ఇద్దరికి ఇద్దరు.. అంతే ఉన్నరు. మొన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నట్టుగా.. హద్దులు మీరుతున్నారిద్దరు.. ఈ పద్దతి మార్చుకోవాలంటూ సీఎం రేవంత్‌ను, కేటీఆర్‌లకు హితబోధ చేశాడు. రేవంత్ ఒకటంటే నేను రెండంట.. సీఎం శేరు అయితే.. నేను సవ్వాషేరు.. అన్నట్టుగా ఉంది ఇద్దరి వ్యవహారం.
మొన్న సీఎం రేవంత్ ఇంజినీరింగ్ విద్యార్థుల చదువును ఉద్దేశించి క్రిమినల్ వేస్ట్ అనే పదం వాడాడు. దీన్ని బీఆరెస్ పార్టీ తన అస్త్రంగా తీసుకున్నది. ఇప్పటికే పలువురు నేతలు సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. బీజేపీ కూడా ఇప్పుడు తోడయ్యింది. అయితే ఇవాళ కేటీఆర్ తన ప్రెస్‌మీట్‌లో ఈ అంశాన్ని మళ్లీ తీసుకొచ్చాడు. ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తుందని, వారు అమెరికా లాంటి దేశాలలో మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారని, అలాంటి వారిని చులకన చేసే విధంగా మాట్లాడిన సీఎంది నోటి దూల అంటూ విరుచుకుపడ్డాడు.
పనిలో పని తన చదువు గురించి గొప్పలు చెప్పుకునే చాన్స్ దొరికిందనుకున్నాడు కేటీఆర్. ఆ వివరాలన్నీ ఏకరువు పెట్టుకున్నాడు. తను రాసిన పరీక్షలను ఓసారి ఈ వేదికగా గుర్తు చేశాడు అందరికీ. మరి తాను చదువుకున్నానని, సీఎం ఏం చదివాడంటూ.. విద్యార్హత అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశాడు కేటీఆర్. ఏమో ఏం చదివాడో తెలియదు..ఆ చదివిన చదవు కూడా నకలు కొట్టి పాసై ఉంటాడని లిమిట్స్ దాటిన కేటీఆర్.. సున్నాలేసుకుని బతికిన నీకే ఇంతుంటే.. చదువుకున్నోళ్లం మాకెంత ఉండాలె..? అని కొత్త పాయింట్ లేవనెత్తాడు.
ఇక్కడ కేటీఆర్ గడుసుతనం బయటపడింది. తాను ఉన్నత విద్యావంతుడినని, రేవంత్‌కు చదువే లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. క్రిమినల్ వేస్ట్ అంటూ విద్యార్థులను తిట్టాడు కాబట్టి.. ఇక తాను ఏమైనా తిట్టడానికి చాన్స్ ఉందని… ఇక హద్దులు దాటి మాట్లాడాడు. రేవంత్ ఓ క్రిమినల్ అన్నాడు. వందల కొద్ది క్రిమినల్ కేసులున్నాయన్నాడు. అసలు అతన్ని సీఎం చేయడమే ఓ పెద్ద క్రమినల్ వేస్ట్ అన్నాడు. ఇది జనాలను తిట్టినట్టవుతుందేమోనని నాలుక్కర్చుకుని.. ఇలాంటి క్రిమినల్‌ను సీఎం క్యాండిడేట్‌గా ఎంచుకున్న అధిష్టానం ఓ పెద్ద క్రిమినల్ వేస్ట్ అని సరిదిద్దుకున్నాడు.
వాస్తవానికి, ఈ క్రిమినల్ వేస్ట్ అనే పదమే సీఎం వాడాల్సింది కాదు. పేద విద్యార్థులు ఎంతో కష్టపడి ఇంజీనిరింగ్ చదవులు పూర్తి చేస్తారు. కనీసం వారికి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా రాదు.. అని సీఎం అనడం విద్యా వ్యవస్థ తీరు ఇలా ఉంది.. అని చెప్పడానికే అయినా.. అది విద్యార్థులందరికీ ఆపాదించినట్టు అయ్యింది. ఇక్కడే ప్రతిపక్షాలకు సీఎం మాటలు అస్త్రాలుగా దొరికాయి.
గోడలకు సున్నాలేసుకున్నాడు.. అంటూ దిగజారుడు విమర్శల దాకా దిగిపోయాడు కేటీఆర్. ఇద్దరికి ఇద్దరు మైక్ చేతికొస్తే నోరు కంట్రోల్ లో ఉండదేమో అని అనుకుంటున్నారంతా!