BigTV English

Kohinoor: కోహినూర్ వజ్రం.. గుంటూరు నుంచి బ్రిటన్ వరకూ.. రాణి పట్టాభిషేకంపై ఇండియా ఎఫెక్ట్!

Kohinoor: కోహినూర్ వజ్రం.. గుంటూరు నుంచి బ్రిటన్ వరకూ.. రాణి పట్టాభిషేకంపై ఇండియా ఎఫెక్ట్!

Kohinoor: కోహినూర్ వజ్రం ఎవరిది? మనదే అంటారు భారతీయులంతా. ప్రస్తుతం అది బ్రిటన్ దగ్గర ఉంది కాబట్టి టెక్నికల్ గా అది వారికే చెందుతుంది. కానీ, మనవంతుగా ఆ అమూల్య వజ్రాన్ని తిరిగి భారత్ కు ఇచ్చేయాలని ఏళ్లుగా పోరాడుతోంది. బ్రిటన్ రాణి కిరీటాన్ని అధిరోహించి ఉందీ కోహినూర్ డైమండ్. బ్రిటన్ రాజవంశానికే గొప్పతనం తీసుకొచ్చింది మన వజ్రం. అందుకే, కోహినూర్ ను ఇండియాకు తిరిగి ఇచ్చేసేందుకు ఇంగ్లండ్ ససేమిరా అంటోంది. కాకపోతే, భారత్ నుంచి ఒత్తిడి బాగా పెరిగిపోవడంతో.. కోహినూర్ విషయంలో లేటెస్ట్ గా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది రాయల్ ఫ్యామిలీ.


మరో మూడు నెలల్లో బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఇలాంటి పట్టాభిషేక కార్యక్రమంలో కోహినూర్ వజ్రం పొదిగి ఉన్న కిరీటాన్ని రాణి ధరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రం లేని కిరీటంతోనే.. తన భర్త చార్లెస్ 3 పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కావాలని బ్రిటన్ రాణి కెమిల్లా నిర్ణయించారు. ఈ విషయాన్ని బకింగ్ హోమ్ ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.

ఈ ఏడాది మే 6న బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషేకం జరగనుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో పట్టాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమం కూడా దానితోపాటే జరపనున్నారు. దౌత్య పరంగా సున్నితమైన అంశాల కారణంగా రాణి కెమిల్లా కోహినూర్ వజ్ర కిరీటం ధరించ కూడదని నిర్ణయించుకున్నారు.


వలస పాలనకు గుర్తుగా బ్రిటన్‌ రాజ కుటుంబం చేతిలో కోహినూర్‌ వజ్రం ఇప్పటికీ ఉంది. గతేడాది రాణి ఎలిజబెత్‌ 2 కన్నుమూశారు. మరణించే వరకు ఆమె కిరీటంలోనే కోహినూర్‌ వజ్రం ఉండేది. ప్రత్యేక సందర్భాల్లో క్వీన్ ఎలిజబెత్ ఆ కిరీటాన్ని ధరించేవారు. విక్టోరియా మహారాణి కోహినూర్‌ గురించి రాసిన వీలునామా ప్రకారం ఛార్లెస్‌ భార్య, బ్రిటన్‌ రాణి కెమిల్లా ఇకపై దానిని ధరించాల్సి ఉంటుంది. కానీ కెమిల్లా తన కిరీటంలో కోహినూర్‌ను పోలిన మరో వజ్రం ధరిస్తారని బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు ప్రకటించాయి. కోహినూర్ డైమండ్ కోసం భారత ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రెజర్ వల్లే రాచకుటుంబం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ డైమండ్ బరువు‌ 105.6 క్యారెట్లు. దాని విలువ కట్టడం అసాధ్యం. ప్రపంచంలోకే అతిపెద్ద విలువైన వజ్రాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. కోహినూర్ వజ్రం మన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరు నేలల్లోనే లభించిందని చరిత్ర చెబుతోంది. మొదట్లో కాకతీయ రాజుల ఆధీనంలో ఉండేదట. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్‌తో యుద్ధం లేకుండా సంధి చేసుకొని.. అపారమైన సంపదతో పాటు కోహినూర్‌ వజ్రం కానుకగా ఇచ్చాడని అంటారు. ఆ తర్వాత ఢిల్లీని పాలించిన ఖిల్జీ వంశస్తుల చేతికి చేరిందని.. వారి నుంచి మొఘల్ రాజుల ఆధీనంలోకి వచ్చిందని చెబుతారు. మొఘల్ వంశం పతనం తర్వాత.. పర్షియన్‌ సేనాపతి ‘నాదిర్‌ షా’ చేతికి చిక్కగా.. ఆయనే ఆ ప్రకాశవంతమైన వజ్రానికి కోహినూర్ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. పర్షియన్‌ భాషలో కోహినూర్‌ అంటే ‘కాంతిశిఖరం’.

కోహినూర్ ను ఇరాన్‌ తీసుకెళ్లిన నాదిర్‌షా దాన్ని తన బంగారు సింహాసనంలో అలంకరించాడట. ఆ తర్వాత నాదిర్ షా మరణానంతరం.. అతని వారసుల నుంచి మళ్లీ ఆ వజ్రం ఇండియాకు చేరింది. సిక్కు రాజ్యం స్థాపించిన రంజిత్‌ సింగ్‌ దాడుల నుంచి కాచుకోలేక.. కోహినూర్ ను ఆయనకు అప్పగించారట. ఆ తర్వాతి కాలంలో సిక్కులపై ఆంగ్లేయులు వరుస యుద్ధాలు చేస్తూ.. కోహినూర్ ను కొల్లగొట్టారని చరిత్ర చెబుతోంది. అలా, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా.. 1850లో బ్రిటన్‌ రాణి విక్టోరియా దగ్గరకు కోహినూర్ డైమండ్ చేరింది. ఆమెనే ఆ వజ్రానికి మరింత సానపెట్టించి.. మెరుగులు దిద్దించి.. ప్రస్తుతం ఉన్న కోహినూర్ రూపాన్ని తీసుకొచ్చారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆ వజ్రం వాడేవారు. మహారాణులు మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలంటూ ఆమె వీలునామా కూడా రాశారు. విక్టోరియా తరువాత.. క్వీన్‌ అలెగ్జాండ్రా, క్వీన్‌ మేరీ, క్వీన్‌ ఎలిజబెత్‌-2 లు తమ కిరీటంలో కోహినూర్ డైమండ్ ను ధరించారు. ప్రస్తుతం కోహినూరు వజ్రం టవర్‌ ఆఫ్‌ లండన్‌ దగ్గర ఉన్న జువెల్‌ హౌస్‌లో ఉంది. అది ఎప్పటికైనా మన దేశానికి తిరిగి వస్తుందని భారతీయులంతా ఆశిస్తున్నారు. ప్రభుత్వాలు మరింత గట్టి ప్రయత్నం చేస్తే.. ఏమో, కోహినూర్ మళ్లీ మన సొంతం అయినా అవ్వొచ్చు.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×