Big Stories

AP Elections 2024: ఏపీ అసెంబ్లీ బరిలో 8 మంది మాజీ సీఎంల వారసులు.. ఎవరెవరంటే..?

AP Elections 2024 AP Elections 2024 (political news in ap): ఏపీ ఎన్నికల బరిలో అమీతుమీకి రెడీ అయ్యాయి అన్ని పార్టీలు. వైసీపీని గద్దె దించడమే టార్గెట్‌గా టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకటయ్యాయి. వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పోటీకి రెడీ అయింది. గెలుపు ఎవరిదనేది పక్కన పెడితే ఈ సారి ఎన్నికల్లో 8 మంద్రి కేండెట్లు అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. రాజకీయ వారసత్వాలు అందిపుచ్చుకున్న ఆ నేతల భవితవ్యం ఆసక్తికరంగా మారింది. వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఆ ఎనిమిది మందీ మాజీ సీఎంల వారసులే కావడం గమనార్హం.

- Advertisement -

వారసత్వ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు యావత్తు దేశంలో పరిపాటిగా మారాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల వారసులు పోటీ చేయడం సహజమే. ముఖ్యమంత్రి, మాజీ సీఎంల వారసులనూ ఎన్నికల బరిలో చూస్తూనే ఉంటాం. అయితే ఈ సారి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఉండటం.. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవడానికి మరో ఇద్దరు మాజీ సీఎంల కుమార్తెలు ప్రయత్నిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్‌ పులివెందుల నుంచి బరిలో ఉన్నారు. పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. తండ్రి ఉన్నప్పుడు 2009లో కడప ఎంపీగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్.. వైస్ మరణాంతరం వైసీపీ స్థాపించి.. 2012 రీపోల్స్‌లో తిరిగి కడప ఎంపీగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో వరుసగా పులివెందుల ఎమ్మెల్యేగా గెలుపొంది.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ సారి కూడా పులివెందుల నుంచి పోటీకి సిద్దమయ్యారు.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడైన నారా లోకేశ్‌ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనుమడు అయిన లోకేశ్‌.. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. గత ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా వారసుడు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆయన ఈసారి నియోజకవర్గం మారతారని ప్రచారం జరిగినా.. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు.. తిరిగి మంగళగిరి నుంచే బరిలో నిలిచారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం అసెంబ్లీ బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి బాలయ్య 2014, 2019 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు విజయం సాధించారు. గతంలో హిందూపురం నుంచి అన్న ఎన్టీఆర్ మూడు సార్లు.. బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ ఒకసారి గెలుపొందడం విశేషం. అదే హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయం కొట్టడానికి నందమూరి వారసుడు పాటుపడుతున్నారు.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. ఆయన కూడా మాజీ సీఎం కుమారులే.. మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు కూడా ఎన్టీఆర్‌ను గద్దెదించి కొంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ తరపున తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు కూడా 1989లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

Also Read: Arvind Kejriwal : జెయిల్ నుంచి పాలన సరే.. ప్రచారం ఎలా? ఎన్నికల ముంగిట కేజ్రీకి పరీక్ష!

మరో ముఖ్యమంత్రి వారసుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి.. ఆయన తండ్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు కాంగ్రెస్ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా డోన్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కోట్ల వారసుడు కాంగ్రెస్ అభ్యర్ధిగా మూడు సార్లు కర్నూలు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ఈ సారి డోన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తండ్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పని చేశారు. కాంగ్రెస్‌ పలుకీలక పదవులు అనుభవించిన జనర్ధానరెడ్డి మరణానంతరం ఆయన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కాంగ్రెస్ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు వారి వారసుడు మరోసారి వెంకటగిరి బరిలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఎంపీ కేండెట్ల విషయానికొస్తే.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి గతంలో బాపట్ల, విశాఖపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాషాయ కండువా కప్పుకున్న పురంధేశ్వరి.. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె.. ఈ సారి ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశముందంటున్నారు.

Also Read: Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ లెక్కలివే.. BRS తో సహా ఏ పార్టీకి ఎంతంటే..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా దూకుడు ప్రదర్శిస్తున్నారు వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, సీఎం జగన్‌ సోదరి అయిన వైఎస్‌ షర్మిలారెడ్డి కూడా ఈ సారి కడప ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అన్న జగన్‌తో విబేధించి రాజకీయ ప్రత్యర్ధిగా మారిన షర్మిల.. వైసీపీ సర్కారును గద్దె దించడమే లక్ష్యమంటున్నారు. మొత్తమ్మీద ఈ సారి ఎన్నికల్లో ఇంతమంది సీఎం వారసులు ఫోకస్ అవుతుండటం ఇంట్రెస్టింగ్‌గా తయారైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News