Jyotirlinga Darshan: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోది.. భువిపై వెలసిన కైలాసంగా ప్రసిద్ధికెక్కింది శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దివ్యక్షేత్రంలో ఆ పరమేశ్వరుడు.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా దర్శనిస్తున్నారు. భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్నాడు. ఇక, మధ్యప్రదేశ్‌లో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు సైతం మహా మహిమాన్విత క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
శ్రీశైల మందిరం.. శ్రీమల్లికార్జునం అంటూ భక్తులు ఎలుగెత్తి చాటే దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జ్యోతిర్లింగం దర్శనమిస్తోంది.
శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు.. అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. స్థలపురాణం ప్రకారం చూస్తే కృష్ణా నదీ తీరంలో మల్లికాపుర మహారాజు చంద్రకేతుడు నుంచి తనను రక్షించమంటూ అతడి కూతురు చంద్రమతి వేడుకోవడం.. శివభక్తురాలైన చంద్రమతి కోసం స్వయంగా ఆ పరమశివుడు దిగివచ్చి ఆమెను రక్షించారని చెబుతారు. భక్తురాలి మొర ఆలకించి కష్టాలను తీర్చడంతో ఆ మహేశ్వరుడు నాటి నుంచి ఇక్కడ మల్లికార్జునుడనే నామధేయంతో పూజలందుకుంటున్నారని అంటారు.
భ్రమరాంబ పేరుతో అమ్మవారు దర్శనం ఇవ్వడంపైనా ఆసక్తికరైన కథ ప్రచారంలో ఉంది. బ్రహ్మ నుంచి అనేక వరాలు పొందిన అరుణాసురుడు అనే రాక్షసుడు తనను ఎవరూ ఏం చేయలేరని విర్రవీగుతున్న సమయంలో కోపగించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి పెద్ద సంఖ్యలో భ్రమరాలను సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతడి సైన్యాన్ని సంహరిస్తాయి. అప్పటి నుంచి అమ్మవారు సైతం భ్రమరాంబ పేరుతో భక్తులను కటాక్షిస్తున్నారని అంటారు భక్తులు.
శ్రీశైల ఆలయం నాలుగు మండపాలతో, అద్భుతమైన శిల్ప సంపదతో కన్పిస్తుంది. ఈ ఆలయంలో గర్భాలయం వెనుక భాగాన గోడకు చెవి ఆనించి వింటే ఝమ్మునే నాదం విన్పిస్తుందన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. కేవలం ఇక్కడి జ్యోతిర్లింగమే కాదు.. సమీపంలోని సాక్షి గణపతి, పంచ పాండవుల దేవాలయాలు, పాతాళ గంగ సహా మరెన్నో ఆలయాలు ఇక్కడ భక్తులతో పూజలందుకుంటున్నాయి.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అన్నింటికంటే భిన్నమైనది మహాకాలేశ్వర్. స్మశానమే నా నివాసం అంటూ చెప్పే ఆ పరమేశ్వరుడికి భస్మాన్ని హారతిగా ఇవ్వడం ఇక్కడ సంప్రదాయం. అంతేకాదు.. అన్ని జ్యోతిర్లింగాల్లోనూ దక్షిణ ముఖంగా కన్పించే జ్యోతిర్లింగ క్షేత్రం సైతం ఇదే కావడం మహాకాలేశ్వర్ ప్రత్యేకత.
మోక్షాన్ని ప్రసాదించే సప్త పురాల్లో ఒకటిగా మధ్యప్రదేశ్ ఉజ్జయినీ నగరంలోని శిప్రా నదీ తీరంలో ఉన్న మహాకాలేశ్వర్‌ను చెబుతారు. పైగా సూర్యసిద్ధాంతం ప్రకారం జీరో మెరిడియన్ రేఖాంశాన్ని కర్కటరేఖ ఖండిస్తున్న ప్రదేశంలోనే ఉండడంతో ఖగోళశాస్త్ర ప్రకారం కూడా ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అభివర్ణిస్తుంటారు. రుద్రసాగర్ సరస్సు ఒడ్డున స్వయంభువుగా వెలిసిన మహాకాలుడి ఆలయం ఐదు అంతస్తుల్లో కన్పిస్తుంది. ఈ క్షేత్రంలో మహాకాలేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా, నాగ చంద్రేశ్వరుడిగా పరమశివుడు భక్తులను కటాక్షిస్తుంటారు.
ఈ ఆలయంలో చెప్పుకోదగినది భస్మ మందిరం. ఆ భూత నాధుడికి భస్మహారతి కోసం ఆ రాత్రి స్మశానంలో మొదటగా కాలిన శవానికి సంబంధించిన భస్మాన్ని అర్చకులు తీసుకువస్తారు. దానిని పది మంది నాగ సాధువులు శివలింగానికి భస్మాభిషేకం చేస్తారు. అయితే.. ఇటీవలె ఆ పద్దతికి స్వస్తి పలికి ఆవుపేడతో తయారైన పిడకలను కాల్చి విభూతిని తయారు చేస్తారు. దానితోనే భస్మాభిషేకం చేస్తారు. ప్రతి నిత్యం తెల్లవారుజామున 4 గంటలకు నిర్వహించే ఈ భస్మహారతి కోసం దేశం నలుమూలల్నించి భక్తులు తరలి వచ్చి నిరీక్షిస్తారు.
మధ్యప్రదేశ్‌లోనే ఉన్న మరో మహిమాన్వితమైన జ్యోతిర్లింగం ఓంకారేశ్వరం. ఇక్కడి శివలింగం రెండుగా చీలిపోయి కన్పిస్తుంది. ఒకటి ఓంకారేశ్వర ప్రణవ లింగంగా, మరోటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా దర్శనమిస్తుంది. అందుకే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఈ క్షేత్రాన్ని ఓంకార మమలేశ్వరమ్ అని స్తుతిస్తారు.
కేవలం ఇదే కాదు.. శివ పురాణం ప్రకారం చూసినా శివుడి ఢమరుక నాదం నుంచి వెలువడిన తొలి ధ్వని ఓంకారంగా చెబుతారు భక్తులు. సకల చరాచర సృష్టికి మూలంగా భావించే ఓంకారాన్ని సాక్షాత్తూ పరమేశ్వరుని స్వరూపంగా కొలుస్తారు. అసలు స్మరించినంత మాత్రానే సకల పాపాలను పోగొట్టే క్షేత్రం ఓంకారేశ్వర్‌గా విశ్వసిస్తారు భక్తులు.
అతి పురాతన జ్యోతిర్లింగాల్లో ఒకటి ఈ క్షేత్రం. ఓంకారేశ్వర క్షేత్రంలో ఓంకారేశ్వరుడే కాకుండా.. పరిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాళేశ్వర్, కేదారీశ్వర్, గుప్తనాథ్ పేరుతో ఉపాలయాలున్నాయి. ఈ అయిదు ఆలయాలను కలిపి పంచలింగ ధామాలుగా పిలుస్తారు. ప్రతి రోజూ పవిత్ర నర్మదా నదీ జలాలతో పునీతమయ్యే ఈ దివ్యధామాన్ని ఒక్కసారి తిలకించినా జన్మ ధన్యమైనట్లుగా భక్తకోటి భావిస్తుంది.
హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ. ఆ పరమశివుడు సాక్ష్యాత్తూ కాశీ విశ్వనాథుడిగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంటారు. పరమేశ్వరుడి సృష్టిగా పేర్కొనే కాశీలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. గంగా హారతులు, నాగ సాధువుల సంచారాలు, నిత్యం పూజలు, భజనలతో ఆధ్యాత్మిక సౌరభం విరజిల్లే క్షేత్రం కాశీ. ఇక, స్వయంగా శ్రీరాముడే ప్రతిష్టించిన శివలింగమే రామేశ్వర లింగంగా భక్తుల పూజలు అందుకుంటోంది.
వారణాసి, బెనారస్.. పేర్లు వేరైనా గుర్తుకొచ్చేది ఒక్కటే.. అదే కాశీ. మన దేశంలోని అతి ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రధానమైనది కాశీ విశ్వనాథ క్షేత్రం. ఉత్తర ప్రదేశ్‌లోని గంగానది ఒడ్డున ఉన్న ఈ మహా మహిమాన్విత క్షేత్రం విశిష్టత అంతా ఇంతా కాదు. అసలు కాశీ అనే పేరు స్మరించినంతనే సకల పాపాలు ధ్వంసమవుతాయని పురాణాల్లో సైతం ఉంది.
కాశ్యాన్తు మరణాన్ ముక్తి.. ఈ ఒక్క దానికోసమే ఎంతో మంది కాశీ వస్తుంటారని చెప్పడంలో ఏ మాత్రం అతిశయేక్తి కాదు. నిజానికి ఈ సమస్త భూమండలంపై ప్రాణాలు జీవించడానికి బతుకుతుంటాయి. కానీ, ఒక్క కాశీలో మాత్రమే మరణించడం కోసం జీవిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వారణాసిలో చనిపోతే మోక్షం లభిస్తుందని ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వేలాదిగా కాశీకి వస్తారు.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత విశిష్టమైనదిగా కాశీని చెబుతుంటారు. యావత్ విశ్వంలో స్వయంగా పరమేశ్వరుడు సృష్టించిన క్షేత్రంగా వారణాసిని పేర్కొంటారు భక్తులు. అందుకు తగ్గట్లుగానే వేల సంవత్సరాల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ప్రతి నిత్యం వేలాది మంది యాత్రికులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకొని కన్పిస్తుంది కాశీ నగరం.
కాశీ క్షేత్రం విశిష్టతను వర్ణించేందుకు మాటలు చాలవు. వేలాది ఆలయాలు, గంగా హారతులు, నాగ సాధువుల సంచారాలు, నిత్య పూజలు, భజనలు.. ఇలా ప్రతి నిమిషం ఆధ్యాత్మిక సౌరభంతో విరాజిల్లుతూ కన్పిస్తుంది వారణాసి. కాశీ పట్టణం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగానే కాదు.. శక్తి పీఠంగానూ పూజలందుకుంటోంది. సతీదేవి చెవి కుండలాలు పడిన ప్రాంతంగా వారణాసి ప్రసిద్ధి చెందింది.
పరమ శివుని జటాజూటం నుంచి భువికి దిగిన గంగానదిలో పవిత్రమైన పుణ్యస్నానం ఆచరించి కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకుంటారు భక్తులు. మహ్మదీయుల కాలంలో పలుమార్లు దండయాత్రలు జరగగా ఆలయం ధ్వంసమైంది. అయితే.. 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు.
కాశీలో ఉన్న మరికొన్ని విశిష్టతలు, ఆలయాల గురించి చెప్పాలంటే కాలబైరవ స్వామి ఆలయం, సంకట మోచన్ హనుమాన్ ఆలయం, భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు 80కి పైగా స్నానఘాట్లు ఉన్నాయి. ఇక, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, దశాశ్వమేధ ఘాట్ లాంటివి ప్రధానమైనవి. ఇక్కడే మరణించిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి నిత్యం కాశీలో ఎంతో మందికి అంతిమ సంస్కారాలు, పిండ ప్రదానాలు జరుగుతుంటాయి.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మరో విశిష్టమైన క్షేత్రం రామేశ్వరం. పురాణాల ప్రకారం రావణాసురుడిని శ్రీరాముడు సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోకుండా ఉండేందుకు ఏం చేయాలని మహర్షులను కోరారట. అయితే.. శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రామచంద్రుడికి సలహా ఇచ్చారట రుషులు. అయితే.. కైలాసం వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడట శ్రీరాముడు. కానీ, సమయం దగ్గర పడుతున్నా హనుమ రాకపోవడంతో సీతాదేవి సముద్రం ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట. ఆ లింగాన్ని రాముడు పూజించి ప్రతిష్టించారట. అనంతరం హనుమ తీసుకు వచ్చిన శివలింగాన్ని ప్రతిష్టించడంతో ఇక్కడ రెండు శివలింగాలు కన్పిస్తాయి. అయితే.. భక్తులు మొదటగా హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించిన అనంతరం రాముడు ప్రతిష్టించిన లింగాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
రామేశ్వరంలో మొత్తం 64 బావులు ఉంటాయి. వీటిలో 22 ముఖ్యమైనవి. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తన వద్ద ఉన్న 22 బాణాలతో ఇక్కడ 22 బావుల్ని సృష్టించారని పండితులు చెబుతారు. అందుకే వీటి వద్ద స్నానం ఆచరించిన తర్వాత ఆలయంలోకి వెళ్తారు. అయితే.. ఈ తీర్థాలన్నీ సముద్రం పక్కనే ఉన్నా.. ఒక్కో బావిలోని నీరు ఒక్కో రుచిలో ఉంటుందని భక్తులు చెబుతారు.
రామనాథస్వామిగా భక్తుల పూజలు అందుకునే జ్యోతిర్లింగాన్ని దర్శించిన భక్తులు ఓ దివ్యానుభూతికి లోనవుతారట. ఇక, నంది మండపంలో ఉన్న నంది విగ్రహం ఎత్తు సుమారు 17 అడుగులుగా ఉంటుంది. హనుమంతుడి విగ్రహం మాత్రం శ్రీలంక వైపు చూస్తున్నట్లుగా ఇక్కడ కన్పించడం మరో విశేషం.
మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపై పచ్చని ప్రకృతి అందాల మధ్య వెలసిన దివ్య జ్యోతిర్లింగ క్షేత్రం భీమ శంకరం. కుంభకర్ణుడి కుమారుడు భీముడిని ఈశ్వరుడు సంహరించిన ప్రాంతమే ఈ భీమ శంకరంగా చెబుతారు.
భీమ శంకరం క్షేత్రం సమీపంలో ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. అదే భీమా నది. స్థల పురాణం ప్రకారం భీముడు, శివుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు కొన్ని చెమట బిందువులు శివుని శరీరం నుంచి భూమ్మీద పడ్డాయట. అలా పుట్టిందే ఈ భీమా నదిగా స్థలపురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. కొండ కోనల మధ్య కొలువు తీరిన భీమ శంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు కొంత దూరం కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.
త్రిమూర్తులు ఒకే పానవట్టంలో దర్శనమిచ్చే అరుదైన జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో భక్తులు స్వయంగా తాకి ఆ పరమశివుడికి అభిషేకం చేయగలిగే శివలింగం ఘృష్ణేశ్వరం. హిమ పర్వతాల్లో కొలువు తీరిన మహిమాన్విత క్షేత్రం కేదార్‌నాథ్. దారుకావనే నాగేశం అంటూ ఆ పరమశివుడ్ని గుర్తు చేసే జ్యోతిర్లింగం నాగనాథ్.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రత్యేకమైనది త్రయంబకం. మహారాష్ట్రలో ఉన్న ఈ క్షేత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు ఒకే పానవట్టంపై దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహిస్తారు. పచ్చని కొండలు, గోదావరి గలగలల మధ్య నల్లరాతి కట్టడంతో అత్యంత సుందరంగా కన్పించే త్రయంబకేశ్వరం నాసిక్ టౌన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
త్రిమూర్తులు ప్రత్యక్షమైన ప్రదేశం కావడంతో ఈ జ్యోతిర్లింగ క్షేత్రానికి త్రయంబకం అనే పేరు వచ్చిందంటారు భక్తులు. ఆది పరాశక్తి సైతం ఇక్కడే కొలువై ఉంది. అంతేకాదు.. 33 కోట్ల మంది దేవతలు ఇక్కడే వెలసి ఉన్నారన్నది హిందువుల విశ్వాసం.
త్రిమూర్తులు వెలసిన ఈ జ్యోతిర్లింగం సోమనాథ, మహాకాలేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంత విశిష్టత ఉన్నదిగా గుర్తింపు పొందింది. మూడో పేష్వా అయిన బాలాజీ బాజీరావు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి. ఈ ఆలయంలో మరో విశేషం.. నందీశ్వరుడుకి ప్రత్యేకంగా గుడి ఉండడమే.
ఇక, అన్నింటికంటే చిత్రమైనది ఇక్కడి శివలింగం పానవట్టం నుంచి నిత్యం జలధార ఉబికి వస్తుంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది.
నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్‌లోని గోమతి ద్వారక, బేట్ ద్వారక ద్వీపం మధ్య ఉంది. ఇక్కడ నాగనాథ్ ఆలయంలో కొలువు తీరిన స్వామి వారిని నాగేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు. రుద్ర సంహితలోని దారుకావనే నాగేశం అనే శ్లోకంతో ఇక్కడ వెలసిన నాగేశ్వరుడిని భక్తులు స్తుతిస్తుంటారు.
నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని దర్శిస్తే వ్యాపారంలో నష్టపోయిన వారు తిరిగి నిలదొక్కుకుంటారని, వారి వ్యాపారం మళ్లీ అభివృద్ధి బాటలో నడుస్తుందని చెబుతారు. ఇక్కడే అమ్మవారు సైతం నాగేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని దారుకావనంగా భక్తులు వ్యవహరిస్తంటారు.
హిమగిరుల్లో వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగం కేదార్‌నాథ్. ఉత్తరాఖండ్ గర్వాల్ ప్రాంతంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఆ పరమేశ్వరుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రమిది. సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంచే ఈ ఆలయాన్ని చేరుకోవడం చాలా కష్టమైన పని. అయినా సరే భక్తులు ఆ పరమశివుడి దర్శనం కోసం పరితపిస్తూ ముందుకు సాగుతారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకెళతారు.
కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడేందుకు వారణాసి వెళ్లి శివుడ్ని ప్రార్థించారట. అయితే.. కాశీ విశ్వనాథుడు వాళ్లను అనుగ్రహించకుండా వృషభ రూపంలో హిమాలయాలకు చేరుకోవడంతో పాండవులు సైతం అక్కడికే వెళతారు. ఆ సమయంలో భీముడు తోకపట్టుకోబోగా వృషభం భూమిలోకి వెళ్లిపోతుంది. అలా ఆ వృషభం మూపురంతో పాండవులకు ముక్తి కలుగుతుంది. దీంతో.. ఈ ప్రాంతంలోనే శివుడు కొలువై కేదార్‌నాథుడిగా దర్శనమిస్తుంటారు.
ఈ ఆలయం మిస్టరీల్లో చెప్పుకునేవి చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 2013లో భారీ వర్షాలు కురిసినప్పుడు కేదార్‌నాథ్ ఆలయం చెక్కుచెదరకుండా పెద్ద పెద్ద బండ రాళ్లు అడ్డం ఉండడం అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ పరమేశ్వరుడు ఉన్నాడనేందుకు ఇదే సాక్ష్యం అంటుంది భక్తకోటి.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చిట్ట చివర క్షేత్రం ఘృష్ణేశ్వరం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వేరూల్ గ్రామంలో ఉందీ క్షేత్రం. ఘుష్మ అనే మహా భక్తురాలి కోరిక మేరకు ఆ పరమశివుడు స్వయంభువుగా వెలసిన ప్రదేశమే ఘృష్ణేశ్వరంగా చెబుతారు భక్తులు.
ఘృష్ణేశ్వరుని ఆలయం సుమారు 240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పుతో ఇప్పటికీ ఎంతో పటిష్టంగా కన్పిస్తుంది. ఇక్కడి విశేషం ఏంటంటే భక్తులు స్వయంగా ఆ జ్యోతిర్లింగాన్ని తాకి తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం ఉండడం. ఇలా అవకాశం ఉన్న ఏకైక ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఘృష్ణేశ్వరం మాత్రమే.
Also Read: దిల్లీ వేదికగా తెలంగాణ హక్కుల పోరాటం.. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి 11 దర్శించినా చివరిదైన ఘృష్ణేశ్వరం దర్శిస్తేనే మొదటి 11 జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యఫలం దక్కుతుందట. అందుకే భక్తులు పెద్ద సంఖ్యలోనే ఘృష్ణేశ్వరం వచ్చి ఆ గరళకంఠుడిని దర్శించుకుంటారు. స్వామివారి సేవలో తరిస్తుంటారు.