Pakistan: పాకిస్తాన్‌లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీ ఎత్తున పెరిగాయి. లీటర్ పాల ధర 210 రూపాయలకు పెరిగింది. పాడి ఉత్పత్తులతోపాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీ కనీవినీ ఎరగనంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు.
పాక్‌లో పెట్రోల్ ధరలు కూడా చారిత్రలో తొలిసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర 272కు చేరింది. డీజిల్‌పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర 280కి పెరిగింది. డాలర్‌తో పాక్ రూపాయి విలువ క్షీణించడంతో ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగం పేర్కొంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న పౌరులపై మరింత భారాన్ని మోపింది.
పాకిస్తాన్‌లో కిలో కోడి మాంసం ఏకంగా 780 రూపాయలైంది. దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారని పాక్ ప్రజలంటున్నారు. కొన్నాళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కి శ్రీలంకను తలపిస్తోంది. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.