BigTV English

BJP Politics: ముగ్గురూ ముగ్గురే.. ముఖం చాటేస్తున్న లీడర్లు

BJP Politics: ముగ్గురూ ముగ్గురే.. ముఖం చాటేస్తున్న లీడర్లు

BJP Politics: ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా కరీంనగర్ జిల్లా బీజేపీ నేతల యవ్వారం ఉందన్న విమర్శలు వస్తున్నాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించడానికి అష్టకష్టాలు పడ్డ క్యాడర్ వైపు ఇప్పుడు వారు కన్నెత్తి కూడా చూడటం లేదట.. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దగ్గరుండి కార్యకర్తలను గెలిపించాల్సిన నాయకులు.. తమకేం పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ద్వితీయ శ్రేణి నేతలు తర్జనభర్జన పడుతున్నారట.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని క్యాడర్ గొణుక్కుంటున్న పరిస్థితి అక్కడ నెలకొంది.. ఇంతకీ కాషాయపార్టీలో ఆ పరిస్థితికి కారణమేంటి?


జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల సెగ్మెంట్లలో సత్తా చాటుకున్న బీజేపీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ.. కోరుట్లలో అయితే టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్సెస్‌ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్.. ఇక జగిత్యాలలో పోటీ చేసిన భోగా శ్రావణి 43 వేల ఓట్లకు పైగా సాధించారు.. జగిత్యాలలో బీజేపీ మూడో స్థానంలో నిలిచినప్పటికి.. కొన్ని గ్రామాలు, జగిత్యాల పట్టణంలో పలు చోట్ల ఆధిక్యత ప్రదర్శించడం కేడర్ లో కొత్త జోష్ నింపింది..


లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ

అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లో కంటిన్యూ చేస్తూ… కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలలో స్పష్టమైన ఆధిక్యత సాధించింది.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ జగిత్యాల అసెంబ్లీ పరిధిలో కమలం పార్టీకే ఆధిక్యత లభించింది.. కోరుట్ల నియోజకవర్గంలోనూ మంచి మెజారిటీనే వచ్చింది.. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల పురోగతిని చూసుకుని తమకు మంచిరోజులు వచ్చాయని సంబరపడ్డాయి స్థానిక కాషాయ శ్రేణులు.. అయితే నేతలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లే విధంగా వ్యవహరిస్తున్నారట.. కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ… తాను నియోజకవర్గానికితరచుగా వస్తానని.. పార్టీని పటిష్టం చేస్తానని ప్రకటనలు చేశారు.. ఆయన ఎంపీ అయ్యాక ఒకటిరెండు సార్లు తప్ప కోరుట్ల జగిత్యాల వైపు కన్నెత్తి చూసింది లేదట.. కోరుట్లలో ఉన్న లోకల్ లీడర్లను ఖాతరు చేయడం లేదట.. గత ఎన్నికల ముందు అనేక వ్యయప్రయాసల కోర్చిన సురభి నవీన్‌రావు లాంటి వాళ్లను పట్టించుకోకపోవడంతో పార్టీలో వారు సైలెంట్ అయ్యారట.. ఆయన నియోజకవర్గానికి రాకుండా.. తమకు లోకల్‌గా అండగా ఉండే లీడర్‌ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లడంతో.. కక్కలేక మింగలేక కమలం క్యాడర్ సతమతమవుతోందంట

బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్ పదవి దక్కించుకున్న శ్రావణి

బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్న భోగ శ్రావణి అప్పట్లో లోకల్ ఎమ్మెల్యేతో కయ్యం వల్ల బయటకు రావాల్సి వచ్చింది.. తనకు అవమానం జరిగిందంటూ ఆమె రచ్చకెక్కడం.. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.. కారు దిగిన శ్రావణి కాషాయం కండువా కప్పుకుని జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు.. జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని దాదాపు 25 శాతం ఓట్లను సాధించింది.. కాస్తంత కష్టపడితే నెక్స్ట్‌ ఎలక్షన్స్‌ల గెలిచే చాన్స్‌ వస్తుందని అంతా భావించారు.. జగిత్యాలలో పొలిటికల్ సినారియోను తమకు అనుకూలంగా మార్చుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని క్యాడర్ భావించింది..

బీజేపీ కార్యక్రమాలకు దూరమవుతున్న శ్రావణి

అయితే ఏం జరిగిందో ఏమో… పార్లమెంట్ ఎన్నికల తర్వాత భోగ శ్రావణి క్రమంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించేశారట.. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లోనూ ఆమె పాల్గొనడం లేదట.. నియోజకవర్గ నేతలకు.. పట్టణ ముఖ్య నాయకులకు కూడా అందుబాటులో ఉండకుండా, ఒకవేళ కలిసినా ఎడమొఖం పెడమొహం అన్నట్టుగా ఉంటున్నారట .. ఇలా నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. తమకేం పట్టనట్టుగా వ్యవహరించడం ఇప్పుడిప్పుడే జగిత్యాల బలపడుతున్న కమలం పార్టీకి అడ్డంకిగా మారిందంటున్నారు ఆ పార్టీ సీనియర్లు.. పార్లమెంట్ ఎన్నికల సమయంలోని పెట్టిన ఖర్చులకు శ్రావణి లెక్కలు చూపలేదని.. అడగడం వల్లనే ఇలా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారట కాషాయ కార్యకర్తలు..

ఎంపీ అరవింద్ ప్రయార్టీ ఇవ్వడంలేదని శ్రావణి అలక

అదేం కాదు.. ఎంపీ అరవింద్‌తో తేడా రావడం… ఆయన పట్టించుకోకపోవడం, నియోజకవర్గంలో తనకు ప్రయార్టీ ఇవ్వకుండా ఇతర నేతలకు పదవులు ఇవ్వడం వల్లనే శ్రావణి పార్టీకి దూరం అయ్యారనే టాక్ కూడా నడుస్తోందట.. గత ఏడాదిన్నరగా ఇలా టచ్ మీ నాట్ అన్నట్టు సాగిన వ్యవహరం తాజాగా మరో మలుపు తిరిగింద… ఇన్నాళ్లు జగిత్యాలోనే నివాసం ఉన్నశ్రావణి సడన్‌గా ఇక్కడ నుంచి హైదరాబాద్ మకాం మార్చడంతో ఏంజరుగుతుందో క్యాడర్‌కు అంతుపట్టడం లేదట.. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట తిరిగిన చోటా మోటా నాయకులకు ఇది మింగుడు పడటం లేదట.. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన తరుణంలో నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి దూరం జరగడంపై జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చే జరుగుతోంది.

Also Read: టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. కారణం ఇదేనా?

ఓటమి తర్వాత సిరిసిల్లలో కనిపించని రుద్రమదేవి

ఇక రాణిరుద్రమ దేవి.. అనూహ్యంగా సిరిసిల్ల నుండి బీజేపీ టికెట్ దక్కించుకొని ఎన్నికల సమయంలో ఎన్నెన్నో మాటలు చెప్పారు.. సిరిసిల్ల లోనే స్థానికంగా నివాసం ఉంటానని, ఏ సమస్య వచ్చినా తానే ముందుండి కొట్లాడుతానని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకున్నారు .. అప్పటి వరకి సిరిసిల్ల బిజేపి టికెట్ తమకే అనుకున్న నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీనుండి‌ జంప్ అయిపోయారు..ఇప్పుడు ‌వారులేరు, పోటి చేసిన వారు లేరు…స్థానిక‌సంస్థలు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తమ‌ నియోజకవర్గం ఇంచార్జ్ ఎవరో తెలియని పరిస్థితి కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోందంట.. రాణిరుద్రమదేవి ఎన్నికలో ఓటమి తరువాత సిరిసిల్ల వైపు కనీసం‌‌ కన్నెత్తి చూడడం లేదు.. దాంతో బీజేపీ క్యాడ్ తమకి‌ సమస్యలు వస్తే కేంద్రమంత్రి బండిసంజయ్ వద్దకే వెళ్లాల్సి వస్తోందంట. మరి ఆ మూడు సెగ్మెంట్లలో పార్టీ క్యాడర్‌ని లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు బీజేపీ పెద్దలు ఎలా సంసిద్ధం చేస్తారో చూడాలి.

Story By Rami Reddy, Bigtv

Related News

AP Politics: టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. కారణం ఇదేనా?

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Srikakulam Politics: దువ్వాడ కుల రాజకీయం

KCR: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

Big Stories

×