Mega Hyderabad Expansion: ముంబై.. ఢిల్లీ.. బెంగళూరు.. చెన్నై.. దేశంలో ఇలాంటి మెట్రో సిటీలు ఎన్ని ఉన్నా.. ఇక హైదరాబాదే తోపు సిటీ! దేశంలోనే అతిపెద్ద మహానగరంగా.. గ్రేటర్ హైదరాబాద్ అవతరించింది. 27 అర్బన్ లోకల్ బాడీలను.. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క డెసిషన్‌తో.. గ్రేటర్ హైదరాబాద్.. గ్రేటెస్ట్ సిటీ కాబోతోందా? ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో వచ్చే ఊహించని మార్పేంటి?
నగర శివార్లలోని 27 అర్బన్ లోకల్ బాడీల విలీనం..
నగర శివార్లలోని 27 అర్బన్ లోకల్ బాడీల మెర్జర్‌తో.. హైదరాబాద్ మరింత లార్జర్‌గా మారబోతోంది. దేశంలోని మిగతా సిటీలకంటే బిగ్గర్‌గా కనిపించబోతోంది. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో.. హైదరాబాద్ మ్యాప్‌తో పాటు జీహెచ్ఎంసీ షేప్ కూడా కొత్తగా కనిపించబోతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ఈ దేశంలోనే అతిపెద్ద మహానగరంగా హైదరాబాద్ అవతరించింది. ప్రస్తుతం.. 650 చదరపు కిలోమీటర్లుగా పరిధి, కోటీ 45 లక్షల మంది జనాభాతో ఉన్న జీహెచ్ఎంసీ.. ప్రభుత్వ నిర్ణయంతో 1983 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. కోటీ 69 లక్షల మంది జనాభాతో.. గ్రేటర్ హైదరాబాద్ అతిపెద్ద నగరంగా అవతరించింది. అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ కోసం.. గ్రేటర్ విస్తరణ అనివార్యమైంది. మన తర్వాతే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చైన్నె మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. కోర్ అర్బన్ ప్రాంతంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను.. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
3 కార్పోరేషన్లుగా విభజించాలా? ఒకటిగా కొనసాగించాలా?
జీహెచ్ఎంసీలో కొత్తగా 27 అర్బన్ లోకల్ బాడీలు విలీనం చేయనున్నారు. వీటిలో.. పెద్ద అంబర్‌పేట, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్ ఉన్నాయి. వీటి విలీనానికి వీలుగా జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణలను క్యాబినెట్ ఆమోదించింది. విస్తరించిన జీహెచ్ఎంసీని.. పాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లుగా విభజించాలా? ఒకే సంస్థగా కొనసాగించాలా? అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధితో హైదరాబాద్ కార్పొరేషన్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు సమాంతరంగా.. మిగతా రెండు కార్పొరేషన్లు ఉండే అవకాశం ఉందనే చర్చ మాత్రం జరుగుతోంది.
డివిజన్ల ఏర్పాటు, సరిహద్దుల నిర్థారణపై కసరత్తు
ఆ కార్పొరేషన్ల పరిధిలో గందరగోళానికి తావు లేకుండా డివిజన్ల ఏర్పాటు, సరిహద్దుల నిర్ధారణపై కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి పెరగడంతో.. ఇప్పుడున్న 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక విలీనం తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి.. పరిపాలన, పన్నులు, ప్రజా సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత మిగతా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ప్రధాన మౌలిక సదుపాయాల అప్‌గ్రేడేషన్ కోసం.. జీహెచ్ఎంసీ పరిధిలో అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం.. 14 వేల 725 కోట్లు ఖర్చు చేయనుంది సర్కార్.
మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీలు అప్‌గ్రేడ్
1990 చివర్లో హైదరాబాద్‌లో ఫార్మా, ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. ఆ తర్వాత.. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీలు అప్‌గ్రేడ్ అయ్యాయి. 2008లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో.. ప్రపంచం నలుమూలల నుంచి ప్రయాణికులు, కార్గో సేవలు అందుబాటులోకి రావడంతో.. గ్రోత్ డబుల్ అయింది. అదే సమయంలో.. ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో.. వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌ని ఎయిర్‌పోర్ట్‌కి లింక్ చేశారు. దాంతో.. హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయ్. నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలు.. గ్రేటర్ వైపు ఫోకస్ చేశాయ్. మల్టీ నేషనల్ కంపెనీలు, స్కిల్డ్ ఎంప్లాయిస్‌కి హైదరాబాద్ వేదికైంది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో.. నగరం ఫైనాన్షియల్, టెక్నికల్ కేంద్రంగా హైదరాబాద్ మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రో అందుబాటులోకి రావడంతో.. నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దాంతో.. సిటీ డెవలప్‍మెంట్.. పశ్చిమం వైపు నుంచి దక్షిణం వైపు విస్తరించింది.
ప్రపంచంలోని 37 మెగా సిటీలలో ఆరు భారత్‌లోనే..
ప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా సిటీలలో.. ఆరు భారత్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చైన్నె, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలు కేవలం పాపులేషన్ సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆర్థిక, ఉద్యోగ కేంద్రాలుగా మారాయి. 146 కోట్ల జనాభా ఉన్న దేశంలో.. దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, దాదాపు 88 కోట్ల జనాభాకు చేరుతుందనే అంచనాలున్నాయి. ఇప్పుడు మన మెట్రో నగరాలు.. ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతున్నాయ్. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల లాంటివన్నీ.. నగరాల అభివృద్ధి, విస్తరణకు కారణాలుగా కనిపిస్తున్నాయ్. జీహెచ్‌ఎంసీ విస్తరణతో కొత్తగా విలీనమయ్యే.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పన్నులు పెరుగుతాయ్. అందుకనుగుణంగా.. అభివృద్ధి సమాంతరంగా జరిగే అవకాశాలూ ఉంటాయి. కొత్తగా విలీనమైన పట్టణాల్లో.. భూముల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ ఊహించనంత పెద్దదిగా మారిపోతుంది సరే.! మరి.. ఈ విలీనంతో జరగాల్సినంత అభివృద్ధి జరుగుతుందా? కావాల్సినంత నిధుల్ని ప్రభుత్వం సమకూరుస్తుందా? ప్రజల నుంచి రావాల్సినంత మద్దతు వస్తుందా? ఈ గ్రేటర్ మెర్జర్ గురించి.. గ్రేటర్ ప్రజలు ఏమనుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీలో విలీనం కాబోతున్న ప్రాంతాల్లో.. పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఔటర్ వరకు.. పేరుకు తగ్గట్లుగానే గ్రేటర్ హైదరాబాద్ గ్రేటెస్ట్ సిటీగా మారిపోతుందా?
దేశంలోని మెట్రో నగరాలకే బాద్‌షాగా హైదరాబాద్
హైదరాబాద్.. దశాబ్దాలుగా దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహానగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు.. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో.. హైదరాబాద్ దేశంలోని మెట్రో నగరాలకే బాద్‌షాగా అవతరించనుంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరుతో పాటు చెన్నై, కోల్‌కతా లాంటి మెట్రో నగరాలన్నింటిని వెనక్కి నెట్టి.. అగ్రస్థానంలో నిలవనుంది. ఈ విలీనంతో ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్‌లోనూ.. హైదరాబాద్ పేరు రీసౌండ్‌లో వినిపిస్తుంది. వాస్తవానికి.. కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరం నలుదిక్కులా శరవేగంతో విస్తరించింది.
సిటీలోనే స్థిరపడుతున్న అనేక రాష్ట్రాల ప్రజలు
ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే.. లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండటం, భాషా సమస్య లేకపోవడంతో.. విద్య, ఉద్యోగావకాశాలు, వ్యాపారం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినవారు సిటీలోనే స్థిరపడుతున్నారు. దాంతో.. ఇప్పటికే ఈ మహానగరం ఔటర్ రింగ్ రోడ్డుని దాటిపోయింది. ఇప్పటికే ఫార్మా, ఐటీ రంగాలకు కేరాఫ్‌గా ఉన్న హైదరాబాద్.. మిగతా రంగాల్లోనూ దూసుకుపోతోంది. బయో టెక్నాలజీ, ఇతర వ్యాపార, వాణిజ్య రంగాల్లో వృద్ధి వేగంగా కొనసాగుతోంది. మొత్తంగా.. ఓ వైపు నిజాం చారిత్రక నేపథ్యం, మరోవైపు అత్యాధునిక హైటెక్ నగరంగా హైదరాబాద్ విలసిల్లుతోంది. దీనిని కొనసాగించడంతో పాటు హైదరాబాద్ ఖ్యాతిని మరించ పెంచేలా.. గ్రేటర్ రూపురేఖల్ని సమూలంగా మార్చేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన ప్రణాళికాబద్ధమైన అభివద్ధి..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. యూనిఫామ్ డెవలప్‌మెంట్. అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలనే ఆలోచనతో.. ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణీకరణ వేగంగా పెరిగినా, ఆ ప్రాంతాల్లోని చిన్న మున్సిపాలిటీలు, పంచాయతీలు కోర్ సిటీతో సమానంగా మౌలిక సదుపాయాలను అందించలేపోయాయ్. ఇదే సమయంలో.. శివార్లలో అస్తవ్యస్తంగా పెరుగుతున్న నిర్మాణాలకు, పర్యావరణ సమస్యలకు, వనరుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ లాంటివన్నీ.. జీహెచ్ఎంసీ పర్యవేక్షణలోకి తీసుకురావడం ద్వారా పౌర సేవలు మరింత మెరుగవుతాయనే చర్చ జరుగుతోంది. అంతేకాదు.. గ్రేటర్ పరిధి విస్తరణని పెంచడం ద్వారా.. నగర అభివృద్ధికి మెరుగైన ప్రణాళికలు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కెపాసిటీని పెంచడం, మౌలిక సదుపాయాల కల్పనలో మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించేందుకు.. అవకాశాలు పెరుగుతాయ్. అయితే.. పెరిగిన పరిధికి అనుగుణంగా ప్రభుత్వం నిధులను సమకూరుస్తుందా? లేదా? అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయ్.
ఇప్పటికే.. జీహెచ్ఎంసీ వల్ల నగరంలో ఆశించినంత అభివృద్ధి జరగట్లేదనే అభిప్రాయాలున్నాయ్. పూర్తిగా ప్రభుత్వమే అభివృద్ధి పనులు చేపడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఈ విలీనంతో.. శివారు ప్రాంతాల్లోనూ ప్రాపర్టీ ట్యాక్స్‌లు, ఇతర పన్నుల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. జీహెచ్ఎంసీ విస్తరణ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అనేక పరిశ్రమలు వస్తాయంటున్నారు. ఎక్కడికక్కడ జాయింట్ కమిషనర్ ఆఫీసులు నిర్మిస్తే.. పరిపాలనకు ఇబ్బంది ఉండదంటున్నారు. ప్రభుత్వానికి 80 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. అందువల్ల.. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి సరిపోను నిధులు, అధికారాలు అప్పగిస్తే.. హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.
27 పట్టణ స్థానిక సంస్థల విలీన నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. శివారు ప్రాంతాల్లోని కొందరు ప్రజలు.. మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌర సేవలు అందుతాయని ఆశిస్తున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో సరైన పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, గ్రేటర్ పరిధిలోకి వస్తే.. పన్నులు పెరిగినా మెరుగైన సేవలు అందుతాయని చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలకు, భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నగరవాసులు భావిస్తున్నారు.
ఇక.. జీహెచ్ఎంసీ ఇప్పటికే అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. విస్తరణకు తగ్గట్లుగానే.. ప్రభుత్వం నిధులు కేటాయించగలదా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆస్తి పన్నులు, ఇతర పన్నుల భారం పెరుగుతుందనే ఆందోళన ఉంది.
Also Read: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్
మరోవైపు.. ఇంకొద్ది నెలల్లో జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుండటంతో.. కార్పొరేటర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డివిజన్ల అభివృద్ధి కోసం కార్పొరేటర్లకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో డివిజన్‌కు 2 కోట్ల చొప్పున 150 డివిజన్లకు 300 కోట్లు కేటాయించింది. వీటిలో.. కోటి రూపాయలను.. నేరుగా కార్పొరేటర్ ప్రతిపాదించే పనులకు ఖర్చు చేయనున్నారు. మరో కోటి రూపాయలను రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, పార్కుల లాంటి ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఖర్చు చేయనుంది జీహెచ్ఎంసీ. ఏదేమైనా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెంపు అనేది.. హైదరాబాద్‌ని గ్రేటెస్ట్ సిటీగా మార్చే దిశగా ఓ కీలకమైన ముందడుగు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విలీనం తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు సైబరాబాద్ కూడా మరింత బలోపేతమవుతుంది. సమర్థవంతమైన ప్రణాళిక, స్థిరమైన నిధులు, రాజకీయ సంకల్పం ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్ పేరుకు తగ్గట్లుగానే గ్రేటెస్ట్ సిటీగా మారుతుంది. ప్రపంచంలోనే గర్వించదగ్గ నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఇందుకు.. నగర విస్తరణతో పాటు ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పన కూడా చాలా అవసరం. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సమానంగా జరిగితేనే.. ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది. ప్రజలకు మేలు జరుగుతుంది. విలీనం తర్వాత.. పాలనా వ్యవస్థని మరింత సమర్థవంతంగా మార్చడం ముఖ్యం. పెరిగిన పన్నులను, నియంత్రణలను ప్రజలు అంగీకరించాలంటే.. అందుకు తగ్గట్లుగానే.. మెరుగైన సేవలను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలి.
Story By Anup, Bigtv