని మొదలుపెట్టారు ట్రంప్. ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అక్రమ వలసలకు సంబంధించిన జాబితాను రూపొందించారు.
ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)
ఇటీవలే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్-ICE అమెరికాలోని అక్రమ వలసదారులు జాబితాను విడుదల చేసింది. అందులో 18 వేల మంది భారతీయులను గుర్తించారు. ICE గణాంకాల ప్రకారం, మొత్తం 14 లక్షల 40 వేల మందిలో 17 వేల 940 మంది భారతీయులను మొదటి విడతలో పంపించేయడానికి ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తుంది. లెక్కల ప్రకారం చూస్తే.. గత మూడేళ్ళలో, ICE ప్రతి సంవత్సరం సగటున 90 వేల మంది భారతీయ పౌరులను చట్టవిరుద్ధంగా యూఎస్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించింది.
ఎక్కువగా పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలవారు
అయితే, దశల వారీగా వీరందర్నీ పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ బహిష్కరణను ఎదుర్కొంటున్న అన్‌రిజిస్టర్డ్ భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వచ్చినట్లు స్థానిక ఇమ్మిగ్రేషన్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ చర్యతో అమెరికాలో ఉన్న చాలా మంది తెలుగు వారికి టెన్షన్ పట్టుకుంది.
ట్రంప్ ఆర్డర్ అమలులో కొన్ని చట్టపరమైన అడ్డంకులు
అయితే, ఇక్కడ చిన్న ట్విస్ట్ కూడా లేకపోలేదు. ట్రంప్, ఈ ఉత్తర్వుపై సంతకం చేసినప్పటికీ, దాని అమలులో కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి. అంతేకాదు, యూఎస్ రాజ్యాంగంలోని ఈ నిబంధనలను మార్చడానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం. ఈ ప్రక్రియ కూడా చాలా సుదీర్ఘమైంది, సవాలుతో కూడుకున్నది. ఒక విధంగా ఇది చాలా కష్టం కూడా. ఎందుకంటే, అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్, సెనేట్.. రెండింటిలోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ ఓటు అవసరం అవుతుంది.
హౌస్‌లో డెమొక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు
దీని తర్వాత రాష్ట్ర శాసనసభలల్లో కూడా మూడింట మూడు వంతుల ఆమోదం అవసరం. అయితే.. కొత్త సెనేట్‌లో, ప్రస్తుతం ప్రతిపక్ష డెమొక్రాట్లకు 47 స్థానాలు ఉండగా, ట్రంప్ పార్టీ అధికార రిపబ్లికన్లకు 53 స్థానాలు ఉన్నాయి. అలాగే, హౌస్‌లో చూస్తే.. డెమొక్రాట్లకు 215 స్థానాలు.. రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. కాబట్టి మెజారిటీ సాధించడం ట్రంప్ అనుకున్నంత సులువైతే కాదు.
1898లో యూఎస్ Vs వాంగ్ కిమ్ ఆర్క్ కేసు
చారిత్రాత్మకంగా చూసుకున్నప్పటికీ.. యూఎస్ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో జన్మహక్కు పౌరసత్వాన్ని సమర్థించింది. 1898లో యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ అనే సంచలన కేసులో.. అమెరికన్ పౌరులు కాని తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన బిడ్డను యూఎస్ పౌరుడని కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని బట్టి, ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా.. చాలా సవాళ్లు ఎదురవుతాయి. సరైనా సవరణ ప్రక్రియను అనుసరించకుండా రాజ్యాంగ హామీలను ఈ ఆర్డర్ అధిగమించలేని పరిస్థితి ఉంది.
పౌరులు కాని తల్లిదండ్రులకు జన్మించిన బిడ్డ యూఎస్ పౌరుడని తీర్పు
దీనికి, కాంగ్రెస్‌లో సూపర్ మెజారిటీ, రాష్ట్రాల్లో మూడింట రెండు వంతుల ఓటు అవసరం. అయితే, ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌పై సంతకం చేసిన వెంటనే.. వలసదారుల హక్కుల న్యాయవాదులు ఆయన నిర్ణయంపై కోర్డులో దావా వేశారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికా రాజ్యాంగ ఆదేశాలు, కాంగ్రెస్ ఉద్దేశం, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిందని దావాలో ఆరోపించారు.
2024 నాటికి 5.4 లక్షలకు పైగా భారతీయ అమెరికన్లు
ఏది ఏమైనప్పటికీ, ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. అమెరికాలో వేగంగా పెరుగుతున్న వలస జనాభాలో భారతీయ-అమెరికన్ సమాజం కూడా ఎక్కువగానే ఉంది. 2024 నాటికి, భారతీయ అమెరికన్లు 5.4 లక్షలకు పైగా ఉన్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్ జనాభాలో 1.47%గా ఉంది. అధికారిక డేటా ప్రకారం, దాదాపు మూడింట రెండు వంతుల మంది వలసదారుల్లో 34% మంది అమెరికాలో జన్మించిన వారు.
2/3 వలసదారుల్లో 34% మంది అమెరికాలో జన్మించిన వారు
ఒకవేళ, ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ప్రకారం ఈ విధానం మారితే.. తాత్కాలిక వర్క్ వీసాలు అంటే, H-1B వీసా వంటి వీసాలు, గ్రీన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారతీయ పౌరులకు జన్మించిన పిల్లలు ఇకపై అమెరికా పౌరసత్వం పొందలేరు. దీనితో, యూఎస్‌లోని భారతీయ వలసదారులకు జన్మించిన లక్షలాది మంది పిల్లలపై ప్రభావం పడనుంది. వీరింతా ఆటోమేటిక్ సిటిజన్‌షిప్‌ని కోల్పోతారు. ఇక, ఇప్పటికే చాలా కాలంగా గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో ఉన్న భారతీయ వలసదారులకు కార్డ్ పొందడం మరింత ఆలస్యం అవుతుంది.
భారీ స్థాయిలో కుటుంబ విభజనలకు కారణం
అయితే, ఈ ఆర్డర్ వల్ల అమెరికాలో జన్మించిన పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ లేకపోతే.. 21 ఏళ్లు నిండిన తర్వాత వారి తల్లిదండ్రులను అమెరికాకు తీసుకురావాలనే పిటిషన్‌ను ఇకపై వేయలేరు. ఇది భారీ స్థాయిలో కుటుంబ విభజనలకు కారణం అవుతుంది. అలాగే, ఈ విధానంతో “బర్త్ టూరిజం” కూడా పూర్తిగా తగ్గుతుంది. కొందరు, ప్రత్యేకంగా అమెరికా పౌరసత్వం కోసం అక్కడ పిల్లల్ని కనడానికే వెళ్తాలు.
ట్రంప్ విధానంతో “బర్త్ టూరిజం”పై భారీ ప్రభావం
ఇకపై, అలా ప్రయాణించే వారికి ఈ ఆర్డర్‌తో చెక్ పడిందనే చెప్పాలి. మరోవైపు, ఈ ఆర్డర్‌తో నాన్-ఇమ్మిగ్రేంట్ వీసాలపై వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు కూడా అమెరికా పౌరసత్వం దక్కదు. నిజానికి, అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లోని అతి పెద్ద సమూహాల్లో భారతీయ విద్యార్థులు ఒకరు. వీళ్లలో ఎక్కువ మంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలలో ఉన్నారు.
పౌరసత్వానికి రుజువుగా ఉన్న బర్త్ సర్టిఫికేట్లు
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ 2011 ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం.. అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్‌షిప్ తొలగించడం అక్కడున్న వలసదారుల్ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే, ఇకపై అమెరికన్ తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల పౌరసత్వాన్ని నిరూపించడం కష్టమవుతుంది. ఈ ఆర్డర్ వల్ల.. ఇప్పటి వరకూ పౌరసత్వానికి రుజువుగా ఉన్న బర్త్ సర్టిఫికేట్ల అంశం సందిగ్థంలో పడుతుంది. ఇప్పటి వరకూ ఈ బర్త్ సర్టిఫికేట్లే అమెరికా పౌరసత్వాన్ని ధృవీకరించేవి. ఇప్పుడు వీటి స్థానంలో ఏం తీసుకొస్తారు. వాటి, ప్రక్రియ, అమలుపై ఎలాంటి ప్రకటనా లేదు. మరి, రాబోయే నాలుగేళ్ల పాలనలో ట్రంప్ ఈ అంశాన్ని ఎలా పూర్తి చేస్తారన్నది అస్పష్టంగా ఉంది.
విదేశీ వనరుల నుండి భారీ మొత్తంలో సుంకాలు..
అమెరికాను మరింత సంపన్న దేశంగా మార్చడానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫారిన్ కంట్రీలపై మరిన్ని సుంకాలు, పన్నులు విధిస్తానని అధికారం చేపట్టిన మొదటి రోజే వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా.. విదేశీ వనరుల నుండి భారీ మొత్తంలో సుంకాలు, ఇతర మార్గాల ద్వారా ఆదాయాలు సేకరించడానికి సిద్ధపడ్డారు. దీని కోసం”బాహ్య ఆదాయ సేవ”ను సృష్టిస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికన్లను రక్షించడానికి అమెరికా వాణిజ్య వ్యవస్థను వెంటనే సరిదిద్దడం ప్రారంభిస్తానని ట్రంప్ భరోసా ఇచ్చారు.
కెనడా-మెక్సికో ఉత్పత్తులపై 25% దిగుమతి సర్‌ఛార్జ్
అయితే, ఈ సుంకాలు నిర్థిష్టంగా ఎంత ఉంటాయనేది ట్రంప్ ప్రస్తావించలేదు. కానీ, ప్రపంచ దిగుమతులపై 10 శాతం, చైనీస్ వస్తువులపై 60 శాతం, కెనడా-మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సర్‌ఛార్జ్ ఉంటుందని గతంలో పలు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఇక, ప్రత్యేకంగా.. కెనడా-మెక్సికో విషయంలోకి వస్తే… అమెరికాలోకి అక్రమ వలసలను ఆపడంలో, మాదకద్రవ్యాల రవాణాను కఠినంగా నియంత్రించడంలో విఫలమైతే ఈ దేశాలపై సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు.
“టారీఫ్ అండ్ ట్యాక్స్” వాణిజ్య విధానం అమలు
ఇక, ఇతర దేశాలపై కూడా “టారీఫ్ అండ్ ట్యాక్స్” వాణిజ్య విధానాన్ని అమలు చేస్తానని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం కొన్ని యుఎస్ ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తున్న భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం అధికంగా ఉండబోతోంది. ఒకప్పుడు, ట్రంప్.. భారతదేశాన్ని “టారిఫ్‌ల రాజు” అని పేర్కొన్నారు. ఈ అభిప్రాయం ఉన్న ట్రంప్ రాబోయే కాలంలో భారత్‌పై ఏ స్థాయిలో టారీఫ్‌లు వేస్తారో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ గతంలో, భారత్‌తో సహా పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధించిందిన పదే పదే విమర్శించారు.
అమెరికా కూడా భారత దిగుమతులపై టారిఫ్ విధిస్తుందని హెచ్చరిక
ముఖ్యంగా, భారత్ వంటి దేశాలు అమెరికా వస్తువులపై అధిక టారిఫ్‌లు వసూలు చేస్తే, అమెరికా కూడా భారత దిగుమతులపై ఇలాంటి టారిఫ్‌లనే విధిస్తుందని హెచ్చరించారు. రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే బంధం ఉందనీ.. అమెరికా నుండి వసూలు చేస్తే, భారతదేశం నుండి మేమూ వసూలు చేస్తామంటూ స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ వైఖరి చూస్తుంటే.. కేవలం, అమెరికన్ కార్మికులు, కుటుంబాలను రక్షించడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే, “అమెరికా ఫస్ట్” వాణిజ్య విధానంలో భాగంగా.. కఠిన నిర్ణయాలను తీసుకోడానికి ట్రంప్ సిద్ధమయ్యారు.
రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ దేశాల సభ్యుల సమావేశం తర్వాత..
గతేడాది డిసెంబర్‌లో, ట్రంప్, భారతదేశంతో సహా బ్రిక్స్ దేశాలు కలిసి, యూఎస్ డాలర్ స్థానంలో మరో జనరల్ కరెన్సీని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తే 100 శాతం సుంకాలను విధిస్తామని బెదిరించారు. బ్రిక్స్ దేశాలన్నీ అమెరికాకు వీడ్కోలు చెప్పి, మరొక దుర్మార్గుడిని కనుగొనాల్సి వస్తుందని వ్యాఖ్యనించారు. గతేడాది, అక్టోబర్‌లో.. రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ దేశాల సభ్యులు సమావేశమైన తర్వాత ట్రంప్ ఈ 100 శాతం సుంకాల హెచ్చరిక చేవారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్‌లో పూర్తి సభ్యులు
అయితే, ట్రంప్ హెచ్చరికలపై భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జాగ్రత్తగా స్పందించారు. బ్రిక్స్ సభ్యులు తమ సొంత కరెన్సీలతోనే ప్రపంచ వాణిజ్యంలో పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తంగా చూస్తూ.. మూడు కరెన్సీ అవసరం ఏముంటుంది అనే విధంగా జైశంకర్ వ్యాఖ్యనించారు. ఈ అస్పష్టమైన స్పందనతో ట్రంప్ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు, బ్రిక్స్ సభ్యులుగా ఉన్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలతో పాటు కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా బ్రిక్స్‌లో పూర్తి సభ్యులుగా చేరాయి.
BRICSలో వచ్చే చివరి Sను స్పెయిన్ అనుకున్న ట్రంప్
అయితే బ్రిక్స్ దేశాలపైనే కాదు.. దాదాపు అన్ని దేశాలపై ట్రంప్ తన ప్రభావాన్ని చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇక, బ్రిక్స్ దేశాలపై మరింత కోపంగా ఉన్నారు. ఇటీవల BRICSలో వచ్చే చివరి Sను స్పెయిన్ దేశంగా అపార్థం చేసుకున్న ట్రంప్.. అసలు, బ్రిక్స్ సభ్యుల్లో లేని స్పెయిన్‌పై కూడా భారీగా.. 100 శాతం సుంకాన్ని విధిస్తానంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
2021-2022, 2022-2023లో భారత్ అగ్ర వాణిజ్య భాగస్వామిగా అమెరికా
చూస్తుంటే.. ట్రంప్ స్పృహలో లేకపోయినా బ్రిక్స్ దేశాలపై చాలా కోపంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. స్పెయిన్ BRICS దేశం కాకపోయినప్పటికీ.. BRICS దేశం అయితే, సుంకం తప్పదని అన్నారు. BRICS దేశాలు అమెరికాతో చేసే వ్యాపారంపై కనీసం 100% సుంకం విధించబోతున్నాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
2021-2022, 2022-2023లో భారత్ అగ్ర వాణిజ్య భాగస్వామిగా అమెరికా
నిజానికి, 2021-2022.. 2022-2023లో అమెరికా, భారత్ అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఉంది. అయితే, 2023-2024లో.. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా మారింది. ఇక, జనవరి-జూలై 2024 కాలంలో, ద్వైపాక్షిక వస్తువుల వ్యాపారానికి సంబంధించి, 72 బిలియన్ డాలర్లకు మించి, భారత ఎగుమతులు 48.2 బిలియన డాలర్లకు పెరిగాయి. దీనితో, తిరిగి అమెరికా, భారతదేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తన స్థానాన్ని మరోసారి పొందింది.
భారతదేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తిరిగి అమెరికా
ఈ నేపధ్యంలో.. ట్రంప్ పరస్పర సుంకాల హెచ్చరిక.. భారత ఎగుమతి రంగాన్ని, ముఖ్యంగా అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడే పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో.. భారతీయ ఎగుమతిదారులు అమెరికాతో వ్యాపారం చేయడానికి భారీ అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు. దీనితో వారి ఉత్పత్తులకు అమెరికాలో పోటీ తగ్గిపోతుంది. ఇది భారతీయ వ్యాపారాలు, అమ్మకాలపై ప్రభావం పడి, ఆదాయం తగ్గడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితి, భారతదేశంలో ఉపాధి, ఆర్థిక వృద్ధిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
రెండు దేశాల్లో వినియోగదారుల ధరల్లో పెంపు
ఇక, ట్రంప్ వేస్తానంటున్న ఈ సుంకాల ఆర్థిక ప్రభావం.. వాణిజ్య సమతుల్యతకు మాత్రమే పరిమితం కాదు. ఇది రెండు దేశాల్లో వినియోగదారుల ధరలను పెంచడానికి కారణం కావచ్చు. సుంకాల వల్ల దిగుమతి ధరలు పెరుగుతాయి కాబట్టీ.. అమెరికా కంపెనీలు ఈ అధిక ఖర్చులను వినియోగదారులపైకి నెడతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. మరోవైపు, అమెరికా నుండి దిగుమతి చేసుకున్న వస్తువులకు కూడా ఇక్కడ భారతీయ వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది.
ఇది భారతీయ హోమ్ బడ్జెట్‌లను మరింత దెబ్బతీస్తుంది. ఈ నేపధ్యంలో.. ట్రంప్ బెదిరింపులకు ప్రతిస్పందనగా, భారత్ తన వాణిజ్య విధానాలను తిరిగా పరిశీలించాల్సి రావచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అమెరికాతో మరింత అనుకూలమైన ట్రేడ్ పాలసీల కోసం దౌత్య ప్రయత్నాలు కూడా అవసరం రావచ్చని, నిపుణులు భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. అమెరికాలో ట్రంప్ రీఎంట్రీ ప్రపంచదేశాలతో పాటు ఇండియాకి కూడా టెన్షన్ పుట్టిస్తోంది. మరి, రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా మారతాయన్నది చూడాలి.