Gudivada Amarnath: ఉమ్మడి విశాఖ రాజకీయాల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హవా బానే నడిచింది. వారసత్వంతోరాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారాయన. మాట్లాడే ప్రతి మాట జనాల్లోకి నెగిటివ్‌గానో.. పాజిటివ్‌గానో జనం నోళ్లతో నానుతూనే ఉండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు అడ్డే లేకుండా చేసుకున్న ఆ మాజీ మంత్రి ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గుడివాడ ప్రస్తుతం విశాఖ వైసీపీ రాజకీయాల్లో ప్రాధాన్యత లేకుండా చేయడంతో దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇంతకీ గుడివాడ ఏందుకు సైలెంట్ అయ్యారు?
చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్
ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసిన ఆయన సభలు సమావేశాల్లో తన నోటి దూకుడుతో హైలెట్ అయ్యారు. ఆ దూకుడుతో మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరయ్యారు. రాజకీయాల్లో పాజిటివ్‌గా మాట్లాడినా నెగిటివ్‌గా మాట్లాడినా మనుగడలో ఉండడం అన్న అంశాన్ని వంట బట్టించుకుని జిల్లాలో రాజకీయం నడిపారు.
గుడివాడ గురునాధరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి గుడివాడ అమర్నాథ్ అదే ఫార్ములా ఫాలో అవుతూ వచ్చారు. మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలి రోజుల్లో టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. తర్వాత వైసిపి తీర్థం పుచ్చుకుని అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టి మీడియా ముందు తన మాటలతో ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించారన్న అపవాదు మూటగట్టుకున్నారు. గుడ్డు మంత్రని నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు.
గాజువాకలో 95 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన రికార్డు
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందడంతో అధికారం కోల్పోయింది. గుడివాడ అమర్‌నాథ్ ఆ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి 95 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్‌ను విభజిత విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది వైసీపీ అధిష్టానం. వైసిపి నిర్ణయంతో గత సంవత్సర కాలంగా అనేక ఆందోళనలు నిర్వహించి, ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం చర్చనీయాశంగా మారింది.
ఎన్నికల ముందు అనకాపల్లి ఇన్ఛార్జ్‌గా తప్పించిన జగన్
2024 ఎన్నికల ముందు అనకాపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా గుడివాడ అమర్నాథ్‌ను తొలగించి.. ఎన్నికలు వచ్చేవరకు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది చెప్పకుండా … చివరిలో గాజువాక నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక, గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లాలో ఉండడం, అమర్నాథ్‌కు సొంత ప్రాంతం కావడంతో వైసిపి అధికారంలో లేకపోయినా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ వైసిపి అధిష్టానం నుండి వచ్చే సూచనలు పాటిస్తూ ముందుకు కొనసాగారు.
చోడవరం వైసీపీ ఇన్ఛార్జ్‌గా పంపించిన జగన్
అంతవరకు బాగానే నడిచింది. సడన్‌గా జగన్ పార్టీ పటిష్టత పేరుతో అమర్నాథ్ ను గాజువాక నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా తొలగించి అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించారు. చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వైసిపి సీనియర్ నాయకుడు కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంట్ ఇన్చార్జిగా పంపించి గుడివాడ అమర్నాథ్‌కు చోడవరం బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఒకింత అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరిగింది. గత సంవత్సర కాలంగా విశాఖ జిల్లాలో ముఖ్యంగా విశాఖ నగరంలో జిల్లా అధ్యక్షుడిగా రాజకీయాలు చేస్తూ తన కేడర్‌ని సెట్ చేసుకున్న గుడివాడ అమర్నాథ్‌ను సడన్ గా మారుమూలన ఉన్న చోడవరం పంపించడంతో అక్కడ పార్టీని పుంజుకునేలా చేయడం కష్టంతో కూడుకున్న పని అని గుడివాడ అమర్నాథ్ సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తుంది.
కరణం ధర్మశ్రీ క్యాడర్ సహకారంపై అనుమానాలు
దానికి తోడు చోడవరం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జికారణం ధర్మశ్రీ క్యాడర్ తనకు ఎంతవరకు సహకరిస్తుందో అని ఆయన సందేహపడ్డారంట. కాకపోతే గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాధరావు గతంలో అనకాపల్లి నుంచి గెలిచి మంత్రిగా చేసిన అభివృద్ధితో రూరల్ ఏరియాలో కూడా ఆయనకు పాజిటివ్ కార్నర్ ఉంది. చోడవరం నియోజకవర్గంలో కూడా ఆ పాజిటివ్ కార్నర్ పార్టీ శ్రేణుల్లో తనకు కలిసి వస్తుందని గుడివాడ అమర్నాథ్ చోడవరం నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు.
అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియామకం
ఇంతలో జగన్ విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా విశాఖ నార్త్ నియోజకవర్గం ఇన్చార్జి కేకే రాజుకు బాధ్యతలు కట్టబెట్టారు. దాంతో ఒక్కసారిగా విశాఖ జిల్లాతోనూ విశాఖ నగరంతోను రాజకీయంగా గుడివాడ అమర్నాథ్‌కు ఉన్న బంధం తెగిపోయింది. విశాఖ రాజకీయాల నుంచి తనను తప్పించడంతో ఆయన తెగ ఫీల్ అయ్యారంట. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గుడివాడ అమర్నాథ్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దాని వెనక అమర్నాథ్ కు ఏదైనా వ్యూహం ఉందా లేదా కావాలనే సైలెంట్ అయ్యారా అనేది వైసిపి అధిష్టానానికి కూడా అర్థం కావడం లేదంట.
పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొన్న అమర్‌నాథ్
ముఖ్యంగా విశాఖ జిల్లాలో కాపుల ప్రాబల్యం ఉన్న గాజువాక, విశాఖ నార్త్, భీమిలి, పెందుర్తి నియోజక వర్గాలలో ఏదో ఒకచోట ఆ వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్‌కు వైసీపీ ఇన్చార్జిగా నియమించవచ్చు. కానీ విశాఖ రాజకీయాలకు దూరం చేయడంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉండడం బెటర్ అని ఆలోచించుకున్న గుడివాడ అమర్నాథ్ మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. దానికి తోడు అమర్నాథ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే అమెరికా వెళ్లడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో గుడివాడ అమర్నాథ్ పేరు ఎక్కడ వినిపించడం లేదు.
వెన్నుపోటు దినం ఆందోళనల్లో కనపించని అమర్‌నాథ్
వెన్నుపోటు దినం ఆందోళనల్లో కూడా అమర్నాథ్ కనిపించకపోవడంతో అసలు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా, లేదా అమెరికాలో ఉన్నారు కాబట్టి సైలెంట్ అయ్యారా? అన్న చర్చ నడిచింది. తన ఉనికిని కాపాడుకోవడం కోసం గుడివాడ అమర్నాథ్ అమెరికాలో ఉన్నా కూడా ఓ ప్ల కార్డు పట్టుకుని … ఆందోళనకు మద్దతు తెలియజేసి … కచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉండే వాళ్ళని .. అది కూడా చేయకపోవడంపై వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
గాజువాక నుంచి తప్పించారని ఫీల్ అవుతున్న గుడివాడ
వైసీపీ అధిష్టానం తనను విశాఖ రాజకీయాలకు దూరంగా ఉంచడంతో అలిగిన ఆయన వైసీపీ నాయకుల అరెస్టుల విషయంలో కానీ, సాక్షి కార్యాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో గాని స్పందించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా వైసీపీనే నమ్ముకుని ప్రయాణం కొనసాగిస్తున్న గుడివాడ అమర్నాథ్ గాజువాక ఇన్చార్జ్‌గా తననే నియమించి, విశాఖ జిల్లా రాజకీయాల్లో ఉంచితే పార్టీ బలోపేతానికి యాక్టివ్‌గా పనిచేసే వాడినని సన్నిహితులు దగ్గర వాపోతున్నారంట. మరి చూడాలి రెండు నెలల అమెరికా ట్రిప్ ముగించుకుని వచ్చిన ఆ మాజీ మంత్రి ఏ మాత్రం యాక్టివ్ అవుతారో?
Story By apparao, Bigtv Live