Guntur YSRCP: గుంటూరు వైసీపీలో మరోసారి లుకలుకలు మొదలైయ్యాయా> అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఇటీవల గుంటూరులో వైసీపీ అధ్యక్షుడు జగన్ హాజరుకాబోయే ఓ భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు నేతలు. కట్ చేస్తే.. కార్యాక్రమానికి సరిగ్గా ముందు రోజు రాత్రి ప్రోగ్రాం వాయిదా పడినట్లు పార్టీ వెల్లడించింది. రెండ్రోజుల తర్వాత అదే ప్రోగ్రామ్ ను విజయవాడలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో గుంటూరులో వైసీపీ నేతల మధ్య అంతర్గత రాజకీయాల వల్లే జగన్ ప్రోగ్రాం ప్లేస్ మార్చినట్టు ప్రచారం జోరందుకుంది. అసలు గుంటూరు వైసీపీ లో ఏం జరుగుతోంది?
ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు ఎన్నికలకు వ్యూహరచనలు చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టారు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అందులో భాగంగా ఇప్పటికే పార్టీలో నియోజకవర్గాల్లో అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ తీరు ఒకలా ఉంటే గుంటూరు జిల్లాలో మాత్రం నేతల మధ్య పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు నగరం వైసీపీ లో జరుగుతున్న తాజా పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారంతో గుంటూరు వైసీపీ లో భారీ కుదుపులు వచ్చాయి. తాజాగా గుంటూరులో జరిగిన మరో సంఘటన వైసీపీ లో అంతర్గత పోరు రాజకీయాలను బయటపెట్టాయంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో గుంటూరు వైసీపీ లో మైనార్టీ నేతలు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతారు అంటూ ప్రకటించారు. ఈ నెల 10 వ తేదీన గుంటూరులో జరగాల్సిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు నేతలు. రెండ్రోజుల ముందు పార్టీ నేతలు ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు వైసీపీ న్నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు కూడా. గుంటూరుకు జగన్ వస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని కూడా ఆ పార్టీ గుంటూరు మైనార్టీ నేతలు స్టార్ట్ చేశారు.
అంతేకాకుండా వైసీపీ కు చెందిన ఓ మహిళా నాయకురాలు జగన్ కు స్వాగతం పలుకుతూ నగరంలో చాలా చోట్ల ఫ్లెక్సీ లు కూడా ఏర్పాటు చేయించారు. తీరా చూస్తే కార్యక్రమానికి ముందు రోజు గుంటూరులో జగన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం వాయిదా పడింది, వివరాలు త్వరలో చెబుతాం అని పార్టీ ప్రకటించింది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే అదే కార్యక్రమాన్ని విజయవాడలో ఈ నెల 18 న నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో గుంటూరు వైసీపీ నేతల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని సెక్యూరిటీ పర్పస్ లోనే వేదిక మార్పు చేశారని చెప్తున్నా.. నాయకత్వంలో అంతర్గత రాజకీయాల వల్లే మార్చేశారని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారట. గుంటూరులో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తున్నట్లు ఓ మహిళా నేత సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో కార్యక్రమం నిర్వహిస్తోన్న ఆ సీనియర్ నాయకుడికి మింగుడు పడలేదట. పైగా ఇఫ్తార్ నేపథ్యంలో వడ్డించే బిర్యానీ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న వ్యక్తిని.. దానికి ప్రతిఫలంగా సిటీ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో కార్యక్రమం నిర్వహిస్తున్న ఆ సీనియర్ నేతకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే విషయాన్ని పార్టీ అధినేత వద్ద పంచాయతీ పెట్టారట సదరు సీనియర్ నాయకుడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ అసలు , కుమ్ములాటలు ఎందుకు వేదికనే మార్చేద్దామని ప్రోగ్రాం ను విజయవాడ షిఫ్ట్ చేశారట.
దీంతో గుంటూరులో ఈ నెల 10 న జరగాల్సిన ఇఫ్తార్ విందు ప్రోగ్రాం ను కాస్తా ఈ నెల 18 న విజయవాడలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది పార్టీ. ఇపుడు ఈ వ్యవహారం పై సొంత పార్టీ నేతల్లోనే వర్గాల వారీగా చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు తజగన్ గుంటూరుకు వస్తారని ఆశగా ఎదురు చూసిన కార్యకర్తలకు నిరాశే మిగిలినట్లైంది. కార్యక్రమానికి దాదాపు ఏర్పాట్లు పూర్తైన త్వర్వా నేతల అంతర్గత పోరుతో సడెన్ గా క్యాన్సిల్ అవ్వడంతో కంగుతిన్నారంట కార్యకర్తలు.
ఇప్పటికే మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు అన్నచందంగా గుంటూరు వైసీపీ తీరు ఉంటే, ఇప్పుడీ అంతర్గత రాజకీయాలు బయటపడటంతో పిడుగు పడినట్లయిందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. దాదాపు ఖరారైన ప్రోగ్రాం ను ఉన్నట్టుండి జగన్ మార్చేశారు అంటే గుంటూరు వైసీపీ అంతర్గత రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. మరి ఈ వ్యవహారాన్ని సదరు నేతలు ఎలా సమర్దించుకుంటారు. అధిష్టానం జోక్యం తో ఈ అంతర్గత రాజకీయాలకు బ్రేక్ పడుతుందా లేదా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహిస్తూ జిల్లాలో పార్టీ భవిష్యత్తును పణంగా పెడతారా? అని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: యుద్ధం వస్తే పెరగాలి.. కానీ తగ్గుతోంది! బంగారం రివర్స్ ట్రెండ్‌కు అసలు కారణాలివే!
Story by: Apparao, Big Tv