jubilee Hills By Election: తెలంగాణ మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ ఎలా ఉండబోతోందో.. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయ్. మిగతా ఎగ్జిట్ పోల్స్ కూడా అధికార కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చాయ్. ఈ బైపోల్‌లో.. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్సలు వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. నవీన్ యాదవ్ వైపే.. జూబ్లీహిల్స్ ప్రజలు నిలబడినట్లుగా క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. అసలు.. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయ్? పోలైన ఓట్లలో.. ఎంత మేర ఓట్లు పోలయ్యాయో చూస్తే.. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉండబోతోందో.. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ చెప్పేసింది. జూబ్లీహిల్స్‌లో నడిచిన పోలింగ్ సరళికి దగ్గరగా, 14న రాబోయే ఫలితంలో ఏమాత్రం తేడా లేకుండా.. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ నెంబర్స్ చాలా కచ్చితంగా కనిపిస్తున్నాయ్. బిగ్ టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో.. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మూడుసార్లు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్‌ని పక్కనపెట్టి.. అభివృద్ధి కోసం అధికార పార్టీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ బైపోల్‌లో కాంగ్రెస్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బిగ్ టీవీ ఎగ్జిట్‌పోల్‌లో కాంగ్రెస్ 48.9 శాతంతో ముందజలో ఉంది. ఈసారి బీఆర్ఎస్ 44.2 శాతానికే పరిమితమైంది. బీజేపీ అయితే.. కేవలం 3.8 శాతం ఓట్లతోనే సరిపెట్టుకోనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ లెక్కన.. కమలం పార్టీ డిపాజిట్ గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ కలిపి.. 3.1 శాతం ఓట్లు పోలైనట్లు.. బిగ్ టీవీ సర్వేలో తేలింది.
ఇక.. డివిజన్ల వారీగా ఎగ్జిట్ పోల్స్ చూస్తే.. బోరబండలో కాంగ్రెస్‌కు 47.91 శాతం, బీఆర్ఎస్‌కు 47.92 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఏరియాలో.. రెండు పార్టీల మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడిచింది. కేవలం.. పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే తేడా ఉందంటే.. బోరబండలో హోరాహోరీ పోరు నడిచిందనే విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. ఇక.. ఇదే డివిజన్‌లో బీజేపీకి
కేవలం 4.17 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
ఎర్రగడ్డ డివిజన్‌లో పోలింగ్ సరళిని చూస్తే.. అధికార కాంగ్రెస్‌కు 57.25 శాతం, బీఆర్ఎస్‌కు 36.5 శాతం ఓట్లు పోలైనట్లు సర్వేలో తేలింది. ఇక్కడి ప్రజలు.. హస్తం పార్టీకి ఔట్ రైట్‌గా మద్దతిచ్చినట్లు కనిపిస్తోంది. దాదాపు 20 శాతం మెజారిటీ కనిపిస్తోంది. ఈ ఏరియాలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ లెక్కన.. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలబడినట్లు తెలుస్తోంది. ఎర్రగడ్డలో బీజేపీకి 6 శాతం ఓట్లే పోలయ్యాయి.
రెహ్మత్ నగర్ డివిజన్‌లోనూ.. కాంగ్రెస్ డామినేషనే కనిపించింది. ఇక్కడ.. కాంగ్రెస్‌కు 50.93 శాతం, బీఆర్ఎస్‌కు 46.4 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండు పార్టీల మధ్య తేడా కేవలం 5 శాతం మాత్రమే కనిపిస్తోంది. ఈ ఏరియాలోనూ ముస్లిం ఓటర్లు కాస్త ఎక్కువే ఉంటారు. అయినప్పటికీ.. ఎర్రగడ్డ మాదిరిగా పూర్తిగా కాంగ్రెస్ స్టాండ్ తీసుకోకుండా.. బీఆర్ఎస్‌కు కొంతవరకు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. రెహ్మత్‌నగర్‌లో మెజారిటీ ఓటర్లకు కాంగ్రెస్‌కే సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డివిజన్‌లో బీజేపీ మరీ పూర్‌గా కనిపిస్తోంది. ఆ పార్టీకి కేవలం 1.33 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
షేక్‌పేట్ డివిజన్‌లో.. అధికార కాంగ్రెస్ పార్టీకి 34.59 శాతం, బీఆర్ఎస్‌కు 54.88 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ముందునుంచీ ఊహించినట్లుగానే.. ఈ ఏరియాలో బీఆర్ఎస్ ఆధిపత్యం కనిపించింది. ప్రీపోల్ సర్వేలు కూడా.. షేక్ పేట్ డివిజన్‌లో బీఆర్ఎస్‌కే ఎడ్జ్ ఉన్నట్లు చూపాయ్. ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. ఈ డివిజన్‌లో బీజేపీకి 6 శాతం ఓట్లు పోలయ్యాయి.
సోమాజిగూడ డివిజన్‌లో.. కాంగ్రెస్‌కు 58.28 శాతం, బీఆర్ఎస్‌రకు 36.01 శాతం ఓట్లు వచ్చినట్లు సర్వేలో తేలింది. ఈ బైపోల్ విషయంలో సోమాజిగూడ ప్రజలు కాంగ్రెస్‌నే గెలిపించాలనే క్లారిటీతో ఉన్నట్లు తేలిపోయింది. రెండు పార్టీల మధ్య 22 శాతం ఓట్ల తేడా అంటే మామూలు విషయం కాదు. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ఇక్కడ అస్సలు పనిచేయలేదనే విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ ఏరియాలో బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జస్ట్.. 1.2 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
వెంగళరావు నగర్ డివిజన్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా కాంగ్రెస్ బాగానే పర్ఫామ్ చేసింది. అధికార పార్టీకి 49.44 శాతం ఓట్లు వచ్చినట్లు సర్వేలో తేలింది. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు 43.98 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మిగతా డివిజన్లతో పోలిస్తే.. ఈ ఏరియాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా కొద్ది శాతమే కనిపిస్తోంది. బీజేపీకి ఈ ఏరియాలో 5.26 శాతం ఓట్లు పోలయ్యాయి.
యూసుఫ్‌గూడ డివిజన్ చూస్తే.. కాంగ్రెస్‌కు 52.87 శాతం, బీఆర్ఎస్‌కు 38.22 శాతం ఓట్లు పోలయ్యాయ్. ఇక్కడ కూడా పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యమే కనిపించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసుఫ్ గూడ డివిజన్‌కు చెందిన వ్యక్తి కావడంతో.. ఇక్కడి ఓటర్లు ఆయనకే మద్దతుగా నిలిచినట్లు కనిపిస్తోంది. అందువల్లే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దాదాపు 15 శాతం ఓట్ల తేడా కనిపిస్తోంది. ఇక.. ఇదే ఏరియాలో బీజేపీకి కేవలం 1.98 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
మొత్తంగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఏడు డివిజన్లలో.. బోరబండ, షేక్ పేట్ డివిజన్లలో మినహాయిస్తే.. మిగతా ఐదు డివిజన్లలో కాంగ్రెస్ ఆధిపత్యమే కనిపించింది. ముస్లిం ఓటర్లు, మిగతా సామాజికవర్గాలకు చెందిన ప్రజలంతా.. నవీన్ యాదవ్ వైపే నిలబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. డిసెంబర్ 14న రాబోయే ఫలితం కూడా బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్‌ని నిజం చేసేదిగా ఉండబోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్‌లో ఈసారి కూడా బీఆర్ఎస్‌కే పట్టం కడతారనే ప్రచారం నుంచి.. కాంగ్రెస్ ఎలా రైజ్ అయింది? జూబ్లీహిల్స్ బస్తీలు.. ఇలాంటి తీర్పు ఎందుకిచ్చాయ్? బీఆర్ఎస్‌కు వర్కవుట్ అవుతుందనుకున్న సెంటిమెంట్.. నవీన్ యాదవ్‌కి బలంగా పనిచేసిందా? జనం ఏయే అంశాలను బేరీజు వేసుకొని.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు? మాగంటి సునీత కంటే.. నవీన్ యాదవే బెటరని ఎందుకనుకున్నారు?
సాధారణంగా ఎప్పుడు బైపోల్ వచ్చినా.. ఆ ఎన్నికలో గెలుపు అవకాశాలు ఎక్కువగా అధికార పార్టీకే ఉంటాయ్. చాలా అరుదుగా మాత్రమే.. ప్రతిపక్ష పార్టీలు గెలుస్తుంటాయ్. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అయినట్లు కనిపిస్తోంది. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయ్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ అంటేనే.. క్లాస్, మాస్ ఏరియాలు కలిసిన ప్రాంతం. ఇక్కడ క్లాస్ ఏరియాతో పోలిస్తే.. పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే బస్తీలే ఎక్కువ ఉంటాయ్. మెజారిటీ ఓటర్లు కూడా ఆ ప్రాంతాల్లోనే నివాసముంటారు. రెహ్మత్ నగర్, బోరబండ, షేక్ పేట, ఎర్రగడ్డ లాంటి ఏరియాల్లో కాస్త రఫ్‌గా ఉంటేనే కుదురుతుంది. దీనికి మించి మాస్ పబ్లిక్ పల్స్ తెలిసినోడు అయి ఉండాలి. నవీన్ యాదవ్ అచ్చం అలాంటోడే. ఆ బస్తీల్లో పెరిగి, తిరిగి.. లీడర్‌గా ఎదిగిన వ్యక్తి. అందుకే.. జూబ్లీహిల్స్ ప్రజలు తమకు అందుబాటులో ఉంటాడనో, మరో కారణమో తెలియదు గానీ.. మొత్తానికి నవీన్ అయితేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
నవీన్ యాదవ్ మాస్ లీడర్. అందులోనూ.. యూసుఫ్‌గూడకు చెందిన నాయకుడు. జూబ్లీహిల్స్ నుంచి గతంలో పోటీ చేసి మంచి ఓట్లు సాధించారు. నియోజకవర్గ ప్రజలతో.. అతనికి ఇప్పటికే మంచి పరిచయాలతో పాటు గట్టి పట్టు కూడా ఉంది. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి కావడం కూడా ఆయనకు అనుకూలించినట్లు తెలుస్తోంది. ఇంతకుముందే.. రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారన్న సెంటిమెంట్ జనంలో ఇప్పటికే ఉంది. ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. జూబ్లీహిల్స్‌లో రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాలంటే.. అధికార పార్టీకే పట్టం కట్టాలనే ఆలోచన జనంలో బలంగా ఉంది. మాస్ లీడర్‌ని ఎన్నుకుంటేనే.. భవిష్యత్ కూడా బాగుంటుంది. ఇప్పటికే.. బీఆర్ఎస్‌కు మూడు సార్లు ఇక్కడి ప్రజలు అవకాశం ఇచ్చారు. నవీన్ యాదవ్‌కి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనే ధోరణి కూడా నవీన్ యాదవ్‌కి బలంగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అందువల్ల.. జూబ్లీహిల్స్‌లోని మెజారిటీ ప్రజలంతా.. నవీన్ వైపే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. ఇదే.. ఎగ్జిట్ పోల్స్‌లోనూ తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలు, యువతను ఆకట్టుకునే పథకాలు.. తమ నియోజకవర్గానికి మరింతగ చేరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలవాలనే ఆలోచన జూబ్లీహిల్స్ ఓటర్లు ఉండి ఉండొచ్చనే అంచనాలున్నాయి.
సిట్టింగ్ సీటుని నిలబెట్టుకోవాలనే ఆలోచనతో.. బీఆర్ఎస్ పూర్తిగా సెంటిమెంట్‌నే నమ్ముకుంది. కానీ.. ఈసారి అది పెద్దగా వర్కవుట్ కాలేదని.. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్‌లో తెలుస్తోంది. పైగా.. జూబ్లీహిల్స్‌లో మాస్ ఏరియాలు, మాస్ ఓటర్లే ఎక్కువ. వారికి కావాల్సింది కూడా మాస్ లీడరే! మాగంటి సునీత అలా కాదు. ఆమె.. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మాస్ ఇమేజ్ అంతగా తెలియదు. మాగంటి ఉన్నప్పుడు కూడా ఆమె పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్‌లో కనిపించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఆమె కొత్త నాయకురాలు.
సునీతను గనక ఎన్నుకుంటే.. షాడో ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉంటారన్న అనుమానం కూడా జనంలో కనిపించింది. అందువల్ల.. సునీతతో పోలిస్తే నవీన్ యాదవే తమ ఎమ్మెల్యేగా ఉండటమే బెటరనుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. నవీన్ యాదవ్‌తో పోలిస్తే.. సునీత ముందు నుంచి ప్రచారంలోనూ అంత యాక్టివ్‌గా కనిపించలేదు. కేటీఆర్ మాత్రమే జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారాన్ని తన భుజాన వేసుకొని తిరిగారు. అయినప్పటికీ.. జనం బీఆర్ఎస్‌ని సీరియస్‌గా తీసుకోలేదనే విషయం ఎగ్జిట్ పోల్స్‌తో తేలిపోయింది.
Also Read: కార్తీక మాసంలో కేక పుట్టిస్తున్న బంగారం.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే?
బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్‌తో అర్థమవుతున్న మరో విషయం ఏమిటంటే.. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఇంకా తొలగిపోలేదనే విషయం తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లవుతున్న సమయంలో వచ్చిన ఈ జూబ్లీహిల్స్ బైపోల్.. కాంగ్రెస్ ప్రజా పాలన బాగుందనే తీర్పునిచ్చారనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పూర్తిగా సెంటిమెంట్‌ని నమ్ముకొని బరిలోకి దిగినా.. హైదరాబాద్ ప్రజలు మాత్రం డెవలప్‌మెంట్‌నే కోరుకున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్‌తో తేలిపోయింది. పైగా.. బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు అవకాశం ఇచ్చారు. ఉపఎన్నిక రూపంలో వచ్చిన అవకాశంతో.. మార్పు కోరుకున్నారనే విషయం ఎగ్జిట్ పోల్స్‌తో స్పష్టమవుతోంది. మొత్తంగా.. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ వేవ్‌కి, నవీన్ యాదవ్ పర్సనల్ ఇమేజ్‌కి, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత తోడవడంతో.. ఎగ్జిట్ పోల్స్ హస్తం పార్టీకి అనుకూలంగా వచ్చినట్లు స్పష్టమవుతోంది. మరి.. ఎగ్జాక్ట్ రిజల్ట్ ఏమిటి? జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన ఒరిజినల్ తీర్పు ఏంటనేది.. ఈ నెల 14న తేలిపోతుంది.
Story By Anup, Bigtv