Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో నీతి నిజాయితీతో కూడిన రాజకీయ నేపథ్యం దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానిది. అప్పల సూర్యనారాయణ నాలుగుసార్లు, అయన సతీమణి లక్ష్మిదేవి ఒకసారి టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎమ్మెల్యేలుగా గెలిచారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కని ఆ ఫ్యామిలీ పొలిటికల్ కెరీర్ చరిత్రలోనే మిగిలి పోతుందా అనే అనుమానాలకు చెక్ పడనుంది. ఆ ఫ్యామిలీ నుంచి వారసుడు వస్తున్నారంట. తండ్రి, తల్లి బాటలోనే నడిచేందుకు వారి చిన్న కుమారుడు, ఎన్ఆర్ఐ గుండ విశ్వనాథ్ సిద్దమవుతున్నారంట. అదే జరిగితే సిక్కోలు ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం ఉంది?
శ్రీకాకుళం జిల్లాలో సుపరిచితమైన గుండ ఫ్యామిలీ
శ్రీకాకుళం జిల్లాలో గుండ ఫ్యామిలీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. గుండప్పల సూర్యనారాయణ అంటే అందరికీ అజాతశత్రువు. ముక్కుసూటితనం నిజాయితీ నిబద్ధతకు ఆయన మారుపేరు. గుండ అప్పల సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 1985 నుండి 2004 వరకు వరుసగా నాలుగుసార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత అయనది. వయోభారంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో.. ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి శ్రీకాకుళంకు సేవలందించారు . ఆ కుటుంబం రెండున్నర దశాబ్దాలు అసెంబ్లీలో ఉన్నా.. రాజకీయ ప్రాబల్యంతో వాళ్లు సంపాదించిన ఆస్తులు శూన్యం అంటారు వారి అభిమానులు. అభిమానులు మాత్రమే కాదు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆ కుంటుంబం నిజాయితీని ప్రశంసిస్తుంటారు.
గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా టీడీపీకి మద్దతు
గత ఎన్నికల్లో గుండ అప్పల సూర్యనారాయణ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోయినా ఆయనతో పాటు ఆయన సతీమణి లక్షీదేవి టీడీపీకే అండగా నిలిచారు. ఆ క్రమంలో 2026 జనవరిలో అప్పల సూర్యనారాయణ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి చెందిన తర్వాత ఆయన వారసుడు రాజకీయాల్లోకి అడుగుపెడతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. టీడీపీ అధిష్టానం కూడా ఈ కుటుంబంపై ప్రత్యేక అభిమానం చూపిస్తుంది. నిజానికి గత ఎన్నికల సమయంలోనే విదేశాల్లో ఉన్న అప్పల సూర్యనారాయణ కుమారులను చంద్రబాబు రాజకీయాల్లోకి ఆహ్వానించారంట.
ఐరాసలో కీలక పదవిలో ఉన్న గుండ శివగంగాధర్
అయితే గుండ అప్పలసూర్యనారాయణ కుమారులిద్దరు 2014 ఎన్నికల్లో పోటీకి అంత ఆసక్తి చూపించలేదు. గుండ అప్పల సూర్యనారాయణ మరణం తరువాత కుమారుల ఆలోచన మారినట్టు తెలుస్తోంది. అప్పలసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులపెద్ద కుమారుడు గుండ శివ గంగాధర్ ఐక్యరాజ్యసమితిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండగా.. చిన్న కుమారుడు గుండ విశ్వనాధ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు. వారిలో విశ్వనాధ్ శ్రీకాకుళంలోనే అందరికీ ఉంటారని శివగంగాధర్ టీడీపీ అభిమానులకు హామీ ఇచ్చారు.
విశ్వనాథ్ ఎంట్రీతో సిక్కోలు రాజకీయాల్లో మార్పులు
శివగంగాధర్ ప్రకటన నిజమైతే శ్రీకాకుళం రాజకీయాల్లో కొంతమేర మార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్లీన్ ఇమేజ్ ఉన్న గుండ ఫ్యామిలీ నుంచి వారసుడు వస్తున్నాడు అంటే అటు పార్టీ అధిష్టానం పరంగా, కార్యకర్తల నుంచి విశేషమైన స్పందన రావడం ఖాయం. అప్పల సూర్యనారాయణ మృతి చెందినప్పుడు ప్రజల నుంచి రాజకీయ వర్గాల నుంచి వచ్చిన స్పందన దానికి నిదర్శనమంటున్నారు. టీడీపీ అధిష్టానం నుంచి కార్యకర్తల వరకు, అన్ని పార్టీల రాజకీయ ప్రముఖులు, పెద్దఎత్తున ప్రజలు అప్పల సూర్యనారాయణ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆ రోజు వచ్చిన విశేష స్పందన ప్రభావంతోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని గుండ కుమారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రజల నుంచి ఈ స్థాయి అభిమానం ఈ రోజుల్లో దక్కడం చాలా అరుదు. ఇలాంటి అభిమానం దొరికిన తాము దాన్ని వృధా చేసుకోకూడదని విశ్వనాధ్, శివగంగాధర్ ఫిక్స్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల హంగామా.. రేసులో అభ్యర్థులు వీళ్లే, రేపటి నుంచి ప్రచారం
40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉండి, నరసన్నపేట, శ్రీకాకుళం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రిధర్మాన ప్రసాదరావు పై 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి టీడీపీ అభ్యర్ధి గోండు శంకర్ భారీ మెజార్టీతో గెలిచారు. అప్పటికి సర్పంచ్‌గా పనిచేసిన శంకర్ సీనియర్ నేతైన ధర్మానకు పెద్ద షాకే ఇచ్చారు. అయితే దానికి ప్రధాన కారణం కూటమి వైపు వీచిన గాలి, గుండ అనుచరుల మద్దతే అంటారు. ఇకపై ధర్మానపై గెలవాలంటే ప్రజల అభిమానం ఉన్న గుండా ఫ్యామిలీకి మాత్రమే సాధ్యమని ప్రజలు కార్యకర్తల్లో బలమైన అభిప్రాయం ఉంది. ఇలాంటి సమయంలో శివగంగాధర్ ప్రకటన సరైనదేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శివగంగాధర్ వెనకుండి తమ్ముడు విశ్వనాధుని రాజకీయంగా నడిపిస్తారని తెలుస్తోంది. అయితే అప్పల సూర్యనారాయణ వారసులు ఎంతవరకు శ్రీకాకుళం రాజకీయాల్లో తమ మార్కు చూపిస్తారో చూడాలి.
Story By Apparao, Bigtv