E-Paper
Advertisement

Delhi Bomb Blast: నిఘా వైఫల్యమే పేలుడుకు కారణమా? ఢిల్లీలో బ్లాస్ట్ వెనుక ఏం జరిగిందంటే..

Delhi Bomb Blast: నిఘా వైఫల్యమే పేలుడుకు కారణమా? ఢిల్లీలో బ్లాస్ట్ వెనుక ఏం జరిగిందంటే..

Delhi Bomb Blast: ఒక్క బ్లాస్ట్.. ఒకే ఒక్క బ్లాస్ట్.. అమాయక జనం ప్రాణాలు తీసింది. ఉగ్రదాడులకు ఈ దేశం ఇంకా ఓ వేదికేనని చూపింది. మన నిఘా వ్యవస్థలు, భద్రతా దళాల వైఫల్యాన్ని ఎత్తి చూపింది. ఢిల్లీ పేలుడు.. ఇప్పుడో ఎగ్జాంపుల్ కాదు. మున్ముందు మనం పసిగట్టేలోపే జరగబోయే ఘోరాలకు ఓ హెచ్చరిక. ఎన్ని స్ట్రైక్స్ చేసినా, ఎన్ని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసినా.. అన్నిసార్లు ఉగ్ర కుట్రలను భగ్నం చేయడంలో మాత్రం.. మన భద్రతా వ్యవస్థలు ఫెయిలవుతున్నాయ్. అసలు.. ఢిల్లీలో బ్లాస్ట్‌ ఎలా జరిగింది? ఉగ్ర కుట్రని ఎందుకు భగ్నం చేయలేకపోయారు?

ఎర్రకోట రక్తం కళ్లజూసింది.. రెడ్ ఫోర్ట్ ముందు నెత్తురు పారింది.. కాళ్లు, చేతులు, తలలు ఎగిరిపడ్డాయ్.. కారులో బాంబ్ బ్లాస్ట్‌తో ఒక్కసారిగా భయం.. ఎక్కడికక్కడ పరుగులు తీసిన జనం.. పేలుడు ధాటికి 22 వాహనాలు దెబ్బతిన్నాయ్. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర జనం వణికిపోయారు. ప్రశాంతంగా ఉన్న చాందినీ చౌక్‌లో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. చాలా ఏళ్ల తర్వాత.. ఢిల్లీని మళ్లీ ఓ బాంబ్ బ్లాస్ట్ భయపెట్టింది. సాక్షాత్తూ దేశ రాజధాని నడిబొడ్డున, రద్దీ ఏరియాలో అది కూడా ఎర్రకోట ముందే.. ఈ బ్లాస్ట్ జరిగింది.

ఈ బాంబ్ బ్లాస్ట్ అంతా.. ఓ కారు చుట్టే తిరుగుతోంది. i20 కారులో ఈ పేలుడు జరిగింది. దీంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయ్. మొదట కారులో cng ట్యాంక్ ఏదైనా బ్లాస్ట్ జరిగి ఉంటుందనుకున్నారు. కానీ అక్కడి పరిస్థితులు చూసిన వారికి అది బాంబ్ బ్లాస్ట్ అని తొందరగానే తెలిసిపోయింది. స్పాట్‌‌‌లోనే తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు.

అయితే నవంబర్ పదో తేదీన రోజంతా ఉమర్ అనుమానాస్పదంగా కనిపించాడు. ఫరీదాబాద్‌లో అతడి సన్నిహితుల దగ్గర అదే రోజు 2900 కిలోల IED మేకింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు, వాకీ టాకీలు, ఓ ఏకే 47, పిస్తోల్, టైమర్స్ లాంటివన్నీ సీజ్ చేశారు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. అందులో నలుగురు డాక్టర్లు ఉన్నారు. దీంతో తన ఉనికి తెలిసిపోతునుకున్నాడో లేదంటే ఎలాగైనా బ్లాస్టింగ్ ప్లాన్ వర్కవుట్ చేసి తీరాలనుకున్నాడో ఏమోగానీ.. ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్నారు. పేలుడులో అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు చెబుతున్నారు. అందుకే ఇంత తీవ్రత ఉందంటున్నారు ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్స్. DNA టెస్టుతో ఉమర్ చనిపోయాడా? లేదా? అనేది నిర్ధారించనున్నారు. ఇప్పటికే.. ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించింది కేంద్రం.

ఢిల్లీ బ్లాస్ట్‌లో గేమ్ అంతా ఈ ఐ20 కార్ చుట్టే తిరుగుతోంది. ఈ కారు చాంద్ నీ చౌక్ ఏరియాలో నవంబర్ 10న ఎక్కడెక్కడ తిరిగిందో సీసీ ఫుటేజ్ అంతా బయటికొస్తోంది. ఫరీదాబాద్, బర్దార్ పూర్ టూ చాందినీ చౌక్.. ఇలా బ్లాస్ట్‌కు కొన్ని గంటల ముందు ఏం జరిగింది.? కారు ఎక్కడెక్కడి నుంచి వచ్చిందన్నది దూద్ కా దూద్.. పానీ కా పానీ మొత్తం తెలిసిపోయింది. పేలుడుకి వాడిన i-20 కారు బర్దార్‌పూర్ నుంచి ఢిల్లీలోకి ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ఎంటర్ అయింది. డే అంతా ఢిల్లీలో రకరకాల ఏరియాల్లో చక్కర్లు కొట్టింది.

పేలుడు జరిగిన ఏరియాలో పార్కింగ్ ఏరియాలోకి ఐ20 కారు ఎంట్రీ అయింది. ఈ సీసీ ఫుటేజ్‌లో కారు నడిపే వ్యక్తిని డాక్టర్ ఉమర్‌గా ఐడెంటిఫై చేశారు. పార్కింగ్ ఏరియాలో సుమారు 3 గంటల పాటు కారు అక్కడే నిలిపి ఉంచారు.
పార్కింగ్ ఏరియా నుంచి కారు బయటికి వచ్చింది. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వైపు వెళ్లింది. అన్ని వాహనాలు ఫాస్ట్ గా వెళ్లినప్పటికీ ఈ కారు మాత్రం చాలా స్లోగా మూవ్ అయింది. బహుశా రెడ్ సిగ్నల్ పడేలా చూసుకుని ఉండొచ్చు. అనుకున్నట్లుగానే రెడ్ ఫోర్ట్ మెట్రో గేట్ నెంబర్ 1 దగ్గర రెడ్ సిగ్నల్ దగ్గర కారు ఆగింది.

సిగ్నల్ దగ్గర ఆగిన కారులో ఒక్కసారిగా భారీ పేలుడు. హైడ్రోజన్ బాంబ్ పేలినప్పుడు ఎలాగైతే మష్రూమ్ షేప్ వస్తుందో అలాగే అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. వాహనాల శకలాలు ఎక్కడెక్కడో ఎగిరిపడ్డాయి. ఫైర్ సర్వీసెస్‌కు కాల్ వచ్చింది. ఏడు ఫైరింజన్లు, 15 అంబులెన్సులు స్పాట్‌కు చేరుకున్నాయి. సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో LJNP హాస్పిటల్‌కు తరలించారు. అరగంట తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తం.. 9 మంది చనిపోయినట్లు ప్రకటించారు. NSG, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్‌ని నవంబర్ 13 వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఇదీ ఓవరాల్ గా నవంబర్ 10న జరిగిన సీక్వెన్స్.

ఢిల్లీలో 2011లో చివరిసారిగా బ్లాస్టింగ్ జరిగింది. 14 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీలో.. అది కూడా టూరిస్టులు ఎక్కువగా ఉండే హిస్టారికల్ రెడ్ ఫోర్ట్ ముందు ఆత్మాహుతి దాడి అంటే మాటలు కాదు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆ రూట్‌లో సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో బ్లాస్ట్ తర్వాత.. దేశమంతా హైఅలర్ట్ ప్రకటించారు. నిజానికి కారులో CNG కిట్ బ్లాస్ట్ అయితే మిగతా వాహనాలకు డ్యామేజ్ జరగదు. అంత తీవ్రత ఉండదు. కానీ ఇది అమ్మోనియం నైట్రేట్, డిటొనేటర్లతోనే తీవ్రత ఎక్కువ ఉందంటున్నారు. డాక్టర్ ఉమర్ మహ్మద్ పుల్వామాకు చెందిన వ్యక్తి. ఈ దాడి వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ లింకులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. కారు లాస్ట్ ఓనర్ పుల్వామాకు చెందిన తారిక్‌ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కారు ముగ్గురి చేతులు మారినా.. ఫస్ట్ ఓనర్ గురుగ్రామ్‌కు చెందిన సల్మాన్ పేరుపైనే రిజిస్ట్రేషన్ ఉంది. ఆ తర్వాత దేవేందర్ అనే వ్యక్తికి అమ్మాడు. అక్కడి నుంచి తారిఖ్‌కు చేరింది. దీంతో అందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే కారులో ఉమర్ సహా మరో ముగ్గురి డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఎవరు అన్నది కీలకంగా మారింది. ప్రయాణికులా.. లేదంటే ఇంకెవరు అన్న యాంగిల్ లో ఎంక్వైరీ నడుస్తోంది.

ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత జరుగుతున్న చర్చ ఒక్కటే. ఎందుకంటే.. ఓ చిన్న కారులో 30 నుంచి 50 కిలోల పేలుడు పదార్థాలు పెట్టుకుని ఢిల్లీ అంతా చక్కర్లు కొడుతుంటే.. ఒక్క చోట కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? కీలక ప్రాంతాల్లో ఎందుకు తనిఖీ చేయలేకపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఇది భారత్‌ని భయపెట్టే ఉగ్ర ప్రయత్నమనుకోవాలా? లేక.. ఉగ్ర కుట్రని పసిగట్టలేని నిఘా వైఫల్యమని ఊరుకోవాలా?

ఎవరైనా నేరుగా దాడిచేస్తున్నారంటే.. ఎలాగోలా కష్టపడి దానిని అడ్డుకోవచ్చు. కానీ.. ఇలాంటి ఉగ్రదాడులు ఇంకా జరుగుతున్నాయంటే.. అది కచ్చితంగా నిఘా వైఫల్యమేననే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయినా.. ఇండియాకు ఇదేమీ కొత్త కాదు. ఇలాంటి ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్స్ గతంలో చాలానే ఉన్నాయ్. పుల్వామా అటాక్ దగ్గర్నుంచి పహల్గామ్ దాకా అన్నీ ఈ కోవలోకే వస్తాయ్. అక్కడక్కడ తనిఖీలు చేయడం, ఏమైనా దొరికితే సీజ్ చేయడం లాంటివి జరుగుతున్నా.. పక్కా నిఘా మాత్రం కొనసాగడం లేదన్నది.. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన బ్లాస్ట్ చూశాక అర్థమైంది. ఈ పేలుడుతో.. ఉగ్రవాదులు ఎలాంటి సవాల్ విసిరారో అర్థం చేసుకోవచ్చు.

మన దగ్గర ఎప్పుడు పేలుడు జరిగినా.. వెంటనే హై అలర్ట్ ప్రకటిస్తారు. అదే పెద్ద విచిత్రం. ఈ అప్రమత్తత.. పేలుడుకు ముందే ఉండి ఉంటే.. ఇలాంటి ఘోరం జరిగేది కాదు కదా. ఇదే అలర్ట్‌నెస్.. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలపై ఉండి ఉంటే.. చాలా ప్రాణాలు పోకుండా ఉండేవి కదా! నిజానికి.. డాక్టర్ ఉమర్ తప్పించుకు తిరుగుతున్న విషయంపై నిఘా అధికారులు ఢిల్లీ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ఉమర్‌ని పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యం ఉందన్న వాదన ఇప్పుడు చర్చకు వస్తోంది. సో.. పోలీసులు, నిఘా వ్యవస్థ మధ్య సమన్వయం లోపించిందనే విషయం అర్థమవుతోంది.

ఈమధ్యకాలంలో టెర్రరిస్టుల మోడ్ ఆఫ్ ఆపరేషన్ మారుతోంది. స్లీపర్ సెల్స్ వయా ప్రొఫెషనల్స్ అన్నట్లుగా ఉంది. సమాజంలో డాక్టర్లుగానూ, ఇతర కీలక వృత్తుల్లోనూ చలామణీ అవుతూ కనిపిస్తారు. లోపల మ్యాటర్ మరోలా ఉంటోంది. ఫరీదాబాద్‌లో 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తో దొరికిన నలుగురు డాక్టర్లే ఇందుకు నిదర్శనం. పరిస్థితులు చూస్తుంటే.. ఇంటెలిజెన్స్ ఇంకా అడ్వాన్స్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇల్లీగల్‌గా రవాణా అయ్యే అమ్మోనియం నైట్రేట్ లాంటి పేలుడు పదార్థాలపై నిఘా మరింత కట్టుదిట్టం కావాల్సిందే. నిజానికి అమ్మోనియం నైట్రేట్ ఫర్టిలైజర్‌గా పంట మొక్కల పెరుగుదలకు వాడుతారు. దానికి ఫ్యూయెల్ కలిపితే యమ డేంజర్‌గా మారుతుంది. పవర్‌ఫుల్ బాంబ్ మెటీరియల్ అవుతుంది. ఒక్క చిన్న ట్రిగ్గర్‌తో షాక్ వేవ్ మాదిరి ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. అందుకే.. అమ్మోనియం నైట్రేట్ – 2012 రూల్స్‌ని మరింత కఠినతరం చేయాలి. ఫేక్ ఫర్టిలైజర్ ఆర్డర్స్‌ని ఓ కంట కనిపెట్టాలి. ఎక్కడపడితే అక్కడ ఉండే నిల్వలను గుర్తించాలి.

భారత్‌లో.. రా, ఐబీ, ఎన్ఐఏ, స్టేట్ ఇంటలిజెన్స్ లాంటి కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థలు ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు పేలుళ్లు సంభవిస్తూనే ఉన్నాయ్. ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయ్. కేంద్ర నిఘా ఏజెన్సీలు సేకరించిన సమాచారం, రాష్ట్ర పోలీసులు, స్థానిక భద్రతా దళాల మధ్య సమర్థవంతంగా త్వరితగతిన పంచుకోబడటం, దానిపై చర్యలు తీసుకోవడంలో లోపాలు ఉన్నాయని గతంలో అనేక దాడుల తర్వాత కమిటీలు తెలిపాయ్. కొన్ని ఉగ్రవాద సంస్థలు.. దేశంలోని యువతని ఆకర్షించి, వారిని ఉపయోగించుకోవడం.. నిఘా సంస్థలకు కొత్త సవాలుగా మారింది. దాంతో.. లోకల్ టెర్రర్ నెట్‌వర్క్‌లను పసిగట్టడం కష్టమవుతోందనే చర్చ ఉంది. ఇక.. ఉగ్రవాదులు ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్, డ్రోన్‌లు, IEDల తయారీకి సంబంధించిన.. సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీటికి దీటుగా.. నిఘా వ్యవస్థ తన టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవడం సవాలుగా మారుతోంది. ఇక.. నిఘా వ్యవస్థలో.. క్షేత్ర స్థాయిలో కీలక సమాచారాన్ని సేకరించే.. హ్యూమన్ ఇంటలిజెన్స్ సిబ్బంది కొరత, సరైన ట్రైనింగ్ లేకపోవడం లాంటి లోపాలు కూడా ఉన్నాయనే విమర్శలున్నాయ్.

Also Read: జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దేనా! ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే..

క్షేత్ర స్థాయిలో తనిఖీలు లేకపోవడం కూడా ఇలాంటి దాడులకు కారణంగా కనిపిస్తోంది. రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, బస్టాండ్ల లాంటి రద్దీ ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది అప్రమత్తత, తనిఖీ పద్ధతుల్లో లోపాలు ఉండటం కూడా కారణమంటున్నారు. మరోవైపు భద్రత, నిఘా వ్యవస్థలకు అవసరమైన నిధులు, అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు సమయానికి అందట్లేదనే చర్చ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేశంలో నిఘా వైఫల్యం అనేది.. వివిధ స్థాయిల్లో జరుగుతోంది. సమన్వయం లేకపోవడం ఆపరేషన్ ఫెయిల్యూర్‌ల కారణంగా.. ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఢిల్లీలో పేలుడుకు సంబంధించి.. త్వరలోనే దర్యాప్తు సంస్థల నుంచి మరిన్ని వివరాలు వెల్లడయ్యాకే.. దీనికి అసలు కారణమేంటన్న దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Story By Anup, bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×