AP Politics: నిత్యం వివాదాలకి చిరునామా.. పార్టీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. టీడీపీలో వివాదాలు ఎక్కడున్నాయంటే ఠక్కున గుర్తొచ్చే పేరు తిరువూరు నియోజకవర్గం.. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహార శైలిపై మరోసారి తిరువూరు ఎమ్మెల్యే అసంతృప్తి వెలగక్కుతున్నారు. ఎంపీ నా ఎమ్మెల్యే నా తేల్చుకోవాలని పార్టీకి అల్టిమేటం ఇస్తున్నారు..
వివాదానికి కేంద్ర బిందువుగా మారిన కేశినేని చిన్ని..
సరిగ్గా 16 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన దగ్గరనుంచి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో 8 గొడవలు 16 పంచాయితీలు.. 20 బుజ్జగింపులు అన్నట్లు తయారైంది పరిస్థితి. ఆ తలనొప్పికి ఎంపీ కేశినేని చిన్ని కూడా కేంద్రమయ్యారు . నిన్నటి వరకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతోనే తలనొప్పి ఆనుకుంటే ఇప్పుడు పార్టీకి ఎంపీ కూడాపెద్ద తలనొప్పిగా మారారంట.
గత ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుపెట్టానంటున్న ఎంపీ
ఎంపీ వ్యవహార శైలితో విజయవాడ పార్లమెంటులో టిడిపి ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. కారణం గత పార్లమెంట్ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుపెట్టి తన నియోజకవర్గ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించాను .. కాబట్టితాను చెప్పిందే శాసనం, చేసిందే చట్టం అంటున్నారంట ఎంపీ. కేశినేని చిన్ని తీరుతో ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు లబోదిబోమంటున్నారు… ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఒకరు ఉంటే, ఎంపీ నియమించిన షాడో ఎమ్మెల్యే మరొకరు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారంట.
తిరువూరులో చక్రం తిప్పుతున్న ఎంపీ అనుచరుడు కిషోర్
తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను ఉన్నాగాని తన మాట పట్టించుకోకుండా, ఇసుక, మద్యం, మట్టి ఇలా అన్ని వ్యవహారాల్లో ఃఎంపీ అనుచరుడు కిశోరే చక్రం తిప్పుతున్నాడని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. కష్టపడ్డ పార్టీ కార్యకర్తలని పక్కనపెట్టి, వైసిపి కోసం పనిచేసిన వ్యక్తులకు డబ్బులు తీసుకొని మరి ఎంపీ కార్యాలయంలో కూర్చొని నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తున్నారని కొలికపూడి కార్యకర్తల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరువూరు కార్యకర్తలకు తలనొప్పిగా మారిన ఎంపీ, ఎమ్మెల్యేల వివాదం..
ఎంపీ తీరుతో విసిగిపోయానని, ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నానని.. 24వ తేదీన సీఎం చంద్రబాబును కలిసి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు.. కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్తానని కొలికపూడి అంటున్నారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వివాదం కాస్త ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తలకు తలనొప్పిగా మారింది.. అధిష్టానం మద్దతు ఎవరికి ఉందో ..తాము ఎవరు వైపు ఉండాలో తెలియక తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోతున్నారంట
అధిష్టానం హెచ్చరించినా తీరు మార్చుకోని కొలికపూడి..
పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి నిత్యం ఏదో ఒక విషయంలో కొలికపుడి శ్రీనివాస్ అసంతృప్తి వెల్లగక్కుతూనే ఉన్నారు. సందర్భం ఏదైనా సరే తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతూ పార్టీకి తలనొప్పిగా మారారు. ప్రస్తుతతంనియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను గెలిస్తే వేరొకరి పెత్తనం ఏంటంటు ఎమ్మెల్యే అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఇప్పటిక అనేకసార్లు పార్టీ అధిష్టానం పిలిచి ఆయన్ని హెచ్చరించింది. అయినా కానీ కొలకపూడి తీరులో మార్పు కనిపించడం లేదు.. ఆయన మాత్రం తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం ఏంటంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సునీత ఉండగా.. విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్.. అసలు కథ ఇదే!
మొత్తమ్మీద ఎంపీ , ఎమ్మెల్యేల తీరుతో తిరువూరు నియోజకవర్గం వివాదాల సుడిగుండంలో చిక్కుకుకుంటుంది. ఆ నియోజకవర్గంలో పార్టీని కాపాడే బాధ్యతను అధిష్టానం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరి నియోజకవర్గంలో ఎంపీ ప్రాధాన్యత తగ్గిస్తారా?.. ఎప్పటి మాదిరిగానే కొలికపూడికి నచ్చచెప్పి పంపిస్తారా అనేది త్వరలోనే తేలిపోతుంది..
Story By Apparao, Bigtv