BigTV English

Bangladesh China Alliance: బంగ్లాదేశ్ బరితెగింపు.. భారత్‌‌ను ఆక్రమించేందుకు చైనాతో కలిసి!!

Bangladesh China Alliance: బంగ్లాదేశ్ బరితెగింపు.. భారత్‌‌ను ఆక్రమించేందుకు చైనాతో కలిసి!!

బంగ్లాదేశ్ బరితెగింపు..
చైనాతో కలిసి కుయుక్తులు..
భారత్ కే కవ్వింపులు..
ఈశాన్య రాష్ట్రాలపై పన్నాగాలు..

అవును పాముకు పాలు పోసి పెంచినా కాటు వేస్తుందంటారు కదా.. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. తిండికి టికానా లేని బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ ఆధిపత్యం నుంచి విముక్తి చేసి, అన్ని రకాలుగా ఆదుకుని, నిలబెడితే.. ఇప్పుడు భారత్ పైనే విషం చిమ్మే దుస్సాహసానికి తెగబడుతోంది. దుష్టులకు దుష్టబద్ధే ఉంటుందంటారు కదా.. బంగ్లాదేశ్ లో కొందరు మాట్లాడుతున్న మాటలు చూస్తే అదే నిజం అనిపిస్తుంది. మనం పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తే.. అదే అదునుగా.. చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని.. యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న ఫజ్లూర్ రెహమాన్ చేసిన కామెంట్ ఇది. దర్జాగా ఫేస్ బుక్‌లో పోస్ట్ కూడా పెట్టాడు. ఎంతటి బరితెగింపు లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి? ఏం చూసుకుని ఈ దుస్సాహసం? ఎవరి మెప్పు కోసం ఈ దిగజారుడు?


యూనస్ కు నిలువెల్లా భారత వ్యతిరేకత

ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా దూరంగా ఉన్నా లోలోపల మ్యాటర్ ఎలా ఉందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. యూనస్ నిలువెల్లా భారత వ్యతిరేకతను నింపుకున్నాడు. చైనా దగ్గర తీస్తోంది కదా అని డైలాగ్ డోస్‌లు పెంచుతున్నాడు. కానీ అదే ఏదో ఒక రోజు రివర్స్ అవుతుందని గుర్తించడం లేదు. ఓవైపు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ నుంచి కవ్వింపులు పెరగడంతో యాక్షన్ ప్లాన్‌కు ఇండియా రెడీ అవుతుంటే.. మధ్యలో బంగ్లాదేశ్ ఓవరాక్షన్ పెరుగుతోంది.

బంగ్లాదేశ్ ను విముక్తి చేసిన కృతజ్ఞత లేకుండా పైత్యం

బంగ్లాదేశ్ ఇవాళ ఈ పొజిషన్ లో ఉందంటే కారణం భారతే. పాకిస్తాన్ ఆధిపత్యంతో విసిగిపోయి ఏమీ చేయలేకపోయిన బంగ్లాదేశ్ భారత్ శరణుకోరితే.. మనం యుద్ధం చేస్తే పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారింది. అప్పుడు ఏ చైనా రాలేదు.. ఇంకెవరూ తోడు లేరు. మనమే సపోర్ట్ ఇచ్చాం. ఆ కృతజ్ఞత బంగ్లాదేశ్ కు అసలే లేదన్నది తాజా మాటల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.

బంగ్లాదేశ్ జాతీయ గీతం రాసింది రవీంద్రుడే

చివరికి బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బాంగ్లా ను రాసింది మన రవీంద్రుడే. రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్ గొప్పతనం గురించి పదాలు పేర్చి కూర్చి రాస్తే దాన్నే పాడుకుంటున్న వాళ్లు.. ఇప్పుడు భారత్ కు ఎదురు తిరిగి మన భూభాగాన్నే ఆక్రమించుకుందాం అంటూ మాట్లాడడం అందరికీ రక్తం మరిగిపోయేలా చేస్తోంది. అసలు బంగ్లాదేశ్ కు అంత సీన్ ఉందా.. బార్డర్ దాటి ఈశాన్య రాష్ట్రాల్లోకి అడుగు పెడితే ప్రాణాలతో ఉంటారా అసలు..? ఏం చూసుకుని ఈ మాటలు? బంగ్లాదేశ్ కు ఉన్న సైన్యమెంత.. వారి బలమెంత.. బలగమెంత.. ఆయుధ సంపత్తి ఎంత.. ఎవరి ముందు ఈ కుప్పిగంతులు? ఎందుకోసం ఈ వేషాలు? అంటే చైనా అండ దండ చూసుకునే ఇలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతోంది.

భారత్ వార్ జోన్ గా మారిందని చూపే యత్నాలు

చెప్పాలంటే చైనా ఆడినట్లు ఆడుతోంది. ప్రస్తుతం అమెరికా – చైనా వాణిజ్య యుద్ధంతో భారత్ బెనిఫిట్ పొందుతోంది. చైనా వస్తువులన్నీ ఆ దేశంలో ఓ డంప్‌గా మారిపోయాయి. కొనేవాళ్లు లేరు. దీన్ని ఓర్వలేని చైనా ఓవైపు పాకిస్తాన్ నుంచి డ్రామాలు, ఇంకోవైపు నుంచి బంగ్లాదేశ్ నుంచి గేమ్ నడిపిస్తోందా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. భారత్ కూడా వార్ జోన్ గా మారిపోయిందన్న బూచి చూపి.. ఇక్కడ వాణిజ్యం సాఫీగా జరగొద్దన్న గేమ్ ప్లాన్ తెరవెనుక నడుస్తోందా అన్నది కూడా ఒక చర్చ జరుగుతోంది.

రహమాన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని స్టేట్ మెంట్

1960ల్లో పాకిస్తాన్ సౌత్ ఏషియాలో ఆర్థికంగా చాలా బలంగా ఉండేది. అప్పుడు జరిగిన అభివృద్ధి కేవలం పాక్ కే పరిమితం అయింది. బంగ్లాదేశ్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అలాంటి పరిస్థితుల్లో భారత్ శరణు కోరితే బంగ్లావిమోచనకు యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే సలహాదారు చేసిన ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ మాటలకు తాము దూరం అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వశాఖ మొక్కుబడిగా ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది.

చేయాల్సిందంతా చేసి సంబంధం లేదంటారా?

యూనస్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఫజ్లూర్ రెహమాన్ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఖరిని, విధానాలను ప్రతిబింబించవు అని అన్నారు. ఇది సరిపోతుందా.. సలహాదారుగా ఉన్న వ్యక్తికి చీవాట్లు పెట్టకుండా, దూరంగా ఉంటామని అనడం ద్వారా కడుపునిండా విషం నింపుకున్నారన్నది బయటి నుంచి చూసిన వారెవరికైనా అర్థమయ్యే విషయమే.

చైనా పర్యటనలో యూనస్ చెత్త డైలాగ్ లు

యూనస్ సలహాదారు రహమాన్ ఈ కామెంట్స్ చేయడానికి తెరవెనుక చాలా నడిచింది. మార్చి తొలివారంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడ హిందూ మహాసముద్రానికి ఏకైక రక్షకుడు బంగ్లాదేశే అని చెప్పుకున్నాడు. భారత్ లోని 7 ఈశాన్య రాష్ట్రాలు చైనాకు సముద్రతీరానికి అడ్డంకిగా ఉన్నాయన్నాడు. అంతే కాదు.. చైనాకు ఆఫర్ కూడా ఇచ్చి వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా సరుకుల్ని బంగ్లాదేశ్ మీదుగా పంపుకోవాలని చైనాకు ఉచిత హామీ ఇచ్చాడు యూనస్.

బంగ్లాదేశ్ ఆధారపడుతోంది మన పోర్టులు, ఎయిర్ పోర్టులపైనే

అసలు ఏ లెక్కన యూనస్ ఈ మాట అన్నాడో అర్థంకాని విషయం. ఎందుకంటే.. పశ్చిమాసియా, యూరప్ సహా అనేక ఇతర దేశాలకు ఎగుమతుల కోసం బంగ్లాదేశ్… మన పోర్టులు, ఎయిర్ పోర్టులనే వాడుకుంటోంది. ఆధారపడేదంతా మన షిప్పింగ్ పోర్టులు, మన ఎయిర్ పోర్టుల మీద. చైనా దగ్గర మాత్రం డాంభికాలు. ఎందుకు ఈ డ్రామాలు?

ట్రాన్స్‌షిప్‌మెంట్ బెనిఫిట్ ను వెనక్కు తీసుకున్న భారత్

చైనా దగ్గర యూనస్ ఆ స్థాయి డైలాగ్ పేలిస్తే మనం ఊరుకుంటామా.. ఎక్కడ కథ మార్చాలో తెలియదా.. యూనస్ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత కొన్ని రోజులకే మిడిల్ ఈస్ట్, యూరప్ సహా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడానికి బంగ్లాదేశ్‌కు అనుమతించిన ట్రాన్స్‌షిప్‌మెంట్ బెనిఫిట్ ను వెనక్కు తీసుకుంది. దీంతో బంగ్లాదేశ్ నోటి మాట పోయింది. ఇండియాతో అనవసరంగా పెట్టుకుంటున్నామా అన్న అన్నది అనుభవంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లోసారి భారత్ పాక్ ఉద్రిక్తతలు నడుస్తున్న టైంలో అక్కడి నోళ్లు లేస్తుండడంతో శాశ్వతంగా బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు మనదేశంలో పెరుగుతున్నాయి.

బంగ్లాదేశ్ తన కెపాసిటీ చూసుకోకుండా మాట్లాడుతోందా?

బంగ్లాదేశ్ తన కెపాసిటీ చూసుకోకుండా మాట్లాడుతోందా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నారా? తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న యూనస్ దగ్గర్నుంచి ఆయన భజన బృందం అంతా భారత వ్యతిరేక వాదాన్ని వినిపించడంలో బిజీగా ఉన్నారెందుకు? షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్ కొత్త నేతల బరితెగింపు పెరిగిందా? మైనార్టీలపై దాడులు, భారత్ పై ఉగ్రసంస్థలను ఎగదోయడం ఇవన్నీ ఎవరూ మర్చిపోరు. అంతెందుకు బంగ్లాదేశ్ విమోచన సమయంలో పాకిస్తానీ ఆర్మీ చేసిన అకృత్యాలు బంగ్లాదేశ్‌కు గుర్తు లేదా?

బంగ్లాదేశ్ కు మానని గాయాలు మిగిల్చిన యుద్ధం

1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ఎన్నో మానని గాయాలను మిగిల్చింది. ఊచకోతలు, హింసాకాండలు, మహిళలపై అఘాయిత్యాలు.. కోట్లాది మంది శరణార్థులు.. 1971 ఆపరేషన్ సెర్చ్‌లైట్‌లో భాగంగా పాక్ ఆర్మీ ఇప్పటి బంగ్లాదేశ్‌లో ఉన్న లక్షల మందిని ఊచకోత కోసింది. ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేశారు. లక్షల మంది మహిళలపై పాక్ ఆర్మీ అత్యాచారాలు చేసింది. ఇవన్నీ మానని గాయాలే. కానీ పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేస్తే.. ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుందామన్న వక్రబుద్ధి బంగ్లాదేశ్‌లో కొందరు కీలక వ్యక్తులకు వచ్చిందంటే .. ఆ దేశాన్ని సరైన దారిలో పెట్టాల్సిన టైమ్ వచ్చినట్లే. ఇంతగా తెగించిన బంగ్లాదేశ్‌ను అసలు క్షమించవచ్చా?

బంగ్లాదేశ్ లో ఇప్పటికే హిందువులపై పెరిగిన హింస

గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత ఆ దేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దాడులను యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైంది. దీంతో భారత్ -బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. మతోన్మాద దేశంవైపు అడుగులు పడుతున్నాయా అన్న చర్చ అంతర్జాతీయంగా నడుస్తోంది. యూనస్ వస్తూనే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ ప్రకారం 52 జిల్లాల్లో 205 దాడులు జరిగాయి. ఇందులో టెంపుల్స్, ఇండ్లు, వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో హిందువులు అభద్రతాభావంతో ఉన్నారు.

బెంగాల్ వక్ఫ్ నిరసనల్లో బంగ్లా ఉగ్రవాద సంస్థ హస్తం

మొన్నటికి మొన్న బెంగాల్‌లో వక్ఫ్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి హిందువుల హత్యల దాకా మ్యాటర్ వెళ్లింది. ఆ ఘటనల్లో బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. బెంగాల్‌లో హింస వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. గతంలో బెంగాల్‌లో దాడులు చేసి, అలజడి సృష్టించిన చరిత్ర జమాతుల్‌ ముజాహిద్దీన్‌ బంగ్లాదేశ్‌ అనే సంస్థకు ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్‌పై పట్టు బిగిస్తోందని, ఏడు సరిహద్దు జిల్లాల్లో ఈ ఉగ్రసంస్థ ఉనికి ఉందని అంచనాలున్నాయి. సో భారత్ అలర్ట్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది.

బంగ్లాదేశ్ లో తిరుగుతున్న పాక్ గూడచారులు

బంగ్లాదేశ్ లో పాక్ గూడచారులు తిరుగుతూనే ఉంటారు. వారి పని బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో రాడికల్ గ్రూపులను రెచ్చగొట్టి, ఈశాన్య భారతంలో అల్లర్లు సృష్టించేలా స్కెచ్‌లు వేస్తుంటారు. ఎంత ధైర్యం లేకపోతే.. మనదేశంపై చాలా వరకు ఆధారపడి.. మన భూభాగాన్నే స్వాధీనం చేసుకునేలా ప్లాన్ చేద్దామని ప్రభుత్వానికి దగ్గరి వ్యక్తులు అనడం బంగ్లాదేశ్ దుస్సాహసానికి ఒక ఉదాహరణ మాత్రమే. బంగ్లాదేశ్‌తో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 16 బిలియన్ డాలర్లుగా ఉంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు భారత్ నుంచే కాటన్ సహా ఇతర ముడి పదార్థాలు ఎగుమతి అవుతుంటాయి. అంతెందుకు బంగ్లాదేశ్‌లో రైల్వే ట్రాక్స్, రోడ్లు, పోర్టులు అన్నీ నాసిరకంగా ఉన్నాయి. వాటిని బాగు చేసుకోవాల్సింది పోయి భారత్‌కు ఎదురు తిరిగితే నష్టం ఎవరికో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య 4,096 కిలోమీటర్ల సరిహద్దు

భారత్-బంగ్లాదేశ్ మధ్య 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. స్మగ్లింగ్, అక్రమ వలసలు, తీవ్రవాద బెదిరింపులు ఇక్కడ కామన్‌గా మారాయి. 2024 నాటికి, భారత్ 4,096 కిలోమీటర్ల సరిహద్దులో 3,180 కిలోమీటర్లు కంచె వేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేస్తే బంగ్లాదేశ్ చొరబాట్లకు మరింత చెక్ పెట్టొచ్చు. నిజానికి బంగ్లాదేశ్ ఇంతగా మాట్లాడడానికి కారణం.. చైనాను చూసుకునే. ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటూ చైనా బంగ్లాదేశ్‌లో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు.. బంగ్లాదేశ్‌కు రెండు సబ్‌మెరైన్‌లు, ఫ్రిగేట్‌లను సరఫరా చేసింది.

బంగ్లాదేశ్ కు కష్టకాలంలో కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన భారత్

వాళ్లు యుద్ధం చేయాలని రెచ్చగొట్టేలా ఆయుధాలు సప్లై చేస్తే… భారత్ మాత్రం ప్రాణాలు కాపాడుకోండి.. అని మానవతా దృక్పధంతో కరోనా టైంలో అంతా విలవిలలాడుతుంటే… కోవిడ్ వ్యాక్సిన్లు సప్లై చేశాం. అదీ మనకు ఇతర దేశాలకు ఉన్న తేడా. కానీ బంగ్లాదేశ్ కు అవేవీ కనిపించడం లేదు. కృతజ్ఞత అసలే లేదు. మరి అలాంటి దేశాన్ని ఎవరైనా క్షమిస్తారా? సో ఓవరాల్ గా భారత్‌తో ఉద్రిక్తతలను సృష్టించడం బంగ్లాదేశ్‌కు ఆర్థికంగా, రాజకీయంగా ఏమాత్రం ప్రయోజనకరం కాదు. ఎందుకంటే మనదేశమే బంగ్లాదేశ్ కు ప్రధాన వాణిజ్య భాగస్వామి. పొరుగు దేశం. ఇది బంగ్లాదేశ్ దృష్టిలో ఉంచుకోవాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×