బీఆరెస్ అధినేత కేసీఆర్ తను చేసిన పొరపాట్లు దిద్దుకునే పనిలో ఉన్నారా? తాము ఓడిపోవడానికి కారణమైన లోపాలను సవరించుకునే పనిలో ఉన్నారా? పదే పదే ఇచ్చిన వారికే టికెట్లు ఇవ్వడమే తమ కొంపముంచిందని కేసీఆర్ భావిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తున్నది. గత కొంతకాలంగా గులాబీ దళపతి .. ఆ పార్టీలైన్‌ను గమనిస్తే మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి కొత్త వారిని తెచ్చిపెట్టుకోవాలని సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
సిట్టింగులకే మళ్లీ మళ్లీ టికెట్లు ఇవ్వడం, నియోజకవర్గాల్లో వారినే ప్రోత్సహించడం, ద్వితీయ శ్రేణి నాయకులెవర్నీ ఎదగనీయకుండా చేయడం.. కేసీఆర్ చేసిన ప్రధాన లోపంగా గుర్తిస్తున్నారు. ఎలాగైన తనను చూసి, తన పథకాలను చూసి.. ప్రజలు ఎలాగైనా గెలిపిస్తారనే అతి విశ్వాసం కూడా దీనికి తోడైంది. దీంతో పార్టీ ఓటమి పాలైంది. దాదాపు 30 మంది క్యాండిడేట్లను మారిస్తే బాగుండేదనే అభిప్రాయం అప్పుడు పార్టీలో వచ్చింది. కానీ కేసీఆర్ వినలేదు. సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యేల అరాచకాలు, అవినీతిపై ఫిర్యాదులు అందాయి.
అయినా కేసీఆర్ డోంట్ కేర్ అన్నారు. కొన్ని సీట్లు పోయినా.. అధికారం పోయేంతగా కాదు.. అని సర్దిచెప్పుకున్నాడే తప్ప.. తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు తప్పని సరిగా వారిని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోహమాటానికి పోయి… ఇంకా ఇంకా వారితోనే నెట్టుకొద్దామని భావిస్తే ప్రజలు మరింతగా చీత్కరిస్తారనే భయం అధినేత మదిలో ఉంది. అందుకే ఇప్పట్నుంచే పరిస్థితిని చక్కబెట్టే పనిని మొదలు పెట్టాడాయన.
అందులో భాగంగానే జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం. ఇలా ఇతర పార్టీ నేతలపై కేసీఆర్ ప్రధానంగా గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఎక్కడైతే పార్టీపై, సదరు మాజీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందో .. కచ్చితంగా వాటిలో కొత్త వారితో పోటీ చేయించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అదీ జనరల్ ఎన్నికలకు ఏడాదిన్నర పైగా ముందు నుంచే. ఎందుకంటే.. తీరా ఎన్నికల సమయానికి లీడర్‌ను మారిస్తే.. ఆ మాజీలు తమతో ఉన్న క్యాడర్‌ను మొత్తం పట్టుకుని ఇతర పార్టీలకు జంప్ అయ్యే చాన్స్ ఉంది.
అప్పుడు పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. గతంలో అదే జరిగింది. చివరి నిమిషయంలో మారిస్తే.. నిర్ణయం తీసుకుంటే అది మరింత డ్యామేజీ చేస్తుందనే భయపడ్డారు కేసీఆర్. అందుకే క్యాండిడేట్లను మార్చలేదు. నష్టం జరిగినా .. ఓడినా అది తీవ్రస్థాయిలో ఉండనుకున్నారు. కానీ పరిస్థితి చేయి దాటిపోయిందని ఫలితాలు వచ్చిన తరువాత గానీ తెలియరాలేదు. అందుకే ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పట్నుంచే వేట మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు గాలం వేసే పనిలో ఉన్నారు.
వారికి టికెట్ కన్ఫమేషన్‌తో పాటు పదవులు, ఆర్థిక అండదండలు .. తదితర తాయిలాలు ముందుగానే ప్రకటించి.. భరోసా ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి దాదాపు 30 మంది వరకు కొత్త వారితో ఆయా నియోజకవర్గాలను నింపాలని, వారే ఇంచార్జిలుగా వ్యవహరిస్తూ.. ఎన్నికల కోసం అంతా రెడీ చేసుకుని ఉండేలా కార్యచరణను రెడీ చేస్తున్నారు. జీవన్‌రెడ్డి అందరికంటే ముందే రావడంతో మరింత జోష్‌తో గులాబీ దళపతి.. ఇతర పార్టీల నేతలకు గాలం వేసే పనిని చేస్తున్నారు.
ఈ పరిణామం ఇంచార్జిలుగా ఉన్న వారికి చాలా మందికి ఇబ్బంది కరంగా మారింది. తమను ఇంచార్జిగా తీసేస్తే …. రాజకీయ భవిష్యత్తు ఏంటీ? ఏ పార్టీకి వెళ్లాలి..? వెళ్తే తనతో ఎవరెవరు వస్తారు? అని ఇప్పట్నుంచే సమీకరణాలు, తర్జనభర్జన పడుతున్నారు.