Revanth Reddy: తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తిరుగులేని సత్తాని చాటింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని, పట్టణ ఓటర్ల మద్దతు పొందడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ చారిత్రాత్మక విజయానికి బాటలు వేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీనిస్తూ, వందకు పైగా మున్సిపాలిటీలు, మెజారిటీ కార్పొరేషన్లపై హస్తం పార్టీ జెండాను ఎగురవేసి, రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును మరోసారి నిరూపించుకుంది కాంగ్రెస్. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలన పట్ల జనంలో ఉన్న అభిమానానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమై, భవిష్యత్‌లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం ఢిల్లీలో పర్యటించారు. వానాకాలం పంటకు సంబంధించి తెలంగాణలో అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని.. ఎఫ్‌సీఐ తీసుకోవాలని, కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలని అడిగారు. 2024-25 వానా కాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్‌కు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారని, దానిని మరో 2 నెలలు పాటు పొడిగించాలని కోరారు. 2014-15కి సంబంధించి తెలంగాణకు బకాయి ఉన్న 1468 కోట్లని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 నుంచి 2022 వరకు సప్లై చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్‌లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343 కోట్లని వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఈసా-మూసీ నదుల సంగమ స్థలిలో.. ప్రపంచస్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్నగాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణహితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపడుతున్నట్లు కేంద్రమంత్రికి వివరించారు. అందులో భాగంగానే ఈసా-మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో జాతిపిత మహత్మా గాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూ ఘాట్ దగ్గరే.. గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, సుస్థిరాభివృద్ధి, నిరాడంబర జీవనశైలిని ప్రతిబంబించేలా.. గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలిపారు. శాంతి చిహ్నం, నేషనల్ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
వరంగల్ సమీపంలో నిర్మించనున్న మామూనూరు ఎయిర్‌పోర్టుని.. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడికి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్, ఓవర్‌హాల్, రిపేర్ సదుపాయాలు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని చెప్పారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. అదనంగా అవసరమైన 250 ఎకరాలు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడికి పంపిస్తానని.. కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతోనే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి.. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న విషయం తెలియజేశామని గుర్తు చేశారు. ఈ మార్గంలోని టేకల్‌కోడ్‌లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని, సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నామనే వివరాలను కేంద్రమంత్రికి అందించారు. కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని అనేక సమిెంట్ పరిశ్రమలకు సమీపంలో.. కృష్ణా ప్రాంతం ఉందన్నారు. కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లని పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇక.. హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు, పుణె హైస్పీడ్ రైల్ కారిడార్లకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని కేంద్రమంత్రికి తెలిపారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచే.. హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని సూచించారు. హైదరాబాద్ – చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. దానివల్ల డ్రైపోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతం అవుతుందన్నారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే ప్రారంభమైతే ట్రై జంక్షన్ అవుతుందన్నారు. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని కోరగా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఇక.. ఢిల్లీ టూర్‌లోనే హైస్పీడ్ రైల్ కారిడార్ల
అలైన్‌మెంట్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రైట్స్ కన్సల్టెంట్ సంస్థకు సూచనలు చేశారు. అలైన్‌మెంట్లు, డీపీఆర్‌కు సంబంధించి వారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం.. సలహాలు అందజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో సీఎం ఓటు వేశారు. ప్రజాస్వామ్య సౌధానికి పునాది ఓటు అని గుర్తు చేశారు.
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్.. సీఎంని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. అదేవిధంగా.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న జాతర మహోత్సవానికి కూడా హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని.. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయన్నారు. తెలంగాణ రూపాయి చెల్లిస్తే.. కేంద్రం 42 పైసలు ఇస్తోందన్నారు. అదే.. బీహార్ రూపాయి పన్ను చెల్లిస్తే.. కేంద్రం 6 రూపాయలకు పైగా తిరిగి ఇస్తోందని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ రోజైనా.. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని, మనం చెల్లించిన నిధులు తిరిగిస్తే చాలని చెప్పారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో దక్షిణాది రాష్ట్రాలే 40 శాతానికి పైగా చెల్లిస్తున్నాయని తెలిపారు. తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయడమే కాదు, హైదరాబాద్‌కు వచ్చిన సెమీకండక్టర్ ప్రాజెక్టుని కూడా మోడీ ఒత్తిడి చేసి ఏపీకి తరలించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
బైట్.. సీఎం రేవంత్ రెడ్డి ( కేంద్రం అన్యాయం మీద మాట్లాడింది మాత్రమే )
ఈ వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొడవటంచ గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అతిథి గృహంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులో బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. అదేవిధంగా.. జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డుని రద్దు చేస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారంపై.. సీఎం స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాని తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. అలాంటిదేమైనా చేయాలనుకుంటే.. బహిరంగంగా ప్రజలకు చెప్పి, అసెంబ్లీలో చర్చించి, ప్రతిపక్షాల సూచన తీసుకున్నాకే జిల్లాల గురించి ఆలోచిస్తామన్నారు. సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని సైతం సీఎం ఖండించారు. కార్మికుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప, నష్టం కలిగే నిర్ణయం తీసుకోదన్నారు. సింగరేణి గని కార్మికులు తమ భుజాలపై మోసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం 6 వేల 116 కోట్లను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తొలి, మలి విడత పోరాటంలో వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పాత్ర, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రను ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 2027లో నిర్వహించబోయే గోదావరి పుష్కరాల గురించి ప్రస్తావిస్తూ.. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Story by: Anup, Big tv