Russia-Ukraine War: ఉక్రెయిన్ పై ట్రంప్ స్టాండ్ ఏంటి? రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపబోతున్నారు? ఉక్రెయిన్ నుంచి ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? పుతిన్ తో గంటన్నర ఫోన్ కాల్ మాట్లాడేంతగా ఏం చర్చలు జరిగాయి? అటు జెలెన్ స్కీ, ఇటు పుతిన్ ను ఏకకాలంలో సంతృప్తి పరిచేలా ట్రంప్ పెద్ద స్కెచ్చే వేస్తున్నారా? ఇంతకీ మూడేళ్ల యుద్ధం ఆగుతుందా? ఆపుతారా? మధ్యవర్తిత్వంతో ట్రంప్ కు జరిగే బెనిఫిట్స్ ఏంటి? లెట్స్ వాచ్.
రష్యా, ఉక్రెయిన్ ను డీల్ చేస్తున్న ట్రంప్
మిస్టర్ జెలెన్ స్కీ.. నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇస్తున్నా.. 24×7 మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు.. లిఫ్ట్ చేస్తా.. మాట్లాడుతా.. ఇదీ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి చెప్పిన మాట.. ఇది స్వయంగా జెలెన్ స్కీ చెప్పారు. మిస్టర్ పుతిన్.. మనం సౌదీ అరేబియాలో అతి త్వరలోనే కలవబోతున్నాం.. చర్చిద్దాం.. యుద్ధం సంగతి, ఉక్రెయిన్ సంగతి తేల్చేద్దాం.. ఇదీ పుతిన్ తో ఫోన్ కాల్ లో ట్రంప్ చెప్పిన మాట. ఈ ఇద్దరితో ట్రంప్ ఫోన్ కాల్స్ చూస్తే ఏమనిపిస్తుంది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ ను ఎలా డీల్ చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. ఎవరిని వెనకేసుకొస్తున్నారు.. ఏం చేయబోతున్నారన్నది కూడా క్లారిటీ వస్తుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే ప్లాన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై మూడేళ్లు పూర్తవబోతోంది. ఎక్కడా తెగడం లేదు. రాత్రివేళల్లో డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు దేశాలు కూడా తమ వాళ్లు ఎంత మంది చనిపోయారో అసలైన లెక్కలు బయటపెట్టుకోవడం లేదు. ఎందుకో తెలియదు. దీంతో ఈ మ్యాటర్ అస్పష్టంగానే ఉంది. అయితే యుద్ధం ఎన్నాళ్లని చేస్తారు.. ఏదో ఒక రోజు ముగింపు పలకాలి కదా.. అయితే నేనున్నా.. నేను ముగించేస్తా అంటూ ట్రంప్ ముందుకొచ్చారు. చర్చలు జరగాలంటే రెండు దేశాలు కొన్ని కండీషన్లు పెట్టుకుని కూర్చున్నాయి. దీంతో వాటిని కూడా డీల్ చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడితో ఒకలా.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తో మరోలా మాట్లాడుతూ మ్యాటర్ కన్ఫ్యూజ్ చేస్తున్నారా.. లేదంటే కొలిక్కి తెస్తున్నారా అన్నది బిగ్ క్వశ్చన్ గా మారిపోయింది.
పుతిన్ తో 90 నిమిషాలు ఫోన్ మాట్లాడిన ట్రంప్
ట్రంప్ కథలే వేరుగా ఉంటాయి. ఆయన స్టైలే వేరు. రూటే వేరు. అనుకుంటే ఏదైనా చేస్తారు. అమెరికా గ్రేట్ అంటారు. సరే అధ్యక్షుడయ్యాక రష్యా-ఉక్రెయిన్ మ్యాటర్ పై స్పెషల్ నజర్ పెట్టారు. పుతిన్ తో 90 నిమిషాలు అంటే గంటన్నరసేపు ఫోన్ లో మాట్లాడారంటే సిచ్యువేషన్ కు ఇంపార్టెన్స్ ఎలా ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ గంటన్నర టైంలో పుతిన్ ను కూల్ చేసేలా ట్రంప్ చాలానే ముచ్చట్లు చెప్పారంటున్నారు.
పుతిన్ ను కూల్ చేసేలా మాట్లాడిన ట్రంప్
ఉక్రెయిన్ ను డీల్ చేస్తా.. నాటోలో ఉక్రెయిన్ ను చేర్చే ఛాన్సే లేదు.. 2014కు ముందు రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని ఉక్రెయిన్ కు ఇవ్వాల్సిన పని లేదు.. ఇలా పుతిన్ కు వినసొంపుగా ఉండే మాటలెన్నో ట్రంప్ చెప్పారు. ఇది చాలదా.. పుతిన్ ఖుషీ అవడానికి. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు జరపాలంటే ఆ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్నది రష్యా ప్రధాన డిమాండ్. దానికి ట్రంప్ కూడా సానుకూలంగానే ఉండడంతో తర్వాతి స్టెప్ లో ఏం జరుగుతుందో ఎవరైనా ఈజీగా ఊహించుకోగలుగుతారు.
రష్యా ఆక్రమించిన భూమి ఇవ్వాల్సిన పని లేదని కామెంట్
అటు పుతిన్, ఇటు జెలెన్ స్కీని ట్రంప్ ఒక్కతాటిపైకి తెస్తున్నారు. చర్చలు జరుపుదామని పిలుస్తున్నారు. పెద్దన్న పాత్ర పోషించాలని ఆరాటపడుతున్నారు. ఇద్దరికీ తీపిగా ఉండే మాటలు చెబుతున్నారు. ఎవరి దగ్గర వారి మాట చెబుతూ సంతోషపెడుతున్నారు. ముఖ్యంగా రష్యా విషయంలో ట్రంప్ వైఖరి చాలా వరకు మారిపోయింది. ఒబామా దగ్గర్నుంచి చాలా మంది తప్పు చేశారని, కానీ ఆ తప్పు తాను చేయబోనంటున్నారు. మొదట జీ8 దేశాల కూటమి ఉండేది.
జీ 7 కూటమిలోకి రష్యాను తెచ్చే ప్రయత్నాలు
ఇందులో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, యునైటెడ్ కింగ్ డమ్ ఉండేవి. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకోవడం మొదలు పెట్టిందో అప్పుడు ఆ జీ8 కూటమిని కాస్తా జీ 7గా మార్చుకున్నారు. రష్యాను బయటకు పంపించేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం ఆహ్వానిస్తున్నారు. రష్యాను బయటకు పంపడం కరెక్ట్ కాదన్నారు. పుతిన్ కూడా జీ8లోకి తిరిగి రావడానికి ఇష్టపడుతారని ధీమాగా చెబుతున్నారు.
రష్యాలో బందీగా ఉన్న అమెరికా టీచర్ రిలీజ్
నిజానికి అటు పుతిన్, ఇటు జెలెన్ స్కీని ఒప్పించేందుకు ఇద్దరికీ ఫోన్ కాల్స్ చేశారు. ముందుగా పుతిన్ తో మాట్లాడారు. పుతిన్ తో ఫోన్ మాట్లాడేకంటే ముందు రెండు దేశాల మధ్య ఓ కీలక డ్రామా నడిచింది. అదేంటంటే.. రష్యాలో బందీగా ఉన్న అమెరికా టీచర్ మార్క్ ఫోగెల్ రిలీజ్ తర్వాతే పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. మరోవైపు ఫోగెల్ విడుదలకు ప్రతిగా రష్యాకు చెందిన నేరస్తుడు అలెగ్జాండర్ విన్నిక్‌ను అమెరికా రిలీజ్ చేసింది. ఫోగెల్‌కు రష్యా కోర్టు 2021 ఆగస్టులో 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
పుతిన్ మనసులో ఏముందో తెలుసుకున్న ట్రంప్
సో రెండువైపులా ఖైదీల విడుదల తర్వాత ఫోన్ సంభాషణ గంటన్నర పాటు సాగింది. ఇదిలావుంటే.. కీవ్ ప్రమేయం లేకుండా అమెరికా, రష్యా మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించదని ఉక్రెయిన్ అధ్యక్షుడు అనడం పెద్ద బాంబే పేల్చింది. అయితే ఉక్రెయిన్ ను ఎలా కూల్ చేయాలో ట్రంప్ కు బాగా తెలుసు. ట్రంప్ మాత్రం అటు పుతిన్ మనసులో ఏముందో కనుక్కున్నారు. ఇటు జెలెన్ స్కీకి ఫోన్ చేసి పర్సనల్ నెంబర్ ఇచ్చారు. ఇద్దరినీ లైన్ లో పెట్టారు. అదీ మ్యాటర్.
కలిసి పని చేస్తే ఆ మజానే వేరంటున్న ట్రంప్
కలిసి పని చేయడం వల్ల ఏదో ఒక రోజు గొప్ప లబ్ది జరుగుతుందని, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా నష్టం వాటిల్లిందన్నారు ట్రంప్. యుద్ధంలో లక్షల మంది ప్రాణ నష్టాన్ని అరికట్టాలని అంగీకారానికి వచ్చామని, వెంటనే చర్చలు మొదలు పెట్టేందుకు అంగీకరించామన్నారు. కామన్ సెన్స్ నినాదాన్ని ఇద్దరం గట్టిగా నమ్ముతున్నామని చెప్పుకొచ్చారు. రష్యా అధినేత పుతిన్‌తో తాను శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ట్రంప్ చెప్పారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని, అయినా సరే.. ఈ భేటీలో భారీ ఆలస్యం జరగదంటున్నారు.
కీవ్ లో శాంతికోసం చర్చించామన్న జెలెన్ స్కీ
ఆ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. అటు ట్రంప్‌తో ఫోన్‌కాల్ చర్చలపై జెలెన్‌స్కీ కూడా రియాక్ట్ అయ్యారు. తమ మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయని, కీవ్‌లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడుకొన్నామన్నారు. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయని, పుతిన్‌తో మాట్లాడిన విషయాన్ని ట్రంప్ తనతో చెప్పారన్నారు జెలెసన్ స్కీ. అంతే కాదు.. రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని తాను భావిస్తున్నట్లుగా కూడా చెప్పారు.
మధ్యవర్తిత్వంతో ట్రంప్ లాభం చూసుకుంటున్నారా?
ట్రంప్ పరిస్థితి ఎలా ఉంటుందంటే.. ఉపయోగం లేని పని ఏదీ చేయరు. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్ ఇందులో ఎంతో కొంత లాభం చూసుకుంటున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఏదీ రాకపోతే, ఏమీ లేకపోతే మధ్యలో వెళ్లేందుకు సహజంగానే ట్రంప్ ఇంట్రెస్ట్ చూపరన్న టాక్ ఉంటుంది. ఇప్పుడు కూడా పెద్ద స్కెచ్చే వేశారు. ఉక్రెయిన్ తో ఓ డీల్ కోసం ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
అటు సైనిక సహాయం, ఇటు రేర్ ఎర్త్ మినరల్స్ డీల్
రేర్ ఎర్త్ మినరల్స్ అంటే అరుదైన ఖనిజాలు అందిస్తే తాము సైనిక సహాయం అందిస్తామన్న మాట మాట్లాడుతున్నారు. సో ఉక్రెయిన్ భూభాగంలో రేర్ ఎర్త్ మినరల్స్ చాలానే ఉన్నాయి. ఇవి సెల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్ లు, చిప్ లు, అన్ని రకాల ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికిల్స్, సెన్సార్స్ తయారీ కోసం వాడే అరుదైన ఖనిజాల కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. లిథియం, టైటానియం, యురేనియం వంటివెన్నో ఉన్నాయి.
20కి పైగా కీలక లోహాలు సప్లై చేస్తున్న ఉక్రెయిన్
‘వీ బిల్డ్ ఉక్రెయిన్’ డేటా ప్రకారం ఉక్రెయిన్‌లోని 40 శాతం ఖనిజ వనరులు రష్యన్ ఆక్రమణ కారణంగా అందుబాటులో లేవంటున్నారు. యూరోపియన్ కమిషన్ ఉక్రెయిన్‌ను 20కి పైగా కీలకమైన ముడి లోహాలు సప్లై చేసే దేశంగా గుర్తించింది. EUలో ఆ దేశం చేరడం వల్ల యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఇది వరకే నిర్ధారించింది. 2021లో ఉక్రేనియన్ ఖనిజ పరిశ్రమ దేశ స్థూల దేశీయోత్పత్తిలో 6.1% అలాగే ఎగుమతుల్లో 30% వాటాను కలిగి ఉన్నట్లు తేలింది.
చైనాపై అతిగా ఆధారపడకుండా ట్రంప్ జాగ్రత్తలు
అందుకే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనాపై అతిగా ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడేందుకు అటు అమెరికా, ఇటు ఈయూ రెడీగా ఉన్నాయి. అయితే ట్రంప్ ఈ విషయంలో ముందడుగు వేసి జెలెన్ స్కీని లైన్ లో పెట్టారు. అందుకే శాంతి చర్చల విషయమంటూ ఈ ఆలోచన చేశారా అన్నది కూడా తెరపైకి వస్తోంది. మూడేళ్లుగా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో రేర్త్ ఎర్త్ మినరల్స్ ఎక్కువగా వాడకంలో రాలేదు. యూరప్ అంతటితో పోలిస్తే టైటానియం నిల్వలు ఉక్రెయిన్ లోనే ఉన్నాయి.
టైటానియం, లిథియం వనరులు ఎక్కువే
బ్యాటరీలు, సిరామిక్స్ , గాజును ఉత్పత్తి చేయడానికి అవసరమైన లిథియం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. ఈ డీల్ ట్రంప్, జెలెన్ స్కీ భేటీలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సో ఎవరి అవసరాలు వాళ్లవి. అందుకే ఈ మ్యాటర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చెప్పడం కష్టమే. అటు పుతిన్, ఇటు జెలెన్ స్కీ, మధ్యలో ట్రంప్. వాట్ నెక్ట్స్? లెట్స్ వెయిట్ అండ్ సీ.